నిశ్యాలోచనాపథం-16

అదరగొట్టి, బెదరగొట్టి నిశి ని పోయిన్సారి పంపేశానే కానీ, నాకు కుతూహలం ఆగట్లేదు. ఏం చెప్తుందా? అని. ఫోన్ చేద్దాం అనుకున్నా… వద్దనుకున్నాను. ఎస్సెమ్మెస్ అనుకున్నా, నోనో అనుకున్నా మళ్ళీ నేనే. తొందర తొందరగా రాత్రి భోంచేసేసి తొందరగా ముసుగేసేస్కున్నా – ఎవరికీ కనబడకుండా బైటకెళ్ళిపోయి, వీలైనంత త్వరగా నిశీని పట్టేస్కుని కథ వినాలని. అయినా, వెర్రి తాపత్రేయం కాకపోతే నేను త్వరగా వెళ్తే ఏం లాభం, తను రావాలి కానీ! కాసేపు అటూ ఇటూ తిరిగాక, మధ్యలో ఓ చోట నాకో మనిషితో బాత్చీత్ కూడా అయ్యాక (ఆ మనిషి గురించి మళ్ళీ చెప్తాను లెండి), నీరసమొచ్చి వీథి అరుగు దగ్గర కూర్చుని ఉంటే, అటువైపు నుంచి నెమ్మదిగా నడుస్తూ వస్తూ కనిపించింది నిశీనిస్.

“రామ్మా! రా! వచ్చావా! ఎప్పుడొస్తావో అని చూస్తున్నా. బాగా త్వరగా వచ్చేశావే…” అన్నాను కాస్త వ్యంగ్యంగా.
“కాలు కాస్త బాలేదులే..” అన్నది నిశి. అప్పుడు గమనించాను నెమ్మదిగా నడవడం లో మామూలు నెమ్మదితనం కన్నా కూడా తేడా నెమ్మదితనం ఎక్కువగా ఉందీ అని.
“ఏమైంది? బాగా నొప్పిగా ఉందా?” అన్నాను.
“ఏమీ లేదు లే. ఏదో ఆలోచిస్తూ మెట్లపై పట్టు తప్పాను. కాస్త బెణికింది. అంతే. ఇపుడు బానే ఉన్నాను.” అంది నిర్లిప్తంగా.
“అంటే, పగలు కూడా నువ్వు ఇంతేనా? మెదడు వాపు వంటివి వచ్చేస్తాయి ఇలా చేశావంటే” – రెండర్థాలు వచ్చేలా వాడాను నిశి గమనిస్తుందా లేదా అని.
ఆమె నా వ్యంగ్యం అర్థం చేస్కోలేదని నాకు అర్థం కావడంతో, హర్టయ్యా. కానీ, తమాయించుకుని, కాస్త నెమ్మదిగా –
“కాలు బాగా నొప్పిగా ఉందా? నడుద్దామా, కూర్చుందామా?” అన్నాను.
మొన్నోరోజు పాత మిస్సమ్మ సినిమా చూసినప్పటి నుండి నాకు ఎందుకో నిశీ ని చూస్తే సావిత్రి గుర్తొస్తోంది. మిస్సమ్మ తర్వాత నిశీ ని చూస్తే, చిన్నప్పుడు తప్పిపోయిన మా అక్క కూడా గుర్తొస్తోంది. దానితో, నాకు సహోదరీ భావం లోలోన తన్నుకొస్తోంది తనని చూస్తూంటే.

మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా – ఓ వీథికుక్క వచ్చి నిశీ పక్కన కూర్చుని కాలు నాకడం మొదలుపెట్టింది. నాకు కుక్కలు-వీథికుక్కలూ రెండూ అంటే భయమూ, భక్తీ కనుక – కాస్త భయంతో దాని వంక చూస్తూ ఉన్నాను. నిశి ఓ రెండు మూడుసార్లు దాన్ని అవతలకి వెళ్ళమని తోసింది. అది వెళ్ళలేదు. మా మానాన మేము మాట్లాడుకుంటున్నాము కానీ, నిశి కి చిరాకు పెరుగుతూ ఉండటం గమనించాను. ఇంతలో ఉన్నట్లుండి ఆ కుక్కని ఒక్క తోపు తోసి తానేమో ఒక్క ఉదుటున లేచింది. నేను ఠంగైపోయాను. నిశి అంత కోప్పడ్డం నేను ఇదివరలో చూడలేదు. సరే, లేవడం ఒకెత్తు – ఆ కుక్కవైపుకి తిరిగి – “నీకేం ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఊరికే అలా నన్ను వెంటాడతావు? పనీ పాటా లేదా? చెప్తే వినబడదా?” అని అరవడం ఇంకో ఎత్తు. అదేమన్నా మనిషా ఏం? ఏం అర్థమై చస్తుందనీ? “కుయ్….కుయ్..” అనుకుంటూ వెళ్ళిపోయింది. మొదటిసారి ఓ కుక్కపై భయం పోయి జాలి కలిగింది. నేను నేననుకున్నంత “అకుక్కురం” కానేమో అని మొదటిసారి అనిపించింది.
(అలాంటి పదమేదీ లేదు అనుకుంటా. అమానుషం అంటాం కదా, కుక్కలకి ఎలా అనాలి? అన్న అనుమానం వచ్చినప్పుడు సృష్టింపబడ్డ పదం అది. సృష్టికర్త కోడ్ – శ్రీరాం).

నిశీ వైపుకి తిరిగి కోపంగా – “ఎంత హృదయం లేని దానివి నువ్వు…నోరు లేని జీవిపై అలా విరుచుకుపడతావా?” అన్నాను.
“నాకు ముందే పరమ చిరాగ్గా ఉంది. ఇదొకటి ఊరికే సతాయిస్తోంది.”
“దానికేం తెలుస్తుంది చెప్పు నీ చిరాకు సంగతి?”
“మరి నాకెందుకు దాని సంగతి? నాకు పరమ చిరాకు కుక్కలంటే.”
“అకుక్కానుషం అంటే బాగుందా, అకుక్కురం అంటే బాగుందా?, అకుక్కషం అంటే బాగుందా? నాకు మధ్యలోది నచ్చింది. కానీ, ఊరికే అడుగుతున్నాను.” అన్నా.
“ఏహె! ఆపు నీ గోల. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలయొచ్చు కదా. ఓ పక్క ఈ కుక్క నస, ఓ పక్క నీ నస. ఎందుకిలా సతాయిస్తారు అంతా నన్ను! అన్నీ ఇలాగే చేస్తాయేమిటి నాతో!” అరిచింది నిశీ.

“..ఓ పక్క ఈ కుక్క నస, ఓ పక్క నీ నస…” – ఏంటో తేడాగా ఉందే ఈ వాక్యం అనిపించింది. అంటే, కాస్త వక్రంగా నన్ను తిడుతున్నట్లా? అని అనుమానం వచ్చింది. ఇందాకట్నుంచి కుక్కని అడ్డం పెట్టుకుని నన్నంటోందా? ఏదో ఒకట్లే కానీ, నిశీ చిరాకు మరీ ఎక్కువగా ఉన్నట్లనిపించి –
“మళ్ళీ ఏమైంది? మొన్నోరోజు ఏవో కారణాలు చెబుతాను అన్నావు…” అన్నాను, పోయిన్సారి ఎక్కడ ఆపామో గుర్తు తెచ్చుకుంటూ.
“కారణాలు సరిగ్గా డాక్యుమెంట్ చేస్కుని సూసైడ్ నోట్ రెడీ చేసేలోపే ఏదో జరిగిపోయేలా ఉంది. అంత విరక్తొస్తోంది నాకు” అంది నిశీ కసిగా.
“అరే..అరే… ఏంటి ఆ ఆవేశం?” అన్నాను.
“బీపీ పెరిగిపోతోంది…”
“బీపీ బీపీ బీపీ పెరగట్లేదా? బీపీ మాత్రమే పెరుగుతోందా?” అన్నాను.
“ఏంటీ?” అర్థం కాక అయోమయంగా చూసింది నన్ను. నిశీ జూనియర్ ఎన్టీఆర్, వేణుమాధవ్ ఇద్దర్నీ చూసినట్లు లేదు.
“ఏం లేదు లే. ఏమైంది… ఎందుకు అలా రైజవుతున్నావు?” అన్నాను కాస్త నెమ్మదిగా. జోకు పేలకపోతే, అలాగే నెమ్మదైపోయి తుస్సుమన్న బాంబులా ఉంటే, ఒక్కోసారి రెండో జోకు వేసేందుకు పనికిరావొచ్చు. ఒక్కోసారి మనమే జోకవచ్చు కానీ, నిశీకి అంత సీన్ లేదు.

“నేను అదోరకం మనిషిని. నాకు ఊపిరి పీల్చడం కంటే కూడా ఆనందాన్ని పీల్చడం ముఖ్యం. ఊపిరి లేకున్నా బ్రతగ్గలను కానీ, ఆనందంగా లేకుంటే నేను బ్రతకలేను. లైఫ్ ప్లెజర్ తగ్గే కొద్దీ నాకు బ్లడ్ ప్రెజర్ ఎక్కువౌతుంది. అలాగే, ఆత్మహత్య చేస్కోవాలన్న మానసికమైన ప్రెజర్ కూడా పెరుగుతూ ఉంటుంది”
“దాన్నే ‘మా.ప్రెజర్’ అని కూడా అంటారు లే. అంటే, masochistic pleasure అనమాట” అన్నాను కసిగా.
LP ఏంటి? దాని వల్ల BP ఏంటి? అసలు ఈ పిల్లది తనని తాను హింసించుకునే స్వభావమా? నాలాంటి జనాల్ని ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి హింసిస్తోందా? లేక రెండూనా? – అని సందేహం కలిగింది.

నేనిలా ఆలోచనల్లో పడిపోవడంతో తానే మళ్ళి అడిగింది – “వింటున్నావా?” అని.
“వింటున్నానమ్మా… వింటున్నాను.”
“నాకు జీవించడంలో ఆనందం కలగట్లేదు…” అని తను ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా..
“పోనీ ఆనందంలో జీవించు” అన్నాను. ఇలా తికమక పెట్టకపోతే, తను నాకు పిచ్చెక్కించేస్తుంది మరి.
“జోకా? నేనోపక్క అసహనంగా ఉంటే, నీకు వెటకారమైపోయింది” అన్నది నిశీ కోపంగా.
“సరే, చెప్పు చెప్పు…” అన్నాను.
“బాటా” అన్నది నిర్లిప్తంగా.
నాకు కోపం వచ్చింది. నేను గట్టిగా… “ఇన్ బ్లూ” అన్నాను.
“హహహహ…కోపమే? నీవు నేర్పిన విద్యయే…” అన్నది.
“సర్లే, సంగతేంటో చెప్పు” అన్నాను విసుగ్గా.
“ఇదిగో, నీకు నేనంటే విసుగ్గా ఉందే…అలా నాకు జీవితమంటే విసుగ్గా ఉంది.”
“నాకు నువ్వంటే విసుగుంటే, నేను నిన్ను వదిలేసి పోతానా ఏంటి? ఏడ్చినట్లు ఉంది.” అన్నా కోపంగా.
“నేనూ, జీవితమూ ఒకళ్లనొకళ్ళం విసుక్కుంటూ రోజుల తరబడి కొనసాగడం ఏడ్చినట్లే కాదు, ఏడ్చి మొహం కడుక్కున్నట్లు ఉంది” అన్నది నిశీ.

“ఇదిగో చూడు, ఎందుకు అలా అస్తమానం సూసైడ్ అంటావు? కాలక్షేపానికన్నా ఓసారి బ్రతుకుతా అనరాదు?” అన్నాను.
“ఎందుకు బ్రతకాలి? ఒక్క కారణం చెప్పు?” అన్నది.
“…” ఏం చెప్పాలో తోచలేదు నాకు. ఎందుకు బ్రతకాలంటే కారణం నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు చావాలంటే తను చాలా కారణాలు చెప్పుకుంటోంది. ఏమిటో! అనిపించింది. అదే తనతో అన్నాను. దానికి తను –
“పోనీ, ఎందుకు చావకూడదో చెప్పు?” అని అడిగింది.
“బ్లా..బ్లా..బ్లా..” అని ఓ పది నిమషాలు చెప్పాను.
“అంటే, బ్రతకడం ఎందుకో తెలీదు కానీ, ఎందుకు చావకూడదో మాత్రం తెలుసా?” అన్నది.
నేను ఏమీ మాట్లాడలేకపోయాను.
“నువ్వు పిరికిదానివో… ఫూల్ వో… పనికిరానిమనిషివో…వెన్నముకలేని మనిషివో… నాకు అర్థం కావట్లేదు…” అని ఓ వెధవ నవ్వు నవ్వింది.
“మరి నువ్వో?” అన్నాను ఉక్రోషంలో. ఒక్క ఉదుటున నన్నెవరూ అన్ని మాటలు అనలేదు.
“నేను పిరికిదాన్ని కాదు. ఎందుకంటే, నేను పనికిరాని మనిషినని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఫూల్ నే కావొచ్చు, ప్రపంచానికి. వెన్నముక ఉంది కనుకే బ్రతకలేకపోతున్నా” అన్నది, ఈసారి “విజయ దరహాసం” ఒలకబోస్తూ.
“ఇదిగో, నువ్వు చెప్తానంటే సరిగా కారణం చెప్పు. లేదంటే లేదు. నన్ను అంటావెందుకు మధ్యన? నేను నువ్వు చెప్పినవన్నీ కూడా కావొచ్చేమో కానీ, ఇప్పుడు అది నీ ద్వారా మళ్ళీ తెలుసుకోనక్కర్లేదు.” అన్నాను కోపంగా.
“అరే…అరే… కోపమే.. ముక్కుమీద కోపం..నీ మొహానికే అందం..” అని హమ్మింది కాసేపు.
నేను ఏమీ మాట్లాడలేదు. దానితో బుజ్జగించే మూడ్ లోకి వచ్చింది నిశీ.
“సరేలే, సారీ. నిన్ను ఏమీ అనను. ఇక శాంతించు..” అన్నది.
“ఎవరి చావు వాళ్ళని చావనివ్వొచ్చు కదా…ఎందుకు నాలో లోపాలుంటే మాత్రం అవి అలా ఎత్తి ఎత్తి చూపించి మరీ నన్నే అడగాలా?” అన్నాను, కళ్ళలోంచి నీళ్ళు రావడం ఒక్కటే తక్కువ.
“ఎజ్గాక్ట్లీ! ఎవరి చావు వాళ్ళని చావనివ్వొచ్చు కదా!” అన్నది నిశీ.

“చావు!” అన్నా కోపంగా.
“లేదు. మరియాదగా సాగనంపాలి నన్ను. అలా కోపగించుకుంటే నేను ప్రశాంతంగా వెళ్ళలేను” అన్నది స్థిరంగా.
“ఏంటీ?” అన్నాను షాక్ లో.
“నిన్ను ఒప్పించి కానీ ముందుకు సాగను అని చెప్పా కదా…ఎక్కడున్నా సరే, వచ్చి, నిన్ను ఒప్పించిగానీ ముందుకెళ్ళను.”
“వార్నీ! నేను నిన్ను మారుద్దాం అనుకుంటూ ఉంటే, నువ్వు నన్ను మార్చేలా ఉన్నావు కదా..” అనుకున్నా మనసులో. ఇవాళ్టి నిశీ మార్కు ఊకదంపుడుకి తలనొప్పి మొదలైంది. వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండగా, తెల్లారుతున్న సూచనలు కనబడ్డాయి.
దానితో తను-నేను టాటాలతో ఎవరి దోవన వాళ్ళు వచ్చేశాము.

ఐనా, తన మానాన తను చస్తా అంటే, వినకుండా, ఏదో దీనజనోద్ధరణ సామ్రాట్ లా ఫీలై నేను పరిచయం పెంచుకోడం ఏంటో, ఇలా ఇరుక్కుపోడం ఏమిటో! ఇంకెన్ని వినాలో – నా గురించి నేనే!

Advertisements
Published in: on September 30, 2009 at 1:44 pm  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/09/30/nisyalochanapatham-16/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. Awesome! Some of the lines especially,

  నేను అదోరకం మనిషిని. నాకు ఊపిరి పీల్చడం కంటే కూడా ఆనందాన్ని పీల్చడం ముఖ్యం.

  నేనూ, జీవితమూ ఒకళ్లనొకళ్ళం విసుక్కుంటూ రోజుల తరబడి కొనసాగడం ఏడ్చినట్లే కాదు, ఏడ్చి మొహం కడుక్కున్నట్లు ఉంది

  And also coining of the new words. Well, apart from the acknowledging part, are there any cash awards for coining these words / phrases? 😛

  I was expecting a comprehensive suicide note, hmmm.. lets wait for the reasons its gonna give.

 2. Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

  Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

  Click here for Install Add-Telugu widget

 3. // “వార్నీ! నేను నిన్ను మారుద్దాం అనుకుంటూ ఉంటే, నువ్వు నన్ను మార్చేలా ఉన్నావు కదా”
  🙂
  నిశీ ఎప్పుడు మిమ్మల్ని, ప్రపంచాన్ని అంగీకరిస్తే అప్పుడు విముక్తి !

 4. @venkata ramana: ఎవరికండీ విముక్తి? చదివేవాళ్ళకా? 😉

 5. @సౌమ్య : చదివేవాళ్లకు కాదండీ. మీకే. 🙂
  ఒక విధంగా ఎవరికీ వాళ్లకు.

 6. మరీ ఇన్నాళ్ళకా? Hilarious.

  In my view, this one takes the cake. Best in the series.

  ఇదిగానీ నన్ను చూసి వ్రాశారా సౌమ్యా? 😉

  “నేను అదోరకం మనిషిని. నాకు ఊపిరి పీల్చడం కంటే కూడా ఆనందాన్ని పీల్చడం ముఖ్యం. ఊపిరి లేకున్నా బ్రతగ్గలను కానీ, ఆనందంగా లేకుంటే నేను బ్రతకలేను. లైఫ్ ప్లెజర్ తగ్గే కొద్దీ నాకు బ్లడ్ ప్రెజర్ ఎక్కువౌతుంది. అలాగే, ఆత్మహత్య చేస్కోవాలన్న మానసికమైన ప్రెజర్ కూడా పెరుగుతూ ఉంటుంది”

 7. You may like this…

  http://gitasrujana.blogspot.com/2008/10/blog-post_17.html

  &

  http://gitasrujana.blogspot.com/2008/10/blog-post_26.html

  Written before this series, and left… ఇంకా వ్రాయాలి. I enjoy your series


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: