వీళ్ళందరూ ఏమయ్యారో ఇప్పుడు…..

నిన్న రాత్రి పడుకోబోతూ ఉండగా ఎందుకో గానీ, ఒక ఆలోచన వచ్చింది. గత పదేళ్ళలో ఎంత మంది క్రికెటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారో అని. పదినిముషాల్లోనే బోలెడు పేర్లు తట్టాయి. వీళ్ళ మీదే ఓ టపా రాస్తే ఎలా ఉంటుంది? అనిపించి రాస్తున్నా. ఇందులో ఒక వరుస అంటూ ఏమీ లేదు. నాకు తోచినట్లు రాస్తున్నా అంతే.

కొందరు బౌలర్లు:

ఒకానొక దశ లో టీమ్ లో కర్ణాటక నుండి బోలెడు మంది ఉండేవారు. శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, కుంబ్లే, ద్రవిడ్ వంటి వారితో పాటు దొడ్డ గణేశ్, సునీల్ జోషి, డేవిడ్ జాన్సన్ లాంటి వారు. డేవిడ్ జాన్సన్ ని వదిలేస్తే (ఆడిన రెండు టెస్టుల్లో మూడే వికెట్లు తీసాడు), సునీల్ జోషి విషయం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు. ఓ సారి దక్షిణాఫ్రికా తో అనుకుంటా – ఆరు పరుగులకే అయిదు వికెట్లు తీశాడు. అప్పుడప్పుడూ కాస్తో కూస్తో ఆడేవాడు. కానీ, స్టార్ కాదగ్గ ఆట లేదేమో మరి. దొడ్డ గణేశ్ కూడా జాన్సన్ లాగే వచ్చిన కొన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేక తరువాత అవకాశాలు రాకుండా పోయిన మనిషి లా తోస్తాడు నాకు. కేరళకు చెందిన టినూ యొహానన్ ఇలాంటివాడే మరో బౌలర్. ఓ మూడు టెస్టులు, మూడు వన్డేలూ ఆడాడు. అంతే. మళ్ళీ కనబళ్ళేదు. ఒరిస్సా బౌలర్ దేబశీష్ మొహంతీ కూడా ఇంతే. ఇతను సుమారు గా వన్డే లు ఆడినట్లే ఉన్నాడు. కానీ, ఎందుకో మరి – తెరవెనక్కి వెళ్ళిపోయాడు క్రమంగా. తమిళనాడు వాడు – లక్ష్మీపతి బాలాజీ – 2004 పాకిస్తాన్ టూర్ లో బౌలింగ్ తో బాగా పేరు తెచ్చుకున్నా కూడా గాయాల మహిమ వల్లనేమో – జట్టు లో చోటు దొరకడం లేదు. ముంబయ్ బౌలర్ నీలేశ్ కుల్కర్ణి : టెస్టుల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసి భారత క్రికెట్ చరిత్ర లో ఒక రికార్డు సృష్టించాడు. కానీ, తరువాత మరిక ఏమీ చేయకపోయే సరికి టీమ్ నుండి దూరం కాక తప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో! ఇక అభే కురువిల్లా – అరున్నర అడుగులు పైనే ఎత్తు, చూస్తే నే భయం కలిగించేంత ఆకారం – ఆ పేరు తలుచుకోగానే ఇవే గుర్తొస్తాయి ఎవరికన్నా. ఇతను కొన్నాళ్ళు ఆడాడు. కానీ, ఎందుకో, మళ్ళీ కనబళ్ళేదు. 2000 లో రిటైరై కోచ్ గా పనిచేస్తున్నాడని వికీ అంటుంది.

పంజాబ్ కు చెందిన హర్విందర్ సింగ్ ఇలాంటి వాడే మరో బౌలర్. స్పిన్నర్ ఆశిష్ కపూర్ మరో బౌలర్. రాబిన్ సింగ్ జూనియర్ కూడా పాపం ఒకటే టెస్టు ఆడి మరి కనబడక రిటైర్ కూడా అయిపోయాడు ఫస్ట్‌క్లాస్ ఆట లో నుండి. మరో ఇద్దరు కొన్నాళ్ళ పాటు ఆడిన రాజేశ్ చౌహాన్, ఇంకా ఆడే అవకాశం ఉన్న ఆశిష్ నెహ్రా. మురళీ కార్తిక్ ని కూడా చేర్చొచ్చు ఏమో. కానీ, అతను కూడా నెహ్రా లాగే..మళ్ళీ వచ్చినా వస్తాడు. సాయిరాజ్ బహుతులే – వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోలేని వాళ్ళలో ఒకడు. అమిత్ భండారీ, ఆవిష్కార్ సాల్వీ – అవకాశాలు సరిపడా దొరకని బాపతు మళ్ళీ. నిఖిల్ చోప్రా అన్న డిల్లీ స్పిన్నర్ పర్వాలేదనిపించేలానే ఆడాడు. ఎందుకు జట్టులోనుంచి వెళ్ళిపోయాడో మరి…అదే..ఎందుకు తీసేసారో మరి. తానుగా జట్టునుండి ఎందుకు వెళతాడు ఏ ఆటగాడన్నా, రిటైర్ అయితే తప్ప? టి.కుమరన్ – ఇతను కూడా వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోని బాపతే అనిపిస్తుంది. కానీ, ఇంకా ఒకటి రెండు అవకాశాలు వస్తే కుదురుకునే వాడేమో, చెప్పలేం. శరణ్‌దీప్ సింగ్ మరో బౌలర్. వీళ్ళలో స్పిన్నర్లు బహుశా హర్భజన్, కుంబ్లే ప్రభంజనం లో చోటు దక్కని స్పిన్నర్లు ఏమో. అంటే దురదృష్టవంతులు అని భావము. రాహుల్ సంఘ్వీ ఈ బౌలర్ల జాబితా కి చివరి ఎంట్ర్రీ – నాకు గుర్తు ఉన్న వారిలో.


ఓ మోస్తరు ఆల్‌రౌండర్లు:

ఆల్‌రౌన్డర్లు అనుకోగానే నాకు విజయ్ భరద్వాజ్ గుర్తుకు వస్తాడు. నాకెందుకో ఇతన్ని భారత క్రికెట్ పోగొట్టుకుందనే అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. తన తొలి సీరీస్ బాగానే ఆడాడు. కెరీర్ లో ఆడిన పది వన్డేల గణాంకాలు పర్వాలేదు. కానీ, స్టార్ ఇమేజ్ లేకపోవడం వల్లనేమో, జట్టు లో చోటు తప్పిపోయింది. తమిళ నాడు కు చెందిన హేమాంగ్ బదానీ ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ఆడి, వచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నట్లు అనిపిస్తాడు. ఒకప్పటి క్రికెటర్ హేమంత్ కనిత్కర్ కుమారుడు హ్రిషికేశ్ కనిత్కర్. ఇతను బాగా ఆడేలాగే కనిపించాడు. పాకిస్తాన్ తో ఓ మ్యాచ్ లో చివరి బంతి కి ఫోరు కొట్టి వెలుగులోకి వచ్చాడు. వచ్చినట్టే కనుమరుగయ్యాడు. మన హైదరాబాదీ నోయెల్ డేవిడ్ – అవకాశాలు రాని వారి కోవ లోకి చేరతాడు అనుకుంటా. లక్షీ రతన్ శుక్లా కూడా ఇదే కోవ కి చెందిన వాడు. అయినా ఒకటీ, రెండు మ్యాచ్ లు అంతర్జాతీయ స్థాయి లో అడ్జస్ట్ కావడానికే పడుతుంది ఏమో. మరి అవకాశమే ఓ మూడూ, నాలుగు మ్యాచ్ లలో ఇచ్చి తీసేస్తే ఒరిగేది ఏమిటో! సంజయ్ బంగార్ నా జాబితా లో చివరి వ్యక్తి. ఇతనికి అవకాశాలొచ్చాయి. కానీ, ఏవో కొన్ని ఇన్నింగ్స్ మినహా ప్రభావం చూపలేక జట్టులో చోటు పోగొట్టుకున్నాడేమో అనిపిస్తుంది.


వికెట్ కీపర్లు:

మన వాళ్ళు వికెట్ కీపర్లతో చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరన్నా చేసారో లేదో! ఎమ్.ఎస్.కె.ప్రసాద్, పార్థివ్ పటేల్, అజయ్ రాత్ర, దీప్ దాస్ గుప్త, విజయ్ దాహియా, పంకజ్ ధర్మణి, సమీర్ దిఘే – ఒకళ్ళా ఇద్దరా…ఇలా ఎందరినో ప్రయోగించి, చివరికి ధోనీ మీద ఫిక్స్ అయినట్లు ఉన్నారు ఇప్పుడు. ఈ వికెట్ కీపర్లంతా ఏమి చేస్తున్నారో ఇప్పుడు!


ఓపెనర్లు & మిగితా వారు:

ఇందులో కూడా మనవాళ్ళు సుమారు ప్రయోగాలు చేసుకున్నారు. దేవాంగ్ గాంధీ, సుజిత్ సోమసుందర్, గగన్ ఖోడా, జ్ఞానేంద్ర పాండే, అభిజిత్ కాలే వంటి వారికి అవకాశాలు సరిగా ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఖోడా – ఆడిన రెండు వన్డేల్లో నూ ఒక దానిలో ఎనబైల్లో,ఒక దానిలో నలభైల్లో పరుగులు చేసాడు. అయినా మూడో వన్డే అన్నది ఆడలేకపోయాడు. శడగోపన్ రమేశ్, శివ్ సుందర్ దాస్, ఆకాశ్ చోప్రా వంటి వారు ఓ మోస్తరుగా ఆడినా కూడా జట్టులో స్థిరంగా నిలవలేక పోయారు. విక్రం రాథోర్, రోహన్ గవాస్కర్, అమయ్ ఖురాసియా, శ్రీధరన్ శ్రీరాం, జాకబ్ మార్టిన్ వంటి వారు వచ్చిన అవకాశాలు వినియోగించుకోలేదేమో అనిపిస్తుంది. కైఫ్ సంగతి ఓ పట్టాన అర్థం కాదు నాకు. ఇంకా నా జాబితా లో ఉన్నది ఇద్దరు. ఒకరు రీతీందర్ సింగ్ సోధి. ఇతని గురించి అండర్ 18 అనుకుంటా – వాటిలో చదివి, ఇతను భారత జట్టులోకి రాగానే నేను ఇతను ఎప్పుడు బాగా ఆడతాడా అని ఎదురుచూస్తూ గడిపాను. చివరికి ఆడడు అను అర్థమయ్యేలోగా అతనే జట్టులోంచి వెళ్ళిపోయాడు. బోర్డు వారికి నాకంటే ముందే అర్థమైపోయి ఉంటుంది. 🙂 ఓహ్! వేణుగోపాల్రావు ఉన్నాడు కదూ! మర్చేపోయా! మళ్ళీ మన వేణు జట్టులోకి వస్తాడేమో, ఎవరు చెప్పగలరు?

వీళ్ళు కాక ఇంకా ఎవరన్నా ఉండొచ్చు. నేను ఒక 1997-98 కాలం నుండి ఇప్పటి దాకా వచ్చి-వెళ్ళిన వారిలో నాకు గుర్తు వచ్చిన వారి పేర్లు మాత్రమే రాసాను. ఇన్ని పేర్లు ఉండటం తో, పేజంతా వికీ లింకులతో నిండుతుందని ఏ పేరుకీ లింక్ ఇవ్వడం లేదు. ఏదో సరదాగా, రాత్రి వచ్చిన ఆలోచనకు అక్షరరూపం ఇస్తున్నా. అంతే.

Published in: on July 4, 2007 at 9:03 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/04/where-did-they-go/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. విజయ్ భరద్వాజ్ అంటే నాకు soft corner. చాలా టాలెంట్ వుండీ, స్టార్ అవ్వలేకపొయ్యాడని నా ఫీలింగ్.

    కాంబ్లి, లక్ష్మీపతి బాలాజి స్టార్స్ అయ్యాక కెరీర్ చేతులారా నాశనం చేసుకొన్నారు.

  2. Vijay Bharadwaj had the knack of taking wickets in the last overs. Also he is an excellent middle order batsman. Surely better than Md. Kaif. Had he ben there in the team, he would have been a great alrounder like Vettori. But a string of poor performances sent him out of the team. Because he is an all rounder, our selecters neglected him cooly. 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: