నిశ్యాలోచనాపథం-4

అంటే, ఈ మధ్య కాలంలో నిశ్యాలోచనలు లేవని కాదు కానీ, పగలంతా ఉంటే పనీ, లేకుంటే ఆవులింతలూనూ. ఇక రాసేందుకు వీలెక్కడిది?

ఇంతకీ ఆ మధ్యోరోజు నైటవుటా ఇన్నా అనేది నిర్ణయించుకుని ఇన్ననుకుని పడుకునేసరికి ఒంటిగంటైంది. చీకటీ, నిశబ్దం, ఒంటరితనం – ఇవి చాలవూ ఎడతెగని ఆలోచనలూ, ఆందోళనలూ మొదలవడానికి? కళ్ళు మూసుకుపోతూ ఉంటే చీకటి మరింత చిక్కగా మారింది. దారులన్నీ మూసుకుపోయినట్లే అనిపించింది. (ఏమన్నా తెరిచున్నా ఆ చీకట్లో ఎక్కడ కనిపిస్తాయి లెండి!) ఇప్పటికిప్పుడు నన్నిక్కడ కట్టిపడేసి అటూ ఇటూ ఈ భయానక శబ్దాలూ అవీ చేయిస్తూ, అప్పుడప్పుడూ ఏవో అటూ ఇటూ కదులుతున్న చప్పుడు తెలుస్తూ ఉంటే – అంత అతి ధైర్యమేమీ లేని నాకు ఎలా ఉండిఉంటుందని మీరు ఊహించుకోగలరో అలాగే అనిపించింది ఆ క్షణాల్లో నాకు.

నిజానికి, కావాలంటే కదలొచ్చు కానీ, ఏమిటో, మనసేవో చీకటి దారుల్లో తిరుగుతూ కిందపడ్డది. ఆ చీకట్లో లేచీ-పడీ, పడీ-లేచీ, చచ్చీ-చెడీ, చెడీ-చచ్చీ ఎలా నడుస్తామని చివరికి ప్రాకడం మొదలుపెట్టింది. కనుక ధ్యాసంతా అది ఎటు కదుల్తోందో గమనించడంపై ఉంది కానీ శరీరాన్ని కదిలించడంలో లేదు. అఫ్‍కోర్సు, భయం ఉండనే ఉందనుకోండి, పక్కకు కదిలితే ఏమౌతుందో అని. పక్కకి కదిలితే పక్కంతా కదిలి భైరవద్వీపంలో లా గాల్లోకి ఎగురుతుందేమో అన్న భయం. పిడికిలంత నా మనసు చీకటి దారుల్లో నిర్భయంగా దొర్లుకుంటూ అయినా పట్టువదలక తిరుగుతోందే, చెట్టంత మనిషిని నాకేమిటో భయం!!

భయం చీకటిని చూస్తున్నందుకా? ఎక్కడి చీకటిని? దిక్కులన్నీ చూసే దిక్కులేకుండా చేసిన బయటి చీకటినా? లేక మనసు తిరగగల దారులన్నీ మూసేసి, ఉన్న ఆశలన్నీ అడుగంటి ఉన్న క్షణాలలో మరింత చిక్కగా విజృంభించిన లోచీకటినా? భయం చీకటి గురించైతే ఇక చీకట్లో తప్పించుకునే దారేదీ? కన్నుమూసినా, తెరిచినా ఏదో చీకటే, ప్రతి క్షణమూ తిమిరంతో సమరమే. బ్రతుకు అమరమవ్వాలన్న వాంఛ కలవారు ఇలా పోరాడినా న్యాయం ఉంది కానీ బ్రతకాలనుకునేవారికెందుకు ఈ పోరాటాలు? (With due apologies to Dasarathi kavi. No offence meant).

భయం బ్రతుకు గురించైతేనో? నిజమే, బ్రతుకడానికి భయపడి పారిపోయేవారెందరు లేరు? నిజానికి ఆలోచిస్తే వారిని చేతగానివాళ్ళని నిందించడం, చేవలేనివారని కొట్టిపారేయడం – చాలా తేలిగ్గా చేసేస్త్తూ ఉంటాము కదా అనిపిస్తుంది ఇప్పుడు. భయమన్నది ఓ బలహీనత అనుకుంటే, బ్రతుకు భయం కూడా ఓ బలహీనత కాదూ? మరి అందరూ వాళ్ళ బలహీనతల్ని అధిగమించేస్తారా ఏమిటీ? కొందరు వాటికి బలైపోరూ? అది వారి పొరపాటా? అసలు వారి పొరపాటెలా ఔతుంది? అంటే మరి ఆత్మహత్యలు నేరాలు కావా? హత్యలే కదా – అయినా నేరాలెందుకు కావు?

దిక్కుమాలిన ప్రశ్నలు. దిక్కుమాలిన సందేహాలు. ఏమన్నా చేసి ఈ ఆలోచనల్నుంచి మనసుని ఏమారుద్దామంటే దారేదీ? వెధవ చీకటొకటి – భయంతో కట్టిపడేసింది కూడానూ. అదేమిటి, చీకటి చిక్కదనం తగ్గుతోంది? నేను కూడా ఆశావాదిని ఔతున్నానా ఏమిటి? అదెలా సాధ్యం? “నీ మొహం! తెల్లారింది!” అంతరాత్మ కేకేయడంతో “అప్పు-డే తెల్లారిందా!” అని అప్పుల అప్పారావులా అనుకుంటూ కళ్ళు నులుముకున్నాను.

Advertisements
Published in: on March 10, 2009 at 2:53 pm  Comments (2)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/03/10/nisyalochanapatham-4/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. Soooooooooooper

  2. బాగుంది. ఎక్కడి చీకటిని? దిక్కులన్నీ చూసే దిక్కులేకుండా చేసిన బయటి చీకటినా? లేక మనసు తిరగగల దారులన్నీ మూసేసి, ఉన్న ఆశలన్నీ అడుగంటి ఉన్న క్షణాలలో మరింత చిక్కగా విజృంభించిన లోచీకటినా? –చాలా మంచివాక్యాలు. చూస్తూంటే గొప్ప రచయిత్రివి కాగలవు త్వరలోనే అనిపిస్తోంది. శుభమస్తు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: