ఝుమ్మంది నాదం, నా వాచీ, ఇరవైయ్యిరవై

హమ్మయ్యా! మిడ్‍సెమ్స్ అయిపోయాయి… ఇంక ప్రశాంతంగా బ్లాగొచ్చు ఈరోజు!

ఈ మధ్య కొత్తగా ఈటీవీ వాళ్లు గంజాయి వనం లో తులసి మొక్కలా ఓ మంచి ప్రోగ్రాం మొదలుపెట్టారు. దాని పేరు “ఝుమ్మంది నాదం”. అదేమిటోగానీ, పేరు ఇది, బ్యాక్‍గ్రౌండ్ లో మార్నింగ్ రాగా మ్యూజిక్. 🙂 సర్లెండి..వాళ్ళ షో..వాళ్ళిష్టం కానీ… షో మాత్రం చాలా బాగుంది. అది పాత తరం గాయనీ గాయకులని పరిచయం చేసే షో. అంటే, సంగీత దర్శకులు వాళ్ళు కూడా వస్తారేమో కానీ, ఇప్పటికి అయితే ఇంకా రాలేదు. ఇప్పటికి అయితే సుశీల గారు, జానకి గారు వచ్చారు. ప్రోగ్రాం ప్రతి శనివారం రాత్రి ఏడున్నర నుండి ఎనిమిదిన్నర దాకా వస్తుంది. గాయని సునీత ఈ ప్రోగ్రాం కి యాంకర్. బాగా చేస్తున్నదనే చెప్పాలి. రాబోయే శనివారం కూడా జానకి గారి ఇంటర్వ్యూ నే కొనసాగుతుంది. ఆవిడ ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రోగ్రాం అందుకే చూసే కొద్దీ చూడాలనిపించింది. చూసిన చాలాసేపటిదాకా ఆ ట్రాన్స్ లో ఉండిపోయాను. మంచి మంచి పాటలు…(పాటలేవన్నా ఆమె నోటి నుండి వెలువడితే అద్భుతంగా అనిపిస్తాయి నాకు…) ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు… జానకి గారి హద్దుల్లేని ఎనర్జీ….వెరసి ఆ ప్రోగ్రాం చూడ్డం ఓ మరువలేని అనుభవంగా మార్చాయి. అన్నింటితోపాటు సునీత ప్రోగ్రాం ని నడిపించిన విధానం – చాలా బాగుంది. కొన్ని చోట్ల ఆమె కూడా చాలా మధురంగా పాడింది. కానీ.. జానకి గారిని గలగలా నవ్వుతూ ఉంటే చూట్టం మాత్రం ఓ మంచి అనుభవం… రెప్పవాల్చక ఆమె నగుమోమునే చూస్తూ, “చెవి మూయక” ఆమె ప్రతి మాటా, పాటా వింటూ ఉంటే ఎంత బాగుండిందో చెప్పలేను. ఇంకా ఎవరెవరు రానున్నారో… మంచి ప్రోగ్రాం…మిస్సవ్వకండి.. అసలుకే మన తరం (పోనీ, నా బోటీ వాళ్ళ తరం) వాళ్ళు చాలా మందిని మిస్సయ్యాం. ఇప్పుడు అంత ఆక్టివ్ గా లేని ఒకప్పటి మేటి గాయకుల ఇంటర్వ్యూలు మళ్ళీ మళ్ళీ వేయరు కదా!

ఆదివారం ఓ సంగతి జరిగింది… నా వాచీ సెల్ చచ్చిపోతే కొత్త సెల్ వేయించుకుందాం అని వెళ్ళాను. షాపు వాడు వాచీ తీసుకుని గాజు కిటికీ లోపల ఉన్న మెకానిక్ కి ఇచ్చాడు. అతను సెల్ తీసాడు బయటకి.. అనుమానంగా ఇది మీదేనా? అన్నట్లు చూసాడు. వెంటనే అది తీసుకుని బైటకు వచ్చాడు నా దగ్గరికి. “దీనికి సెల్ ఇక్కడ దొరకదు మేడమ్. అమీర్‍పేట్ వెళ్ళండి.” అన్నాడు. నేనైతే అవాక్కయ్యాను. “అదేమిటి? గత ఏడేళ్ళుగా ఇదే షాపు లో నే వేయించుకుంటున్నా కదా…” అన్నాను ఆ షాక్ నుండి తేరుకుని. “ఇప్పుడు ఈ మోడల్ వి రావడం లేదు మేడమ్. “పోనీ ఓ వారం తరవాత రండి. అప్పుడు ఉండొచ్చు..” అన్నాడు.  నేను తలూపి బైటకొచ్చేసాను. కానీ, అంతా అయోమయంగా అనిపించింది… నా వాచీ కి సెల్ దొరక్కపోవడం ఏమిటి? అని. అది మామూలు కేసియో వాచీ. ఏదో ఓ చిన్న షాపులో నేను ఆరో తరగతి లో చేరడానికి కొద్ది రోజుల ముందు మా అమ్మా,నాన్నా కొనిచ్చారు. అప్పట్నుంచి ఇలా సెల్లు మార్చడమో, అప్పుడప్పుడూ స్ట్ర్రాప్ మార్చడమూ చేసుకుంటూ దాన్నే వాడుతున్నా. మా అమ్మ దాన్ని “బొమ్మ వాచ్” అని వెక్కిరిస్తూ ఉంటుంది కూడా. అయినా కూడా దాన్ని వదలక అదే వాడుకుంటున్న.  ఆ మధ్య రెండు రోజులు అది కనిపించకపోతే నే అల్లాడిపోయాను. అది కనిపించగానే నిజంగానే ఆనందంతో అరిచేసరికి వాచీకి కూడా ఇంతసీన్ ఉందా అన్నట్లు చూసారు నా స్నేహితులు. మరి, ఓ పన్నెండు-పదమూడేళ్ళ అనుబంధం నాకు దానితో. ఇప్పుడు దానికి సెల్ లేకపోయేసరికి ఎంత దిగులుగా ఉందో చెప్పలేను. వారం రోజులు ఇంకో వాచీ వేసుకోవాలంటే ఏదోలా ఉంది. పడుకునేటప్పుడు కూడా వాచీతోనే పడుకునే నేను ఆ ఇంకో వాచీ వేసుకోడం ఏదోలా ఉండి వాచీ తీసేసి తిరుగుతున్నా! వినడానికి కాస్త విడ్డూరంగా ఉండొచ్చు కానీ..అది నిజం.

ఈ వారానికి మనకందరికీ ప్రత్యేక వార్త మన ట్వంటీ-ట్వంటీ విషయం. చరిత్రలో తొలి ఇరవైయ్యిరవై ప్రపంచ కప్ విజేత భారత్. టెస్టులు చూసిన వారికి వన్డేలే వేగంగా అనిపించాయి. ఇక ఇవి వాయివేగం అనిపిస్తాయేమో. ఏదో, మొత్తానికి మొదట నాకు నచ్చలేదు కానీ, ఈ ప్రపంచ కప్ తరువాత నేను కూడా దీని అభిమానుల లిస్టులో చేరాను. చూస్తూ ఉంటే దీనికి అభిమానులు ఎక్కువగానే తయారైనట్లు అనిపిస్తోంది ఇక్కడ జనాలతో మాట్లాడుతూ ఉంటే. కొన్ని గంటల్లోనే మ్యాచ్ అయిపోవడం అన్నింటి కంటే నాకు నచ్చిన అంశం. 🙂 మన తరువాతి తరానికి వన్డేలే మనకి టెస్టుల్లా అనిపిస్తాయని కాబోలు దీన్ని కనిపెట్టారు. మరో రోజు తీరిగ్గా దీని పుట్టుపుర్వత్తరాల గురించి బ్లాగుతా. ఇప్పటికి ఇంతే సంగతులు.

Advertisements
Published in: on September 25, 2007 at 3:57 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/25/%e0%b0%9d%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9a%e0%b1%80-%e0%b0%87%e0%b0%b0%e0%b0%b5/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. అవునండీ….ఈ మధ్య స రి గ మ ప లిటిల్ చాంప్స్ లో జానకి గారు చిన్న పిల్లల్లా పాడిన పాటే ఆవిడ ఎనర్జీ కి …ఉల్లాసానికి ప్రతీక..!

 2. అవును సౌమ్యగారు, ఝుమ్మంది నాదం చాలా బాగుంది. సుశీల గారి ఎపిసోడ్ ఇంకానూ. “అహనా పెళ్ళియంట…” పాడతారేమో అనుకున్నాను. నాకు 60-70 ల మధ్యలో సుశీల గారి గొంతు బెస్ట్ అనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఝుమ్మంది నాదం ఈటీవీ వాడిది కాదు. లేకపోతే ఆ ప్రభాకరుడు ఇక్కడా ప్రత్యక్షమయి అంతా కంపు చేసేవాడు.

 3. అవునండీ, నేను మొదట్లో ఆశ్చర్యపోయాను.. ఈటివిలో, ఇలాంటి కార్యక్రమమా అని.. అయితే దాని రూపకర్త మాత్రం ఆ సుమన్ కాదు (వైజయంతి ప్రొడక్షన్స్) కాబట్టి పర్లేదు.. అలా అయినా కూడా, సుమన్ కి నెనర్లు చెప్పాలి.. ఎందుకంటే, ఆ సమయంలో, ఇంకేదో చెత్త సీరియల్ వేయాలనే ఆలోచన లేకుండా దానికి ఒప్పుకున్నందుకు…!!

  అసలు జానకి గారు, ఇంకా ఈ వయసులో, అలా చిన్న పిల్లాడి గొంతు పలికించడం మాత్రం నిజంగా సూపర్బ్.. సుశీల గారు కూడా అంతే, ఇంకా ఆవిడ తన గొంతు లోని మాధుర్యాన్ని నిలుపుకున్నారు…

 4. అవును సుమన్ కే నెనర్లు చెప్పాలి.

 5. hello sowmya garu nenu eeroje mee blog chusanu.meeru post chesina articals chduvutunte naa manasuku chala hayiga anipistunnai…mee rachana shayili chala chala bagundi….. chala thanx

 6. మీ స్వగతంలోని మాటలు బైటికి బ్లాగానే వినపడుతున్నయ్. ఉలలల్లల లల్లేయో ఉలల్ల లలల్ల లెయో.

 7. మీ ఎలక్ట్రానిక్ వాచీలాంటిదే నాకూ వుండేది ఓ పది సంవత్సరాలు దానికి స్ట్రాప్ ఊడిపోయి తెగిపోయినా దాన్ని జేబు లో పెట్టుకుని “గాంధీ వాచీ” అని నామ కరణం తో పిలుచుకునే వాడిని. ఓ శుభ ముహూర్తం చూసుకుని అది నీళ్ళ బక్కెట్ లో బడి “నాకీ జీవితం చాలు” అని బక్కెట్ తన్నడం వల్ల ఈజిప్టు పిరమిడ్ చేసి ఎక్కడో దాచాను. అదిప్పుడు కనబడ్డం లేదు. మీ వాచీ నా వాచీని గుర్తుకు తెచ్చింది.

  మీ టపాకి హెడ్డింగ్ ఇలా వుంటే బావుండేది..

  ఝుమ్మంది పాదం…పోయింది వా..చీ..ఇక మిగిలింది ఇరవైలో ఇరవై.

  — విహారి

 8. నాదం = పాదం

  — విహారి

 9. నాకు మీ వాచ్ కథ నచ్చిందండి..నేను అలానే బాధపడేదాన్ని ….ఇప్పుడు వాచ్ అలవాటేపొయింది…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: