సినిమాల కథ

ఈ పదిహేను రోజులూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్లాసులు తప్ప తక్కిన సమయమంతా ఖాళీనే అఫీషియల్ గా. సో, ఈ IISc క్యాంపస్ ని అన్వేషిస్తూ, ఫొటోలు తీస్తూ, చక్కని చిక్కని కాఫీ ని అప్పుడప్పుడూ సేవిస్తూ, కంప్యూటర్ లో ఇలా రకరకాల టపాలు రాస్తూ సమయం గడిపాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చూశాను. కొత్తవి కావు. జనరంజక సినిమాల జాబితాలో ఉన్న సినిమాలు కొన్ని. మనం స్నేహితులతోనో,సన్నిహితులతోనో మాట్లాడేసమయం లో – “ఆ సినిమా లో ఆ పాత్ర లాగా..” అనుకుంటూ తరుచూ ఉదహరించే సినిమాల లో కొన్నింటిని గురించిన మ్యూజింగ్సే ఈ టపా. ఏమైనా నా ఉద్దేశ్యం ఈ సినిమాలను సమీక్షించడం కాదు. కొన్ని రోజుల తేడా లో చూసిన ఈ సినిమాల మీద ఆ క్షణం లో కలిగిన అభిప్రాయాలు. అంతే. బ్లాగన్నాక అప్పుడప్పుడూ ఇలాంటి టపాలు కూడా రాయాల. లేకుంటే బ్లాగుకి, ఇంకోదానికి తేడా ఏటుంటది? 🙂

మొదటగా ఏప్రిల్ ఒకటి విడుదల. రాజేంద్ర ప్రసాద్,శోభన హీరో హీరోయిన్లు. వంశీ దర్శకుడు. ఇళయరాజా సంగీతం. మంచి టైమ్ పాస్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా కి ఆధారం “హరిశ్చంద్రుడు అబద్దమాడితే” అన్న నవల. ఇక కథాంశమా – అందరికీ తెలిసే ఉంటుంది. సరదా, సీరియస్ నెస్ .. రెండూ ఉన్నాయి ఈ సినిమాలో. ఎక్కడా బోరు అనిపించలేదు. సంగీతం కూడా బాగుంది. కథ లో వెరైటీ ఉంది. రాజేంద్రప్రసాద్ ఉన్నాడు కనుక సినిమా కి మినిమమ్ గ్యారంటీ అన్న అభిప్రాయం మళ్ళీ కలిగించింది. 🙂 నేను ఈ సినిమా వచ్చినప్పుడు బాగా చిన్నదాన్ని. కాబట్టి అప్పుడు ఇది ఎలా ఆడిందో గుర్తు లేదు. కానీ, ఇప్పటికీ నచ్చుతూనే ఉంది కనుక ఇది కాలం లో కలిసిపోయే సినిమా కాదు. నిలిచే సినిమా నే అని అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ లేకుంటే మాత్రం ఇలా చెప్పగలిగే దాన్ని కాదు. ఆ టైమింగ్ ఇంకోళ్ళకి రాదు. ఎల్.బీ.శ్రీరాం మాటలు సినిమాకి హైలైట్.

రెండోది – చెట్టు కింద ప్లీడరు. ఊరికి బయలుదేరే ముందు దొరికిన ఏడెనిమిది తెలుగు సినిమాలూ ల్యాప్టాప్ లోకి ఎక్కించేసా. అప్పుడు గమనించలేదు కానీ, చూట్టం మొదలెట్టాక గమనించాను – రాజేంద్ర ప్రసాద్ సినిమాలే ఎక్కువ ఉన్నాయని. ఇది కూడా మంచి టైమ్ పాస్ సినిమా. కథాంశం లో వెరైటీ ఉంది. మళ్ళీ ఇది వంశీ-ఇళయరాజా కాంబినేషన్. ఎటొచ్చీ నాదో అనుమానం. ఇదే ఇళయరాజా వంశీ కి చేస్తే ఒకలా ఉంటాయి పాటలు. వేరే ఎవరికి చేసినా ఇంకోలా అనిపిస్తాయి. అంటే రెండూ బాగుంటాయి కానీ, ఏదో తేడా పాటల్లో. వీళ్ళిద్దరి మధ్య అదో కెమిస్ట్ర్రీ ఏమో మరి. దీనిలో కూడా సంభాషణలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ డైలాగులు. విని, వెనక్కి వెళ్ళి మళ్ళీ విని మరీ నవ్వుకున్నాను చాలా చోట్ల. రాసినది – తనికెళ్ళ భరణి. కిన్నెర ఇదొక్క చోటే అనుకుంటా కాస్త కామెడీ పాత్ర వేసినది. బాగుంది ఆమెకి ఆ పాత్ర. వీళ్ళిద్దరికి, మహంకాళి కేసు కీ మధ్య జరిగిన కథ భలే నవ్వు పుట్టించింది. ఆ మధ్య ఈ బ్లాగులో చదివిన టపా లోని “నీరుగారి పారిపోకు..” పాట మొదటిసారి ఇప్పుడు విన్నా. అప్పట్నుంచి విందాం అనుకుంటూ. బాగుంది. ముందే చెప్పినట్లు, పాటలు బాగున్నాయి. ఇందాక చెప్పినట్లు, ఇళయరాజా ది ఒక శైలి అయితే, వంశీ కి చేస్తే ఆ ఇళయరాజా ది మరో కొత్త స్టయిల్ అనిపిస్తుంది.

మూడోది – పడమటి సంధ్యా రాగం. ప్రవాసాంధ్రులు నిర్మించిన జంధ్యాల సినిమా. సంగీతం – ఎస్.పి.బాలసుబ్రమణ్యం. మాటలు రాసింది కూడా జంధ్యాలే అనుకుంటా – సినిమా మొదట్లో – “కథా రచన లో సహకరించిన ఆదివిష్ణు కి ధన్యవాదాలు” అని రాసారు కనుక ఇద్దరు కలిసి రాసి ఉంటారు. ఈ సినిమా బానే ఉంది చూట్టానికి. నేనెప్పుడు పూర్తిగా చూడలేదు. ఇదే మొదటి సారి. ఈ దెబ్బ కి ఇదేదో బ్రహ్మాండమైన సినిమా అన్న భ్రమ లు పోయాయి. కథ పరంగా నాకు చాలా చోట్ల – “ఏమిటీ కథ?” అనిపించింది. కానీ, డైలాగులు మాత్రం – అద్భుతం. పడీపడీ నవ్వుకున్నాను చాలా చోట్ల. అయిస్క్ర్రీం పార్లర్ అతని డైలాగులు, సంధ్య తండ్రి పాత్ర డైలాగులు – అన్నింటి కంటే నచ్చాయి. అతిధి నటుడు సుత్తివేలు వ్యాఖ్యానం కూడా. బాగా నవ్వుకున్న డైలాగు – సంధ్య తండ్రి “వ్యాపారం బాగా సాగుతోందా?” అని అడిగితే – బకాసురుడి వారసుడి లాంటి కొడుకును చూపుతూ అయిస్క్ర్రీమ్ షాపు ఓనర్ – “వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజు చూసారు కదా. అంచేత మేము అయిస్ క్రీములు అమ్మడం కంటే – స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తూ ఉంటామన్నమాట. అదీ మా వ్యాపారం.” అంటాడు. 🙂 బ్యాక్ గ్రౌండైనా, ఫోర్ గ్రౌండైనా రెంటిలోనూ సంగీతం బాగుంది.

తరువాతిది – మురారి. ఈ సినిమా ని కామెడీ అనలేము. కానీ, సరదా గానే ఉంటుంది సగం దాకా. అయితే, నాకు ఇందులో పెద్దగా ఏమీ నచ్చలేదు మహేశ్ బాబు నటన. మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాడు. గొంతు కూడా అంతే. లక్ష్మి నటన కొన్ని చోట్ల ఎంత సహజంగా అనిపించిందో కొన్ని చోట్ల అంత ఓవర్ యాక్షన్ లా అనిపించింది. సోనాలి బెంద్రే మాత్రం బాగుంది. ఆ పాత్ర ఆమెకి చక్కగా కుదిరింది. ఎస్.పి.శైలజ గొంతుక హీరోయిన్ కి బాగా సరిపోయింది. కథ నాకంత నచ్చకపోయినా కూడా, నటుల ప్రదర్శన కారణంగా ఇది ఒక ఎంటర్ టైనర్ అనే అనిపించింది. వీళ్ళ అందరి కాంబినేషన్ బాగా కుదిరింది. పాటలు బాగున్నాయి. ఇంతకీ సంగీతం ఎవరో తెలీదు.

నువ్వు నాకు నచ్చావ్:
దీని గురించి ఎంతని చెప్పను? ఈ కొన్నాళ్ళలోనే రెండు మూడు సార్లు చూసాను. అందులో ఓ సారి మూకీ లో చూసాను. ఎప్పుడూ బోరు కొట్టలేదు. మంచి సినిమా. త్రివిక్రం సంభాషణలు – నవ్వాగదు ఆ డైలాగులకి. ఒకరు ఇద్దరని కాదు మొత్తం అందరూ సూపర్బ్ ప్రదర్శన. వెంకటేష్ మీద నాకేం ప్రత్యేకాభిమానం లేదు కానీ, భలే చేస్తాడు ఈ తరహా సినిమాలు. మొత్తం కామెడీ కామెడీ. ప్రకాష్ రాజ్ కవిత సీను, బ్రహ్మానందం కారులో వెంకటేష్ తదితరులతో సంభాషించే సీను నాకు అన్నింటికంటే నచ్చినవి. ఈ సినిమా ని ఓ యాభై ఏళ్ళైనా జనం చూస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సునీల్ ఈ సినిమా లో “గోల” లేకుండా మామూలుగా మాట్లాడతాడు కనుక బాగుంది. మొత్తానికి ఇది ఈ తరపు క్లాసిక్ అని నా అభిప్రాయం. విజయభాస్కర్ దర్శకత్వం బాగుంది ఈ చిత్రానికి.

మల్లీశ్వరి: కొత్త సినిమా గురించి నేను చెప్పేది. పాత ది కాదు. ఇది కూడా మొత్తం కామెడీ. బోరు కొట్టదు. వెంకటేష్ కి, వాళ్ళ ఆఫీసు లో జనాలకి మధ్య సంభాషణలు, మల్లీశ్వరి వాళ్ళ ప్యాలెస్ లో బ్రహ్మానందం తో డైనింగ్ టేబుల్ వద్ద జరిగే సంభాషణా నాకు భలే నచ్చాయి. కత్రినా కైఫ్ ని మాత్రం చూడ్డం చాలా కష్టమైపోయింది. మనిషి పర్లేదు. కానీ, నవ్వుకీ, ఏడుపుకీ అదే మొహమైతే ఎలా? ఉత్తర భారద్దేశం వారు చాలా మంది వచ్చినా కూడా, కనీసం వారికి భాష తెలీకున్నా, ఎప్పుడు మొహం దిగులుగా పెట్టాలో, ఎప్పుడూ నవ్వాలో అన్నా తెలుసు. ఈవిడకి అదీ లేదు. మంచి కామెడీ ఈ సినిమా కూడా. దర్శకుడు? మాటలు?

అహనాపెళ్ళాంట:
“అయితే నీకు నా ఆటోబయాగ్రఫీ చెప్పాల్సిందే..” – ఎన్ని సార్లు ఈ సీను గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నానో. కోటా శ్రీనివాస రావు, బ్రహ్మానందాల మధ్య కామెడీ ని, నూతన్ ప్రసాద్ డైలాగులని, రాజేంద్రప్రసాద్ టైమింగ్ ని.. మొత్తంగా ఈ సినిమాలోని చాలా విషయాలు ఇష్టపడ్డాను. ఒక్క పాటలు తప్ప. అవి ఎందుకు రావాలో, వచ్చినా అలా ఎందుకు రావాలో అర్థం కాలేదు. ఏమైనా మంచి టైమ్ పాస్ సినిమా.

బృందావనం: మరో మంచి సినిమా. సింగీతం శ్రీనివాసరావు రాక్స్ :). మళ్ళీ రాజేంద్రప్రసాద్ భలే చేసాడు. అంజలీదేవి వి కొన్ని సీన్లు చాలా బాగుంటాయి. ఇక రావికొండలరావు, రాధాకుమారి ల జోడీ సరేసరి! వీళ్ళు నిజజీవితం లో వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే గొడవపడతారా అన్నంత సహజంగా ఉంటాయి తెరపై వీరి తగువులు. అన్నింటి కంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది మాధవపెద్ది సురేష్ సంగీతం, బాలు, జానకి గానం. ఈ సినిమాలో పాటలు అదో తరహా హాయిని ఇస్తాయి.

నువ్వువస్తానంటే నేనువద్దంటానా:
టైమ్ పాస్. కామెడీ కావాల్సినంత ఉంది. నాకు గుర్తుంది…ఈ సినిమా తరువాత సిద్ధార్థ్ కి ఫాన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో! ఈ సినిమా లో ఫొటోగ్రఫీ చాలా బాగుంటుంది. పాటలు కూడా బాగుంటాయి. నాకు బాగా గుర్తు ఉండిపోయిన డైలాగు – తనికెళ్ళ భరణి గీత తో ఫోను లో అంటాడు – “లవ్ అనింది. నో అన్నాను. కెవ్వ్ అనింది. ఓకే అన్నాను.” అని.

– ఇదీ నేను గత పదిహేను రోజులు చూసిన సినిమాల కథ. 🙂 కట్టె,కొట్టె,తెచ్చె అంటే ఏమిటో ఈ టపా రాస్తూ ఉంటే బాగా అర్థమైంది. 🙂

Advertisements
Published in: on May 24, 2007 at 2:00 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/05/24/on-several-movies/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. Ammaki cheptha :p

    Shud i buy a HDD to maintain a copy of such movies 😀 ?

  2. మల్లీశ్వరి(కొత్తది) దర్శకుడు మళ్ళీ విజయభాస్కరే! మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. విజయాసంస్థ చందమామ విజయా కంబైన్స్ గా పునర్జన్మ ఎత్తాక తీసిన తొలి సినిమా బృందావనం.

  3. మురారి సంగీత దర్శకుడు మణిశర్మ.ఈ సినిమాలో మహేష్ నటన అద్భుతం.ఈ సినిమా అంతా ఒక పల్లెటూరులో జగుతూ వుంటుంది.ఆ సినిమాలోని చాలా సీన్లు మనం తూర్పుగోదావరి వైపు పల్లెల్లో ఎక్కువగా చూస్తుంటాము.[క్రిష్నవంశీ కూడా అదే స్పూర్తి తో తీసాడు]ఊర్లలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్లా సుకుమారం గా గారాబం గా పెరుగుతూ అలా పిల్లల్లా మాట్లాడుతూవుంటారు.తాతల పేర్లు పెట్టడం వల్ల పెద్దవాళ్ళు కూడా “అండి”,”గారూ” అని పిలుస్తూ వుంటారు.ఇంక నువ్వు నాకు నచ్చావ్ నాకిష్టమయిన సినిమాల్లో ఇది ఒకటి.అయినా మీరు ఊరెళ్ళి చేసింది ఇదా?

  4. చాలా బాగుంది


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: