తెలుగెందుకు చదవాలి?

మే నెల్లో నేను “ఎందుకు చదవాలి?” అని రాసిన టపా కింద వ్యాఖ్య రాస్తూ రానారె గారు – “అసలు తెలుగెందుకు చదవాలి?” అన్న ప్రశ్న లేవనెత్తారు. తరువాత మాలతిగారు “తెలుగెందుకు మాట్లాడాలి?” అన్న టపా రాసారు. అప్పట్నుంచీ ఈ టపా రాద్దామని అనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది. ఇది.. మీరు తెలుగెందుకు చదవాలో చెప్పడం కాదు. నేను ఎందుకు చదువుతున్నానో చెప్పడం కోసం రాస్తున్న టపా. ఎందుకంటే, ఒకసారి ఆలోచించి చూస్తే, నిజంగా అర్థం కావట్లేదు నాకు తెలుగు ఇందుకు చదవాలి అని అందరికీ వర్తించే కారణం. నా మటుకు నేనే ఎక్కువ చదవను తెలుగు. ఓ ఇరవై శాతం తెలుగు పుస్తకాలు చదువుతానేమో…అంతే. కానీ, ఆ ఇరవై శాతాన్నే ఎందుకు చదువుతున్నా అన్న దానికి ఈ టపా.

1. భాష పై ప్రేమ కొద్దీ: ఇది నా మటుకు నాకు ప్రధాన కారణం. నాకు తెలుగులో చదవడమంటే ఇష్టం. ఈ భాషలో పదాలంటే ఇష్టం. నాకు అర్థమయ్యేంతలో భాషలో చేసే విభిన్నమైన ప్రయోగాలను తెలుసుకోడం అంటే ఇష్టం. నాకు అర్థమయ్యేంత దాకా రకరకాల మాండలీకాలు ఆయా పాత్రల మాటల్లో చదవడం ఇష్టం. తెలుగు పదాల కూర్పు ఇష్టం. ఇందుకని చదువుతాను నేను.

2. అనువాదాల ద్వారా తెలుగు పుస్తకాల్ని చదివితే నాకు తృప్తి ఉండదు. ఈ విషయాన్ని గురించి ఎందుకా అని ఆలోచిస్తే ఓ విషయం అర్థమైంది. అసలు భాష లో ఆ భాష మనుష్యుల జీవితాల గురించి తెలుసుకుంటే వచ్చే తృప్తి అదే విషయాన్ని అనువాదం ద్వారా తెలుసుకుంటే కలగదు అని. ఏ రష్యనో..జర్మనో అయితే… ఎలాగో అది నాకు రాదు కనుక, నాకు అనువాదాలు కూడా నచ్చేస్తాయి. అదే పుస్తకాన్ని నేను ఒరిజినల్ జర్మన్ లో గనుక చదివితే అప్పుడు అనువాదం నచ్చదేమో….ఎవరికి తెలుసు? అనువాదం ఎంత బాగా చేసినా కూడా, అసలు భాష తెలిసుంటే ఆ భాష లో చదవడం వేరు…దాన్నే మరో భాషలో చదవడం వేరు. అంతే కాదు. మన తెలుగు జీవితాల్ని గురించీ, మనకి తెలీని మనవాళ్ళ ప్రపంచం గురించీ తెలుసుకోడానికి తెలుగు సాహిత్యం కంటే ఉత్తమమైన మార్గం ఇంకోటేముంది?
(ఈ అనువాదాల్లో తెలుగు కథలు చదివి నచ్చకపోవడం వల్ల ఒరిగిన లాభాల్లో అతి పెద్దది మాలతిగారి పరిచయం, మా మధ్య ఏర్పడ్డ అనుబంధమూనూ.. హీహీ. కనుక అలాంటి లాభాలు కూడా ఉంటాయి తెలుగు చదవడం వల్ల.)

3. భావ వ్యక్తీకరణ మెరుగుపరుచుకోడానికి: మీరీ టపా చదువుతున్నారూ అంటే, మీరు నేటివ్ తెలుగు స్పీకర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు తెలుగు మాట్లాడుతూ పెరిగారు ఇంట్లో…లేకుంటే తెలుగు మీ మాతృభాష – ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగే అవకాశం ఎక్కువ (రెంటికీ తేడా ఏమిటీ? అనకండి. తేడా ఉంది. నన్నెరిగిన వారికి తేడా అర్థమయ్యే ఉంటుంది ఈపాటికి…నేనే ఉదాహరణని కనుక.) మన భాషలో వ్యక్తీకరించినట్లుగా భావాలని పర భాష లో వ్యక్తీకరించలేము (నా అభిప్రాయంలో). అంటే పై వాక్యం – నాకు ఆంగ్లమే మన భాష…అనుకునే వారికి కాదు. ఎవరికైనా తల్లిభాష అనేది ఒకటుంటుంది కదా…చాలా మటుకు మనం వేరే ఎన్ని భాషలు నేర్చుకున్నా అందులో మాట్లాడ్డంలో ఉన్న కంఫర్ట్ లెవెల్ వేరే భాషల్తో రాదు. అలాగే, మనలోని భావాలని అందులో వ్యక్తం చేసినంత బాగా ఇంకో భాషలో చేయలేకపోవచ్చు. సాహిత్యం చదవడం ఈవిధంగా కూడా ఉపయోగకరమే కదా. (అంటే..ఇది ఏ భాషకైనా నిజమే అనుకోండి…మీరు ఆ భాషలోనే వ్యక్తీకరించుకుంటాను…నాకు తెలుగొద్దూ….అంటే అది మీ ఇష్టం.)

4. ఏముందోయ్ తెలుగు సాహిత్యం లో? అని వెక్కిరించాలన్నా, (అంటే తెలుగు సాహిత్యంలో ఏమీ లేదని కాదు. మీరేదో సరుకు లేని పుస్తకమో కథో చదివితే కదా మీరు ఒక దురభిప్రాయమన్నా సాక్ష్యంతో ఏర్పరుచుకోగలిగేది!!) “ఏముందోయ్ తెలుగు సాహిత్యం లో?” అని వెక్కిరించేవారికి సమాధానం చెప్పాలన్నా కూడా మనం తెలుగు చదవాల్సిందే. లేకుంటే, ఏదో ఎమోషనల్ అయిపోయి లాజిక్ లేకుండా మాట్లాడేసి… తెలుగే గొప్ప..తెలుగే చదవాలి అనేస్తే ఎవరూ పట్టించుకోరు.

5. మీకు తెలుగులో రాయాలన్న తాపత్రేయం ఉంటే: మీరు ఇంగ్లీషు మాత్రమే చదువుతూ తెలుగులో బాగా రాయాలనుకోడమంత వెటకారపు ఆలోచన ఇంకోటి లేదు నా దృష్టిలో. ఒక భాషలో రాయాలంటే ఆ భాష గురించిన జ్ఞానం ఉండాలి కదా… ఆ భాష సాహిత్యాన్ని గమనిస్తూ ఉంటే, nuances మనక్కూడా తెలుస్తాయి.

ఇవి కాక…”ఎందుకు చదవాలి?” అన్నప్పుడు చెప్పిన ఏడు కారణాలూ ఇక్కడ కూడా వర్తిస్తాయి.

చివరగా ఓ చిన్న నిట్టూర్పు. ఆ మధ్య ఓసారి ఒకరితో మాట్లాడుతూ ఉంటే జరిగిన చర్చ సారాంశం: “తెలుగు సాహిత్యమంటే అస్తమానం ఇప్పుడు బ్రతికిలేని వాళ్ళ పుస్తకాలే పట్టుకుని చెప్పుకుంటూ ఉంటాం గొప్పగా. అదే నువ్వు ఏ ఆంగ్ల సాహిత్యమో తీసుకుంటే…ఎంత డైవర్సిటీ ఉంది? ఎన్ని ప్రాంతాల వాళ్ళు రాస్తున్నారు? ఆఫ్గన్ మొదలుకుని అమెరికన్ జీవితం దాకా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల జీవితాల్ని ఆంగ్ల సాహిత్యం ప్రతిబింబిస్తోంది…. తెలుగు అలా చేయగలదా?” అన్న ప్రశ్న వచ్చింది. తెలుగు అలా చేయలేదు…ఎందుకంటే ఆంగ్లం వ్యాప్తి వేరు. తెలుగు లో ఆఫ్గన్ జీవితం గురించి రాసే ఆఫ్గన్ దొరకడం దుర్లభం కాదూ? అదే ఆంగ్లం లో రాసే ఆఫ్గన్ దొరకడం ఎంత తేలిక? తెలుగు అలా చేయనక్కరలేదు కూడా. అసలే భాషా అలా చేయనక్కరలేదు నన్ను అడిగితే. ఏ భాషకైనా (ఆంగ్లాన్ని వదిలేస్తే) ప్రధానమైన పాఠకులు ఆ భాషని మాట్లాడేవారే. అనువాదాల ద్వారా చదువుకునే వారు వేరు. వాళ్ళని ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ, పైన చెప్పిన చర్చలో చెప్పుకోవాల్సిన భాగం – “మంచి పుస్తకాలంటే మనం ఇంకా పాతవే చెప్పుకుంటూ రావడం. ఆంగ్లం లో కూడా పాత పుస్తకాల్ని తలుచుకుంటూనే ఉంటాము కానీ వాటిని మాత్రమే తలుచుకోము. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కొత్తవి కూడా విరగబడి చదువుతూనే ఉంటారు జనం. అంత పెద్ద ఎత్తులో తెలుగులో పుస్తకాలు రావనుకున్నా గానీ, శాతాల లెక్కన చూస్తే కూడా contemporary తెలుగు సాహిత్యం గురించి ఎంత మంది …”ఇది చదివి తీరాలి!” అని చెప్పగలుగుతున్నారు?

ఇది మారాలంటే మనమేం చేయాలి? ఈ టపా ద్వారా కొంతమందన్నా ఈ దిశలో ఆలోచించి, విషయాన్ని అర్థం చేసుకుంటే…. అంతకంటే కావాల్సిందేమీ లేదు. సో, తెలుగు వెలగడానికి ఏమి చేస్తారు మీరు? మీ వ్యాఖ్యల్లో చెప్పండి మరి! 🙂

Advertisements
Published in: on July 11, 2008 at 5:35 pm  Comments (15)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/07/11/why-read-telug/trackback/

RSS feed for comments on this post.

15 CommentsLeave a comment

 1. హమ్మయ్య, ఇప్పటికైనా వచ్చిందే టపా. సౌమ్యా. సంతోషం. నువ్వు చెప్పిన అంశాలు ఆలోచించదగ్గవే. నీ చివరి నిట్టూర్పు తరవాత రాసిన వాక్యం చదువుతుంటే నాకు ఒక విషయం తోస్తోంది. ఇప్పుడు రాస్తున్నవారందరూ ఇంగ్లీషు చదువులు చదివినవారూ, ఇంగ్లీషు పుస్తకాలు చదివి ప్రభావితమైనవారూ కావడంవలన ఇంగ్లీషు రచనే నమూనాగా రాయడమేమో. అంచేత ఇప్పుడు వస్తున్నవాటిలో తెలుగుదనం తగ్గిందేమో. మంచికథలే రాస్తున్న కొందరికి నాకథల్లో మాటలే కొన్ని అర్థం కాలేదన్నారు. అంచేత నాకు అలా అనిపిస్తోంది. నేను ఇది సాధికారంగా ఋజువు చేయగల అభిప్రాయం కాదు.
  (నా అనువాదాలమీద నీఅభిప్రాయం పబ్లిక్ చేసేశావు. :p)

 2. నామట్టుకు నాకైతే తెలుగు చదవాడనికి ఒకే కారణముంది. ఇంకేభాషలోనూ ఇంత సునాయాసంగా, అప్రయత్నంగా అర్థమవదు.

  పలు బాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి, చదివ గలిగేవారంటే నాకు ఈర్ష్య.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. తెలుగు సాహిత్యాన్ని వక్రవిధానాలలో ప్రభుత్వం,సాహితీవేత్తలు అమలు చేస్తున్నంత వరకూ మన తెలుగు భాషకు పట్టిన ఝాఢ్యం వదలదు.తెలుగు బోధనా పద్దతి మారనంతవరకూ నాలాంటి వాళ్ళు తెలుగు భాషనుంచీ పారిపోయి, మార్కులొచ్చే సంస్కృతమో, పనికొచ్చే ఆంగ్లంలోనో శరణు కల్పించుకుని బతుకు వెళ్ళదీస్తాం.

  ఇక చదవడం అంటారా! అదే బహుశా ఇప్పటికీ నా తెలుగుని నిలబెట్టిందనుకుంటా. తెలుగును ప్రేమించేవాళ్ళందరూ ఎక్కడ తెలుగు కనిపించినా అప్రయత్నంగా చదువుతారు.ఢిల్లీలో(మునీర్కా అనే ప్రదేశంలో) ఒక తెలుగులో రాసిన దుకాణం పేరు కనబడేసరికీ నా మనసు సంతోషంతో ఎందుకు ప్రఫుల్లితమైందో ఇప్పటికీ నేను తార్కికంగా చెప్పలేను.అదే సాహిత్యానికీ, బ్లాగులకీ వర్తిస్తుంది.

  నా అనుభవాన్ని బ్లాగులో రాసుకున్నాను. ఈ లంకె ద్వారా చూడగలవు http://parnashaala.blogspot.com/2008/06/i-think-in.html

 4. చాలా సాధికారికంగా ఉన్నాయి మీ పరిశీలనలు
  బొల్లోజు బాబా

 5. తెలుగు లో వైవిధ్యత లేదు అనడం అంత సరికాదేమో అని నా అభిప్రాయం. తెలుగు భాషకున్న పరిధి, వ్యాప్తి, వీటిని పరిశీలిస్తే,తెలుగు రచనల్లో డైవర్సిటీ కనిపిస్తూనే ఉంటుంది.
  కాకపోతే కాస్త శ్రమపడి వెతికి చూడాలి అంతే.

 6. తెలుగు వెలగడానికి ప్రస్తుతం నేను.. తెలుగు చదువుతున్నాను!! నాకు తెలిసింది కాక ఇంకా నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నదానితో ఇప్పుడేమి చేస్తానో చెప్పలేను కానీ.. అది కనీసం నా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని మాత్రం చెప్పగలను.

  మీ టపా ఆలోచింప చేసేదిగా ఉంది!!

 7. Hello, We are inviting you to VOTE for The BEST HYDERABADI BLOG 2008.
  YOUR VOTE Will Help us find the TRUE COLORS OF HYDERABAD Bloggers.
  Best wishes, MT & Team of Hyderabadiz

 8. Hi సౌమ్య గారు…

  Comment వ్రాయబోతే ఆది కాస్తా పెద్ద ఆర్టికల్ అయ్యింది.. సరే నేను wordpress లో చేరాను.. చిన్న blog ఒకటి పెట్టుకున్నాను… మీరు, ఇంకా మీ పోస్ట్ కి స్పందించిన వాళ్ళు అందరు visit చేసి స్పందించాల్సిందిగా మనవి.. విన్నపం…
  http://geethacafe.wordpress.com

  ఇట్లు…
  కీషోర్

 9. సౌమ్యగారు, ‘తెలుగెందుకు చదవాలి?’కి మీ సమాధానం బాగుంది. మీ అభిప్రాయాలతో పాటు కిశోర్‌గారు తమ బ్లాగులో చెప్పిన విషయాలతో కలిపి – ఈ ప్రశ్న నాకు మళ్లీ ఎవరినుంచైనా ఎదురైతే మంచి సమాధానం చెప్పవచ్చనిపించింది.

 10. “మంచి పుస్తకాలంటే మనం ఇంకా పాతవే చెప్పుకుంటూ రావడం. ఆంగ్లం లో కూడా పాత పుస్తకాల్ని తలుచుకుంటూనే ఉంటాము కానీ వాటిని మాత్రమే తలుచుకోము. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కొత్తవి కూడా విరగబడి చదువుతూనే ఉంటారు జనం. అంత పెద్ద ఎత్తులో తెలుగులో పుస్తకాలు రావనుకున్నా గానీ, శాతాల లెక్కన చూస్తే కూడా contemporary తెలుగు సాహిత్యం గురించి ఎంత మంది …”ఇది చదివి తీరాలి!” అని చెప్పగలుగుతున్నారు?

  బాగా చెప్పారు సౌమ్య గారూ. I can’t agree with you anymore. నాకెందుకో బాధగా వుంది.

  ప్రసాద్ గారూ..
  “నా మట్టుకు నాకైతే తెలుగు చదవాడనికి ఒకే కారణముంది. ఇంకేభాషలోనూ ఇంత సునాయాసంగా, అప్రయత్నంగా అర్థమవదు. పలు బాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి, చదివ గలిగేవారంటే నాకు ఈర్ష్య”.

  నాక్కూడా!!

  నాకా భేధం పుస్తకాలకే కాదు, సినిమాలకి కూడా…నాకు ఇంగ్లీష్ సినిమాల “లోకి” వెళ్ళిపోవడానికి కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది..ఎలాంటి చెత్త సినిమా అయినా. పుస్తకాలు కూడా అంతే. అంత తొందరగా “డైవ్” చేయలేను. తెలుగు నా “సేవియర్”. కాని ఇంగ్లీష్ లో దొరికేది మనకు “బోల్డంత”. తెలుగులో ఆ “కాస్తంత” తప్పితే ఏమీ ఉండదు.

  అది భాషా దారిద్రం కాదు కాని, మార్కెటింగ్ ఏమో అండి సౌమ్య గారూ..అంత మనీ లేదు కదా మన మార్కెట్లో. అందుకని రాయడానికి ముందు రారేమో మన దగ్గిర.
  ఇక్కడ ఒక ఇంగ్లీష్ పుస్తకానికి కనీసం ఒక $1mil డాలర్స్ తీసుకునే Indian Authors చాలా మంది ఉన్నారు. ఇక మిగతా వారి సంగతి చెప్పక్కర్లేదు.

  నా మట్టుకు నాకు ఫేవరేట్ hangout ప్లేస్.. barnse&noble కాని borders కాని. అందులో ఉన్న starbucks లో ఒక coffe pick చేసుకొని అది సిప్ చేస్తూ, ఆ పుస్తకాల వాసనలో, కొద్ది సేపు ఏదో ఒకటి చదువుకుని వస్తే అదో తుత్తి నాకు.

 11. కిషోర్ రాసింది చాలా బాగుంది. అందరూ చదవండి తప్పని సరిగా.

 12. thought provoking. but, manam telugu “induku” chadavaali ani reasoning icchukovatam, avasaram ledu anukunta.

  on contemporary writings, there are not many readers and thus not many good writers. and thats the chicken n egg problem. changing lifestyles is to blame!

  –Cine Valley

 13. […] మనం తెలుగు చదవాల్సిందే…” అంటారు తెలుగెందుకు చదవాలి ? అనే టపాలో […]

 14. […] మనం తెలుగు చదవాల్సిందే…” అంటారు తెలుగెందుకు చదవాలి ? అనే టపాలో […]

 15. muru rasindi chala bagudhe kane naku telugu yala rayale thalapagalru


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: