మౌనంతో యుద్ధం

కారణాలేమైనా నాకు మౌనంతో శతృత్వం. యుద్ధమెలా ప్రారంభించాలో తెలియలేదు. శాంతిమార్గంలో నడకలూ, పరుగులూ అలవాటైపోయి ప్రాథమిక యుద్ధరీతులే మర్చిపోయాను. ఎందుకొచ్చానా అహింసలోకి, మరీ చేతకాని బ్రతుకైపోయిందే అని అనిపించింది. అంతరాత్మైతే లోపల్నుంచే నన్ను కడిగిపారేసింది – చేసి తీరాల్సిన యుద్ధం చేసి తీరాల్సిందేననీ, లేకుంటే చేతకానితనాన్ని ఒప్పేసుకొమ్మనీ! నేనెంత loser ని అయినా ఆ విషయం నా నోటిమీదుగానే ఎలా అనను? పౌరుషం కొద్దీ – ’యుద్ధం చేసేస్తా, గెలిచేస్తా, మౌనాల్ని ఛేదించేస్తా, మాటలకి పట్టం కడతా’ అని గట్టి శపథాలు చేసి, నిప్పులు చెరుగుతున్న నా అంతరాత్మపై మంచువర్షం కురిపించి దాన్ని చల్లార్చాను. అప్పుడే మరోవైపు నుండి వ్యూహరచన ప్రారంభించింది నా మెదడు.

గంటల తరబడి ఇదే విషయంపై దృష్టి కేంద్రీకరించి తలపట్టుకుని జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది చివరికి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, మౌనాన్ని మౌనంతోనే జయించాలని. సరైన సమయం కోసం ఎదురుచూస్తూ దొరగ్గానే ఎదురుదాడి చేసాను మౌనంపై. మొదట నా మారువేషం చూడగానే మౌనం అదిరిపడ్డది. ’image makeover?’ అన్నది. ’Desire to avenge takes over’ అన్నాను, ప్రాస కుదిరేలా చూస్కుని. అప్పుడు అది నన్నో చూపు చూసి మళ్ళీ మౌనం వహించేసింది. ఆ క్షణంలో ఆ చూపు – ’చూస్కుందాం, కాస్కుందాం’ అన్న సవాల్ చూపులా అనిపించింది నాకు. ’సై’ అన్నట్లు చూశాను నేను కూడా. ఈసారి అదో తరహా నవ్వు మౌనంగానే నవ్వి, నన్ను లక్ష్యపెట్టక ముందుకు సాగింది మౌనం. పెడసరపు నవ్వనుకున్నాను. ఆ చూపులోనూ, ఆ నవ్వులోనూ ఉన్నది ’జాలి’ అని అప్పట్లో నాకు అర్థం కాలేదు.

నా భవిష్యత్తు ఓటమిని చూడగలిగిందో లేక నాలాంటి ఎందర్నో చూసి తలపండిపోయిన అనుభవమో మరి, మౌనం జాలిపడ్డం సరైనదే అయింది. ఇలా దాని వేటలో పడి యుద్ధానికెళ్ళానని విరహం ఎక్కువై, అది వికటించి, మాటలు నా నుంచి విడిపోయాయి. ఒక పక్క అక్కడేమో మౌనం మూలాలే చిక్కలేదు, వేళ్ళతో సహా దాన్ని పెకలించి విజయబాపుటా ఎగురవేద్దామంటే. అఖరుకి ఇప్పుడు రెంటికీ చెడ్డరేవడినయ్యాను! ఇదంతా ఊహించే మౌనం జాలిపడి ఉంటుంది.

అయితే, రెండూ చేసిన పొరపాటొకటుంది. నేనిక పైకి లేవనని అనుకుని నన్నోచోట పడేసి చెరోదిక్కుకూ వెళ్ళిపోయాయి మౌనమూ-మాటా (ఎప్పటిలాగే). నేనేకాకిగా మిగిలి కాస్తకాస్తగా కోలుకుంటూ ఉండగా ఓరోజు సుప్తచేతనావస్థలో కలయో నిజమో వైష్ణవమాయో తెలీని అయోమయంలో ఓ ఆశరీరవాణి వాక్కుల్లో జ్ఞానోదయమైంది. ఆ ఆశరీరి నా అంతరాత్మేనేమో అన్న అనుమానం నాకిప్పటికీ లేకపోలేదు.

ఏదైతేనేం, నా జాతకం మారిపోయింది అప్పట్నుంచి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఆడే మౌనమూ,మాటా రెండింటినీ చూస్తే ఓ పక్క జాలేస్తోంది, మరోపక్క విజయగర్వం! నా అజమాయిషీలో మరీ కుక్క బ్రతుకైపోయింది రెండింటిదీనూ! ఇంతకీ ఏం చేసాను? అన్నది చిదంబర రహస్యం. ఢక్కామొక్కీలు తిని, నాలా ’నిద్రకు వెలియై, నేనొంటరినై’ అని శ్రీశ్రీ అన్నట్లు పడి ఉంటే తప్ప అశరీరవాణి మీజోలికి రాదు. మీకా రహస్యమూ చెప్పదు. నేనెలాగో చెప్పను. ఎందుకంటే, చెబితే నా తల వేయి ముక్కలౌతుందని అశరీరవాణి ఉవాచ. అయితే అయింది కానీ అని చెప్పేసేదాన్నే – రామానుజుల లెవెల్లో ఫీలైపోయి. కానీ, నాలోని శాడిస్టుకి అలాంటి పరోపకారం నచ్చదు. నేనది చెప్పేసి మిమ్మల్ని సుఖపెట్టడం ఇష్టం లేదాయె. ఏం చేసేది? దాని మాటలు వినలేదనుకోండి, అదే masochist గా మారి నన్నే హింసించడం మొదలెట్టి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎంతైనా, ముందు నా సుఖం నేను చూసుకోవాలి కదా, కనుక నేను చెప్పను ఆ రహస్యం.

అసలీ టపాకూడా నాలోని శాడిస్టు ఆలోచనే. ఈ విషయం గురించి నేనేమీ మాట్లాడకుండా ఉండిపోతే మీకెలాగో ఈ సంగత్తెలీదు కనుక నిశ్చింతగా ఉంటారని, అది ఇష్టం లేక, ఇలా సగం చెప్పి సగం వదిలేయమన్న సలహా ఇచ్చింది నాకు.

చివరగా: మీరేమన్నా అనుకోండి కానీ, శ్రీశ్రీ కథలు-అనువాదాల్లో అధివాస్తవికత చదివి చదివి, వెంటనే రాస్తున్న టపా ఇది. అధివాస్తవికత (దానినే తమ ఆంగ్లమున సర్రియలియం అనగా surrealism అందురు. అదియునూ తెలియదు మనకు! మన దౌర్భాగ్యము! – కోటా శ్రీనివాసరావు ఇలాగే అని ఉండేవాడు) ఎక్కువైపోయి, ఇలాగ అతివాస్తవికతో, అర వాస్తవికతో, అర్థవాస్తవికతో అవాస్తవికతో ఏం కతో అర్థంకాని రాతలు రాయడం మొదలుపెట్టానన్నమాట!!

ఓ అన్నట్లు మర్చిపోయా, ఈ పోస్టుని కొందరికి అంకితమివ్వాలన్న ఆలోచన కూడా ఉంది నాకు. తమ మౌనంతో నన్ను ఒకట్రెండు విధాలుగా వేధించిన వారికి కోపంతోనూ, నేనెవరినైనా మౌనంగా హింసించి (మనం మాటల్తో కదా హింసించేది??) ఉంటే వారికి జాలితోనూ ఈ టపా అంకితం 😉

Published in: on January 16, 2009 at 11:45 am  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/01/16/mounamtowar/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

  1. ha ha.. oka manchi tablet vesukunte screws anni tight avutaayi 🙂

  2. శబ్దం స్తాణువౌతుంది

    మౌనం మాటలాడుతుంది

    పెనవేసుకున్న ఆ రెంటి కొసన

    బంగారు పంజరాన మనసు ఊయలలూగుతుంది

  3. >>అయితే, రెండూ చేసిన పొరపాటొకటుంది. నేనిక పైకి లేవనని అనుకుని నన్నోచోట పడేసి చెరోదిక్కుకూ వెళ్ళిపోయాయి మౌనమూ-మాటా (ఎప్పటిలాగే). ఏదైతేనేం, నా జాతకం మారిపోయింది అప్పట్నుంచి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఆడే మౌనమూ,మాటా రెండింటినీ చూస్తే ఓ పక్క జాలేస్తోంది, మరోపక్క విజయగర్వం!

    ha ha… Too good!

    మౌనానికి ఉన్న విలువ నేను ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను.

  4. భలే ఉందీ టపా! మౌనాన్ని దారికి తెచ్చుకోవడం అంత సులువైన పని కాదు కదా!

    శ్రీ కిరణ్ గారి లైన్స్ చాలా బావున్నాయి..

  5. పైన విశాల కోట్ చేసిన వాక్యాలతో పాటు,
    ఇలా సగం చెప్పి సగం వదిలేయమన్న సలహా ఇచ్చింది నాకు. – కూడా నాకు చాలా నచ్చింది. మొత్తంమీద నీ ఆవేశం చెలరేగి మంచి రచయితలకుండే శైలీ, నైపుణ్యం నీకు బాగా పట్టుబడుతున్నాయి. కూడోస్… 🙂

  6. మౌనానికి .. మాటకీ మధ్య సంఘర్షణ …hmmm… సులువుగా ఒక కొలిక్కి రాని మనోసంఘర్షణ.
    జయించడం కూడా అంత సులువు కాదు అని ఈ మధ్యే తెలిసింది …
    ఈ టపాలో ఆ సంఘర్షణ తాలూకా అనుభవాన్ని బాగా చెప్పడం జరిగింది .

    Nice post.

  7. wow…..great post

  8. interesting & creative post…nee style of writing interesting ga undi

  9. ” అధివాస్తవికానందం
    అ ఆ ఇ ఈ ఉ ఊ
    కచటతపలు, గజడదబలు
    ఋ ౠ ఌ ౡ ”
    – శ్రీశ్రీ

  10. ????????
    🙂

  11. endukoo theliyadu…nuvvu cheppina ee pichhi raatha(nuvvu pettukunna peru) lo naaku nuvvu padda vedana kanipisthondi….nenu kuuda neelaane unnanu kaani nuvvu mounam tho nenu vaagudutho poraaduthunnanu….mounam gaa untunnanu……chaala baagaa raasaavu


Leave a reply to radhika Cancel reply