మాటలొచ్చిన మూగతనం

మాటలొచ్చిన మూగతనం అన్నది ఒకటున్నదనీ, అది నన్ను అలుముకుని రోజుల తరబడి కొనసాగుతుందనీ, ఆ వెల్లువలో పడి బయటకొచ్చే దారి తెలీక నేను అల్లాడతాననీ అసలు ఊహించలేదు. ఈ మూగతనం నాకున్నదని తెలుసుకోవడానికే ఎన్నో ఏళ్ళు పట్టింది. తెలిసాక నా అశక్తతని ఒప్పుకుని బహిరంగంగా చెప్పుకోడానికి మరికొన్ని నెలలు పట్టింది. మాటల్లో చెప్పుకోలేని బాధ రాతల్లోనైనా చెప్పుకోగలనన్న ఆశా, “జ్ఞాపకానికి సలాం” కొట్టినప్పుడు కలిగిన ఊరటా ఈ టపాకి ప్రేరణలు.

అసలు మూగతనానికి మాటలు తెలిసుండటమేమిటి? మాటలు తెలిసుంటే అది మూగతనమెలా అవుతుంది? enlightenment కాకముందు నేనూ ఇలాగే అడిగి ఉండేదాన్ని. 🙂 నేను ఈ టపాలో చెప్పదలుచుకున్నది జపనీస్ తత్వ శాస్త్రజ్ఞుడు డి.టి.సుజుకీ ఒక్క వాక్యంలో తేల్చేశాడు –
“The contradiction so puzzling to the ordinary way of thinking comes from the fact that we have to use language to communicate our inner experience which in its very nature transcends linguistics”
(Courtesy: The Tao of Physics by Fritjof Capra)
అని. అయినప్పటికీ చేతి దురదకొద్దీ ఈ టపా రాయక తప్పడం లేదు. 🙂 మా ఇంట్లో పీసీ పాడైతే నాకు లాభం, మీకు నష్టం మరి. 😉

నేనో దారినపడి నడుస్తూ ఉంటే, ఏదో ఆలోచిస్తూ తలయెత్తి చూసిన క్షణం ఆలోచనని ఆ గాల్లోకి వదిలేసి, మెడనొప్పెట్టేదాకా పైకి అలా చూస్తూనే ఉండిపోయిన రోజుల గురించి ఏమని చెప్పను? ఎలా చెప్పను? ఏమి చూశావంటే – “ఆకాశాన్ని చూశాను, మేఘాల్ని చూశాను” అంటే సరిపోతుందా? అర్థమౌతుందా? ఇంకా వివరంగా చెప్పడానికి నాకొచ్చిన మాటలు చాలవే మరి! ఇది మాటలొచ్చిన మూగతనమా? మాటరాని మౌనమా?

ఆ మధ్యోరోజు ఒక జనారణ్యంలోని మహారణ్యంలో నడుస్తూ ఉంటే, అప్పటిదాకా శ్రద్ధ పెట్టి వినని పక్షుల కిలకిలలూ, కిచకిచలూ ఈసారి కొత్తగా వినపడ్డప్పుడూ, రోజూ చూసీచూడనట్లు వదిలేసిన పక్షులనెన్నింటినో దగ్గరగా వాటిలోని రంగుల హంగులతో సహా చూసి మురిసినప్పుడు, రోజూ చూసీచూడగానే మర్చిపోయే చెట్ల గురించీ, మొక్కల గురించీ, పూవుల గురించీ – కథలు కథలుగా విని, కొత్త బంగారు లోకం ముఖద్వారాం వద్ద నిలబడి, లోపలున్న అందాన్ని రేఖామాత్రంగా చూసి వెనుదిరిగిన భావన కలిగినప్పుడు – ఏం జరిగిందంటే ఎలా చెప్పను? ఇదే మాటలొచ్చిన మూగతనమని చెప్పనా? మౌనవీణగానమని చెప్పనా?

ఇంకెన్నోసార్లు చల్లని గాలిలో, సన్నని తుంపర్ల నడుమ చెరువుగట్టున రాయిపై కూర్చుని, కనుచూపుమేర మూడుదిక్కుల్లో నిండిన పచ్చదనాన్నీ, నాలుగో దిక్కున వ్యాపించిన నీటినీ, దానిపై ఆటలాడుకుంటున్న కొంగల్నీ, అక్కడి నీటి మధ్యనున్న చెట్టుపై వాలిన కాకినీ, పేరు తెలీని ఎన్నో పక్షుల్నీ వాటి ఆనందాలనూ చూసి నేనూ ఆనందిస్తూ, మధ్య మధ్య వినిపిస్తున్న నెమళ్ళ అరుపులు వింటున్నప్పుడూ, నెమళ్ళ అన్వేషణలో పడి మనిషి వెళ్ళే దారిలేని ప్రాంతాల్లో అన్వేషిస్తూ దొరికిన ఒకటీ,అరా నెమళ్ళనూ, అవి మనుష్యుల్ని చూసి పారిపోతూ విసిరే చూపునూ, రెక్కలు శబ్దం చేస్తూ వెళ్ళిపోయేటప్పటి వేగాన్నీ చూసి విని అబ్బురపడుతూ -అబ్బురాన్నీ, సాహసం చేస్తున్న అనుభూతినీ అనుభవించినప్పుడు ఎలా ఉంటుందంటే, “అసలేం చేశావని ఆ ఆనందం?” అని అడిగితే చెప్పడానికి మాటలు రావొద్దూ?

రద్దీలో రోడ్డుదాటుతూ ఉంటే అవతలివైపు నుండి మనవైపుకి చెయ్యూపుతూ వస్తూ కనిపించిన ఓ పాత స్నేహం, ఎక్కడ్నుంచో ఎప్పుడో మరిచిపోయిన స్నేహం ఓ కాల్ రూపంలో వచ్చి మళ్ళీ చిగురించిన వైనం, ఎప్పుడో ఉన్నట్లుండి ఏ ఆర్కుట్ లోనో పాత జ్ఞాపకం మెసేజ్ రూపంలో.. ఇంకా నేస్తాలతో చెప్పుకునే కబుర్లూ, దూరాల మధ్య ప్రయాణించే మాటలూ, చేరువయ్యే దూరాలు, పంచుకున్న అనుభవాలూ, పెంచుకున్న అనుబంధాలూ, స్వగతాలూ, స్వాగతాలూ, స్నేహాలూ, కోపాలూ, తాపాలూ – ఇలా ఎన్నో జీవితానుభూతుల్ని తలుచుకుంటున్న సమయంలో కలిగే భావనని ఎలా నిర్వచించడం? అప్పుడు మాటలొచ్చినా మూగతనం రాదూ?

ఓ చోట విన్న వాక్యమో, ఓ చోట చదివిన కథో, ఒకప్పుడు విన్న పాటో – రోజుల తరబడి వెంటాడి వెంటాడి ఉక్కిరిబిక్కిరి చేస్తే అశక్తంగా మిగిలిపోయి, నిస్సహాయంగా వాటి మాయకు లొంగిపోయి బాహ్యస్మృతిని క్షణికంగా కోల్పోతూ, అంతరంగంలో ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతూ, ఒక క్షణం మత్తులో జోగుతూ-మరుక్షణం ఉలిక్కిపడి లేస్తూ, చుట్టూ ఉన్నదంతా ఓ క్షణం కొత్తగా మరుక్షణం పాతగా కనిపిస్తే – అర్థం కాక వెర్రిగా చూస్తూ ఎన్ని రోజులు గడపలేదు? తిలక్ అన్నట్లు, “నాకే తెలియని గొప్ప రహస్యమేదో నన్ను ఆవరించుకుంది” అని తెలుస్తూనే ఉన్నా, అదేమిటన్నది ఇంకా రహస్యమే అన్న విషయం స్ఫురణకు రాగానే కలిగే నిస్పృహను ఎలా వర్ణించను? అది మాటలొచ్చిన మూగతనమా? మూగదైన మాటకారితనమా?

హెరాక్లిటస్ అన్నాడట – ప్రకృతి దాగి ఉండటానికే ఇష్టపడుతుంది అని. అందుకేనేమో – నేను ఆకాశంలోనూ, అడవుల్లోనూ తన రహస్యాలని తరచి చూసే ప్రయత్నం చేశానని నా నోరు నొక్కేసింది. మాటలొచ్చినా నోరు పెగలకపోతే లాభమేముంది? శ్రీశ్రీ ఉన్మాదిని – “మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు” అంటూ వర్ణించాడు కానీ, మనసులోనూ, ప్రకృతిలోనూ కూడా ఆ ఉన్మాదం ఉందేమో! ఈ అనుభూతి మూలమేమిటి? ఎక్కడ్నుంచి పుట్టి నాలోకి ఇలా జొరబడుతోంది నా అనుమతి లేకుండానే? అలా చేసి ఈ అనుభూతి సాధించబోయేదేమిటి? అసలు దీనికో పేరుంటే అదేమిటి? – ఇలాంటి ప్రశ్నలకి జవాబు నాకు తెలీదు కనుక, ఇది మాత్రం మాటలేని మూగతనమే. 🙂

Advertisements
Published in: on October 10, 2008 at 10:36 am  Comments (19)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/10/mataloccina-mounam/trackback/

RSS feed for comments on this post.

19 CommentsLeave a comment

 1. ఏనుగును తలచుకోవద్దు అంటే మనకు అన్నింటా ఏనుగే కనపడుతుంది, వినపడుతుంది, మీదెక్కి కూర్చుంటుంది…మరి ఏనుగంత ఆలోచన ఎలా మన బుఱ్ఱలోకి (మనసులోకి, హృదయంలోకి, గుండెలోకి వగైరా..వగైరా కూడా..) దూరింది ? మూగతనం మాటలకు కాదు..మనకే…:)…

 2. అంటే అవి అన్ని మనస్సు పలికే మౌనరాగం అన్నమాట, చాలా బాగుంది.

  మరమరాలు

 3. “ఓ చోట విన్న వాక్యమో, ఓ చోట చదివిన కథో, ఒకప్పుడు విన్న పాటో – రోజుల తరబడి వెంటాడి వెంటాడి ఉక్కిరిబిక్కిరి చేస్తే అశక్తంగా మిగిలిపోయి, నిస్సహాయంగా వాటి మాయకు లొంగిపోయి బాహ్యస్మృతిని క్షణికంగా కోల్పోతూ, అంతరంగంలో ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతూ, ఒక క్షణం మత్తులో జోగుతూ-మరుక్షణం ఉలిక్కిపడి లేస్తూ, చుట్టూ ఉన్నదంతా ఓ క్షణం కొత్తగా మరుక్షణం పాతగా కనిపిస్తే – అర్థం కాక వెర్రిగా చూస్తూ ఎన్ని రోజులు గడపలేదు?”

  చాలా బాగుందీ భావన. ఇది మాటలొచ్చిన మూగతనమే. ఇంకా చెప్పాలంటే అవన్నీ మూగ కళ్ళ ఊసులు, మూగ మనసులు.

 4. hmmm… spellbound…Emi cheppanu… Edo chaeppalani vundi kaani elA cheppAlo teliyaTlEdu. mATalu raavaTlEdu..[:P]

 5. క్రిష్ణశాస్త్రి ’ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని పాడింది సీతారాం శాస్త్ర్రి ’ఈ గాలీ ఈ నేలా ఈ ఊరూ సెలయేరూ’ అనిపాడింది ఇందుకే. ప్రతి ఒక్కరు ప్రకృతి ఒడిలో కొంచెం రీచార్జి అవ్వాల్సిందే. మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి.

 6. బావుందండి…. కాకపొతే ఇదంతా నాణానికి ఒక వైపు.. మరో వైపు నేను చెప్పనా… మొదటి సారి కాపీ కొడుతూ దొరికిపోయి టీచర్ ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు లేత నిక్కరు మీద ఈత బర్రతో మోత పెట్టిన బాధేంటో చెప్పల్సి వచ్చినప్పుడు మాటరాని మౌనమె…

  పక్కింటి వాసుగాడికి నూటికి 95 వచ్చాయి నీకేం మాయరోగం అని బెత్తం పుచ్చుకు నిల్చున్న పిత్రుదేవుడికి వాడికి పుస్తకం తప్ప మరొ ప్రపంచం తెలీదని చిల్లా కట్టి, గోలే గుండ్లు, కట్టి మీద కోల్ కోల్ వంటి ఎన్నొ ఆటల్లొ మనకు ప్రవేశంతొ పాటూ ప్రావీణ్యత కూడా ఉందని బొలెడంత లోక జ్ఞానం సంపదించేసామని చెప్పలేని నిస్సహాయత కూడా మాటరాని మౌనమె…

  jokes apart….

  Real estate పోరులో ఒక వైపు స్మశానాల్ని సిటీలు ఆక్రమిస్తుంటే, పేళుళ్ళూ అల్లర్లతో మరొ వైపు స్మశానాలు సిటీలను ఆక్రమించేస్తొంటే బయటకు వెల్లిన మన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో రారో చెప్పలేని సంశయం కూడా మాటరాని మౌనమె…

  పచ్చని పొలాల మధ్యనుండీ పరుగులు తీస్తూ వచ్చే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ సీమ నీడ తగలాగానే ఖననం చేసిన రైతుల శవాల మట్టి కుప్పల్తో, ఖననం చెయ్యని పశువుల కళెబరాలతో ప్రతి ఊరి పొలెమేరా ప్రభాత గీతం పాడినప్పుడు కలిగే వేదన కూడా మాటరాని మౌనమె…

  తెల్లవారు లేచింది మొదలు ఏ దేశ చరిత్ర చూసినా ఎమున్నది గర్వ కారణం అని అదే శ్రీశ్రీ చెప్పినట్టు పసిపిల్లల పై అత్యచారాలు, పెల్లుబికిన వర్గ వైషమ్యాలు వగైరాలతో వానిజ్య ప్రకటనలను కలగలిపి ప్రసారం చెసే మధ్యమాలను చూస్తు.. కేవలం చూస్తూ ఉండడం థప్ప ఎమి చెయ్యలేని నిస్సహాయత గురించి చెప్పల్సి వచ్చినా మాటరాని మౌనమె…

 7. అద్భుతంగా ఉంది మీ టపా.
  “నేను ఆకాశంలోనూ, అడవుల్లోనూ తన రహస్యాలని తరచి చూసే ప్రయత్నం చేశానని నా నోరు నొక్కేసింది” – దానికీ తెలుసు, మనం దాని రహస్యాలను మన చాలీచాలని మాటల్లోకి ఇరికించి చెప్పలేక, ఆ అనుభవపు స్థాయిని తగ్గించేస్తామని.

 8. బాగుంది! మాటలు రావటం లేదని మాటల మీద మాటల తోనే యుద్ధం చేస్తున్నావా? సరే.. ఆ ప్రశ్నలన్నింటితో పాటు నావి కూడా కొన్ని (పని లో పని) 🙂

  “మాటలే మూగవోయిన” మాటల్లోనే చెప్పాలి ఎందుకు?
  కేవలం మాటలే ఆధారమై ఏర్పడిన బంధాలను మాటల్లో పెట్టలేక పోతున్నానెందుకు?
  మాట్లాడితే ఆనందంగా ఉన్నట్టు, మౌనంగా ఉంటే బాధ అయ్యినట్టు ఎందుకు మాటలు వాడేస్తారు జనం?

  ఇలా ఎన్నో మరెన్నో! మాటలు కూడా మాటలు కాదు సుమా!

 9. ఇదిగో… ఇలా మీరు మాటా మంతి లేకుండా మౌనంగా వ్యాఖ్యలను ఆమోదించేసి కష్టపడి వ్రాసిన కామెంట్ మొహాన కాంప్లిమెంటో కామెంటొ పడెయ్యక స్థితప్రజ్ఞతతో వ్యవహరించినప్పుడు మిగతా వాళ్ళ సంగతి తెలీదు కాని నాకు మాత్రం ఎంత కాలుతుందో చెప్పాలంటె నిజంగానే మాటారాని మౌనమె… పర్లేదు నాలుగు చీవాట్లైనా పెట్టండి కనీసం ఒక కోలను అటో ఇటో తిప్పి ఒక బ్రాకెట్టైనా పెట్టండి [:) , :(] కాని ఏదో ఒకటి అని నా జన్మ చరితార్థం చెయ్యండి…

 10. చుట్టూ రంగులు. అన్నిటినీ కలబోసిన రంగు ధవళం.
  మది నిండా భావాలు. పైకెగసే భాష మౌనం.
  మౌనం అంటే మాటలు రాకపోవడం కాదు – మనతో మనమే మాట్లాడుకోవడం.

  సౌమ్యగారూ, చాలా బాగుంది.

 11. అందరికీ నా ధన్యవాదాలు.
  @Kishore KVM:
  అన్ని కామెంట్లు చూశాక ఒకసారి రాద్దామనుకున్నానండీ. లేకుంటే, నా వ్యాసానికి నా వ్యాఖ్యలే ఎక్కువౌతాయని 🙂

 12. గొప్ప కవిత. ఆవేశం, ఆర్తి చిత్తశుద్ధి గల కవితలలో మాత్రమే కనిపిస్తాయి. అభినందనలు.

 13. సౌమ్య గారు,

  “లేకుంటే, నా వ్యాసానికి నా వ్యాఖ్యలే ఎక్కువౌతాయని” మీ ఈ కామెంట్ నచ్చింది 🙂

 14. సౌమ్య గారు, మీకు మాట రాదు అంటూనే బాలు గారిలా గొప్ప పాట పాడేశారు ..చాలా బావుంది మీ మాట…

 15. kvm kishore గారు, మీరు రాసిన నాణేనికి మరో వైపు కామెడీ చాలా బావుంది… keep writing this kind of comedy stories….

 16. Nice one!

  కొన్నిసార్లు మన మనసుకే స్వంతమైన జ్ఞాపకాలు, అనుభవాలు…అప్పుడప్పుడూ గుర్తుకు వస్తే ఉండే ఆనందం, మాటల్లో చెప్పగలిగితే ఉండదేమో కదా ?

 17. మనసెప్పుడూ మౌనగీతమే కదా?

 18. http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=33617&page=1

  ee article meeru raasindEnaa??
  aa kathaa sankalanam ekkaDa chadivaaru??
  mee daggara unTE cheppagalaru!!!??

 19. @Suresh : “మనసెప్పుడు మౌనగీతమే కదా.”
  – నాకు అలా అనిపించట్లేదు. లోపల జరిగే సంఘర్షణలే మనసు భాషేమో. ఏ అలజడీ లేనంత వరకూ మనసు మూగదేమో. ఆనందమైనా, బాధైనా – మనలో అలజడి మొదలైందంటే, మనసు మాట్లాడ్డం మొదలైనట్లు కాదా?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: