తెలుగు వ్యాకరణం-3

ఆ మధ్య మొదలుపెట్టిన పరిచయ వ్యాసం సంధుల గురించిన చర్చతో ముగిసి, పాఠాల వైపుకి మళ్ళింది. నేను పాఠాలు మొదలుపెట్టా కానీ, సంధుల గురించి మాత్రం ఒక పట్టాన ఎటూ తేల్చుకోలేకపోయాను. ఇది విదేశీయులకోసం రూపొందించిన పుస్తకమే అనుకోండీ… కానీ, ఇలా కొన్ని రూల్సు పెట్టేసి, వాటికి పేర్లు ఏమీ ఇవ్వకుండా చెప్పుకుపోతే అయోమయంగా ఉండదా? అని నా అనుమానం. పైగా, ఈ చర్చ అయ్యాక, నాకు మళ్ళీ సందేహం – ఇక్కడ అన్నీ చెప్పారా? లేదా? అని. ఎంత చెడ్డా “నేటివ్ స్పీకర్” ని కదా. కనుక, ఈ పుస్తకంతో కొనసాగడం నా వల్లని కాదు అని వెనక్కిచ్చేసా. :(

కానీ, ఎవరన్నా తెలుగుని కంప్యూటర్ లో ప్రాసెస్ చేయడానికి టూల్ రాయాలంటే – ఉదాహరణకి…ఒక సంధి విచ్చేధన చేసే సాఫ్ట్వేర్… ఇలాంటివి చేయడానికి ఎటువంటి వ్యాకరణ పుస్తకాలు చదవాలో కాస్త సలహా ఇవ్వండి. అన్నింటికంటే మూందు – అసలు భాషా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే, ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో చెప్పి పుణ్యం కట్టుకోండి.

(నేనేదో చేసేస్తా అని కాదు. అప్పుడప్పుడు తాత్కాలిక భ్రాంతులు కలుగుతూ ఉంటాయి కదా. వాటిల్లో ఇండిక్ భ్రాంతి ఇదన్నమాట…హీహీహీ)

Published in: on December 24, 2011 at 1:50 am  Comments (2)  
Tags: ,

తెలుగు వ్యాకరణం -2

(పుస్తకం ఇంట్రో భాగం సంధి చర్చతో ముగిసింది అని చెప్పా కదా… నాకింకా ఒక పట్టాన ఆమోదయోగ్యంగా లేదు ఆ భాగం…అందువల్ల, ప్రస్తుతానికి దాన్ని ఆపి, తరువాతి పార్టుకి వెళ్ళా)

పుస్తకంలో అధికారికంగా మొదటి పాఠం అనమాట ఇపుడు.

ఇక్కడ రూల్స్ చెప్పే పద్ధతి నాకు నచ్చింది. మనకి చిన్నప్పుడు స్కూళ్ళలో ఎలా నేర్పించారో మాత్రం ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు :(

1) Nouns ending in “డు” are generally masculine.
2) The sign of accusative case is “ని”
3) Masculine names ending in “డు” form accusative as “ణ్ణి”
4) The object which follows the verb in English comes before that in Telugu
5) The subject pronoun is often omitted and indicated at the end of the verb (Eg: వచ్చాడు)
6) The verb “to be” is emitted in a verbless sentence (Eg: అతను విద్యార్థి)
7) While two words will be joined by “and” in English, in Telugu, the final words of both the vowels are lengthened (Eg: తండ్రీకొడుకూ) (నా సోది: నేనైతే ఇలాంటి అనుమానాలకి తావులేకూండా ఎంచక్కా తండ్రీ, కొడుకూ అని రాసుకుంటా..హీహీహీ)
8) Lengthening the final vowel can also mean “also” (Eg: వాడూ వచ్చేసాడు.)
9) There is no article in Telugu. “oka” can be used for a/an. But there is no equivalent of “the”.


Lesson2: Pronoun

ఇందులో ఇలా ప్రత్యేకం చెప్పుకోదగ్గ సంగతులేమీ లేవు లెండి. ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలల్లో వాడే సర్వనామాలు, వాటి మధ్య లింగ భేదాలూ వగైరా…

(ఇలా దాదాపు డెబ్భై ఐదు పాఠాలున్నాయ్. నా ధ్యాస దీన్నుండి మళ్ళిందా… చదువరులకి ఏమీ ఇబ్బందుల్లేవు. లేదా, చదువరీ, నీవు ఘటికుడవు కావలెను ;) )

Published in: on November 30, 2011 at 10:00 pm  Leave a Comment  
Tags: ,

తెలుగు వ్యాకరణం – 1, కొత్త పాఠాలు మొదలు

నాకు కోరాడ మహదేవశాస్త్రి గారి “Descriptive grammar and handbook of modern telugu” అని ఒక పుస్తకం కనిపించింది మా లైబ్రరీలో. విదేశీ తెలుగు విద్యార్థుల కోసం పాఠాల రూపంలో తెలుగు వ్యాకరణం నేర్పే పుస్తకం ఇది. ఈమధ్యే ఆయనకి సి.పి.బ్రౌన్ అవార్డు వచ్చిందని చదవడం వల్ల, ఈ పుస్తకంలో ఏముందో చూద్దాం అని మొదలుపెట్టాను. ఆ, ఎంతైనా మన భాషే కదా, పెద్ద కష్టపడనక్కర్లేదులే, అని. చదవడం మొదలుపెట్టాక, నోట్సు రాసుకుంటూ కొనసాగడం నయమేమో అనిపిస్తోంది. అందుకని న సందేహాలూ, ఇతర అభిప్రాయాలూ బ్లాగులో రాస్కుంటున్నా – ఆసక్తి ఉన్న నాబోటి వారికి పనికొస్తుందేమో అని. అలాగే, విషయ పరిజ్ఞానం ఉన్నవారు చూడ్డం, చదవడం తటస్థిస్తే, సందేహాలు తీరుస్తారన్న ఆశ.

(ఇది రాసి రెండు రోజులౌతోంది. మధ్యలో సురేశ్ కొలిచాల గారి పుణ్యమా అని కొన్ని సందేహాలు తీరాయి. వారికి ధన్యవాదాలు)

ముందుగా – ఇంట్రొడక్షన్ అధ్యాయం నుండి.

1) ఆధునిక తెలుగు పదమూడు అచ్చులు, ముప్ఫై నాలుగు హల్లులతో – మొత్తం నలభై ఏడు అక్షరాలు కలిగి ఉంది అని మొదలుపెట్టారు (అం, అః, ౠ,ఌ,ౡ,ౘ,ౙ, క్ష, ఱ – ఇవీ ఆయన చేర్చని అక్షరాలు). బహుశా – అం, అః, క్ష – అన్నవి నిజానికి రెండు అక్షరాలు అని వదిలేసారు అనుంటూనే, తక్కినవి ఉపయోగంలో లేవు కనుక తొలగించారు (నేర్చుకునే వాళ్ళ సౌలభ్యం కోసం) అనుకుంటూన్నాను.

నాకు: ౠ,ఌ,ౡ,ౘ,ౙ – ఎక్కడ ఉపయోగిస్తారు? అన్నది పక్కన పెడితే, మొదటి అక్షారాన్ని వదిలేస్తే, తక్కినవి సరిగ్గా పలకడం ఎలాగో తెలీడం లేదు. ఎవరన్నా ఎక్కడన్నా ఆడియో ఫైళ్ళు ఉంటే లంకెలిచ్చి పుణ్యం కట్టుకోండి.

ఇక, “నీఱు”, “నీరు” అంటే వేర్వేరు అర్థాలు వస్తాయనీ (మొదటిది బూడిద, రెండోది నీళ్ళు), “వేఱు”, “వేరు” కూడా వేర్వేరు అనీ (మొదటిది ‘వేరూచేయడం అనే అర్థంలో వచ్చే వేరు…రెండోది ‘కూకటి వేళ్ళతో’ సహా పెకలించే వేరు…) అని తెలిసి గుండాగిపోయింది. అర్జెంటుగా మాట్లాడేటప్పుడు రెంటి మధ్యా తేడా పలికించాలి ఇకపై అనుకున్నా…కానీ, అసలుకి పలకడంలో తేడా చూపడం తెలీదుగా. దానిక్కూడా ఒక ఆడియో .. ప్లీజ్…
(ఇక్కడ పలకడంలో తేడా తీరింది. వివరాలకి – , . ఒక ఆన్లైన్ చర్చ….దానిలో మరికొన్ని గుంపు చర్చల లంకెలు కూడా ఉన్నాయి)

2) ఈయన ప్రకారం “ఋ” ని “రు” అని పలకాలి. అప్పుడు రుషి-ఋషి, కృషి-క్రుషి ఎలా రాసుకున్నా కరెక్టేనా? లేదంటే పాపం విదేశీయులకోసం రాసింది కనుక అలా రాశారా? మరి “శ” ని “ష” లా పలకాలి అని రాయలేదే (తెలుగువాళ్ళు చాలామంది అలాగే పలుక్కుంటూ జీవించుకుంటున్నా కూడా!)

3) నాకు ఈ ఫొనెటిక్ పదజాలం అంటే మా చెడ్డ చిరాకు (నాకు రాదు కనుక!) : Velars, Palatals, Retroflexes, Dentals మరియు Labials అన్నారు వరుసగా క నుంచి త వరస దాకా వచ్చే ఐదేసి అక్షరాలనూ. ఇప్పుడవన్నీ నేను వివరించలేను కానీ, నా అనుమానం ఏమిటంటే – వీటికి సమానార్థక తెలుగు పదాలు ఏమిటి? అని.

4) ఞ, ఙ – ఈ రెండూ వత్తుల్లో కాకుండా విడిగా వచ్చే పదాలేవన్నా ఉన్నాయా??

5) ౘ,ౙ :ఉన్న పదాల గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ, నాకేమీ అర్థం కాలేదు ఎక్కడ ఏది వాడాలో. మీకెవరికన్నా తెలిస్తే చెప్పండి.

6) “థ is pronounced as ధ” అన్నారు. ఎంతైనా అలా ఎలా చెబుతారు? మనం మాట్లాడేటప్పుడు ఒకలాగా పలకం కదా??

7) అవి అటు పెడితే, ఇది చదువుతున్నప్పుడు గానీ – ప్పు అని రాసినప్పుడు మాత్రమే ఉకారం వత్తుకి వస్తుంది…తక్కిన సమయాల్లో అలా రాదు అన్న విషయం గమనించలేదు. మరెలా నేర్చుకున్నానో ఏమీటో!! :P

8 ) అయితే, కొన్నాళ్ళ బట్టి నాకు మహా ఆసక్తికరంగా అనిపించే రెండు సంగతులు ఇక్కడ గుర్తొచ్చాయ్ – మనం ఇరవై ఒకటి, ఇరవై రెండూ అంటే – హిందీలో: ఒకటి-ఇరవై, రెండు-ఇరవై అంటాం ఏమిటో! అని (అంటే,జర్మన్ లో కూడా అంతే లెండి). అలాగే, మనం అహల్య అన్నాం అనుకోండి… ల కి య వత్తు కదా ఇస్తాము? అదే హిందీలో రాస్తే… ల సగమే ఉంటుంది… య పూర్తిగా ఉంటుంది… అవనమాట నాకు మహా ఆశ్చర్యంగా అనిపించే రెండు సంగతులు. ఎందుకో? అన్నది నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.

9) ఈ అధ్యాయంలో ఒక భాగం ముగిస్తూ – ఒక సారాంశంలాగ చెబుతూ – ఞ, ఙ – రెండూ న కి Allophones కనుక, థ, ధ రెండూ ఒకేలా పలుకుతాం కనుక, ౠ నిజంగా అచ్చు కాదు కనుక, ఐ-ఔ రెంటినీ కూడా అ-య్,అ-వ్ గా విభజించవచ్చు కనుక, మొత్తానికి ఇవి తీసేసి, “ae, f” శబ్దాలను కలిపి తెలుగులో 43 శబ్దాలే అని చెప్పొచ్చని తేల్చారు. కెవ్వ్!

10) ఇక, తలకట్టులు, దీర్ఘాలు, వత్తులూ గట్రాల్లో అక్షరాల మధ్య ఉండే భేదాలను గురించి రాశారు. అర్రే, చిన్నప్పుడు ఎప్పుడూ ఇలా ఆలోచించనే లేదే! అనిపించింది. కానీ, నిజంగానే కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఇలాంటివి స్పష్టంగా చెప్పడం అవసరం అని కూడా అనిపించింది.

11) “In Telugu, double consonants occur but conjuncts are rare” అన్నారు. అది చదివాక నాకు ఆశ్చర్యం కలిగింది. సంస్కృతమో…ఇంకోటో మూలం కాని అచ్చ తెలుగు పదాల్లో “ర” లో వచ్చే “Conjuncts” వదిలేస్తే, (తండ్రి వంటివి) తక్కినవన్నీ ఏ హల్లుకు ఆ హల్లు వత్తు వచ్చే – Double Consonants ఏ అట. వీటికి తెలుగు సమానార్థకాలు ఏమీటో గానీ, ఈ Double Consonants విషయం మాత్రం మహా ఆసక్తికరంగా ఉంది. అయితే, ఏది పరభాషా పదమో కనుక్కోవచ్చా ఈ ఒక్క రూల్ తో???
(సందేహం: అలా వచ్చేవన్నీ సంస్కృత పదాలో ఇంకేవో అనుకోవాలా? “వస్తే” – అంటే తెలుగు కాదా?? మచిలీపట్నం తెలుక్కాదా?)
(ఇక్కడా కొంచెం వరకూ తీరింది – సురేశ్ గారి మాటల్లో: ద్రావిడ భాషలోని మూల పదాంశాలలో (morpheme) ద్విత్వాలే తప్ప విభిన్నమైన హల్లుల కలయికతో ఉన్న సంయుక్తాక్షరాలు ఉండవు. అయితే, ఈ morpheme లకు విభక్తులు కలిపినప్పుడు సంయుక్తాక్షరాలు వస్తాయి. వచ్చు + తే = వ-త్స్-త్స్-ఉ (చ- దంత్య చ కాబట్టి) +తే = వస్తే. ఆధునిక భాషలలో వేరే సంయుక్తాక్షరాలు కూడా కనిపిస్తాయి.)
-ఇప్పుడు కొత్త సందేహం ఏమిటంటే, ఒక పదాన్ని చూడగానే, అది సంధి వల్ల ఏర్పడ్డదా? మామూలుదా? అన్నది తెలిసే మార్గముందా?

దీని తరువాత సంధి నియమాల గురీంచిన చర్చతో ఈ అధ్యాయం ముగిసింది. ఆ సంధి నియమాల గురించి మళ్ళీ వివరంగా రాస్తాను. ఈ సందేహాలు తీర్చగలవారు తీర్చండి ప్లీజ్.

(సిగ్గులేకుండా తెలుగు వ్యాకరణం ఇంగ్లీషులో నేర్చుకుంటున్నది చాలక సందేహాలు కూడానా? అంటారా? అవునండీ… ఏం చేస్తాం… విధి ఆడే వింత నాటకంలో మనం పావులం. అది బలీయమైనది. మనం కులీనులం అయినా, కాకున్నా బలీనులం. ఈ జమీనుపై ఇంగ్లీషులో విలీనులం. ;) )

Published in: on November 21, 2011 at 7:00 am  Comments (15)  
Tags: ,
Follow

Get every new post delivered to your Inbox.

Join 68 other followers