నీరాజనం

            ఈ టపా ఇప్పుడు రాస్తా అని కొన్ని నిముషాల క్రితం వరకు కూడా ఊహించలేదు. కానీ, ఈ క్షణం లో రాయాలనిపిస్తోంది. రాయకుండా ఉండటం కష్టం అనిపిస్తోంది. అందుకనే – రాసేస్తున్నా. ఇంతకీ ఇది ఎవరికో నీరాజనం కాదు. నీరాజనం సినిమా పాటల గురించి. ల్యాబ్ లో వారాంతం కదా అని తాపీ గా పాటలు వినడం మొదలుపెట్టా ఇందాకే. కాసేపటికే – “నీ వదనం..”, “మమతే మధురం”, “మనసొక మధు కలశం..” అంటూ ఆ పాటలు వస్తూ ఉంటే హం చేయడం మొదలుపెట్టాను. అది ల్యాబ్, పక్కన మనుష్యులు ఉన్నారు అన్న విషయం మరిచిపోయి 🙂 . నా ఉద్దేశ్యం లో ఒక పాట కి గానీ, ఒక ఆల్బం కి గానీ ఇంతకంటే పెద్ద కొలమానం లేదు అనుకుంటా సాధారణ listener point of view లో.

నీరాజనం 88-89 అప్పుడెప్పుడో వచ్చిన సినిమా అనుకుంటా. ఈ సినిమా ఏమిటో, అందులో ఎవరు ఉన్నారో, కథేంటో – ఇవేవీ నాకు తెలీదు. కానీ, చిన్నప్పుడు ఎప్పుడో మొదటి సారి విన్న పాటలు – ఇప్పటికీ వింటూనే ఉన్నాను. సంగీత దర్శకుడు – ఓ.పీ.నయ్యర్. బహుశా నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఇదేనేమో. ఇది అని చెప్పలేని మాయ ఏదో ఉంది ఈ సినిమా పాటల్లో. ఆ ప్రత్యేకత నయ్యర్ సంగీతం వల్లే అని నా అభిప్రాయం. “ఊహల ఊయలలో…” అంటూ జానకి, బాలు పాడినప్పుడు మనలో కూడా ఆ ఊహల్లో తేలుతున్న భావన కలుగక మానదు. ఆ పాట విన్నవారెవరైనా ఆ భావన పొందలేదంటే అది వాళ్ళలో ఆ మూడ్ లేకపోవడమే కానీ ఇంకోటి కాదు. ఆ మూడ్ లేకున్నా కూడా ఈ పాట వింటూ ఉంటే ఊహల ఊయలలో కి మనమూ వెళ్ళడం గ్యారంటీ నా అభిప్రాయం లో.

“నీ వదనం …” – అంటూ బాలూ గొంతుక వింటూ ఉంటే – మన నోటిలోంచీ కవిత్వం వచ్చేస్తుంది 🙂 . “మమతే మధురం ..”, “మనసొక మధుకలశం.” – పాటలు వింటూంటే ఆ మూడ్ లోకి మనమూ వెళ్ళక తప్పదు. They are that mesmarising. నయ్యర్ ఏమి వాయిద్యాలు ఎలా ఉపయోగిస్తారో నాకు తెలీదు కానీ – అధ్బుతమైన సంగీతాన్ని మాత్రం అందిస్తారు చివరాఖరికి. ఆయనది నేను విన్న పాటలు నీరాజనం కాక ఒకటో రెండో హిందీ పాటలు ఉంటాయి. అంతే. “యే హై బాంబే మేరీ జాన్..” అందులో ఒకటి. అయినప్పటికీ నయ్యర్ మరణించిన రోజు నేను ఎంతగా బాధ పడ్డానంటే – ఏదో సొంత మనిషి పోయిన భావన కలిగింది. “ఎద ఉంటే అది నేరమా?” అని గాయకుడు ప్రశ్నించినా … “ఎదకు, విధికి జరిగే సమరం” అంటూ బాధపడినా … ఆ గొంతుక వెనుక వచ్చే సంగీతం ఈ మాటల్ని మన హృదయపు లోతుల దాకా తీసుకెళ్తుంది.

“తొలకరి వలపొకటి .. తలపుల తొలిచినది.. గత జన్మలా అనుబంధమై…”… “పగిలే వరకే.. అది నిత్య సుందరం..”, “ఈ శూన్యం, నా గమ్యం… ఈ జన్మ కే సెలవు…”, “మదిలోని రూపం .. మొదలంట చెరిపి… మనసార ఏడ్చాను లే…”, “కనరాని ప్రాయం .. కసితీర కుదిపి.. కడుపార నవ్వాను లే..” – అంటూ ఓ గొంతు అద్భుతంగా పాడుతూంటే, ఆ గొంతుక వెనుక ఆ ప్రేమికుడి గుండెలోని ఆవేదనంతా స్వరాల్లో పలికిస్తూ ఉంటుంది నయ్యర్ ప్రతిభ. “ప్రేమ వెలసింది…” – అంటూ సంతోషాన్ని వెలిబుచ్చితే ఏకకాలం లో ఈ పాటలోని సంతోషాన్నీ, ముందు పాటలోని దుక్కాన్నీ రెంటినీ చూడగలిగాను నేను!! That is Nayyar! ఇన్ని చెప్పుకుని రెండు పాటలు మరిచిపోతే ఈ టపా కి న్యాయం జరుగదు. ఆ రెండే నాకు నీరాజనం అని ఒక సినిమా ఉందని చెప్పింది. అవి – “ఘల్లు ఘల్లు న..” మరియు “నిను చూడక నేనుండలేను..” – ఏ పాటని చెప్పను? ఏ బిట్ అని చెప్పను?

అబ్బ! ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తోంది నీరాజనం పాటల గురించి. అధ్బుతమైన సంగీతానికి ఆ గాయనీ గాయకుల గొంతుకలకి మధ్య మంచి synchronisation ఉంది. ఇంకో వందేళ్ళైనా ఈ పాటలు జనాలు వింటూనే ఉంటారు అని నా నమ్మకం. Neerajanam rox!

Advertisements
Published in: on April 21, 2007 at 9:29 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/04/21/neerajanam/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. అవునండి. నాకు కూడా నీరాజనం లోని పాటలన్నీ చాలా చాలా చాలా చాలా ……….ఇష్టం. ఓ.పి. నయ్యర్ సంగీత దర్శకత్వంలోని కాశ్మీర్ కీ కలీ లోని పాటలు కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి ఒక అద్భుతమైన సంగీత శకం ముగిసింది. జ్ఞాపకాలు మాత్రమ మిగిలే ఉంటాయి.

 2. పాటలు వినీ వినీ ఆనందించి ఎదురు చూసి, చివరికి సినిమా చూసినప్పుడు మాత్రం రోదించా (తల వాచి). మనసొక మధుకలశం పగిలేవరకే… ఆ తరువాత సినిమా జ్ఞాపకాల విరక్తికి పాటలు కూడా వినలేదు. ఈ టపా స్పూర్తితో మళ్ళీ వినగలను అనిపిస్తుంది.

 3. వారాంతం. ఒసారి ఈ పదం వాడితే, మా అమ్మ అంటే ఏమిటి అంది. అప్పటి నుండి శనాదివారాలు అంటం మొదలు పెట్టాను.
  కొలమానం. అంటే ఏంటో..

  నీరాజనం పాటలు వింటా. (వానా వానా లాగా ఉండకపోతే చాలు)

 4. ఇక పడుకుందాం అనుకున్నాను … కానీ దీనిగురించి ఒక్క నాలుగు ముక్కలు రాసాక అల్లాగే పడుకోవచ్చులే అని సమాధానపరచుకున్నా….
  మా అన్నయ్య దయ వల్ల ఈ పాటలు చాలాకాలం ముందే వినగలిగాను. ఇలాంటి పాటలు వినిపించినందులకు మా అన్నయ్యను మెచ్చుకోవాలి.
  నాకు అన్నింటికంటే బాగా నచ్చినపాట … నీ వదనం మెరిసే కమలం …నా హృదయం ఎగసే కావ్యం … ఈ రాగం ఎంత చక్కగా వుంటుదో బాలూ గారు పాడిన విధానం అంత బాగుంటుంది … నిజం చెప్పాలంటే చరణాలు చాలా చిన్నవిగా వుంటాయి … కానీ మూడు వుండడంతో కాస్త ఉపశమించింది. టోపీ తీసి కింద పడేసా (hats off) :).
  2) మనసొక మధుకలశం … ఈ పాటకొక కథ వుంది నాకు … నేను పదవతరగతి చదూతున్నపుడు పంద్రాగష్టు కి ఈ పాట పాడాను (పంద్రాగష్టు కి ఈ పాట ఏంట్రా బాబూ అనుకున్నారు కదూ … ఏమోనండి నాకప్పుడు అంతకంటే ఆలోచించే శక్తి లేదు – అంటే అసలు పాట పాడమంటారన్న సంగతి నాకు అప్పటివరకూ తెలీదు – అడగ్గానే, వచ్చిన పాట కాబట్టి పాడేసా .. అదన్నమాట సంగతి. పాట మాత్రం అద్భుతం. చరణాలు కొంచెం పై స్థాయిలో వుంటాయి.
  3) తర్వాత బాగా నచ్చిన పాట — మమతే మధురం … మంచి విరహగీతం …

  ఇలా రాస్తూపోతే ఇక రాస్తూనే వుంటా … ఎందుకంటే .. ఏదో మనప్రయత్నం మనం చేస్తాం గానీ … వాటిని వివరించేంత విషయం నా దగ్గర లెదు …

  సౌమ్య గారూ … చాలా రోజుల తర్వాత ఈ పాటలను గుర్తు చేసినందుకు చాలా సంతోషమండీ … ఇక వుంటాను … సెలవు …

  చంద్రం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: