నిశ్యాలోచనాపథం-5

నేనేమో గాల్లో తేలిపోతున్నాను. అదెలాగో మరి, చూస్తే, తెల్లబట్టలేస్కుని ఉన్నాను. రెక్కలు కూడా ఉన్నాయి. కొంపదీసి దేవదూతనయ్యానో ఏమిటో అనుకున్నా. నాకు తెలీకుండా నేనెలా దేవదూతనౌతాను? అనుకున్నాను. ఏదో ఒకట్లే, అయిపోయాం కదా, ఎలా? అని ఆలోచించి మన తల మనమే తినేయడం దేనికి? తర్వాత ఆ మొండెం లేని శరీరంతో తిరగడం దేనికి? అనుకుని ఆలోచనల్ని కట్టిపెట్టాను. సరే, రెక్కలతో ఎగరడం అలవాటు లేదు కదా, రెండు సార్లు టప టపా ఊపాను. ఒక అడుగు ఎగిరాను. కాస్త వేగంగా, కాస్త బలంగా ఊపాను – ఇంకాస్త ఎత్తుకి ఎదిగాను. మొత్తానికి ఇక్కడి నేల కూడా అదో మాదిరిగా ఉంది – నేల అన్నది తాకేందుకు కనబడ్డం లేదు. పొగ పొగగా ఉంటుంది కదా.

ఇంకా పైకి ఎగరాలని – ఇంకా బలంగా ఊపాను రెక్కల్ని. అంతే, ఒక పక్కది ఊడి పడింది. అలా పడిందో లేదో, పరుగెత్తుకొచ్చేసారు ఇద్దరు పోలీసోళ్ళు. అంటే, పోలీసోళ్ళో కాదో నాకు తెలీదు లెండి. పాపం నాకు సాయం చేయడానికి వచ్చిన దానయ్యలు కూడా కావొచ్చు. కానీ, నాలోని నిరాశావాది దాన్ని పోలీసు రాక గానే అనుకున్నది మరి, ఏమి చేసేది? ఒక్కోసారి ఆ ఎస్టిమేటే నయం – వాళ్ళు ఇక్కడి పోలీసోళ్ళే. విచిత్రంగా తెలుగే మాట్లాడారు. వాళ్ళలో బిల్ట్-ఇన్ భాషా పరికరాలేమన్నా ఉన్నాయేమో – sci-fi సినిమాల్లాగా – అని అనుకున్నాను. నేను ఎవరని అడిగేంతలోపే… నేనెవరని అడక్కుండానే గబగబా వాళ్ళ బండిలోకి నన్ను తోసి పట్టుకెళ్ళిపోయారు – ఎక్కడికో తెలియలేదు. ఆ గది తలుపులు మూసి ఉన్నాయి. వీళ్ళెల్లి కార్డ్ స్వైప్ చేస్తే తెరుచుకుంది. నన్ను అక్కడ వదిలేసి, పది నిముషాల్లో వస్తామని చెప్పి వెళ్ళారు. నేనేమీ తోచక ఆ గదిలో నడవడం మొదలుపెట్టాను.

బాగా పెద్ద గది. బాగా అధునికంగా ఉన్నాయి పరికరాలు. ఏం చేస్తాయో ఏమిటో కానీ, చూట్టానికి భలే ముద్దొస్తున్నాయి. ఆత్యాధునిక జిం కాబోలు అనుకున్నాను. కాస్త దగ్గరగా వెళ్ళి పరికరాలని చూస్తూ ఉంటే అర్థమైంది అదేమిటో – వామ్మో, ఆధునిక జిం కాదు….ఆధునిక నరకం అది! మనుషుల్ని హింస పెట్టడానికి పూర్వం సినిమాల్లో చూపినట్లు నూనె వేగుతున్న బాణలి వంటివి లేవు అక్కడ. సాంకేతికత ని ఇలాంటివాటి కోసం ఉపయోగించుకున్నారన్నమాట ఇక్కడ! నన్నెందుకు వదిలారో ఇక్కడ – రెక్కలు చింపితే ఇలా శిక్షిస్తారా ఇక్కడ? ఓ క్షణం ఏడుపొచ్చింది. ఏమీ తోచలేదు. ఇప్పుడిక మళ్ళీ ప్రశ్న మొదలైంది – “అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను? ఎందుకొచ్చాను?” అని. మళ్ళీ మరో క్షణం లోనే – ఎలాగో జవాబులు దొరకవు కానీ, వదిలేయి అని మనసు అన్నట్లు అనిపించింది. మన మనసు నిజంగా మన పక్షమా, అవతలి వాళ్ళ పక్షమా అన్న సందేహం వచ్చినా కూడా అప్పటికి వదిలేసాను ఆ విషయాన్ని.

10 నిముషాలు ఐపోయాయి ఏమో. వాళ్ళొచ్చేశారు. నావైపు కౄరంగా ఒకరు, వెధవ నవ్వుతో ఒకరు చూస్తూ – “ఏది కావాలో ఎంచుకో. నీ శిక్ష దానిపైనే” అన్నారు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ, వాళ్ళు మళ్ళీ చూడమని గద్దించడంతో, లోపలి ప్రాణాల్ని పైకి తెచ్చుకుని చూడ్డం మొదలుపెట్టాను. అప్పటికే మైండు బ్లాకైపోయింది. అక్కడున్నదేదో పేరు చూడకుండానే ఎంపిక చేశాను – ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోడానికి? అనుకుని. వాళ్ళు నవ్వి దగ్గరికి వస్తూ ఉండగా – వాళ్ళలో ఒకరి సెల్ మ్రోగింది. వీళ్ళు అతి వినయంగా ఏదో వాగేసి, తర్వాత వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడేస్కుని, నా దగ్గరికొచ్చారు. “సారీ! రాంగ్ పర్సన్” అనేసి మర్యాదన్నా లేకుండా బైటకి తోసేసారు.

అసలే అక్కడ నేల లేదా, నాకా రెక్కల్లేవు. కింద పడటం మొదలుపెట్టాను. కిందకి చూడగానే, ఉన్న కొన్ని ప్రాణాలు కూడా గాల్లో కలిసినట్లైంది. భయంతో కళ్ళుమూసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఏముందీ – పక్కమీదే ఉన్నాను – రోజూ లాగే. అబ్బా! ఇదో నరకం! అనుకున్నా. ఓ క్షణం ధైర్యం చేసుంటే, ఆ నరకమే నివాసమయ్యేది కదా, లగ్జరీ నరకం మామూలు నరకం కంటే ఎప్పుడూ నయమే కదా అనిపించింది. కానీ, ఏం చేస్తాం! అరక్షణం ఆ యంత్రం లోకి వెళ్ళిపోకుండా ఆలస్యం చేసాను. ఇక్కడ జీవిత యంత్రం లో బుక్కైపోయాను అనుకున్నానిక!

Advertisements
Published in: on March 19, 2009 at 2:13 pm  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/03/19/nisyalochanapatham-5/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. WOW!

  2. అద్భుత చిత్రణ. చెప్పేను కదా నీ టపాలు బ్లాగు స్థాయి దాటి కథస్థాయికి చేరుకున్నాయి. దీన్ని నేనయితే టపా అనను. 🙂

  3. >>అరక్షణం ఆ యంత్రం లోకి వెళ్ళిపోకుండా ఆలస్యం చేసాను. ఇక్కడ జీవిత యంత్రం లో బుక్కైపోయాను అనుకున్నానిక!

    hahaha..

  4. Well executed post.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: