అసలెందుకు ఈ దినోత్సవాలు?

మళ్ళీ ఓ పంద్రాగస్టొచ్చింది. పొద్దున్నే లేచి, ఏడున్నరకల్లా కాలేజీ జెండా వందనం కోసం సిద్ధమై, వెళ్ళాను. అక్కడింకా ప్రొసీజర్ మొదలవలేదు. అక్కడ చుట్టూ జెండా రంగుల్లో కాగితాలని అంటించి చేస్తున్న అలంకారాన్ని చూస్తూ ఉంటే, తెలీకుండానే నాలో ఇటీవలి కాలంలో కలగని ఆలోచనలు మొదలయ్యాయి. అవి క్రమంగా confessions లా మారుతున్నట్లు అనిపించింది. అదలా మనసులో గజిబిజి సృష్టించడం కంటే, ఆ గజిబిజేదో స్క్రీనుపై సృష్టిస్తే, తక్కినవారి ఆలోచనలను కూడా జత చేసుకోవచ్చని, ఈ టపా.

ఓసారి దాదాపు పదేళ్ళు వెనక్కి వెళితే, మనకు స్వతంత్రం వచ్చి యాభైఏళ్ళైనప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. అప్పట్లో, ప్రతి స్వతంత్ర దినోత్సవానికీ నేను అనుభవించే excitement అంతా ఇంతా కాదు. సినిమాలు, క్లాసులో హిస్టరీ పాఠాలు, దేశభక్తి గీతాలు, పిల్లల కోసం రాసిన “మహనీయుల అడుగుజాడల్లో” తరహా పుస్తకాలు – వీటి ప్రభావమైతే కావొచ్చు కానీ, ప్రతి పంద్రాగస్టూ, ప్రతి గణతంత్ర దినోత్సవమూ – నాకు ఓ emotional experience గా, journey back in to history గా ఉండేది. అలాంటి ప్రతి రోజూ నాలో “నా దేశం” “ఎంతమంది వీరుల త్యాగాల ఫలితం మేము అనుభవిస్తున్నామో..” “మాదెంత అదృష్టమో ఈ దేశం లో పుట్టినందుకు” “నేను కూడా వాళ్ళలాగా దేశాన్ని ప్రేమించాలి” “నేను కూడా వాళ్ళలాగా దేశం కోసం పని చేయాలి” – వంటి భావాలు తారాస్థాయిలో ఉండేవి. ఈ రెండు రోజులే కాదు – నేను అభిమానించే ప్రకాశం పంతులు పుట్టినరోజున, నేతాజీ,గాంధీ,నెహ్రూ,భగత్ సింగ్ వంటి వారి జన్మదినాల రోజుల్లో కూడా నేను ఇంత ఉద్వేగాన్ని పొందేదాన్ని. ఆ రోజుల్లో పొందిన ఉద్వేగం తక్కిన రోజుల్లో కూడా నిలిచే ఉండేది సంవత్సరం పొడుగుతా. ఎక్కడన్నా ఎవరన్నా ఏ సందర్భంలోనన్నా ఇండియాని ఏమన్నా అంటే, రక్షకుడు సినిమాలో నాగార్జున లాగా ఆవేశం పొంగుకొచ్చేది. ఒక్కోరోజు ఎందుకలా అంటావని తగువుపడేదాన్ని  ఆ మనిషితో. ఒక్కోరోజు మనసులో మండుతూ ఉండిపోయేదాన్ని. ఆలోచించి చూస్తే, ఆ ఆవేశం ఇప్పుడు మరీ చిన్నతనంగా అనిపిస్తోంది, అది వేరే విషయం. నా కలలన్నీ పెద్దయ్యాక నేనూ దేశానికి ఏదో చేయాలి (ఆ ఏదో ఏది? అని అర్థమయ్యే వయసు కాదది), నా దేశం ది బెస్ట్ కావాలి, (ఏదీ…నేనింకా సిటిజెన్నే కానిదే నా దేశమే! 😉 )…ఇలా ఉండేవి.

ఈ తరహా ఆవేశానికి ఆఖరు సంవత్సరం 2000. అప్పుడు రిపబ్లిక్ డే కి ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీలో వీరావేశంతో ఓ ప్రసంగం ఇచ్చాను. అప్పట్లో చాలా పవర్ఫుల్ గా మాట్లాడానన్న పేరు వచ్చింది. మా లెక్చరర్లు కూడా చాలా మెచ్చుకున్నారు. నాలో ఆ ఉద్వేగం, ఉత్సాహం వగైరా తగ్గడం మొదలైంది కూడా అక్కడ్నుంచే. తరువాతి నుండి వరుసగా ఆరేళ్ళు నేను పంద్రాగస్టూ, గణతంత్ర దినోత్సవాలంటే ఎరుగను! ఎందుకంటే, తర్వాత నేను చదివిన, పనిచేసిన ప్రాంతాల్లో అంతా అవి సెలవు దినాలు. మళ్ళీ 2006 నుండి వరుసగా ఈ రెండు పండుగలనూ చూస్తున్నాను. ప్రతి సారి రక్తం కూడా ఇస్తున్నాను (అంటే, క్యాంప్ పెడుతున్నారు కనుక.) అయితే, రెండో దఫా మొదలైన నాటినుండి, నాలో జెండా వందనానికి వెళ్ళాలన్న తాపత్రేయమైతే ఉంటోంది కానీ, అప్పటి ఆ ఆవేశం వగైరా కలగడం లేదు. ఏదో వెళ్ళడం నా బాధ్యత, వెళుతున్నా అన్నట్లే ఉంది కానీ, మునుపులా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటం, స్వాతంత్ర్య సంగ్రామం గురించి దొరికింది దొరికినట్లు చదవడం, వీరుల కథలు వింటూ ఉత్తేజితం కావడం – అబ్బే! అలాంటివేం లేవు. వయసయ్యేకొద్దీ అంతే కాబోలు :p. కాలం గడిచేకొద్దీ, జీవితం చూసేకొద్దీ “నా జీవితం, నా కెరీర్, నా మనుష్యులు, నా ప్రపంచం” అన్న భావన పెరిగే కొద్దీ ఆ తరహా ఉత్సాహం తగ్గుతుందేమో. అప్పట్లోనే ఆ భావనలు కలగని వారి సంగతి దేవుడెరుగు!

మా ఇంజినీరింగ్ కాలేజీలో ఈ పండుగలు జరిగినా నేనెప్పుడూ వెళ్ళలేదు. కారణం – దూరం. రోజూ ఇరవై కిలోమీటర్లు పోనూ, ఇరవై రానూ తిరిగి, క్లాసుల్లేని రోజు కాలేజీకి వెళ్ళాలంటే అంత ఇష్టం ఉండదు. ఇంటెదురుగ్గా ఉండే స్కూలులో జెండావందనం మాత్రం క్రమం తప్పకుండా బాల్కనీ నుండి చూసేదాన్ని. వాళ్ళు జాతీయగీతం పాడినప్పుడు కదలకుండా వినేదాన్ని. (ఒక్కోసారి కదలకుండా కూర్చున్నా లెండి). కానీ, ఈ తతంగం అంతా ఎందుకు? అన్నది ఈరోజు ఆలోచించినంతగా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడేమి తోస్తుందంటే, మనం ఏ సంక్రాంతో, ఉగాదో ఎందుకు చేసుకుంటామో, ఇవి కూడా అంతేనని. నా మటుకు నాకైతే ఇవి రెండూ అలాంటి పండుగలే. కాకుంటే, ఒకే తేడా-ఇవన్నీ కుల మత భేదాలు మరిచి జాతి యావత్తూ చేసుకోవాల్సిన పండుగలు. మన పండుగల్లో అర్థంకాని మంత్రాలు, పూజలూ చేయమన్నా మాట్లాడకుండా భక్తితో చేసేమనం అంతా తెలిసిన ఈ పండుగలు చేసుకోడంలో మాత్రం ఎందుకు బద్దకించాలి? అన్నది ప్రశ్న. “నేను అంత పొదున్నే లేవలేను. నా వల్ల కాదు” – జెండావందనానికి రాని సగం మంది స్టూడెంట్లు చెప్పే కారణం ఇది (మొహమాటానికి సగం అంటున్నాను). ఇదే కహానీ వినాయక చవితి నాటి ఉదయాన్నో, దసరా నాటి ఉదయాన్నో ఇంట్లో చెప్పమంటే ఎంతమంది చెబుతారు? చెబితే మాత్రం ఎందరు తల్లిదండ్రులు వదిలేస్తారు? 😉 జాతీయ పండుగల పట్ల మన బద్దకానికి మనం ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడమే కారణం కావొచ్చు.

ఇంతకీ, ఈ టపా ఉద్దేశ్యం “దేశానికి మనమేమి చేయగలం?” అన్న ఆలోచన కాదు. నాలో కొన్నేళ్ళలో కలిగిన మార్పుని గురించి ఆలోచిస్తూ జాతీయపండుగలు అసలెందుకు? అని వచ్చిన అనుమానాన్ని నాకు నేను నివృత్తి చేసుకునే ప్రయత్నం. మనం మన సంప్రదాయమనీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? –  బహుశా, నా ఆలోచనలు కాస్త సరిగా process అయ్యేకొద్దీ ఇలాంటి మరిన్ని టపాలు రాస్తానేమో రాబోయే కాలంలో ఈ విషయాలపై. చూద్దాం, నా ప్రయాణం ఎంతవరకో.

Advertisements
Published in: on August 15, 2008 at 8:13 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/08/15/why-these-day/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. 🙂

 2. ఆవేశం తగ్గటానికి ఉన్న అనేకానేక కారణాల్లో జ్ఞానం పెరగటం అన్నది ముఖ్యం కావచ్చు. రాజకీయ నాయకులు వగైరా వస్తున్నారని జండాలను పట్టించి చిన్న పిల్లల్ని గంటల తరబడి ఎండలో నిలబెట్టడం లాంటివి కేవలం “ఆవేశం” ఉన్నవారే చెయ్యగలరు. వినాయక చవితిలో మనం నేర్చుకోవలసిన ఎన్నో విషయాలను అంతర్లీనంగా ప్రవేశపెట్టారు – పంద్రాగస్టులో అలాంటివి ఏమీ లేవు. (హీన పక్షంలో) ఆగస్టు పదిహేనవ తేదీ అనేది హిందువులు/ముస్లింలు అనే పేర్ల మీద దాదాపు పదిలక్షల మంది ప్రజలు చనిపోయిన రోజు(దినం)గా భావించవచ్చు… ఈ విషయంలో నేను రాయాల్సింది ఇంకా ఉంది…

 3. “నాకు స్వాతంత్ర్యం వచ్చింది” అనే భావన “నువ్వొకప్పుడు బానిసగా ఉన్నావు” అనే సత్యాన్ని అంతర్లీనంగా ఎత్తి చూపుతుంది. అది మనల్ని ఎప్పటికీ మానసిక బానిసలుగానే ఉంచుతుంది. ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది అదే.

  మనం ఈ ఉత్సవాలు జరుపుకోవడం, ఆ పేరుతో సెలవులిచ్చుకోవడం మానెయ్యాలి. బ్రిటిష్ పరిపాలనా శకానికి మన బడిపాఠ్యపుస్తకాల్లో నాలుగు పుటలు మాత్రం కేటాయించి అంతటితో వదిలెయ్యాలి. రాస్తే గీస్తే వాళ్ళు ఈ దేశంలో తెచ్చిన మార్పుల గురించే రాయాలి. వాళ్ళు మనకు చేసిన అన్యాయాలూ, ద్రోహాల గుఱించి ఘోషించడం మానెయ్యాలి.

  స్వాతంత్ర్య సమరయోధులంటారా ? వాళ్ళు అన్నివిధాలా గొప్పవాళ్ళే. సందేహం లేదు. కానీ వాళ్ళ పోరాటం మూలంగా స్వాతంత్ర్యం సిద్ధించిందేమీ లేదు. రెండో ప్రపంచయుద్ధంలో చావుదెబ్బ తిన్న బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యాన్ని పరిపాలించలేక స్వచ్ఛందంగా తమ అధికారాన్ని వదులుకుని వెళ్ళారంతే ! వాళ్ళకు ఏ మాత్రం ఆ దెబ్బల్ని నిభాయించుకునే ఓపిక ఉన్నా మనమింకా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలోనే కొనసాగుతూ ఉండేవారం.

 4. బాగుంది ఆత్మావలోకనం. పెరుగుతున్నకొద్దీ ఇతర ఇంటరెస్టులూ, వాటితో వచ్చే హుషారూ కూడా పాతవాటిని వెనక్కి తోస్తాయనుకుంటాను :p

 5. వయసుతో పాటే వచ్చే ఆవేశమే దేశభక్తిలోనూ కనిపిస్తుంది.
  రానూ రానూ వయసు/అనుభవం తెచ్చే పరిణితి వల్ల ఆ కాక తగ్గుతుంది. లేదా “మన”కు విశాల అర్థాన్ని ఇచ్చుకోవడం వల్ల కూడా ఈ భావావేశం పలుచబడుతుందనుకుంటా!

  ఒకసారి 1996/97 ల్లో ననుకుంటా, బాలానగర్ HAL మైదానంలో చిరిగిపోయి నేలను తాకుతున్న జాతీయ జెండాను చూసి జాగ్రత్తగా మడత పెట్టి బాలానగర్ పోలీస్‌స్టేషన్ తీసుకెళ్ళా దాన్ని జాగ్రత్తగా దహనం చేయమని. నేను పోలీస్ స్టేషన్ గడప దొక్కడం అదే మొదటిసారి, ఇప్పటికదే చివరిసారి. నన్నో పిచ్చివాడిలా ఆ ఇన్స్పెక్టర్ చూసిన చూపు నాకింకా గుర్తే.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. 🙂

 7. @Tadepalli garu and Naganna garu:
  This is a totally new perspective, which I never heard and never thought that I will hear. Thanks.
  @Prasad garu: 🙂

 8. …“నాకు స్వాతంత్ర్యం వచ్చింది” అనే భావన “నువ్వొకప్పుడు బానిసగా ఉన్నావు” అనే సత్యాన్ని అంతర్లీనంగా ఎత్తి చూపుతుంది. అది మనల్ని ఎప్పటికీ మానసిక బానిసలుగానే ఉంచుతుంది….
  మీరు హైస్కూలు పట్టానో..కాలేజీ పట్టానో అందుకున్నప్పుడు…ఒకప్పుడు మీకు చదువు లేదని గుర్తు చేస్తుందని ఆ పట్టాను చించేసారా ??…జాబ్ ఆఫర్ వొచ్చినప్పుడు..ఒకప్పుడు మీకు ఉద్యోగం లేదని గుర్తు చేస్తుందని…ఉద్యోగం వొదిలేసారా ?? “నాకు ఙ్ఞానం వచ్చింది” అనే భావన “నువ్వొకప్పుడు అఙ్ఞానివి ” అనే సత్యాన్ని అంతర్లీనంగా ఎత్తి చూపుతుందా ?? దేవుడు లేడని వాదించే పరమ నాస్తికులు, తాడేపల్లి గారి లాంటి “మేధావులు” నాకు అర్థం కారు. ఎన్నో వేల మంది తమ జీవితాలని, ప్రాణాలనీ అర్పించి చేసిన పోరాటం అంతా just a big waste of time అన్నమాట…ఇంత తేలికగా వొచ్చేస్తుందని తెలిస్తే వాళ్ళూ పెళ్ళిళ్ళు అవీ చేసుకుని…పిల్లా పాపని కనీ…ఇంటి పేరునీ, ఆస్తులనీ వృద్ది చేసుకునేవారు పాపం. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడం వెనుక ఇంత కనువిప్పు కలిగించే నిజం ఉందని ఎలా కనిపెట్టారో Mr .తాడేపల్లి గారు…మీ రీసెర్చి వివరాలు చెప్పి దయచేసి మమ్మల్ని ఙ్ఞాన మార్గంలో నడిపించండి…

 9. How can I express my feelings I am very pleased. You will make India Proud. Please Join Rajneethi Swaraj Union community in Orkut.
  Thank you.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: