వేయిపడగలు – The other side

వేయిపడగలు అన్న పుస్తకం గురించి, అది రాసిన విశ్వనాథ సత్యనారాయణ గురించి నేను ప్రత్యేకమైన ఇంట్రో అంటూ ఒకటి ఇవ్వడం బహుశా అవసరం లేదేమో. కాబట్టి డైరెక్టుగా పాయింటుకి వచ్చేస్తున్నా. కొన్నాళ్ళైంది ఈ పుస్తకం చదివి. అసలైతే అప్పట్లో దీని గురించి కావాలనే బ్లాగదలుచుకోలేదు. గొడవలైపోతాయని. కానీ, ఆ మధ్య అనుక్షణికం గురించి రాసాక జరిగిన చర్చ చూసాక నాకు దీని గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలన్న కుతూహలం కలిగింది. అందుకే ఈ టపా. ఇది కూడా Alternative Intro to the book గా అనుకోవచ్చు. కథాంశం గురించి నేనేమీ మాట్లాడలేను. నాకు పరిచయం లేని పరిస్థితులు, పరిసరాలు – కథ నిండా. పరిచయం లేని పరిస్థితులన్నా కూడా కొన్ని మనం చదవగలము, అవి మన ఊహ కి అందేవిగా ఉంటే. ఈ నవలలో ని జీవితం నా ఊహ కు అందనిది. దాదాపు తొమ్మిదొందల పేజీలున్న ఈ నవలను విశ్వనాథ వారు చెప్పుకుంటూ పోతే పక్కన ఎవరో-పేరు గుర్తు రావడం లేదు… వారు రాసారట. అదీ నెల రోజుల్లో. ఆ విధంగా చూస్తే ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. ఆశువు గా నవల చెప్పే సామర్థ్యం అసలు నాకు ఊహకందడం లేదు. విశ్వనాథ వారికి శతకోటి వందనాలు – ఈ విషయం లో.

ఇక కథనం – కొన్ని చోట్ల నాకు కాస్త అతిశయంగా అనిపించింది. ఉదాహరణ కి – పసిరిక, గిరిక పాత్రల చిత్రణ. నమ్మశక్యంగా లేని వర్ణనలు ఈతరహా వి చాలా చోట్ల కనబడ్డా కూడా వీరిద్దరి characterization మాత్రం చాలా అసహజంగా అనిపించింది. అసలు ఎంత అసహజమైన ప్రాణులైనా అలా ఉండరు అనిపించింది. పాత్రల మధ్య సంబంధాలు కూడా కాస్త విడ్డూరంగానే అనిపించాయి. ఉదాహరణ కి ధర్మారావు, అతని భార్యా – ఈ ఇద్దరికి కొన్ని ఇతర పాత్రలతో గల సంబంధాలు- చాలా డ్రమటిక్ గా ఉన్నాయి ఈ బంధాలు. ధర్మారావు భార్య పాత్ర ని చంపడమే పెద్ద లాజికల్ గా అనిపించలేదు. దానికి తోడు అతనికి కూతురి వయసున్న మరో పిల్లనిచ్చి పెళ్ళి చేసి దాన్ని సమర్థించేలా చెప్పించారు కొన్ని పాత్రల ద్వారా. ఇది అసహజంగా అనిపించలేదు, ఆ కాలం లో అలా జరిగేవనుకుంటా. కానీ, దాన్ని సమర్థించడం కాస్త ఎబ్బెట్టుగా నే అనిపించింది.

ఒక చోట – “నేత్రేంద్రియము కన్నా శ్రవణేంద్రియము ద్వారా విద్య చెప్పిన మనసు కు పట్టును.” – అని చెప్పించారు. నాకేమో Visual aid ఆడియో కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని చదివినట్లు గుర్తు. “బుద్ధి వికసించిన తరువాత ఏ భాష అయిననూ తొందరగానే వచ్చును.” -అన్నారు మరో చోట పిల్లలకి ఆంగ్లం నేర్పడం గురించి. నాకేమో – చిన్న పిల్లలకి కొత్త భాష నేర్చుకోవడం మనకన్నా తేలిక అని చదివినట్లు గుర్తు మళ్ళీ. అనేక విషయాల మీద ఆయన భావాలు చూసాక ఆయన భావాలకీ, నాకు Ideological difference ఎక్కువుండడం వల్లో ఏమో పుస్తకం ముగిసే సరికి నాలో అసంతృప్తి. 😦 ఈ నవల లో నుండి కొన్ని excerpts.

మిషనరీల మీద విమర్శ:
“వారేరు దాటి తెప్ప తగులవేయుదురు. తమపనియైనంతనే మనుజులను తిరస్కరింతురు.వారికెంతసేపటికిని తమ మతం లోనికి క్రొత్త వారిని చేర్చుకొనవలయుననియే తప్ప వారికి సమాన గౌరవమీయవలయునని గానీ, ఇతర మతములలో ఉన్న వారు కూడా మనుషులేయని గానీ యుండదు…”

ఈ వాక్యాలు ఎవరి గురించో సరిగా చెప్పలేను కానీ, వర్ణన బట్టి బహుశా సాక్ష్ వ్యాసాలు రాసిన పానుగంటి వారి గురించేమో అని అనుకుంటున్నా:
“రాసినాయన ఆంధ్రా డికెన్స్ అట. నిజమే కాబోలునని తీసితిని. ఆంగ్లేయములో పిక్‌విక్ పేపర్స్ అని యున్నవి. అవి చాలా రమ్యముగా ఉండును. ఈ యుపన్యాసములు వానిననుసరించి రాయబడెనని చెప్పిరి. తీసి చూచితిని కదా… దానికి దీనికి ఏమియూ సంబంధం లేదు. చెప్పినదే చెప్పి, చెప్పినదేచెప్పి ప్రాణములు తీయుచున్నాడు. పలుకుబడిలో నొదుగు ఒక చిన్న వాక్యమును చెప్పి పెద్ద అర్థమును స్ఫురింపజేయుట మొదలైన మహారచయిత లక్షణములు లేవు. ఒక శయ్య లేదు. వాచ్యత ఎక్కువగా ఉన్నది. శబ్దప్రయోగమునందు కూడా సొగసు కనిపించుటలేదు.” (ధర్మారావు అరుంధతి తో)

పాశ్చాత్య భారతీయ రచనా శిల్పాల పోలిక:
“పాశ్చాత్యుల శిల్పము సహారా ఎడారి లోని సికతామయోన్మత్త ప్రళయవాయువుల వలె విరుచుకుని, మానుష ప్రకృతినున్మూలించునకు ప్రయత్నించును. భారతీయ శిల్పము భారత జాతిమతధర్మముల వలెనే ఇంద్రియముల నదుపులో పెట్టి సంఘమర్యాదల ననుసరించి నడువవలెనన్నట్లు – భావోద్రేకమలినం నిర్మూలించి తదంతర్గాఢదృఢత్వమును ప్రకటించును.”

మరోచోట “శిల్పం” పై:
శిల్పం నిప్పులు తొక్కిన కోత వంటిది కాదు. మదించిన ఏనుగు వంటిది. ఉన్మాదమెక్కువ కలది. ఠీవి ఎక్కువ. నిదానమెక్కువ. శక్తి ఎక్కువ.

-ఈ రెండు అభిప్రాయాలేవో నాకర్థమయ్యాయని కాదు. ఆసక్తికరంగా అనిపించి ఇక్కడ రాస్తున్నా. అంతే.

నాకు చాలా ఆశ్చర్యం కలిగిన వ్యాఖ్య ఐతే ఇది –
“భోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్నా చెడిపోయిందా? ఇది ఏదో ఒక పేదజీవి బ్రతుకుటకుపయోగపడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు, రాక్‌ఫెల్లర్ లను బాగు చేయుచున్నది. ఏమి న్యాయము?”

– ఈ భాష లో పుస్తకం చదవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని పుస్తకాలను Timeless classics అంటాము. ఆ కోవలోకి ఇది రావడం నా ఆంచనా లో చాలా కష్టం. భాష ఓ కారణం… ఆ కథనం ఇప్పటి తరానికి చాలా అసహజంగా అనిపించే అవకాశం ఉండటం మరో కారణం. ఇంతకంటే చదివించే గుణం ఉన్న పుస్తకాలు తెలుగు లోనూ, ఇతర భాషల్లోనూ బోలెడుండటం మరో ముఖ్య కారణం. ఓ ముణ్ణాలుగు నెల్లు అయినట్లు ఉంది ఇది చదివి. ఇప్పటిక్కూడా దీన్ని తలుచుకుంటే నాలో ఒక విధమైన నిరాశ ఆవరిస్తుంది…. ఈ పుస్తకం చదివే ముందు దీనిని గురించి అదొక ఎపిక్ అని, అలాంటిది మరోటి లేదు, రాదు అన్న లెవెల్ లో విని ఉండటమే కావొచ్చు.

Published in: on August 8, 2007 at 4:17 am  Comments (18)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/08/08/veyipadagalu/trackback/

RSS feed for comments on this post.

18 CommentsLeave a comment

 1. నేణు దీన్ని బహుశా హైస్కూల్లో వున్నప్పుడు చూశాను. ఆ భాష ఒక ముక్కా అర్థం కాలేదు. ఇప్పుడైనా అవుతుందనే ఆశలేక మళ్ళీ చదవాలనే కోరికను చంపుకుంటూ వస్తున్నాను. నాకు ఇతరుల విమర్షలనుండీ అర్థం అయ్యిందేమిటంటే ఈయన తత్వం నాకు పూర్తిగా మింగుడుపడనిది.
  ఇప్పుడు మీ ఈ బ్లాగు(సమీక్ష?)ద్వారా అది మరింత దృడపడింది.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. ఒకటి కాదు రెండు ముద్రణలు కొన్నేళ్ళుగా నా షెల్ఫులో ఉన్నాయి, షెల్ఫు దగ్గిరికెళ్ళినప్పుడల్లా కొంచెం నిష్ఠూరంగా చూస్తూ ఉంటాయి. ఐనా ఇంకా వాటిని బయటికి తియ్యడానికి ధైర్యం చాలక, వాటి నిష్ఠూరపు చూపుల్ని గమనించనట్టు ఇవతలికి వచ్చేస్తుంటాను అప్పటికి పదహారో సారి చదివిన హేరీపాటర్ మూడో పుస్తకం పట్టుకుని 🙂

 3. అమ్మో పదహారోసారే!
  ఆగ్లంలో ఏది చదవాలన్నా ఏదో గుబులు నాకు. ఈ హేరీ పాటర్ కూడా తెలుగులో వస్తే బాగుణ్ణు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. ఇంటర్మీడియెట్‌లో ఉన్నప్పుడు ఒకట్రెండు నవలలు కష్టపడి పట్టుబట్టి ముగించాను. అవి తెలుగు నవలలు కావు “సంస్కృతాంధ్ర” నవలలు. ఇప్పుడు ఏమీ గుర్తురావడం లేదు… గొప్ప రచనలే కానీ, విశ్వనాథుని పాండిత్యానికి సామన్యుని భాషకు 500 పడగలైనా తేడా ఉండవచ్చు…

 5. First comments here –
  telugulo ela response istaru ?

 6. @viswanath:
  U can use lekhini.org to type in telugu…copy from there and paste it here. U can comment in telugu.

 7. విశ్వనాథవారి రచనలు దేనికిదాన్ని విడిగా చూడటంకన్న వొకరచనకి మరొకరచనకి కనీసం బీరకాయపీచుతోనన్నా ముడిపెట్టారేమోనని గమనిస్తే కొంత వెసులుబాటు దొరకవచ్చునేమో. నేనింతవరకూ విశ్వనాథవారి రచనల్లో ఆయన కల్పవృక్షంలో యేదో మూణ్ణాల్గు పద్యాలు తప్పితే జదివిన గుర్తు లేదు, అవికూడా క్ష్మా, ష్ఠా … యిల్లాంటి ప్రాసలున్న పద్యాలు. చూసి విస్తుపోవటానికి మాత్రమే తప్ప వాటిని కనీసం గుర్తుపెట్టుకునేటంత అర్హత కూడా నాకు లేదని నా గాట్ఠి నమ్మకం. లేదండోయ్, మీరు జెప్పిన విష్ణుశర్మ యింగ్లీషు చదువు కూడా చదివా నీ మధ్యనే. ఇప్పుడు మీరు వేయిపడగలపై వ్రాసిన యీ సమీక్షా వ్యాఖ్యని జదివినపిమ్మట (మీరు వ్రాసినదానిని సమీక్ష అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు) మీరు చెప్పిన వొకటీ రెండూ విషయాలపై నాకు దోచిన విషయాలు మీతో పంచుకొనే సాహసంజేస్తున్నా.

  “నేత్రేంద్రియము కన్నా శ్రవణేంద్రియము ద్వారా విద్య చెప్పిన మనసు కు పట్టును” — యిది మనవారి పూర్వకాలపు జదువులకైతే సరీగ్ఘా సరిపోతుంది. ప్రత్యేకంగా ఆలోచించి జూస్తే విశ్వనాథవారు బహుశా మన వేదవాఙ్మయం గురించి జెప్పివుంటారు అననిపించకమానలేదు నా బుద్ధికి. పుస్తకంలోనో వేరే మరోదాన్లోనో చూస్తూ చెప్పుకుంటే వేదం సరిగ్గా వంటబట్టదు, పైపెచ్చు తప్పులు కూడా దొర్లచ్చు.

  అలాగే “బుద్ధి వికసించిన తరువాత ఏ భాష అయిననూ తొందరగానే వచ్చును” — యిది విష్ణుశర్మజేత అనిపించినట్టు గుర్తు. అయినా, బుద్ధి వికసించాలంటే పెద్దవారే అవ్వాలన్న నియమమేమీ లేదుగదండీ.

  ఇక భోగంవాళ్లగురించి అంటారా, విశ్వనాథవారికి పాశ్చాత్యమేదైనా వొళ్లుమంటే. పరాయిపెంటకన్నా యింట్లోమంటే నయమని ఆయన అభిప్రాయమైయుండొచ్చని నాకనిపించింది.

  విశ్వనాథహృదయం కొంచెం కష్టతరగ్రాహ్యమని నా భావన. మీరు చెప్పినవీకాలానికి చక్కగా సరిపోతాయి, యిందులో సందేహం లేదు.

 8. @Raghava:
  “అలాగే “బుద్ధి వికసించిన తరువాత ఏ భాష అయిననూ తొందరగానే వచ్చును” — యిది విష్ణుశర్మజేత అనిపించినట్టు గుర్తు. అయినా, బుద్ధి వికసించాలంటే పెద్దవారే అవ్వాలన్న నియమమేమీ లేదుగదండీ.”
  – ఇది విష్ణుశర్మ కాదు లెండి…ధర్మారావే అన్నాడు అనుకుంటా.. వేయిపడగల్లోనే ఉంది కనుక ధర్మారావు కాకుంటే ఏ కిరీటో అని ఉంటాడు కానీ… విష్ణుశర్మ ఐతే అనలేడు కదా…. ఇక… బుద్ధి వికసించాలంటే పెద్దవారేకానక్కరలేదు..అగ్రీడ్. కానీ…ఆ డైలాగు వదిలిన సంధర్భం మాత్రం పెద్దవారిని ఉద్దేశించి అన్నది.
  “విశ్వనాథవారి రచనలు దేనికిదాన్ని విడిగా చూడటంకన్న వొకరచనకి మరొకరచనకి కనీసం బీరకాయపీచుతోనన్నా ముడిపెట్టారేమోనని గమనిస్తే కొంత వెసులుబాటు దొరకవచ్చునేమో.”
  – ఒక రచయిత రచనలు చదివితే అన్నీ చదవాలన్న నియమమేమీ లేదు కదా. ఇప్పుడు ఏదో అవకాశం ఉంది కనుక చదువుతున్నా తప్పితే నేను వరుసగా విశ్వనాథ రచనలు చదవాలని rule లేదు కదా… So..even if he had any intentions of providing links between hs novels…I am not sure, how many will read all his works, that too in this generation…and understand those LINKS which u are talking about, if there are any.

 9. HI,
  VISWANATHA – 1000 PADAGALU
  MANA TELUGU/TAMIL/HINDI CINIMA PICHI STORIES… BLACK LO KONI CHUDADAM LEDU. ANTA KANNA GHORAM KADU KADA.
  REGARDS

 10. చాలా, ఆలస్యంగా వ్యాఖ్యానిస్తున్నానేమో! ఏ రచన కైనా, దేశ, కాల, పాత్రత లని చదువరులు గుర్తెరిగినట్టయితేనె, రాసినవారి హృదయం బోధ పడుతుంది.

  విశ్వనాధవారి రచనలు ఈ తరం వారికి కొంత జటిలమే. అంతెందుకు, ఏకవీర చిత్రం చూసొచ్చిన, ఓ పల్లెటురి ఆసామిని, చిత్రం ఎలావుందని అడగ్గా “ఎన్టీవోడు కాంతారావూ అదరగొట్టీసేరు, కానీ, సినిమా తెలుగులో తీసి వుంటే ఇంకా బాగుండేదేమో” అన్నాడట.
  విశ్వనాధవారి రచనలనీ, వారి తత్త్వాన్నీ ఎరిగినవారికి మీ అభిప్రాయం – నిందాస్తుతి అనిపించకమానదు.

 11. సౌమ్యగారూ! నమస్కారం. ఒక మారు దయచేసి
  http://te.wikipedia.org/wiki/వేయిపడగలు
  చూడగలరు.

  (1) ఆయన శైలి గురించి మీ అభిప్రాయాలు అక్కడికి కాపీ చేశాను.
  (2) మీరు ఉట్టంకించిన కొన్ని వాక్యాలు కాపీ చేశాను. (టైపు చేసే పని తప్పించుకొందామని.)

  మీకు అభ్యంతరం లేదని అనుకొంటున్నాను. విశ్వనాధ వారి పురాణవైర గ్రంధమాల లోని పుస్తకాలు ప్రయత్నించండి. నేను నా 10వ తరగతి, ఇంటర్ సమయంలో చదవాను. అవి ఉత్కంఠభరితమైన డిటెక్టివ్ నవలలకు ఏమీ తీసిపోవని అప్పుడు నాకనిపించేది

 12. సుధాకరబాబు గారికి:
  వాక్యాలు కాపీ చేయడం వరకూ బానే ఉంది కానీ… ఈ బ్లాగులో రాసిన అభిప్రాయాలు నా వ్యక్తిగతమైనవి….అవి మరి వికీలో పెట్టడానికి తగినవో లేదో …నాకు అర్థం కావడంలేదు.

  పురాణవైర గ్రంథమాల -ఒకటి రెండు చదివాను…బాగుంటాయి…అఫ్కోర్సు… మళ్ళీ…నా కామెంట్లు నావి అనుకోండి…అది వేరే విషయం.

 13. వేయి పదగలు నేను చాల కాలం క్రితం చదివిన పుస్తకం. దీని పైన చాల మంది చాల కొణాల నుంచి పరిశీలించి వ్యాసాలు వ్రాసారు.

  స్థూలంగా కధాంసాన్ని పరిశీలిస్తే, కాలానుగుణం గా వచ్చే మార్పులు తదనుగుణంగా ధర్మం ఎలా క్షీనించి పొయిందన్నదే చాల సింబాలిజం గా చెప్పారనిపిస్తుంది. ధర్మా రావు తండ్రి రామ శాస్త్రి అనుకుంటా ఆయనకి చతుర్వర్ణాల నుంచి భార్యలు వారి నుండి సంతానం కూడా వుంటుంది.
  దీన్ని బహు భార్యాత్వము, కులాంతర వివాహము అనే లౌకిక ద్రుష్టి తొ చూడ గూడదు.
  పసరిక ప్రకౄతికి ప్రతీక. అలాగే వేణు గోపాల స్వామి గుళ్ళో పడగలు క్షీణించడం ధర్మచ్యుతి ని చూపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల ద్వారా సమాజం మార్పు ఎలా జరుగుతూ వస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

  ఏది ఏమైనా ఒక రచనిని గాని రచయితను గానీ అర్థం చేసుకోవాలంటే అప్పటి సామాజిక పరిస్థితులు, అతని అనుభవాలు కూడా ద్రుష్టిలో పెట్టు కొవాల్సి వుంటుందని నా అభిప్రాయం.

  విస్వనాథ వారి పుస్తకాలు మొదట చాలా భయపెట్టిస్తాయి. చదువరి ని మధ్యలోనే ఆపెసేలా చెస్తాయి. కానీ అంతర్లీనంగా స్మౄతి పథం లో గింగిరాలు తిరుగుతూ వెంటపడి మరీ ఎన్ని సంవత్సరాల తరువాతైనా చదివేలా చేస్తాయి.

  ణా ఇంటర్మీడియేట్ లో మొట్ట మొదట గా చదివిన పుస్తకం నందో రాజ భవిష్యతి. ఎన్ని సార్లు మిడిల్ డ్రాప్ చేసి వుంటానొ చెప్పలేను. చివరికి మూడు నెలల కి పూర్తయింది. తరువాత చదివిన యే పుస్తకము అంతలా ఇబ్బంది పెట్టలెదు. గుర్తున్నంత వరకు నేచదివిన కొన్ని పుస్తకాలు…
  ధూమకేతు, కడిమిచెట్టు, శర్వరి నుంది శర్వరి దాక (- ఒక 60 సంవత్సరాల కాల చక్రాన్ని ఆ మర్పులను దర్శింపచేస్తారిందులో), మాబాబు, ఎకవీర, అమ్రుతవల్లి ఇలా యెన్నొ.
  ఇంతకు ముందు ఒక మిత్రుడు చెప్పినట్లు, దొరికితే ” పులిమ్రుగ్గు ” చదవండి ఒక డిటెక్టివ్ నవల ఎందుకూ పనికి రాదనిపిస్తుంది. సముద్రపు దిబ్బ – ఇందులో మన ఇందిరా గాంధి అస్సాసినేషన్ ని పోలిన ఘట్టం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.

  చివరగానూ, అన్నిటికంటే ముందుగానూ మీ పఠనాసక్థికి, సాహిత్యాభిలాషకి అభినందనలు.

 14. కొన్నేళ్ళక్రితం ముదిగొండ వీరభద్రరావుగారు వేయిపడగల మీద రాసిన వ్యాసాలని తంగిరాల సుబ్బరావుగారు (చైతన్యకవిత) ప్రచురించారు. ముదిగొండ వారి వ్యాసం చదివాకా నాకు వేయిపడగల మీద విపరీతమైన మోజుపుట్టి వెంటనే చదివాను. ఆ వ్యాసం చదవకుండా వేయిపడగలు చదవివుంటే దానిమీద ఎంతగౌరవం వచ్చివుండేదో తెలియదు. ముదిగొండ వారి వ్యాసం చాలా విలువైనది, IMHO, దాన్ని నవలతోపాటు అనుబంధంగా ప్రచురించడం అవసరం. నా వుద్దేశ్యంలో విశ్వనాధవారు రాజరికాలు అంతమౌతూ,ఇంకా కొత్త వ్యవస్థ రూపందిద్దుకోని రోజుల్లో, రాజరికంతో పాటు కాలంలో కలిసి పోతున్న కొన్ని విలువలు కాలగర్భంలో కలసిపోతుంటే ఆ విలువల మీద అపారమైన నమ్మకం, గౌరవం వున్నవాడిగా విచారంతో ఆ క్రమాన్ని వేయిపడగలలో చాలా అద్భుతమైన ప్రతిభతో రికార్డు చేసారనిపిస్తుంది. మీరన్నట్ట ఆయన భాష కఠినమే, కొంత ఓపికపడితే గానీ దాని రుచి తెలియదు. భావపరంగా ఆయనకన్న కొంత పాతవాళైనా గురజాడా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి ఆధునికంగా అనిపిస్తారు. విశ్వనాధ దృష్టి చాలా విలక్షణమైనది. అప్పటికే ఆధునికతవల్ల పర్యవరణం మీద ఏర్పడుతున్న దుష్ప్రభావం, స్ర్రీ పురుష సంబంధాలలో అనైతికత, డబ్బు ప్రభావం పెరుగుతుండడం వంటి విషయాలు వేయిపడగల్లో సూచించారు. కవిగా యిది ఆయన దూరదృష్టిని, ఆయన బాధలో నిజాయితీనీ, గాఢతాని సూచిస్తుంది. ఆయనతో ఏకభవించకపోయినా ఆయన్ని చదవ వలసిన అవసరం వుందనీ, అందులో వేయిపడగలు, ఏకవీర చాలా ముఖ్యమైనవని అనిపిస్తుంది.

 15. @Ramana:
  అవునండీ… ఆయనతో ఏకీభవించకపోయినా ఆయన్ని చదవ వలసిన అవసరం ఉందని నేనూ అనుకుంటూ ఉంటాను. అసలు ఏదీ నచ్చినా నచ్చకున్నా ఒక్క ఆయన ప్రతిభా పాటవాలకి కలిగే ఆశ్చర్యం చాలు – ఆయన పుస్తకాలు చదవడానికి ఒక పెద్ద motivation.
  @Sasikumar: Thanks for the comments.

 16. వేయిపడగలు చదవటానికి ఒకట్రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. కానీ మనసు పీకుతూనే ఉంది చదవాలని.
  మంచి పరిచయం.

  బొల్లోజు బాబా

 17. మీ ఈ టపా ఇప్పుడే చూశాను. ఇప్పుడే వేయిపడగలు చదివేసొచ్చాను కాబట్టి.

  భలే రాశారే! అచ్చంగా మీ భావాలే నాకూ వచ్చాయి. పసిరిక, గిరిక పాత్రలు చాలా అసహజంగా ఉన్నాయి.

  ఈ నవల్లో ధర్మారావు రచయితే. రెండవపెళ్ళి ఆయన జీవితంలోనిదే. పానుగంటి వారు కరెక్ట్. నార్ల వేంకటేశ్వరరావు గారిని (అనుకుంటా) అక్కడక్కడా అన్యాపదేశంగా తిట్టారు. అల్లసాని పెద్దన ను పట్టుకుని పెద్ద పాళేగాడు అనడం అన్యాయం అని నాకనిపించింది. (పెద్ద పాళేగాడు అనేది మా జిల్లాలో ఒక తిట్టు).

 18. @Bolloju Baba : Thanks.
  @Ravi: 🙂 ఏం అనగలనండీ ఈ చిర్నవ్వు నవ్వడం తప్ప?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: