లేఖా సాహిత్యం పై

లేఖా సాహిత్యం రెండు కారణాలకి ఆసక్తి కలిగిస్తుంది నాలో:

1. ప్రముఖ వ్యక్తులు తమ సన్నిహితులతో ఏ విధంగా సంభాషించేవారో (అదేలెండి..లేఖల ద్వారా), తోటి ప్రముఖులతో ఏం మాట్లాడేవారో? అన్న విషయాలని పరిశీలించవచ్చు.
2. చాలామంది లాగానే నాలో కూడా ఒక inherent gossiper ఉంది కనుక, అవతలి వాళ్ళ జీవితాల గురించిన కుతూహలం. 🙂

గత రెండేళ్ళలో, నాకు దొరికినంత మేరలో లేఖా సాహిత్యాన్ని అచ్చేసిన పుస్తకాలు చూస్తూ వచ్చాను. నాకు కొన్నింటిలో కొన్ని లోపించినట్లు (ప్రచురణలో..నేను చెప్పేది) అనిపించింది. అలాంటి విషయాలను ఏకరువు పెట్టి… ఏ పబ్లిషరన్నా ఎపుడో ఒకప్పుడు దీన్ని చూడకపోతాడా… తర్వాతెప్పుడన్నా లేఖా సాహిత్యం అచ్చేస్తే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోకపోతాడా అన్న ఆశతో ఈ టపా రాస్తున్నా…

– మొదటి విషయం ఏమిటీ అంటే, కొందరు పబ్లిషర్లైతే, కనీసం ఉత్తరం ఎవరికి రాసింది అన్నది కూడా రాయరు. ఇప్పుడొక ఉత్తరం – “ప్రియమైన శర్మగారికి, ……(ఏదో రాసి ఉంటుంది..) భవదీయుడు, రావిశాస్త్రి. అని ఉంది అనుకుందాం. ఇక్కడ భవదీయుడు ఉన్నా, లేకున్నా కూడా, అది రావి శాస్త్రి లేఖల సంకలనమైతే మాత్రం మనం చెప్పగలము కదా ఆ లేఖ రాసింది రావిశాస్త్రి అని? (ప్రియమైన శర్మ గారికి అనుంది కనుక…అది రావిశాస్త్రి రాసిన లేఖ కానీ, ఆయనకి వచ్చిన లేఖ అన్న విషయం తెలిసిపోతూనే ఉంది కదా) కానీ… సదరు శర్మ గారు ఎవరు? బోలెడంత మంది శర్మలు ఉంటారు. కనీసం, ఏ శర్మో చెప్తే అన్నా బాగుంటుంది.
– ఇదే రావి శాస్త్రి లేఖల్లో ఒక లేఖ చదువుతూ ఉంటే, ఎలా ఉండింది అంటే- రాచకొండ వి.శా. గారికి… భవదీయుడు రాచకొండ వి.శా. ఇలా ఏదో ఉండింది. అంటే, ఆయన ఆయనకే రాసిన అర్థం వచ్చింది. వినడానికి వింతగా ఉన్నా, ఏమో, నిజంగా రాసి ఉండొచ్చు అలా…చెప్పలేం. సరదాకి కూడా రాసుండొచ్చు. అలాంటప్పుడు, లేఖ సందర్భం కాస్త చెప్పొచ్చు కదా ప్రచురించేవాళ్ళు? దొరికింది దొరికినట్లు అచ్చేసేస్తే, ఇక ఆ కాలం మనుషుల్తో పరిచయం ఉన్నవాళ్ళు తప్ప చదవలేరు కదా…
– ఇంకొన్ని ఉత్తరాలుంటాయి… ఉదాహరణకి, ఏ అనే ప్రముఖ రచయితకి బీ అనే వ్యక్తి మిత్రుడు. తరుచుగా లేఖలు రాసుకుంటాడు. అయితే, బీ ఏ లాగా పేరు చెప్పగానే తెలిసిపోయేంత ప్రముఖుడు కాడు. అలాంటప్పుడు ఈ లేఖల్ని చదివే తరువాతి తరం వారికి బీ తెలీకపోవచ్చు కదా. ఊరికే ఆయా వ్యక్తుల పేర్లను బట్టి లేఖల్ని వర్గీకరించి వదిలేస్తే, ఆ వ్యక్తులెవరూ? అని సదరు అమాయకపు పాఠకులు తలలు పట్టుకోరూ? కొ.కు లేఖలు చదువుతున్నప్పుడు నాకు ఇదే జరిగింది.
– కొన్ని ఉత్తరాల్లో… “మీరు పోయిన్సారి కలిసినప్పుడు చెప్పిన విషయం ఆలోచిస్తున్నాను…” అనే ధోరణి లో మొదలై, ఇక అదే ధోరణి లో కొనసాగుతాయి. ఆ విషయమేంటో మనకు అర్థం కాదు. ఆ ఉత్తరం ఆ సంకలనం లో కనబడదు. నాకసలే గాసిప్ వ్యామోహమేమో… ఇంక ఆరాటం… ఏమిటి ఆ విషయం? అని 😉
– మరికొన్ని ఉత్తరాలు – అక్కడ పెద్ద విషయమేమీ ఉండదు, ఉభయకుశలోపరి తప్ప. అయినా, అవి ఎందుకు ప్రచురిస్తారో అన్నది నాకు తెలీదు.

అసలు ఈ ఉత్తరాల సంకలనాలు ఎందుకు ముద్రిస్తారు? అన్నదే నాకో పెద్ద సందేహం. నేనైతే టపా మొదట్లో చెప్పిన కారణాలకి చదువుతాను. లేఖా సాహిత్యం వల్ల నా మట్టుకు నాకైతే బోలెడు సంగతులు తెలిసాయి కానీ, ఏ లేఖలు ప్రచురణకి అర్హమైనవీ, ఏవి కావు అన్నది ఆలోచించాల్సిన విషయమే కదా. ముద్రించేవాళ్ళు ఎందుకు వేస్తారు? “సమగ్ర సాహిత్యం” ప్రింటులో ఉండాలని కాబోలు! అది తెలీదు కానీ, ఇంక నో కామెంట్స్… లోగుట్టు పెరుమాళ్ళకైతే ఎరుక గానీ, నాక్కాదు కదా. ఇది చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా చేయాల్సిన పనేమో అనిపిస్తుంది నాకు..మొత్తానికైతే, లేఖా సాహిత్యానికి ప్రింటులూ, రీ ప్రింటులూ కూడా ఇస్తున్నప్పుడు, వాళ్ళ టార్గెట్ పాతతరం మాత్రమే కాదు అని అర్థమౌతోంది. అట్లాంటప్పుడు, పై విషయాల మీద కాస్తంత శ్రద్ధ చూపిస్తే, పుస్తకానికి ఓ నిండుతనమూ వస్తుంది, పాఠకుడికీ ఏదో తెలుసుకున్నానన్న తృప్తి మిగులుతుంది (గందరగోళం లో కొట్టుమిట్టాడే బదులు).

Advertisements
Published in: on March 4, 2008 at 4:49 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/03/04/lekha-sahityam/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. చలం గారి ‘ప్రేమ లేఖలు’ ఒక సారి చదవండి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: