నిశ్యాలోచనాపథం-14

ఈ రాత్రి తరువాత…..

తరువాతి రోజు, నేను చాలా ఎగ్జైట్మెంటుతో పరుగులాంటి నడకతో మేము ఈమధ్య ఎప్పుడూ కలుస్తున్న వీథిలోకి వచ్చాను. ఆ వీథిని పగటిపూట ఏమంటారో నాకు తెలీదు కానీ, గొప్పగొప్పోళ్ళు ఆ వీథిలో రాత్రి తిరుగాడటం ఇదివరలో నేను గమనించాను. అయితే, నిశి ఆత్మహత్య గోలలో, నా ధ్యాసంతా తనమీద ఉండి పట్టించుకోలేదు. సరే, తనకోసం వెదుకుతూ ఉండగా, ఓ దిక్కులో ఏవో వాదనలు వినిపించాయి. అంత రేంజిలో మాటలు, ఆ సమయంలో, ఆ వీథుల్లో ఇన్ని నెలల్లో ఎప్పుడూ వినలేదు. దానితో కుతూహలం కొద్దీ ముందుకెళ్ళాను…తీరా వెళ్ళాక… వాదిస్తున్నది మన నిశీనిస్! పక్కనున్నది ఆయనెవరో… చూసినట్లే ఉంది కానీ, గుర్తు రావట్లేదు.

“నాకర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా.. ఎందుకిలా చేస్తారు మీరంతా?”
“అమ్మాయీ, అట్లనకు. ’ఈ నిశీథ మధ్యమ్మున నే నొకండ.. నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు…’ -అని ఆయనేదో అంటూ ఉండగా..
“కన్నీటి కెరటాల వెన్నె లేలా? నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా?” – అని ఎదురు ప్రశ్నించింది నిశి.
“బాగు బాగు బహు బాగు”
“ఏం బాగో… మీ బాధ ప్రపంచానికి బాధ అనుకుని మీరు సంతోషించేయడమే కానీ, నాకు బాధెందుకైందో అడిగారా?”
“ఏమైనదేమైనది?”
“నాకు అర్థం కావట్లేదు అసలు! ఏడుపొచ్చేస్తోంది.” అని…“ఒక్క టొక్కటె కన్నీటిచుక్క లొలుక….నేడ్వ లేక యేడ్వ లేక యేడ్చుచుంటి” అన్నది నిశి.
“ఎంత బరు వయ్యెనో గాని యెడద వెలికి..తొలగి పారని దుఃఖాశ్రు జలము వలన”
– ఆ మనిషెవరో ఈపాటికి నాకర్థమైపోయింది. నిశీ సమస్య కూడా అర్థమైపోయింది. ఇక నేను వెళ్ళలేదంటే పెద్దా చిన్నా లేకుండా నిశీ అరిచేయడమూ, నిశీ సమస్య అర్థం కాక బాధతో ఆయన ఇంకా ఇంకా కవిత్వం చెప్పేయడమూ ఖాయం కనుక… నేను వెంటనే రంగంలోకి దూకాను.

“కృష్ణశాస్త్రి గారూ! ఆపండి. మీకు నేను అసలు సమస్య వివరంగా చెబుతాను.” – అని పరుగెత్తుకుంటూ వెళ్ళాను.
“హమ్మయ్యా! వచ్చావా! ఈయన పేరు గుర్తు రాక, ఈయన కవిత్వం భాష అర్థం కాక… చచ్చిపోతున్నా…”
“దేవులపల్లి కృష్ణశాస్త్రి” – అని ఆయన మార్కు నవ్వు నవ్వారాయన.
“క్షమించాలి. తనకి మీ కవిత్వంలోని భాష అర్థం కావట్లేదు అనుకుంటా” – అన్నాను చిన్నగా.
“అంత కరెక్టుగా ఎలా కనిపెట్టావ్?” అని అడిగింది నిశీ ఆశ్చర్యంగా.
కృష్ణశాస్త్రి గారికి కూడా ఈ సందేహం వచ్చిందని నాకు అర్థమైంది. ఇద్దరికీ కలిపి వివరించాల్సిన సమయం వచ్చిందని అర్థమై చెప్పడం మొదలుపెట్టాను.
“నిశీ సమస్య మీ భాష. తనకి తెల్సిన ప్రస్తుత మానవ తెలుగులో మీ భాష కాస్త క్లిష్టంగా అనిపిస్తోంది. ఎవర్ని అర్థమడగాలో తనకి తెలియట్లేదు. అలాగని చదవడం మానేద్దామా అంటే, ఈ కవితలన్నీ రాత్రులూ, కృష్ణపక్షాలూ, దిగుళ్ళూ – అన్నీ తన అభిమాన విషయాలాయె.” – అని ఓ క్షణం ఆగాను.
“ఔను నిజం! ఔను నిజం! నీవన్నది నిజం నిజం!” అన్నది శ్రీశ్రీని తలవందే కన్ను తెరవని నిశీ.
నేను చిన్నగా నవ్వి -“ఇదంతా ఇంత కరెక్టుగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నాదీ అదే బాధ కనుక! మీ బాధైతే ప్రపంచానికి బాధ కనుక, మీరు ఎలా చెప్పినా చెల్లింది. మా బాధ చెప్పుకోలేక..మీ ద్వారా చెప్పుకుందామని మిమ్మల్ని ఆశ్రయిస్తే, మీరనేది అర్థం కాక..కొత్త బాధలు పుట్టుకొస్తున్నాయే… మా బాధ ఎవరికి పట్టింది?” – ఆవేశంగా అన్నాను.
అనేసి, డైలాగ్ లో బరువు కోసం –
“ఎడతెగని యాత్ర నిట్లు సాగింప లేక… యేడ్వగా లేక కృశియింతు” మేము… అని ఆయన వంక చూశాను.
“నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” – అని నవ్వారాయన.
“ఓహో! ఇలా వచ్చారా….”- అనుకున్నాను.

ఇవాళ పౌర్ణమి లాగుంది. కొంత వెన్నెల వెలుగు ఉంది. నిశికి ముందే ఆ వెలుగు కారణంగా అసంతృప్తిగానూ, విసుగ్గానూ ఉంది. దానికితోడు, ఈ నిస్సహాయత ఒకటి! అంతకంతకూ తనలో పెరుగుతున్న అసహనం వెన్నెల వెల్తురులో నాకు కనిపిస్తూనే ఉంది. ఉన్నట్లుండి –
“విశ్వమంతా నిండి, వెలిబూదివోలె-బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి-బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!”
-అని ఆవేశంగా అరిచింది. ఎందుకలా అరిచిందా అని తనవైపు చూస్తే, తానేమో ఇంకో దిక్కుకి చూస్తోంది.. ఎదురుగ్గా…
“భూతాన్ని,
యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!”
-అంటూ వస్తున్న శ్రీశ్రీ!

“ఏమిటిలా?” అన్నారు కృష్ణశాస్త్రి కూడా ఆశ్చర్యంగా.
“నిద్రకు వెలియై, నేనొంటరినై, చీకటిలోపలి నా గదిలో… నా గదిలోపలి చీకటిలో.. చీకటిలో..నా గదిలో…నా గదిలో..చీకటిలో…” అంటూ ఆయన చెప్పుకుపోతూ ఉండగా,
“నిజంగానే, నిజంగానే?” – అంటూ నిశీ, నేనూ అత్యుత్సాహం చూపించాము.
ఈపాటికి నిశీకి ఉత్సాహమొచ్చేసింది. కృష్ణశాస్త్రితో –
“రానీ, రానీ, వస్తే రానీ!
కష్టాల్‌, నష్టాల్‌, కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ, రానీ! కానీ, కానీ!”
అని, కష్టమైతే అయింది, మీ భాష అర్థం చేసుకుంటాను..మీ ఘోషను అనుభవిస్తాను..అన్నది ఉత్సాహంగా.

“మిమ్ములన్ చూసినంతనే ఈబాల ఉత్సాహంతో ఉరకలేయు..” – అన్నారు దేవులపల్లివారు.
“నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం, అనితరసాధ్యము నా మార్గము” అన్నారు శ్రీశ్రీ, కించిత్తు గర్వంగా, ఓసారి నాతో గతంలో అన్నట్లే. నాకు ఓ చిలిపి ఆలోచనొచ్చింది. కృష్ణశాస్త్రి గారితో – “మరి మీరో?” అని అడిగా (అడుగుతూ నిశీకి కన్నుగీటాను)
“చెవి యొగ్గి వినుడు!
ఏను స్వేచ్ఛా కుమారుడ నేను గగన
పథ విహార విహంగమ పతిని నేను
మోహన వినీల జలధరమూర్తి నేను
ప్రళయ జంఝా ప్రభంజన స్వామి నేను!”
-అన్నాడాయన.
ఓ! అనుకుని… “వావ్!” అనుకున్నాను.

“ఏమండీ, మీరన్నా సాయం చేద్దురూ… ప్రపంచం బాధ మీ బాధంటారు కదా… ఈ చీకటి ప్రపంచంలో ప్రస్తుతానికి ఉన్నది మేమిద్దరమే కదా..మీరిద్దరూ కాక.. మా బాధ మీ బాధే కదా… మా బాధనన్నా కవిత్వంలో చెప్పండి… బాధ తీరే మార్గమన్నా చెప్పండి..” అన్నది నిశీ. తనంత చొరవగా, సౌమ్యంగా ఒకరితో మాట్లాడ్డం చూడ్డం ఇదే మొదలు నాకు. అసలెప్పుడన్నా తాను ఇంకోరితో మాట్లాడ్డం నేను చూడనేలేదు కదా ఇవాళ్టికి ముందు.. (సారీ, ఈ రాత్రికి ముందు).

“పదండి ముందుకు, పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ! భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!” – శ్రీశ్రీ గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ, తెలివిగా తాను ముందుకు నడుస్తూ వెళ్ళిపోయారు, పరిష్కారం చెప్పకుండానే.
దిగాలుగా దేవులపల్లివారి వైపుకి తిరిగాము ఇద్దరం –
“నన్ను గని యేరు జాలి జెందంగ వలదు –
ఎవ్వ రని యెంతురో నన్ను? – ఏ ననంత
శోకభీకర తిమిరలో కైకపతిని!
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు,
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు,
నా కమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దు॰ఖంపు నిధులు కలవు –
ఎవ్వ రని యెంతురో నన్ను?” –

-అని తనలో తాను దిగాలుగా పాడుకుంటూ అటు నడిచెళ్ళిపోతున్న మనిషిని ఇంకేమడగము? మొహాలు వెళ్ళాడేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూస్కుంటూ ఉండగా, తొలి వెలుగురేఖ మొహాన పడబోతోందని గమనించి… మా దారులు వేరయ్యాయి, మళ్ళీ కలవడానికే సుమా!

Advertisements
Published in: on August 31, 2009 at 10:27 am  Comments (6)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/08/31/nisyalochanapatham-14/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. 🙂

  2. 🙂 బాగుంది.

  3. Nice reading.

    “మొహాలు వెళ్ళాడేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూస్కుంటూ ఉండగా, తొలి వెలుగురేఖ మొహాన పడబోతోందని గమనించి… మా దారులు వేరయ్యాయి, మళ్ళీ కలవడానికే సుమా!”

    Waiting :-p

  4. Great! 🙂

  5. […] – 15 ఆరోజలా శ్రీశ్రీ, కృష్ణశాస్త్రీ ఇద్దరూ […]

  6. Good things i read..on srisri, devulapalli…i am happy..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: