నిశ్యాలోచనపథం-6

ఎప్పట్లాగే మనకు నిద్ర పట్టదు. ఆలోచనలెక్కువైతే కూడా నిద్ర పట్టదంటారు కదా – మనకు పనే ఆలోచించడం కదా, కనుక లాజికల్లీ స్పీకింగ్, నేను పుట్టు ఇన్సోమ్నియాక్ అన్నమాట. మొన్నామధ్యో రోజు శ్రీశ్రీ కవిత్వాన్ని కాసేపు గుర్తు తెచ్చుకున్నాను. ఎప్పుడో డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం రాసిన మహాప్రస్థానం కవితలు ఇప్పుడు చూస్తే, “అవును నిజం, అవును నిజం, నీవన్నది నిజం నిజం” అని అనాలనిపించేంత వాస్తవికంగా అనిపించాయి. “వావ్! టైంలెస్ పొయెట్రీ!” అనుకోవాలో, “దిక్కుమాలిన ప్రపంచం ఇన్నేళ్ళైనా ఏమీ మారలేదు” అని నిట్టూర్చాలో అర్థం కాక దిక్కుల్లోని చీకట్లను దిక్కును బట్టి క్లాసిఫై చేయడానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాను.

ఇంతలో ఏదో ఆకారం నా గదిలోకి వస్తునట్లు అనిపించింది. ఎవరా? అనుకుని కళ్ళు చిట్లించాను. అయినా చీకట్లో కళ్ళు చిట్లిస్తే ఏంటి? గుడ్లు మిటకరిస్తే ఏంటి? ఏమీ కనబడదే! సరే, లైటు వేశాను. ఎదురుగ్గా ఓ పెద్దాయన. కొంత మందం కళ్ళజోడు, పడుకుని చూస్తే క్లాత్‍హెడ్డేమో అని అనుమానం వచ్చింది. కాస్త లేచి చూసాక నిర్థారణ ఐంది. సరే, ఏదో ఓ తల కానీ, అసలీ మనిషెవరు? ఎక్కడో చూసినట్లే ఉంది అనుకుంటూ ఉన్నా. ఆ మనిషి మాత్రం కాస్త చురుగ్గా నా వైపుకి చూస్తూ వస్తున్నాడు. నా అయోమయం చూసి నవ్వీనవ్వనట్లు ఓ నవ్వు నవ్వాడు. కొంతమంది నవ్వినా సీరియస్గానే నవ్వుతారు కాబోలు. ఇంకా నేను అలా చూస్తూ ఉండేసరికి “నన్నే గుర్తు పట్టవా?” అన్నట్లు కోపంగా చూసాడు. ఇన్ని హావభావాల్నీ ఈయన చూపించాక కానీ నాకర్థం కాలేదు ఈయనెవరో. ఓ పక్క “నవరసాల శ్రీశ్రీ” బొమ్మలు ఫ్లాషౌతూ ఉంటే, ఈయన్ని శ్రీశ్రీ అని గుర్తించాను.

“రండ్రండ్రండి రండి రండి రండి.” అంటూ ఆహ్వానించాను. “ఏవమ్మా, నన్ను అనుకరిస్తున్నావా? చెప్పిన పదమే మళ్ళీ చెబుతున్నావ్?” అన్నారు. “రామ రామ” అనబోయి… ఈయన ముందెందుకు దేవుడ్ని తలుచుకోడం అనుకుని “అదేమిటండీ అలా అనేశారు… మిమ్మల్ని చూసిన ఉత్సాహంలో…” అంటూండగా “సరే గానీ, ఏమిటీ ఒకటే తెగ తలుచుకున్నావ్ ఇవాళ నన్ను? నీ అవస్థ చూసి జాలేసి ఇలా వచ్చాను. ఏమిటింతకీ నీ బాధ?” అని అడిగారు. “అది కాదండీ, మీరన్నట్లే నేను ఎప్పుడు చూసినా – ’నిద్రకు వెలియై నేనొంటరినై, నా గదిలోపలి చీకటిలో, చీకటిలోపలి నాగదిలో, నా గదిలో చీకటిలో, చీకటిలో నా గదిలో…’ అనుకుంటూ ఉంటానండీ. మీరన్నట్లే నేను కూడా ’పోనీ పోనీ పోతే పోనీ….’ అనీ, ’రానీ రానీ వస్తే రానీ’ అనీ…ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండీ. మీలాగే నేను కూడా ’నిజంగానే…నిజంగానే…’ అని ప్రశ్నించుకుంటూ ఉంటానండీ. మీలాగే నేను కూడా ’నేను సైతం’ ఇది చేయాలనీ, అది చేయాలనీ అనుకుంటూ ఉంటానండీ. మీలాగే నేనూ నిజంగానే ’ప్రభంజనం వలె హోరెత్తండి’ అని జనంవైపు చూసి అరవాలని ప్రయత్నిస్తాను. మీలాగే నేను ’నేనొక దుర్గం, నాదొక స్వర్గం’ అని ఫీలైపోతాను.. మీలాగే..” అని చెబుతూ ఉండగా “ఇదిగో అమ్మాయ్! మాటలు తిన్నగా రానీయి. నేను దుర్గమే, నాది స్వర్గమే…ఫీలవడం కాదు. అసలు విషయం అదే.” శ్రీశ్రీ కి కోపం వచ్చింది. “అంటే, మీ లెవెల్లో ఫీల్ ఔతాను అంటున్నాను సార్” అని ఆయన్ని శాంతింపజేశాను.

“సరే, అయితే?” – అన్నారాయన. “అదే సార్, ఇలా మీ కవిత్వం చూస్తూ ఉంటే ఇన్నాళ్ళైనా నాకు అతికినట్లు సరిపోతోంది కదా, దానికి మీది టైంలెస్ కవిత్వం అనుకోవాలా..ఈ ప్రపంచం మారట్లేదు అనుకోవాలా అని ఆలోచిస్తున్నానండీ.” – అన్నాను. “ఏవమ్మా, ఇన్ని చెప్పావు, నేనే రాసిన ’ప్రపంచమొక పద్మవ్యూహం’ గుర్తురాలేదా? ఆ పద్మవ్యూహంలోకి దూరి బయటకొచ్చే దారి తెలీక మనుషులు అలా అయోమయంగా తిరుగుతూ ఉంటారు. ఏళ్ళైనా, ఊళ్ళైనా అందుకే ఆ కవిత్వానికి మరణం లేదు” కించిత్ గర్వంతోనే చెప్పారు. “ఓహో! అన్నట్లు, మీరన్నాక నాకోటి అనిపించింది..చెప్పమంటారా?” అన్నాను. చెప్పమని తలాడించారు. “ప్రపంచమొక పద్మవ్యూహం కనుకే బ్రతకడమొక తీరనిదాహమేమో అనిపిస్తోంది. లేకపోతే, బ్రతకడమొక తీరనిదాహం కనుకనే ఇది పద్మవ్యూహమైనా కూడా మనుషులు ఇందులోకి దిగుతూనే ఉన్నారా అని మళ్ళీ సందేహం కలుగుతోంది. ఏమంటారు?” అన్నాను. కాస్త అవాక్కయ్యారు. “బ్రతుకొక తీరనిదాహమంటావా?” అన్నారు. “కాదంటారా? ఎన్ని సమస్యలొచ్చినా, చావాలనిపించినా మనిషి బ్రతికేది ఎందుకు? అది తీరనిదాహం కనుకే కదా? కాదంటారా? చచ్చేవారి కథ వేరనుకోండి, వారికి దాహం తీరేందుకు బ్రతుకు కంటే గొప్ప మార్గాలు దొరికి ఉండవచ్చు. బ్రతుకు దాహం తీరేదైతే ఎన్ని చావులు ఎక్కువుండేవో…”

నా ధోరణిలో సోది చెప్పుకుంటూ మధ్యలో వింటున్నారోలేదో అని ఆయన వైపుకి చూశాను. ఆయన షాకింగ్ గా నోరు తెరిచి చూస్తున్నారు నావంక. ఆ నోరు ఇంతింతై అన్నట్లు పరిమాణంలో పెరిగిపోతూ నా అంత ఔతోంది. ఇక నాకు అసలు చెప్తున్న విషయం వదిలి ఓ ఐడియా వచ్చింది. ఆ నోట్లో దూరి వెనక్కి జారి, వెన్నముక పట్టుకుని పైకి ఎగబాకి ఆయన మస్తిష్కం రహస్యాల్ని కనుక్కోవాలని. మారు ఆలోచించక దూకేశాను. కానీ, వెన్నముక పట్టుకోబోయి పట్టు తప్పాను. కిందకు జారిపోడం మొదలైంది. “కాపాడండీ!” అని కేకేస్తూ పడిపోతున్నాను. ఉన్నట్లుండి ఓ మెత్తటి భాగం పై పడ్డాను. కళ్ళు తెరిచి దిక్కులు చూస్తే ఏముందీ! నేను మంచంపైనే ఉన్నానింకా!!

Advertisements
Published in: on March 24, 2009 at 2:00 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/03/24/nisyalochanapatham-6/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Bravo!

    బ్రతుకు దాహం తీరేదైతే ఎన్ని చావులు ఎక్కువుండేవో… hmmmmm..

    Hey, you’re due for a SciFi book.. aren’t you? 😛

  2. Cool.. నేనొక్కతితే అనుకున్నాను. నా లాంటి వాళ్ళూ చాలా మందే ఉన్నారన్నమాట.. 🙂 మీ స్టయిల్లో చెప్పాలంటే నేనూ మీలాగే….. మొన్న రవీంద్రుని కలిసి వచ్చాను. 😉

  3. Excellent Blog! Will be coming back. Keep up the great work.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: