నిశ్యాలోచనాపథం-13

ఆరోజు తను చెప్పింది జీర్ణించుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇలాంటి కథలు కొత్తని కాదు కానీ, ఈ తరహా అన్వయాలు కొత్త నాకు. అందుకని, కొన్నాళ్ళు అలా తన మాటల మాయలోనే ఊగి, ఇన్నాళ్ళకి మళ్ళీ వాస్తవానికొచ్చి, మధ్యలో కోల్పోయిన జీవితాన్ని వెదుక్కోడంలో సమయమంతా గడిచిపోయి, నిశ్యాలోచనలు కాస్త తగ్గిన మాట నిజం. కానీ, కోల్పోయినవన్నీ దొరకవు – వెదికినంత మాత్రాన. అలా వెదగ్గానే దొరికేసేవే అయితే, ప్రపంచంలో జనాలు ఇంకాస్త ఆనందంగా బ్రతికేవాళ్ళేమో (దొరికేసాయని ఏడ్చేవాళ్ళూ ఉండే అవకాశం లేకపోలేదు). అందుకని, మళ్ళీ వచ్చా, నిశీ కథ మీకు వివరంగా చెబుదామని. ఎక్కడ ఆగామూ పన్నెండో భాగంలో…. నిశీనిశ్ ఎందుకు ఆత్మహత్య చేస్కోవాలనుకుంటోందో? అని నేను ఆమెని అడిగిన దగ్గర కదా..

“నాకు జీవితం-ప్రేమ రెండూ మిథ్య అనిపిస్తోంది. అలాంటప్పుడు జీవితంపై ప్రేమ మాత్రం ఎందుకు? అది అంతకంటే పెద్ద మిథ్య. ఏమీ ఉండదు చివరకి. ప్రేమ తానుగా ఇంకెవర్నో చేరుకుని బ్రతికేస్తుంది. మన బ్రతుకు మాత్రం నరకం చేస్తుంది. అందుకే నాకు బ్రతుకంటే అసహ్యం పుడుతోంది” -అని మొదలుపెట్టింది తను.
అప్పుడే అనిపించింది నా దగ్గర ఓ రికార్డర్ ఉంటే బాగుండు అని. ఇలా కన్వల్యూటెడ్ గా చెబితే, ఎలాగో నా పీతబుర్రకి ఒకసారికి అర్థం కాదు. కనీసం ఇదంతా అర్థంలేని ప్రేలాపన అని తెలుసుకోడానికైనా నేను ఇది రెండుమూడు సార్లు వినాలి. ఏ సినిమాలోనో అయితే, డైలాగు అర్థం కాకుంటే, రివైండ్ చేస్కుంటాము. మరి నిజ జీవితంలో? లేని పోని ఆశలకూ, నిరాశలకూ, అయోమయాలకూ – భాషే అన్నింటికంటే పెద్ద మూలం అని ఈమధ్యే నాకు జ్ఞానోదయం చేసారు – Ogden, Bliss మొదలైన పెద్దలు “In the land of invented languages” అన్న పుస్తకంలో. నిజం! నిజజీవితంలో ఇలా మనిషి ఏదో మాట్లాడి మనకి అది అర్థం కాకపోడమో, లేకుంటే వాళ్ళు ఏదో అని అది మనం మర్చిపోడమో కాదంటే, మనమేదో అని అది వాళ్ళకి అర్థం కాక..మనం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఏడవడమో – ఇలాంటివి జరగడం వల్లే తొంభై శాతం బాధలు. అసలు మనుషులకి భాషే లేకుంటే బాగుండని ఓపక్క అనిపిస్తుంది కానీ, ఇలా నిశీ లాంటి వాళ్ళకి వాళ్ళ బాధ చెప్పుకోడానికి వేరే మార్గమేముంది – భాష తప్ప?

“ఈ మిథ్య కాన్సెప్ట్ ఎప్పట్నుంచీ అనిపిస్తోంది నీకు” అని అడిగా, నా ఆలోచనలకి కామా పెట్టి.
“నాకూ, ఈ జీవితానికీ పడదేమో అనిపిస్తోంది.”
“ఈ జీవితానికి పడదు..అంతే కానీ, అసలు జీవితానికీ నీకూ పడదనికాదుగా… లైఫ్ స్టైల్ మార్చుకో, లైఫ్ కూడా మార్చుకో..” అన్నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మేధావిలాగా.
“నాకు అంత పెద్ద ఆసక్తేమీ లేదు. నేను దారుణంగా మోసపోయాను జీవితంలో. ఈ మోసాన్ని మోస్తూ మళ్ళీ అదే జీవితాన్ని ప్రేమించలేను.”
“ఎవరో నిన్ను మోసం చేస్తే, జీవితాన్ని ప్రేమించడానికేమి? అంటే, ఆ మోసం చేసినవాళ్ళే నీ జీవితం అనుకున్నావా?” – ఇదేదో ప్రేమ వ్యవహారం అని అర్థమైన నేను అన్నాను.
“కానీ, మోసం చేసింది జీవితమే అని నేనంటే?”
ఒక క్షణం అనుమానమొచ్చింది – నాకు పిచ్చా, ఈవిడకా? అని. ఇద్దరికీ కూడా కావొచ్చేమో – ఇన్నాళ్ళు ఇలాంటి మనిషిని భరించాను అంటే నేను కూడా తేడా అన్నట్లేగా!
“జీవితం మోసం చేయడం ఏంటి నిశీ? అర్థమయ్యేలా చెప్పు.” అన్నాను కాస్త నెమ్మదిగా.
“నేను జీవితాన్ని ప్రేమించాను. నాకంటే ఎక్కువగా – బ్రతకడాన్ని ప్రేమించాను. నా జీవితాన్ని కాదు – లైఫ్ ఆస్ సచ్. ..”
“నువ్వా?” అన్నా ఒక్కసారిగా.. కెవ్వుమని. నేను చూసినంతలో ఈ మనిషి ఆ తరహాగా అనిపించలేదు నాకు మరి.

“నేనే! నీకు పరిచయమయ్యేనాటికే నా ప్రేమ కథ విఫలప్రేమ అయింది లే” – అదోలా వైరాగ్యంగా నవ్వుతూ అన్నది తను.
“అదేమిటి? నువ్వు అసలు ఎవర్నీ ప్రేమించందే… విఫలమైపోయిందా? అలా ఎలా?”
“చెప్పాను కదా.. బ్రతుకును ప్రేమించాను, బ్రతకడాన్ని వాంఛించాను అని.”
“మరిప్పుడిలా ఉన్నావేంటి? హౌ హౌ హౌ?” – క్యూరియాసిటీ ఆగట్లేదు నాకు.
“వెల్, నీకు మొదట్నుంచీ చెప్పడం నా వల్లకాదు. కాస్త క్లుప్తంగా చెబుతాను విను. మొత్తంగా దాదాపు పదేళ్ళ కథ చెప్పాలి నీకు..పది నిముషాల్లో”
ప్రాస కోసం అందో, నిజంగా అందో అర్థం కాలేదు కానీ, కానివ్వమన్నాను.
మొదలైంది ఇక… టన్ టనా టనా టన్!

“నేను జీవితాన్ని ప్రేమించాను. మామూలుగా కాదు. నన్ను నేను మరిచిపోయేంతగా. మా ప్రేమకలాపాలు ఎనిమిదేళ్ళు అప్రతిహతంగా సాగాయి. ఈ మధ్య కాలంలో నా జీవితంలో మరీ పెద్ద ఒడిదుడుకులేం లేవు. అందుకే కాబోలు, నాకు ప్రేమ తప్ప వేరే ధ్యాస కూడా లేదు. అసలు ప్రేమలేకుండా జీవితం ఉండగలదు అన్న ఆలోచనైనా నాకు రానంత గొప్పగా ఉండింది నా జీవితం…. “నా” జీవితం.”
“నా” ఏముంది.. పక్కింటోళ్ళ కథ కాదు కదా నువ్వు చెప్పేది. – అనుకున్నా మనసులో. ఆమె చెప్పడం కొనసాగించింది…
“అయితే, ఈ రెండేళ్ళలో నాకు జీవితంతో అయినన్ని తగువులు, మోసపోయినన్ని సందర్భాలు – మొదటి ఎనిమిదేళ్ళు మొత్తం కలిపినా అయి ఉండవు.”
“ఏమ్?” అన్నాను.
“జీవితమంటే నాకున్న ప్రేమకంటే, దానిపై నమ్మకం ఎక్కువ నాకు. గౌరవం కూడా ఎక్కువే. కానీ, ఇప్పుడు, ఈ క్షణంలొ – నమ్మకం లేదు..గుడ్డిగా నమ్మాలని ఉంది తప్ప. గౌరవం …పోయింది…ఉంటే బాగుండేది అని అనిపిస్తోందికానీ… ప్రేమ… ఉండీలేకా ఉంది..ఉన్నాకూడా లేదు..”
“జాబిల్లి కోసం…” అనబోయి ఆగాను… “ఉండీలేకా..ఉన్నది నువ్వే..ఉన్నాకూడా లేనిది నేనే” గుర్తొచ్చి.
“తప్పిపోయిన గౌరవమూ, సన్నగిల్లిన నమ్మకమూ… ఉందో లేదో తెలీని ప్రేమా – ఇవి పెట్టుకుని ఏ బంధంలో అన్నా సాధించగలిగేది ఏమిటీ?” – నిశీ దిగాలుగా అడిగింది.
“నీ సమస్యేమిటో నాకు అర్థం కావట్లేదు..” భయం భయంగా అన్నాను. ఔను మరి, కోపమొచ్చి ఏదన్నా చేయడమో, చేసుకుంటుందేమో అని నా భయం.

“ఉన్నంతలో వీలైనంత శ్రద్ధగా నేర్చుకున్నాను భాషను. ఎన్ని పదాలు నేర్చుకుని ఏం లాభం? ఎంత భాష తెలిసినా..ఎన్ని భాషలు తెలుసుకున్నా ఏం లాభం? నాకు అవసరమైనప్పుడు నా బాధ ఏమిటన్నది నేను అవతలి మనిషితో పంచుకోలేపోయాక?” తను వాపోయింది.
నాకు బాధనిపించింది అది చూసి… కాస్త అనునయంగా – “అది కాదు… కాస్త స్పష్టంగా చెప్పగలవా?” అన్నాను.
“పదాల్లో అన్నింటినీ బంధించగలిగి ఉంటే, జీవితాన్ని కూడా నా ప్రేమలో బంధించేసి ఉందును. రెంటికీ సంబంధం ఏమిటని అడక్కు… అది కూడా నేను వివరంగా వర్ణించలేకపోతున్నాను” అసహాయంగా చూస్తూ అన్నది.
“సరే, ఇప్పుడు ఐతే ఆత్మహత్య దేనికి?” అన్నా కాస్త చిరాగ్గా.
“అంతా విన్నాక కూడా అలా అడుగుతావు ఏంటి? జీవితమంటే అసహ్యం పుడుతోంది… అసలు ఇలాంటి జీవితాన్ని ప్రేమించినందుకు నామీద నాకు అసహ్యం పుడుతోంది – నేనూ నచ్చక, నా ప్రేమా నచ్చక…జీవితమూ నచ్చక – ఏం సాధించాలి బ్రతికి?”
“చచ్చి బ్రతకడం కంటే, బ్రతికి చావడం నయం.” అన్నాను.
“బ్రతికి చావడం కంటే చచ్చి బ్రతకడం నయం” అన్నది.

ఇప్పుడు, ఈమె ఇంత వైరాగ్యంలో ఉన్నప్పుడు, ఈమూడ్ నుంచి ఈమెను బైటకు తేవడం ఎలా? అనుకుంటూ ఉండగా, యధాలాపంగా వాచీ చూస్కుంటే, ఐదున్నరౌతూ ఉండింది. దానితో, నాకో ఆలోచనొచ్చింది.
“సరే, కాసేపు ఇలాగే కొనసాగిద్దాం… వెలుగొచ్చేస్తుంది..” అన్నా.
“నేను వెళ్ళాలి… ” అని చెప్పులేస్కుంటూ ఉంటే, చేయి పట్టుకుని ఆపి…
“మరి మన చర్చో?” అని అడిగా కొంటెగా.
“ఉండవమ్మా! రేపొచ్చి చెబుతాలే… అని హడావుడిగా పరుగెత్తుకుంటూ మాయమైంది చీకట్లోకి.
తనని ఫాలో ఔదామనుకున్నా కానీ, తను రేపొచ్చి నాకు కథ చెప్తుందని తెలుసు నాకు.

వచ్చిందీ, చెప్పిందీ కనుకే, నేను ఇదంతా ఇంత ధీమాగా రాస్తున్నది. ఏం చెప్పిందీ? అన్నది వచ్చే భాగంలో. 😉

Published in: on August 24, 2009 at 9:39 am  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/08/24/nisyalochanapatham-13/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. // నిజజీవితంలో ఇలా మనిషి ఏదో మాట్లాడి మనకి అది అర్థం కాకపోడమో, లేకుంటే వాళ్ళు ఏదో అని అది మనం మర్చిపోడమో కాదంటే, మనమేదో అని అది వాళ్ళకి అర్థం కాక..మనం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఏడవడమో – ఇలాంటివి జరగడం వల్లే తొంభై శాతం బాధలు.
  🙂 అవుననుకుంటా !!

  // నేను జీవితాన్ని ప్రేమించాను. మామూలుగా కాదు. నన్ను నేను మరిచిపోయేంతగా
  ఆసక్తి కలిగించే వ్యాఖ్య.

 2. Wow. Back again? Will read again. In a rush

 3. హమ్మయ్య. చదువుతుంటే బానే ఉంది కానీ, మధ్య మధ్యలో బోరనిపించింది. చాలా రోజులయిందనేమో మరి.

  “నిజం! నిజజీవితంలో ఇలా మనిషి ఏదో మాట్లాడి మనకి అది అర్థం కాకపోడమో, లేకుంటే వాళ్ళు ఏదో అని అది మనం మర్చిపోడమో కాదంటే, మనమేదో అని అది వాళ్ళకి అర్థం కాక..మనం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఏడవడమో – ఇలాంటివి జరగడం వల్లే తొంభై శాతం బాధలు.”

  Very well written.

 4. Like chidatala apparao shouts in “aa okkati adakku” ..

  Oooooo my gaaaaaad 😀

 5. […] ఈ రాత్రి […]

 6. […] […]

 7. Shreya Ghoshal “nishaachars” ani edo tweet chesindi, Chaala rojulaindi Sowmya gaari blog chusi “nisyaalochanaapatham” new episodes chadavaledemo anukunna, meeru raayaneledanna maata 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: