ఎందుకు చదవాలి?

ఈ మధ్య కాలంలో నేను చదవడం తగ్గినందుకో, లేక నా చదువరితనం గురించి, ఈ బ్లాగులో ఈ రెండేళ్లలో రాసిన పుస్తకాల పరిచయాల సంఖ్య గురించి నా మిత్ర బృందం ఎకసెక్కాలెక్కువయ్యో గానీ, అసలు ఎందుకు చదవాలి? అన్న ప్రశ్న ఇదివరలో ఎప్పుడూ లేనంత తరచుగా నా మనసులోకి వస్తోంది. అలా ఇన్ని సార్లు ఆ ప్రశ్న వచ్చినప్పుడల్లా నేను కాస్త ఆలోచనతో సమాధానపరచుకుంటూ ఉంటాను. ఇలాంటి సందర్భాల్లో నాకు దొరికిన జవాబులు కొన్నింటిని కలిపి ఇక్కడ రాయడం ఈ టపా ఉద్దేశ్యం. అయితే, ఇవే కారణాలు అని అనడంలేదు. నాకు తోచినవి ఇవి…అంతే. ఒక వరుస కూడా లేదు….మూడ్ ని బట్టి ఒక్కో కారణం సబబు అనిపిస్తూ ఉంటుందన్నమాట.

మొదటిది: మనది కాని ప్రపంచాన్ని తెలుసుకోవడం. ఉదాహరణకి – ఏదో పల్లెటూరి కథ చదువుతూ ఉంటే, పట్నవాసంలోనే పుట్టి పెరిగిన నాకు అక్కడి జీవనశైలి, ఆలోచనా విధానం – ఇలాంటివి కొంతవరకు ఆ కథల ద్వారా అవగతమవొచ్చు. తెలిస్తే? తెలిసాక ఏమి చేస్తాను? కొన్ని చేయొచ్చు – వాళ్ళ వైపు నుండి ఆలోచించగలగవచ్చు తర్వాత ఎప్పుడన్నా అలాంటి సందర్భం వస్తే. పోనీ, ఆలోచించలేకపోయినా కూడా, వాళ్ళ సమస్యని అర్థం చేసుకోవచ్చేమో-చలనం లేకుండా ఉండేబదులు. మామూలుగా నేను చూడలేకపోయిన విషయాన్ని ఇలా ఆ జీవన శైలిని గురించి చదివిన సాహిత్యం ద్వారా తెలుసుకోవచ్చేమో. ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవడం – అంటారు కదా మేనేజ్మెంట్ పరిభాషలో. సాహిత్యం ద్వారా అది సాధ్యమే కదా. ఇక్కడ పల్లెకథ ఉదాహరణ తీసుకున్నా కానీ, ఎలాంటి వాతావరణం గురించి అయినా ఇదే ఆలోచనా స్రవంతి వర్తిస్తుంది అన్నది నా వ్యక్తిగత అనుభవం. కొన్ని పుస్తకాలు మనకి అవతలి వారిని, వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోగల అస్త్రంలా పనికొస్తాయి.

రెండవది: మనల్ని మనం తెలుసుకోవడానికి, మలచుకోవడానికి. పర్సనాలిటీ డెవెలప్మెంట్ పుస్తకాల గురించి నాకు మరీ గొప్ప నమ్మకమేమీ లేదు కానీ, ఎంతో కొంత మనకి ఉపకరిస్తాయేమో అనిపిస్తుంది. మనల్ని మనం తెలుసుకోడం అన్నంత మాత్రాన ఈ పర్సనాలిటీ డెవెలప్మెంట్ పుస్తకాలనే కాదు… ఫిక్షన్ కూడా ఒక్కోసారి అలా ఉపకరించవచ్చు. ఉదాహరణకి ఆ కథలో ఏదో పాత్రకి మన తత్వం దగ్గరగా ఉంటే, ఆ పాత్ర ఒకవేళ చేసిన పనేదో చదవగానే మనకు కూడా మనం చేసిన పొరపాటు అర్థమై వేరే మార్గం దొరకొచ్చు… అలా ఎందుకు జరక్కూడదు? ఆత్మకథలూ, జీవిత చరిత్రలూ, యదార్థ గాథలూ కూడా కొంతవరకూ ఇందుకు ఉపకరిస్తాయి.

మూడవది: చరిత్ర, విషయ పరిజ్ఞానం. పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ కోవలోకి పైకి చూస్తే నాన్-ఫిక్షన్ మాత్రమే వచ్చినట్లు కనిపించినా కూడా, నిజానికి – అన్ని తరహా పుస్తకాలలో ఉంటుంది ఈ ఎలిమెంట్. ఉదాహరణకి, ఓ బ్యాంక్ దోపిడీ కథ చదువుతున్నారనుకోండి, అందులో దొంగలు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు? అన్నది సరిగా ఫాలో అవుతూ పోతే, బ్యాంకుల పనితీరు గురించి అర్థమౌతుంది. ఒకానొక కథలో ఎమర్జెన్సీ కాలం నాటి సెట్టింగ్ ఉంటే అప్పటి జనజీవనం గురించి ఆ కథలో తెలుస్తుంది. ఓ జర్నలిస్టు రాసిన పుస్తకం చదివితే, అతను/ఆమె చూసిన విషయాల గురించిన విస్తారమైన జ్ఞానం లభిస్తుంది. ఏ చరిత్ర పుస్తకమో తెరిస్తే ఒక ప్రాంతం గురించి ఎంతో తెలుస్తుంది. ఓ టెక్నికల్ పుస్తకం, ఓ మేనేజ్మెంట్ పుస్తకం, ఓ వ్యక్తిత్వ వికాస పుస్తకం, ఓ పజిల్స్ పుస్తకం, ఓ ఫిట్నెస్ పుస్తకం, ఓ ఆత్మకథ, ఓ జీవిత చరిత్ర – ఇలా ఏ రకం పుస్తకం చదివినా కూడా దాని నుండి ఎంతో కొంత విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు.

నాలుగవది: టైం పాస్. అసలిదంతా కాదండి….నేనివన్నీ చూడను….ఏదో టైంపాస్ కి చదువుతాను..అంతే…అన్నది మరో రకం. ఓ సినిమా చూసినట్లో, ఓ పాట విన్నట్లో (అసలు సినిమాలెందుకు చూడాలి? పాటలెందుకు వినాలి? అన్నదానికి కూడా ఇలా ఓ పెద్ద కారణాల జాబితా చెప్పొచ్చనుకొండి..అది వేరే విషయం.), కాసేపు కబుర్లు చెప్పినట్లో…గాల్లోకి చూసినట్లో…. కాలక్షేపానికి నేను పుస్తకం చదువుతా… అన్నది కూడా పక్కా జవాబే నా దృష్టిలో. అయితే, అన్ని పుస్తకాల్నీ టైంపాస్ కి చదివినట్లు చదవలేము అనుకోండి, అది వేరే విషయం. హాస్యం, అపరాధ పరిశోధన వంటివి ఇందులోకి వస్తాయేమో. ఒక్కోసారి ఇవే మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించవచ్చు. నేను అలా మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలూ/పేజీలూ టైంపాస్ కోసం చదివేవి – చాలా ఉన్నాయి.

ఐదవది: భాష. దాదాపు సంవత్సరం క్రితం మా ప్రొఫెసర్ గారు ఎందుకు సాహిత్యం చదవాలి అన్న దానికి ఒక కారణం చెప్పారు…మనలోని అంతర్గత భావాలను వ్యక్తం చేయగల శక్తి మనం సాహిత్యం చదవడం ద్వారా తెచ్చుకోగలం అని. అదే ఇంకో విధంగా చెప్పాలంటే చదవడం ద్వారా భాష వృద్ధి చెందుతుంది…తద్వారా భావ వ్యక్తీకరణ శక్తి పెరుగుతుంది అని. ఇది నిజమే. అయితే, ఇక్కడే మరో విషయం కూడా ఉంది. ఒక భాష లోని సౌందర్యం అర్థం చేసుకోవాలంటే కూడా ఆ భాష సాహిత్యం చదవాలి. వ్యాకరణాలూ గట్రా మాత్రం చదివితే చాలదు కదా. తెలుగు విషయానికొస్తే, ఈ విషయం అర్థమయ్యాకే నేను అప్పటిదాకా చదవని తెలుగు శతక పద్యాలూ గట్రా కూడా చదివే ప్రయత్నం మొదలుపెట్టాను 🙂 (కొంతమందిని షాక్ కి గురి చేసిన పాపం కూడా మూటగట్టుకుని మరీ.) విరివిగా చదవడం వల్ల, రాయడంలో కూడా మార్పులొస్తాయి. రాసే అలవాటు ఉన్నవాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ చదవడంలో :). అందుకే నేమో… బాగా రాయాలంటే బాగా చదవాలని చెప్పేది…..

ఆరవది: విలువ. కొన్ని పుస్తకాలను చదవడానికి వాటికున్న చారిత్రక విలువే ప్రధాన కారణం. ఏ పదిహేనో శతాబ్దంలోనో ఒకటి రాసారు అని సోషల్ పుస్తకంలో చదువుకున్న పుస్తకం ఉన్నట్లుండి ఎక్కడో కనిపిస్తే-చదవాలనిపించేది (మీకు సోషల్ లో దాని గురించి చదివిన విషయం గుర్తు ఉంటేనే సుమా!) ఇందుకే. పుస్తకం బాగుందనో,బాలేదనో కంటే – దాని వయసే దాన్ని చదివేందుకు ప్రేరణ ఇక్కడ. ఇటీవలి కాలం లో నేను అలా కొంత చదివిన పుస్తకం – Machiavelli రాసిన “ది ప్రిన్స్”. ఎప్పుడో పదిహేనో శతాబ్దం అప్పటి పుస్తకం. ఇది అయితే, భాష తేలిగ్గా ఉంది కానీ, కొన్ని పుస్తకాలు అర్థం కావు. ఇప్పుడు “ఆముక్తమాల్యద” ని నేను ఈ చారిత్రక విలువ కారణంతోటే చదవబోయాను. నాకంత తెలుగు రాదని అర్థమైనా కూడా, ప్రయత్నించాను. ఎందుకు? అంటే విలువ! అది ఈ కాలపు పుస్తకం అయితే వదిలేసి ఉందును. రాయలకాలం నాటిదనే గౌరవంతో ప్రయత్నించాను (మానేశా అనుకోండి…అది వేరే విషయం.) కానీ, కనీసం, నేనూ ఆ పుస్తకం చూసాను…అని తృప్తి కలుగుతుంది…ఆ తృప్తికోసం చదివే పుస్తకాలు ఒక రకం అనమాట. పూర్తి చేస్తామా లేదా అన్నది వేరే విషయం.

ఏడవది: అధ్యయనం. అకడమిక్ ఆసక్తి తో, పరిశోధనా దృష్టితో చదవడం ఇంకో కేటగిరీ. ఈ దృష్టి తో అన్ని రకాల పుస్తకాలనూ చూడొచ్చు మళ్ళీ. ఒక రచయితని విరివిగా చదివేసాక, అతనిదో/ఆమెదో కొత్త పుస్తకం దొరికితే, అప్పటిదాకా ఏర్పరుచుకున్న అభిప్రాయాలను సరిచూసుకోడానికి ఈ కొత్తపుస్తకాన్ని అధ్యయన దృష్టితో చదువుతాం ఏమో అని నా అనుమానం. ఇంకా ఈ క్లైమ్ ని వాలిడేట్ చేయలేదు. అదే కాక… ఒకే విషయం మీద రకరకాల రచయితలు ఏమేమి చెప్పారు , ఒక విషయాన్ని ఒక్కోరూ ఎలా అర్థం చేసుకున్నారు(ఉదా: కమ్యూనిజం అనుకోండి..కంయూనిస్టులైతే ఏమి రాస్తారు? వాళ్ళ రైవల్స్ ఏమి రాస్తారు? ఇలా పరిశోధించడం అనమాట) – ఇలాంటివి..

ఇవీ నాకు దొరికిన సమాధానాలు. తాంబూలాలిచ్చేసాను…. 🙂 All said and done, మీ మీ అభిప్రాయాలు కూడా తెలుపగలరు.

Advertisements
Published in: on May 22, 2008 at 5:34 am  Comments (24)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/05/22/why-read/trackback/

RSS feed for comments on this post.

24 CommentsLeave a comment

 1. I loved it.

 2. I agree with all your reasons for “why we should read”. Good obersvations.
  Thanks for sharing with us.

 3. విశ్లేషణ బాగుంది సౌమ్యా!ఏది ఏమైనప్పటికి మీరు చదవడం మాత్రం ఆపొద్దు.ఎందుకంటే నేను ఏదన్నా పుస్తకం కొనాలంటే ముందు మీ బ్లాగులో దాని గురించి మీరు ఏమన్నా రివ్యూ రాసారో లేదో చూసి/చదివి కొంటాను అన్నమాట.మరి చదవడం ఆపేస్తే ఎలా??

 4. –మీ విశ్లేషణ బాగుంది. ‘ […] బాగా రాయాలంటే బాగా చదవాలని చెప్పేది […]’

  –కొంత ఫార్మాటింగు చేస్తే మరింత బాగుండేది.

 5. సౌమ్యా,
  ఏదో ఒక పాయింట్ నచ్చింది అని విశ్లేషిద్దామనుకున్నాను మొదట. పూర్తిగా చదివాక అన్ని పాయింట్లూ బాగా బాగున్నాయి. అవును..పుస్తకాలు అందుకే చదవాలి. బాగా రాశారు.

 6. మీరు చెప్పినవన్నీ మంచి కారణాలే. ముఖ్యంగా భాష మీద పట్టు రావాలంటే (రాయటానికైనా, చెప్పటానికైనా) మీరన్నట్లు పుస్తకాలు చదవాల్సిందే.

 7. మంచి కారణాలు సౌమ్యా. చాలా బాగా వ్యక్తీకరించారు కూడాను.
  బ్లాగులు మొదలెట్టిన కొత్తలో ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తుండేవాణ్ణి తరచూ. బ్లాగులో రాద్దామని కూడా చాలా సార్లు అనుకుని, తీరా నా ఆలోచనలు నాకే స్పష్టపదక రాయలేదు. నేను అనుకున్నవన్నీ మీరు రాశారు. అన్నట్టు చదవడానికి అది కూడా ఓ కారణం .. మనకి తెలిసీ తెలియనట్టు ఉన్న భావనలు, విషయాలు, ఆలోచనలు ఇంకొకరు రాస్తే చదివి స్పష్టీకరించుకోవడం నా మట్టుకు నాకు చాలా ఆనందం కలిగించే పని.

 8. బావున్నాయ్ సౌమ్యా మీరు చెప్పిన కారణాలు.
  నాకైతే ఆత్మకథలూ, జీవిత చరిత్రలూ చదవడమంటే ఇష్టం గొప్పవారు జీవితం లోని ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కొన్నారు, వారి సక్సెస్, జీవితం పట్ల వారి స్పందనలూ ఇలాంటివి చాలా ఆసక్తి కలిగిస్తాయి నాకు.

 9. తెలుగుబ్లాగు గుంపు మొదలెట్టిన కొత్తల్లో ఒకాయన అడిగారు – తెలుగు సాహిత్యాన్ని ఎందుకు చదవాలని మిత్రులడుగుతున్నారు, వారికేంచెప్పాలి – అని. అప్పుడు నేను కొంత అత్యుత్సాహం ప్రదర్శించి, “సమాధానం నేను చెబుతాను, నాక్కొంత సమయం కావాలి” అన్నాను. మళ్లీ ఆ మాటెత్తుకోలేదు. మొదటి కారణం – పుస్తకపఠనమనే అలవాటు నాకు లేకపోవడం. రెండు కారణం – ఎవరికైనా సరే మాతృభాషలో వెలువడిన సాహిత్యాన్ని చదవడం ముఖ్యావసరమని తెలిసినా ఎందుకు ముఖ్యావసరమో చెప్పే పద్ధతి చేతకాకపోవడం.

  సౌమ్యగారూ, ప్రత్యేకించి తెలుగుపుస్తకాలను ఎందుకు చదవాలో మీరు చెబితే వినాలనుంది.

 10. @రానారె:
  తెలుగు పుస్తకాలను…. టపా రాయడానికి మంచి ఆలోచనే.. నా కారణాలను త్వరలోనే రాస్తాను… Thanks for the idea.

 11. నిజమా!
  పుస్తకం చదవడానికి ఈ ఏడు కారణాలున్నవా?
  అవి కావాలా?
  అందుకని పుస్తకాలు చదవాలా, అన్నది ఇప్పటి దాకా తెలియలేదు.
  అసలు ఆ కోణం నుంచి అలోచనే లేదు.
  ఊపిరి ఎందుకని పిలుస్తాం?
  ఎందుకని భోంచే్స్తాం?
  గుండెకి ఎవరు చెప్పారు, అలా కొట్టుకోవాలని?
  రొమ్ములకేవరు చెప్పారు అలా గాలి పీల్చాలనీ?
  కళ్ళకెవరు చెప్పారు చూడాలని?

  రానారే గారి మిత్రుల ప్రశ్న – “తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి?”
  ??????

 12. గుండె, ఊపిరితిత్తులు అసంకల్పితంగా పనిచేసినట్లు పుస్తకాలు చదవడం కూడా ప్రకృతిసహజంగా అలవడని, ప్రాణావసరాలు కాని నాలాంటివారి మాటలకేంలెండి 🙂

 13. @ సౌమ్య, “Best that is been thought and said is recorded in books” అంటారు. ఇప్పటివరకూ(మానవాళికి) కల్గిన ఉత్తమ ఆలోచనలూ,అభిప్రాయాలూ,భావాలూ అక్షరభద్ధీకరించి పుస్తకాలలో దొరుకుతాయని దీని భావము. ఈ ఒక్క కారణం చాలు పుస్తకాలు చదవడానికి.కానీ మీ ఆలోచన సాగిన తీరు, మీరు ఆలోచించిన కారణాలూ బాగున్నాయ్.

  “మడిసన్నాక కూసింత కలాపోసనుండాల” కాబట్టి, మనుషులం చదవాల్సిందే! అందులో వేరే ఆర్గుమెంటుకి చాన్సేలేదు.

  మీరు నా బ్లాగుపై శీతకన్ను తొలగించి కేవలం మెల్లకన్ను వెయ్యడం(కొన్ని టపాలే చదివి కామెంటారు మరి) ఇంకా దారుణం. మీ దర్శనానికై ఎదురుచూస్తున్న ఒక బ్లాగరి.
  మహేష్

 14. ఒక్క మంచి పుస్తకం చదవటం కోసం వంద చెత్త పుస్తకాలు చదవటం వల్ల మీకు ’పుస్తకాలు ఎందుకు చదవాలి?’ అన్న ప్రశ్న కలిగింది అనిపిస్తుంది. చదివి చదివి విసుగు పుట్టి ఇలా అనిపించటం సహజం. ఏమైనా మనిషిలో ఉన్న ఎనర్జీని ఖర్చు పెట్టడానికి ఏదో ఒక వ్యాపకం కావాలి. మీకు పుస్తకాలు చదవటం అనే అలవాటు అయ్యింది. ఇంకొకరికి పాటలు వినటం లేదా సినిమాలు చూడటం కావచ్చు. కొంతమందికి బియ్యం గింజలమీద చిత్రాలు చెక్కటం కావచ్చు. మరికొంత మందికి ఖాళీ సీసాల మూతలు సేకరించటం కావొచ్చు. కొంతమందికి గోళ్ళు, మీసాలు పెంచడం ఇష్టం కావొచ్చు. మరికొంత మందికి మోకాళ్ళపై పాకుతూ మెట్లు ఎక్కడం కావచ్చు.
  ఒక విషయం మాత్రం నిజం అండి. మంచి పుస్తకం గానీ , మంచి పాట గానీ దొరకాలంటే 1: 1000 ratio లో వెతుక్కోవాల్సిందే. అగాధాల్లో ఆణి ముత్యాలు కొన్నే ఉంటాయి.

 15. ఒక బ్లాగును క్రమం తప్పకుండా రాసే వారికి పుస్తక రచనలో ఎంత కష్టం ఉంటుందో తెలుసు. ఒక పుస్తకాన్ని (ఎంత చెత్తదయినా) రాసి ప్రచురించారు అంటే మామూలు విషయం కాదు, ఎంతో పట్టుదల, దృఢ నిశ్చయం ఉన్నవారు అయ్యుండాలి. ఒక పుస్తకాన్ని చదవడం వల్ల ఆ రచయితతో స్నేహం చేసిన దానితో సమానం అనుకుంటాను – మనకు కొన్ని సలక్షణాలు అబ్బటం ఖాయం.

  పుస్తకాలను చదవడం ద్వారా కొన్ని జీవిత కాలాల్లో నేర్చుకోగలిగినన్ని విషయాలను కొన్ని గంటల్లో నేర్చుకోవచ్చు. అన్ని పాయింట్లు నాకు నచ్చాయి.

 16. పుస్తకాలు చదవడానికి నాకు మాత్రం ఒకే ఒక్క కారణముంది.

  పుస్తకాలు చదవకుండటానికి ఒక్క కారణమూ లేదు గనుక.

  –ప్రసాద్
  http;//blog.charasala.com

 17. @ రానారె:: 🙂

 18. @Kottapali:
  Yes…Thats another reason for me too 🙂
  @Telugu Abhimani: Atleast in my case, I am fortunate that I read good books more than forgettable ones. Those “must reads” already form such a huge list that….it takes some time for me to venture out and read forgettable ones. The reason for such a question is not what u said, in my view. For me, its just because of what I said before…If u don’t read for sometime…and feel bad about it, the other side of ur mind poses such questions 🙂

 19. synchronize says : I absolutely agree with this !

 20. ఇక్కడ నా ఫ్రెండ్స్ అంతా ఎందుకు ఎప్పుడూ ఎదోకటి చదువుతూ వుంటావని అడిగితే నాకు చదవడం అంటే ఇంట్రెస్ట్ అని క్లుప్తంగా సమాధానమిచ్చేవాన్ని. ఈ టపా చదివాకా ఈసారి ఆ ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పగల బలమొచ్చింది. మీరు దీనిని ఎనిమిదవ కారణంగా (లేదా ఉపయోగంగా) పరిగణలోకి తీసుకోవచ్చు 🙂 ధన్యవాదాలు.

 21. Sowmya!
  yenta baaga analyse chesaru:)
  Meeru baaga chadivi maalanti vallani chadavataniki inspire cheyandi.
  all the best,
  Prasanna Rayaprolu

 22. Bagunnai andi mee reasons nenu kuda veetini face chesanu kani ila rayaalani eppudu anipinchaledu the thought is different.Good one keep going

 23. […] మే నెల్లో నేను “ఎందుకు చదవాలి?” అని రాసిన టపా కింద వ్యాఖ్య రాస్తూ […]

 24. నన్ను నా మిత్రుడు అడిగాడండీ. ఎందుకు చదవాలీ అని, అందుకే జవాబు కోసం వెతికితే మీ పోస్టు కనిపించింది. అవసరమైన పక్షంలో తప్పకుండా ఇన్పుట్స్ తీసుకుంటా. థ్యాంక్యూ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: