ఎదురుచూపు

“ఎదురుచూపుకు నిదరేదీ?” అని వేటూరిగారనుకుంటా – నిలదీశారు. మొన్నోరోజు రాత్రి మంచంపై వాలి నిద్రాదేవి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటే, ఆ వాక్యం గుర్తొచ్చింది. నిద్ర కోసం చూసే ఎదురుచూపుకి మాత్రం నిద్ర ఎక్కడిది? 🙂 ప్రైమరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు పుస్తకంలో ఓ కవిత ఉండేది – పేరు గుర్తురావట్లేదు. అందులో ఇలాగే నిద్రకి ఓ భౌతిక రూపాన్నిచ్చి వర్ణిస్తారు. పిల్లలకి జోలపాడుతూ ఉండగా నిద్రాదేవి వీథిలోంచి నడిచొచ్చి పిల్లాణ్ణి ఆవరించడం – ఇలాంటిదేదో వర్ణన. నా మటుకు నేనైతే నిజంగానే చాలారోజులు అమాయకంగా నిద్ర అలాగే రోడ్లోంచి నడిచొచ్చి నన్ను చేరుతుందనీ, ఒక్కోరోజు నాకు నిద్ర రాకుండే ఆవిడకేమైందో అని ఎదురుచూస్తూ, ఆమె రాలేదు కనుక నిద్ర రాలేదని సరిపెట్టుకునేదాన్ని. ఇప్పటికీ నాకాభావన అంటే ఇష్టం. కానీ ఇప్పుడైతే పెద్దరికమొచ్చి పడింది కదా ! ఏం చేస్తాం! అయినా, అసలు విషయం మర్చిపోయి నేనేదో చెబుతున్నా. “ఎదురుచూపు” అన్న అనుభవాన్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేసాను, నిద్రకోసం నిద్రలేక ఎదురుచూస్తూ. అప్పటి ఆలోచనలను రాస్తే, ఈ టపా అయింది. 🙂

ఎదురుచూపులో ఓ గమ్మత్తుంది. మనమిక్కడుండగానే ఎక్కడో ఉండగలం. 2008 లో కూడా 2007 లో చూడగలం. 🙂 అర్థం కాలేదా? ఎదురుచూపులో ఉన్నప్పుడు మనకు తెలీకుండానే దానికి సంబంధించిన గతాన్ని తలుచుకోడం గురించి చెబుతున్నాను. ఆ విధంగా చూస్తే ఎదురుచూపు ఓ టైం మెషీన్. ఎదురుచూపు ఓ ఇంద్రజాలం. ఇంతలోనే నవ్వించగలదు – ఏదో తీపి జ్ఞాపకం తలపుకి తెప్పించి. అంతలోనే ఏడిపించగలదు – అదే తీపి ఇప్పుడు లేదన్న విషయం గుర్తు చేసి. ఎదురుచూపు ఓ తీపి బాధ. రేవతీదేవి “దారి” కవితలో అన్నట్లు – “ఈ తీపి బాధగా, ఈ బాధ తీయగా” – అలాగే ఉంటుంది ఎదురుచూడటం. ఈ ఎదురుచూడటం దేనికోసమైనా, ఎవరికోసమైనా – దేనిలోని తీయదనం దానిదే. ఏ తీపిలో తగిలే చేదు దానిదే. ఎదురుచూపు ఓ చేదు సంతోషం. ఎంత బాధగా ఉంటుందో అంత బాధలో కూడా తలపులన్నీ ఎదురుచూస్తున్న వ్యక్తి/విషయం మీదే ఉన్నాయన్న ఆలోచన అంత ఆనందం కలిగిస్తుంది. ఎంతెంతటి దూరాలో ఎదురుచూపుల్లో దగ్గర్లైపోతాయి. “చేరువైనా, దూరమైనా ఆనందమే” 🙂 దూరమైనప్పటి ఆనందం చేదు ఆనందం. చూపులకి దూరమన్న బాధ, తలపుకి దగ్గరన్న ఆనందం. ఒక క్షణం నిరీక్షణానందం. మరుక్షణం ఇంకెంతసేపన్న విసుగు. తరువాతి క్షణంలోనే ఈ ఎదురుచూపులే మిగుల్తాయేమోనన్న నిర్వేదం, ఇంతలోపే చివరికి సమయమే తలవంచి నిరీక్షణ నిలిచిపోయే సమయం ఎంతోదూరంలో లేదన్న ఆశా – వెరసి ఎదురుచూపు ఓ ఉగాది పచ్చడి. 🙂

“చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి…” – పాట గుర్తొస్తోంది. కళ్ళు కాయలెందుకు కాస్తాయి? కన్నీరు రాలొచ్చేమో గానీ? లేక, కన్నీరు ఇంకి ఇంకి, పాపం కళ్ళు అలా అయిపోయాయనేమో. అయినా, ఎదురుచూపులో గమ్మత్తే కాదు, మత్తుకూడా ఉంది. ఆ మత్తులో పడితే ఇక ఇంతే సంగతులు. “ఆశ” విలువ నేర్పే అనుభవాల్లో ఎదురుచూపు కూడా ఒకటని నా నమ్మకం. ఎదురుచూపు ఓ సైన్ వేవ్ లాంటిది. ఉవ్వెత్తున ఎగిసే ఆశా, పూర్తి నిరాశా – రెండింటినీ చూపగలదు మనకు. ఎదురుచూపు ఓ లోలకాన్ని కూడా తలపిస్తుంది నాకు – ఆశకూ నిరాశకూ మధ్య ఊగిసలాడుతూ, మధ్యలో ఒక్కొక్కరోజు ఒక నిర్లిప్త స్థితిలో ఉంటూ. ఈ ఎదురుచూపులో రాలిన ప్రతి కన్నీటి బొట్టూ మనలో ఉన్న అభిమానానికి ప్రతీకగా అనిపిస్తుంది నాకు. “అనురాగానికి స్వరమేదీ?” అంటే నాకు జవాబు తెలీదు కానీ, చూపు మాత్రం ఎదురుచూపు లో ఉంది. 😉

ఎదురుచూపు ముగిసిపోయాక దాన్ని తలుచుకుంటే కలిగే అనుభూతినేమంటారో మరి! దాన్ని వర్ణించడానికీ, నామకరణం చేయడానికీ – రెండింటికీ నాకు మాటలూ చాలడం లేదు… అనుభవమూ చాలడం లేదు. Dark Humor (అదేలెండి, పోనీ Black Comedy)అన్న పదం అంటే నాకు చాలా ఇష్టం.  ఎదురుచూపు ని కూడా నేను అలాగే Dark romance అంటాను. Romancing with the darker side since there is no option but  to wait for the brighter side అనమాట. Perhaps, this way of looking at it is very masochistic. I dunno. ఈ పంథాలో ఆలోచిస్తూ పోతూ ఉంటే, మనసు పరిపరివిధాల పోతోంది… కవుల భాషలో – ఎదురుచూపు ప్రియమైన శత్రువు లాగా, అప్రియమైన మిత్రుడిలాగా… అందాల రాక్షసి లాగా … కాస్త కౄరంగా చెప్పాలంటే, మేకవన్నె పులిలాగా, తాడులా కనిపించే పాములాగా… రకరకాల ఉపమానాలన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ అన్వయించుకోడానికి! Hmm….  “ఎక్కడికో వెళ్ళిపోతున్నాన్సార్!” …. so, Coming back to reality 🙂

ఒక్కో ఎదురుచూపూ ఒక్కో మర్చిపోలేని అనుభూతి నాకు. మరిచిపోలేక మరచిపోలేనిది అంటున్నా కానీ, మధురానుభూతి అనట్లేదు. దేనికోసమైతే/ఎవరికోసమైతే ఎదురుచూసానో, ఆ సంఘటన తాలూకా జ్ఞాపకాలతో అది జరిగే ముందు నడిచిన ఎదురుచూపుల ప్రహసనం కూడా ముడిపడిపోయిన సందర్భాలెన్నో. ఒక జ్ఞాపకంలో మరో జ్ఞాపకం లాగా అనమాట. అమ్మో! మళ్ళీ జ్ఞాపకాల జోలికెందుకు… తేనె తుట్టెను కదిలించి ఒళ్ళంతా కుట్టించుకోడానికి కాకపోతే! 😉

Advertisements
Published in: on October 26, 2008 at 10:44 pm  Comments (15)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/26/eduruchupu/trackback/

RSS feed for comments on this post.

15 CommentsLeave a comment

 1. బాగుంది! “చేరువైనా.. దూరమైనా ఆనందమే!”.. నాకు చాలా నచ్చిన పాటలో నచ్చిన లైన్!

  ఎదురుచూపులు-విరహం-ఎడబాటు అనగానే నాకు గుర్తొచ్చేది ఇదే:

  ఎదురుచూపుల బాధలోనే ఎందుకో ఈ తియ్యందనము
  విరహమన్నది లేకపోతే వలపుకేది వెచ్చెందనము!

  అన్నింటి గురించీ, అందరి గురించీ ఎదురుచూడము! So.. enjoy being in a special feeling!

  I loved the word, “dark romance”! Got to have a careful look at it now. 😉

 2. Nice post …

 3. Nice post …

 4. సఖిలోని అలలై పోయెను పాటకి విశ్లేషణలా వుంది ఈ టపా.అనురాగానికి స్వరమేది అన్న మాట విన్నప్పుడల్లా నాకు గుండె గొంతులో కొట్టుకుంటూ వుంటుంది.ఎదురుచూపుల గురించి మీరు చెప్పిన ప్రతి మాటతో అర్జంటుగా ఏకీభవించేస్తున్నాను.

 5. WOW!

 6. బాగుంది.

  మీ తరువాతి టపాల కోసం “ఎదురు చూడాలనిపించేలా” ఉంది మీ టపా.

 7. బహు బాగు.
  ఎదురు చూపు డార్క్ రొమాంసు అనేది పర్షియం కవులు పతాక స్థాయికి తీసుకెళ్ళారు.
  ఎప్పుడో చదివిన ఒక ఆంగ్లానువాదంలో భావం స్థూలంగా ఇలా ఉంటుంది. ప్రియురాలు అంటోంది. ప్రియుడూ ఎక్కడో దూర దేశం వెళ్ళాదు. తిరిగి రాలేదు. ఎదురు చూస్తున్నాను. శరీరం శుష్కించి పోయింది. రాబందు నన్ను సజీవంగానే కబళించడానికి చూస్తోంది. ఓ రాబందు, నా శరీరం మొత్తం తినేసినా కళ్ళని మాత్రం మిగుల్చు. అప్పటికైనా నా ప్రియుడొస్తాడేమో ఒక్క సారి చూస్తాను .. అని.

 8. ఓ సినీకవి అన్నట్లు…
  “విరహము కూడా సుఖమే కాదా..
  విరహపు చింతన మధురము కాదా…”

  ఓ సినీకవి అన్నట్లు…
  “విరహము కూడా సుఖమే కాదా..
  విరహపు చింతన మధురము కాదా…”

  చాలా బాగా వ్రాసారండీ…`

 9. నా అనుభవంతో ఎదురుచూపుకి ముగింపు వుండదు సౌమ్యా. ఒకమనిషికోసమో, ఒక వస్తువుకోసమో ఎదురు చూడడమే జీవితాన్ని ముందుకు నడిపించేది. అంచేత, ఒక ఎదురుచూపు అయిపోగానే దాని డూటి అయిపోయిందన్నమాట :p.

 10. I mean life is Work in Progress. 🙂

 11. @Purnima, Varma, Girish, Kottapali, Bramhi, Phani:
  Thanks a lot.
  @Radhika: 🙂
  @Malathi garu: Life is work in progress… good one! I liked it. 🙂 ఎదురుచూపుకి ముగింపు ఉంటుంది…కానీ, వెంటనే కొత్త ఎదురుచూపేదో వస్తుంది. కనుక, జీవితాంతం చూపులు, వాటికోసం ఎదురుచూపుల్లోనే గడుపుతామేమో… Thats how I see it currently 😉

 12. చూపులకన్నా ఎదురుచూపులు మిన్న అంటారు. మాలతి గారు చెప్పినట్లు ఎదురుచూపులు లేకపోతే అసలు జీవితమేది అనిపిస్తుంది ఒక్కోసారి. ఎదురు చూసి.. ఎదురు చూసి…అన్న ఫీలింగే చాలా బాగుంటుంది. చాలా బాగుంది సౌమ్య గారు.

 13. Namaskaram…

  Modatlo baavundi.. kaani ponu… ponu… maree klistamga thayarayyindi…

  Alochanalu anthe (kalagura gampa)… kaani… daanni alaage express cheste… chadivevadu thala gokkovadam khayam…

 14. 3 putalaa dunnapothula mekki padukuntunte thelidam ledhu gani nidra kosam intha yeduru chusthara.. naku matram book open chesthey rathi devi ravaddu ravaddu anna vachestadhi. (ayyo sorry nidra devi kadhu)

  anyway kekaa undandi mi vyasam kani vamsi cinema style lo modalaina mi blog jandyala garni dati maniratnam style loki vellipoyindi ma lanti nelaa ticket gallaki konchem kastam ayindi 3 sarlu chadavalsi vachindi

 15. […] వస్తోంది. అంతే. గత ఏడాది, ఇదే టైం లో “ఎదురుచూపు” గురించే ఒక పోస్టు రాశాను. ఆ విషయం ఇది […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: