నిన్న ఇక్కడ కొందరం స్నేహితులం కలిసి దగ్గర్లో ఉన్న Lichtenstein Castle కి వెళ్ళాము.సరిగ్గా కోట బైట ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఆ కోటని బయటనుంచి చూస్తే, చందమామలో చదివిన జానపద కథలు గుర్తొచ్చాయి.
దీనికి అర్థం ఏమిటో!
అవిన్యోన్ గోడని చుడుతున్నప్పుడు ఆ రోడ్లో ఇదొకటి కూడా కనబడ్డది. నాకు వింతగా అనిపించింది కానీ, మొత్తానికి అర్థం కాలేదు… ఎవరన్నా చెబుతారేమో అని బ్లాగులో పెడుతున్నా.
పైన రాసిన నంబర్లు బొమ్మలూ చూస్తే, 2.8 మీటర్ల పొడవు దాటి ఉన్న వాహనాలూ, 3.5 టన్నుల బరువు మించి ఉండేవీ, ఆపైన సైకిళ్ళూ ఆరోడ్లో తిరగడానికి లేదని అర్థమైంది. కానీ, ఆ వేళ్ళాడేవి ఏమిటి? ఎందుకు? అన్నది మాత్రం అర్థం కాలేదు. ఒకవేళ ఆ పొడుగు బండ్లు వస్తే వీటికి తగిలి శబ్దం రావాలనా? అని డౌట్ వచ్చింది :p. కానీ, ఆ చివ్వరికే రావాలి అనేముంది వాహనాలు? అలాగైతే ప్రతిచోటా అలాంటివి కనబడాలి కదా? ఇలా డౌట్లు మొదలయ్యాయి వెంటనే
…అదనమాట సంగతి!!
సైజ్ జీరో – ఒక సెటైరు
నేను ఒక కాన్‌ఫరెన్సు కోసమని ఫ్రాన్సులోని అవిన్యోన్ నగరానికి వచ్చాను ఆదివారం. ఈ నగరంలో ఓల్డ్ సిటీ మొత్తం ఒక గోడకి లోపల ఉంటుంది. నేను బయటనుంచి ఈ గోడ చుట్టూ నడవడం మొదలుపెట్టా. చుట్టుకొలత నాలుగు కి.మీ. లోపే అని చదివాను. దానితో అలా సాహసించాను. ఇంతకీ, పూర్తి చేసేసా. మధ్యలో ఏం జరిగింది? ఈ ఊరు కథేంటీ? ఇవన్నీ అటు పెడితే, దార్లో ఒకచోట ఈ బొమ్మ కనబడ్డది.
అదేమిటా? అనుకుంటూ ఒక ఫ్రెండుకి పంపిస్తే తను “సైజ్ జీరో నా?” అని అడిగింది. దానితో, అరే, ఈ అన్వయం ఏదో భలేగుందే! అనిపించీ, ఇక్కడ పంచుకుంటున్నా
మీమీ అభిప్రాయాలు కూడా చెప్పండి ఆ బొమ్మ గురించి
ఉల్మ్ చర్చి పైన్నుంచి ప్రపంచం ;)
కొన్ని వారాల క్రితం, నేను మా ఊరికి దగ్గర్లో ఉన్న ఉల్మ్ నగరానికి వెళ్ళాను. నా మట్టుకు నాకు అది ఐన్స్టీన్ పుట్టిన నగరంగా మాత్రమే తెలుసు కానీ, ఇక్కడికి (జర్మనీకి) వచ్చాక తెలిసింది ఏమిటంటే, ఉల్మ్ చర్చి ప్రపంచంలోకెల్లా ఎత్తైన చర్చి అని. ఇంతకీ, చర్చి గోపురం ఎత్తు 530 అడుగులు. దాని దగ్గరికి వెళ్ళడానికి 768 మెట్లు. ఇందులో మనల్ని 469 అడుగుల దాకా ఎక్కడానికి అనుమతిస్తారు (లిఫ్టు లేదు…కనీసం నాకు కనబడలేదు). విషయం ఏమిటయ్యా అంటే, మెలికలు తిరిగే మెట్లు రెండు మూడు అంతస్థులు ఎక్కడానికే కళ్ళు తిరిగినట్లు అవుతుంది నాకు. కానీ, ఈ ఆరేడొందల మెట్లూ ఎక్కి, కళ్ళుతిరక్కుండా దిగేసా! అప్పట్నుంచి అనుకుంటే ఇప్పటికి రాస్తున్నా అన్నమాట వివరం ![]()
(అప్పట్నుంచీ ఫొటోలేవీ? అని అడుగుతున్న వారందరికీ ఈ టపా అంకితం
)
ఉల్మ్ చర్చి ఇరవయ్యవ శతాబ్దికి పూర్వమే నిర్మితమైన వాటిల్లో అతి పొడవైన వాటిల్లో ఒకటిట. చర్చిగా ఇంత పెద్దది ఇంకోటి లేదట ప్రపంచంలో. నేను వెళ్ళేనాటికి ఇంకా వసంతాగమనం కాలేదు కనుక, పదకొండైనా కూడా ఇంకా పొగమంచు అలాగే ఉండింది. కనుక, నేరుగా దాని ముందొచ్చి నిలబడేదాకా నాకు రోడ్డు మీద నుంచి మసగ్గా మాత్రమే కనబడుతూ ఉండింది.
ఎదురుగ్గా నిలబడ్డాక కూడా, ఇంకా పొగమంచుల్లో దోబూచులాట కొనసాగింది. ఎక్కాలా? వద్దా? అని ఎంతసేపు ఆలోచించినా ఏమీ తేల్చలేకపోయాను. Freiburg వెళ్ళినప్పుడు ఎక్కలేక చతికిలబడ్డ సంగతి గుర్తొచ్చి భయపడ్డా కూడా.
చివరికి ఎలాగైతేనేం, పైకెళ్ళి కిందెలా ఉంటుందో చూడాలన్న తాపత్రేయం ఆపుకోలేకపోయాను. అందునా, వోల్గా నది తరువాత ఐరోపా ఖండంలో రెండవ అతి పెద్ద నది అయిన డాన్యూబె (Danube) నది తీరన ఉందీ ఊరు. అది ఇక్కడ నుండి ఉక్రెయిన్ దాకా ప్రవహిస్తుందన్న విషయం ఊహించుకుంటేనే నాకు గుండె దడ పుట్టేసింది
అలాంటి నదిని పైకెక్కి చూస్తే నా సామి రంగా… అని మనసు వెర్రి ఉత్సాహాన్ని ప్రదర్శించడంతో తప్పలేదిక ఎక్కడం. నిజానికి నేను ఇక్కడివారితో పోలిస్తే కష్టపడి ఎక్కినట్లే లెక్క కానీ, ఆ సమయంలో నాకు బాగా పైకి వెళ్ళాక కానీ దార్లో ఎవరూ కనబళ్ళేదు. ముప్పావు గంటేమో పట్టినట్లు ఉంది ఎక్కేందుకు. కొంతసేపు ఎక్కాక, కిందకి తొంగిచూస్తే, ఇదిగో, పక్కనే ఉన్న రెండు చర్చి స్తంబాలు నేనున్న ఎత్తుకి సమాంతరంగా కనబడ్డాయ్ .. మనసు శాంతించింది.. చర్చి ఎత్తుకు ఎదిగినందుకు
సరే, వీటి సంగతి అటుపెడితే, రెండు వింత ఆకారపు బొమ్మలు మాత్రం చాలా ఆసక్తి కరంగా అనిపించాయి.
ఈ రెండోది మాత్రం Dragon Gargoyle బొమ్మ అని ఇంటర్నెట్లో వెదికితే తెలిసింది.
పైదాకా ఎక్కేసాక, చివరి అంకం ఎక్కడానికి ఇప్పటిదాకా ఉన్నదానికంటే ఇరుకైన మెట్లున్నాయి. అందులో కాస్త లావుగా ఉంటే ఒక్క మనిషి వెళ్ళడం కూడా కష్టమే. అవి కూడా ఎక్కేసి,ఇంక మనుల్షుల్ని ఎక్కనివ్వరు అని తేలేంత దాకా ఎక్కి, కిందై చూస్తే ఏముందీ? ఈ పొగమంచు అలాగే కొనసాగుతోంది కనుక, నేనూహించినంత అపురూప దృశ్యం కనబడలేదు నాకు
సరే, ఎక్కాక దిగడం అంత ఈజీ పని ఉండదు కనుక, కాసేపు అలా ఆ మసగ వెలుగుల్లోనే కిందకి చూస్తూ ఆనందించి, మధ్యలో ఇంతసేపైనా ఒక్కళ్ళూ పైకి రారేంటీ? అని భయపడి
మొత్తానికి కిందకి దిగేసా.
అటు పిమ్మట Museum of bread culture అని ఒకదానికి వెళ్ళా. బ్రెడ్ చరిత్రా, బేకింగ్ చరిత్రా…గురించి నిర్మితమైన మ్యూజియం ఇది. మ్యూజియంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నవి కానీ, ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేదు అనిపించింది నాకైతే. అలాగ, ఊర్లో ఇతరత్రా చూడదగ్గ ప్రదేశాలు రౌండేసి, నదీ తీరాన కాసేపు నడిచి, ఐన్స్టీన్ ఇంటిని మాత్రం కన్వీనియంట్ గా మిస్సయి, ట్రెయిన్ ఎక్కాక అర్థమైంది. నేను రెండు ట్రెయిన్లు మారినా మా ఊరికి రెండుగంటల్లో చేరుకుంటా కానీ, ఈ ట్రెయిన్లో నేరుగా మా ఊళ్ళోనే దిగే సౌకర్యం ఉన్నప్పటికీ మూడున్నర గంటల ప్రయాణం అని! ఈ ఏడాది కాలంలో ఎన్నడూ చూడని పల్లెలూ అవీ చూసుకుంటూ, ప్రతి పది నిముషాలకీ ఏదో ఒక స్టేషన్లో ఆగుకుంటూ, ఏదో ఒకలా డస్సిపోయి ఇల్లు చేరుకున్నా ఆఖరుకి ఆరోజు!
Freiburg Trip, July 2011
(గత ఏడాది జులైలో మా ఊరికి దగ్గరలోని ఫ్రైబుర్గ్ నగరానికి వెళ్లాను స్నేహితులతో. అప్పట్లో రాసుకున్న వ్యాసం ఇది. ఒక స్నేహితుడు తన కేరళ పర్యటన గురించి ఒక పెద్ద ఉత్తరం పంపడంతో, ఇది గుర్తొచ్చి, ఇన్నాళ్టికి దీనికి మోక్షం లభిస్తోంది!)
***************
ఫ్రైబుర్గ్ (Freiburg im Breisgau) జర్మనీలోని బాడెన్-వూర్టెంబర్గ్ రాష్ట్రంలో ఒక నగరం. ఇక్కడి విశ్వవిద్యాలయం జర్మనీలోని అతి పాత విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఆ విషయం తప్పిస్తే, మరేదీ తెలీదు ఇక్కడికి వెళ్ళాలని అనుకునేదాకా. ఫ్రఖ్యాతి చెందిన “బ్లాక్ ఫారెస్ట్” కి పశ్చిమ సరిహద్దు ఈ ఊరు. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటి అని వెదికితే – ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం, బాగా పేరున్న ఒక పాత చర్చి, మంచి జీవన ప్రమాణాలూ వగైరా : అని చెప్పింది వికీపీడియా మాకు. మా ఊరి నుంచి ఒకరోజులో వెళ్ళి వచ్చేసేంత దూరమే కనుక, నలుగురం స్నేహితులం బయలుదేరాము. దారి పొడుగుతా అడవి-లోయల అందాలు కనువిందు చేస్తూ ఉంటే, రెండు మూడు ట్రైనులు మారుతూ చేసిన మా ప్రయాణంలో సగం సమయం “హే, సీ దిస్ సైడ్”, “నో, కం దిస్ సైడ్” అనుకుంటూ ఒకరికి కనిపిస్తున్న దృశ్యం మిగితా అందరికీ చూపించాలనుకుంటూ సాగిపోయింది. ఈ కొద్ది నెలల్లో మొత్తం కలిపి తిరిగిన రూట్లు ఒక ఎత్తు. ఈట్రెయిన్ రూటు మాత్రం ఒక ఎత్తు!
ఫ్రైబుర్గ్ లో ట్రెయిన్ దిగగానే, టూరిస్ట్ సమాచారం వారి ఆఫీసు వెదుకుతూ బయలుదేరాము. ఆ దారిలో “కన్ఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్” అని చూసి ఆశ్చర్యపోయి ఇంకా తేరుకోకముందే, అక్కడొక మ్యూజియం కనిపించింది. ఏమిటా? అని లోపలికెళ్తే అది ఇక్కడి “కార్నివాల్ మ్యూజియం” అని తెలిసింది. రకరకాల బొమ్మల్తో చూడముచ్చటగా ఉంది కానీ, మేము అక్కడ ఉండేది ఐదున్నర గంటలే అన్న స్పౄహ మాకుంది కనుక, ముందుకు సాగిపోయాము. టూరిస్టు ఆఫీసులో ఒక మ్యాపు తీసుకుంటే, అందులో, ఆ ఆఫీసు వద్ద మొదలుపెట్టి, నడుస్తూ ఫ్రైబుర్గ్ లో ముఖ్యమైనవి చూస్కుని, మళ్ళీ అక్కడికే చేరే విధంగా తయారుచేసిన ఒక ప్లాన్ ఉంది. దానిని చూస్కుంటూ తిరగడం మొదలుపెట్టాము. (ఇలాంటి ప్లానుల వల్ల ఇలాంటి ఊర్లు తిరగడానికి చాలా సౌలభ్యం ఉంది.).
మొదట ఇక్కడి రాత్‌హౌస్ (టౌన్ హాలు) నుంచి మొదలుపెట్టాము. ఇక్కడ కొత్త-టవున్ హాలు, పాత టవున్ హాలూ పక్క పక్కనే ఉన్నాయి. ఇదివరలో వెళ్ళిన జర్మన్ నగరాల్లో ఇలా రెండు, అదీ పక్క పక్కనే చూసిన దాఖలాల్లేవు నాకు. అక్కడే ఒక పాత చర్చి కూడానూ. అక్కడి నుంచి మున్స్టర్ ప్లాట్జ్ అనే కూడలికి వెళ్ళేదారిలో చాలా మట్టుకు పాత భవనాలు ఉన్నాయి. కొన్నింటిపైనైతే 1430, 1460 ఇలా సంవత్సరాల పేర్లు కూడా చెక్కి ఉన్నాయి. అయితే, అన్నీ అధునికీకరించారు అనుకుంటాను. అది ఇక్కడి బజారు వీథిలా ఉంది. ఆ సందడి దాటుకుని “మున్స్టర్ ప్లాట్జ్” చేరుకున్నాము. ఇక్కడ ఎప్పుడో 1200 లో కట్టిన పెద్ద క్రైస్తవ దేవాలయం ఉంది. దాని ప్రాంగణంలోనే మాకొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
మేము వెళ్ళిన రోజు అక్కడ – ఫ్రైబుర్గ్ సైన్స్ పండుగ జరుగుతోంది. అది కాక ఆ చర్చి ఉన్న కూడలిలో సంత జరుగుతోంది. ఒకవైపు సైన్సు సంత, ఒక వైపు బ్రతుకు సంత… మరో పక్క, వేదికపై పాటలు పాడుతున్న గాయకులు, రకరకాల వాయిద్యాలతో సంగీత కళాకారుల బృందం. – ఇలా ఆ ప్రాంతంలో జీవకళ ఉట్టిపడుతూ ఉండింది. చర్చి చాలా పెద్దది. లోపల నుంచి మెలికలు తిరిగే మెట్లెక్కుతూ పై దాకా వెళ్తే, నగరం మొత్తం కనిపిస్తుంది. నేను మొత్తం ఎక్కలేదు కానీ, ఎక్కిన మేర నుండి, కింద చీమల్లా కనిపిస్తున్న మనుషుల్ని, వాళ్ళ పక్కన ఆజానుబాహువుల్లా నిలబడ్డ భవనాల్నీ మాత్రం చూశాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ చుట్టుపక్కల దాడులు జరిగి, చాలా భవనాలు దెబ్బతిన్నా కూడా తట్టుకుని నిలబడ్డదంట ఈ చర్చి. అసలు లోపలి నిర్మాణం కూడా, ఏ చరిత్రా తెలియకపోయినా, క్రైస్తవ నిర్మాణాల గురించి అవగాహన లేకపోయినా, అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. అంత బాగుంది.
సైన్సు పండుగ – ఆ ప్రాంతంలోనే నాలుగైదు టెంట్లలో, విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ శాఖలవారు స్టాల్స్ పెట్టి నిర్వహించారు. నాకు స్కూలు రోజుల్లో జరిగే జిల్లా-రాష్ట్ర స్థాయి సైన్సు ఫేర్లు గుర్తొచ్చాయి. ఏటా నా పాత యూనివర్సిటీలో అక్కడ ఆ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల ఫలితాలను ప్రదర్శిస్తూ నిర్వహించే కార్యక్రమం కూడా గుర్తు వచ్చింది. బయటకి వస్తే, అక్కడ జనాల ఉత్సాహం సంగతి ఎలాగో చెప్పనక్కర్లేదు. అంతా కోలాహలంగా ఉండింది. సైన్సు పండుగతో కూడా తక్కిన వాటిని ఇలా కలిపేసి సరదాగా చేసుకుంటారని ఇప్పుడే తెలిసింది.
ఈ కూడలిలోనే ఒక పాత “కాఫ్‌హౌస్” కూడా ఉంది. అక్కడ పదహారో శతాబ్దం కాలం నుండీ వ్యాపార, వాణిజ్య లావాదేవీలెన్నో జరిగేవట. అలాగే, పక్కనే మరో భవనం -వైన్ తయారీకి కొని వందల ఏళ్ళుగా పేరొందినదట. ఇలా, ప్రతి భవనానికీ, ఏదో ఒక చరిత్ర రాసి పెట్టారిక్కడ. (కావాలని అనుకోకపోయినా, నెల్లూరులో అనుకోకుండా, తిక్కన గారి ఇల్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కనబడ్డం గుర్తొచ్చింది. వీళ్ళు చూస్తే, మామూలు వాటికి కూడా చారిత్రక విలువ తెప్పిస్తున్నారిక్కడ!!) ఇక్కడినుండి, పాతకాలం నాటి నగర ముఖ ద్వారాల్లో ఒకటైన “ష్వాబెన్ టోర్” చూట్టానికి బయలుదేరాము. దారిలో, మొదట ఇండియన్ షాప్ అని ఒకటి కనబడేసరికి ఉత్సాహపడి చూస్తే, అది ఉత్తర అమెరికాకు చెందిన నేటివ్ ఇండియన్లకు సంబంధించినదని అర్థమైంది. కానీ, రెండడుగులు వేశామో లేదో, “మహాత్మా గాంధీ” అని ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. రెస్టారెంటుకు గాంధీ అన్న పేరు ఏమిటో! అనుకున్నాను. పేరు పెట్టుకున్నా ఒకరకం కానీ, బయట తగిలించి ఉన్న మెనూ చూసాను. బీరు, వైన్ విస్కీ ఇత్యాది సమస్త పానీయాలనూ మహాత్ముడి పేరుతో అమ్మడం మాత్రం కాస్త విడ్డూరంగా అనిపించింది (జై మాతా వైన్స్ అన్నట్లు!).
ఇక్కడ నుంచి ష్వేబెన్ టోర్ చేరే వీథులు ఎన్నో వందల ఏళ్ళ నాటి నుంచీ ఉన్నవట. అక్కడ “ష్వేబెన్ టోర్” (Schwaben Tor) అన్న ఒకప్పటి ముఖ ద్వారం చేరుకున్నాక, “జుం రోటెన్ బేరెన్” అని ఒక హోటెల్ కనబడ్డది. బోలెడు హోటెళ్ళలో అదొకటి అనుకోవడానికి లేదు. దానికో పెద్ద చరిత్ర ఉంది. అది ఏడొందల సంవత్సరాల నాటిదట. జర్మనీ దేశంలో అన్నింటికంటే పాత హోటెలట! ఇలాంటి విషయాలు కూడా ఎలా సేకరించి, పర్యాటకులకు తెలిసేలా చేస్తారో కదా! అని ఆశ్చర్యపోయాను.

అక్కడినుంచి మా తదుపరి మజిలీ నగరానికి ఒకప్పుడున్న మరో ముఖద్వారం – మార్టిన్స్ టోర్ చూడ్డం. దారిలో పాతకాలంలో ఒక్కప్పటి చర్మకారుల, జాలరి వాళ్ళ ఇళ్ళు ఉండే ప్రాంతాల మీదుగా నడుస్తూ, ఒకప్పటి మార్టిన్స్ టోర్ వద్దకు చేరుకున్నాము. అక్కడ నుంచి రెణ్ణిమిషాలు నడవగానే, యూనివర్సిటీ భవనాలు కనిపించాయి. ఇక్కడ విశ్వవిద్యాలయం 1457లో స్థాపించారు. అలాగే మ్యాపు చెప్పింది వింటూ, ఈ వీథుల గుండా వెళ్ళి, ఒకప్పటి సినగాగ్ కూడలి చేరుకుని, అక్కడ ఇక్కడి “సిటీ థియేటర్” అనబడు నాటక ప్రదర్శనా శాలను చూసి (అన్నట్లు ఆ భవనం పై, “హార్ట్ ఆఫ్ ది సిటీ” అని చెక్కి ఉంది), మ్యాపులో చెప్పిన “ష్వార్జెస్ క్లోస్టర్” (అంటే బ్లాక్ మొనాస్టరీ అని అర్థమట) ని వెదుకుతూ బయలుదెరాము. విచిత్రం ఏమిటంటే, అసలు ఎక్కడా దానికి సంబంధించిన గుర్తులు లేవు. మ్యాపు చూస్తే, మేము వచ్చిన దారి సరైనదే అంటుంది.
చివరకు అర్థం కాక, దారిలో వెళ్తున్న అమ్మాయిలను అడిగాము. వాళ్ళు మ్యాపును రకరకాలుగా తిప్పి చూసి, పేరు నాలుగైదు సార్లు చదివాక… చివరకి వాళ్ళల్లో ఒకామె “అయాం సారీ. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము కానీ, నిజంగా ఇదెప్పుడూ వినలేదు. క్షమించండి” అన్నది. సరేలే, దీనిసంగతి వదిలేద్దాం అనుకుని, అవతల వైపు కనిపిస్తున్న “కొలంబీ పార్కు- భవనం” వైపుకి తిరిగాము. ఇంతలో, అదిగో, అటుపక్క చిన్న గల్లీలో ఏమన్నా ఉండొచ్చు, చూద్దాం అని మాలో ఒకరు అంటేనూ, మళ్ళీ రోడ్డు దాటి, ఈ బ్లాక్ మొనాస్టరీ వేటలో ఒక పది నిముషాలు తిరిగి, నడుస్తూ ఉంటే “కంఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్” భవనం వెనుక భాగం కనిపించింది. మధ్యాహ్నం ఎక్కడ నుంచైతే మొదలుపెట్టామో, దానికి సమాంతరంగా ఉన్న వీథిలో నడుస్తున్నాము అని అర్థమైంది. ఇంతలో, మళ్ళీ మెయిన్ రోడ్డుకి (ఎక్కడైతే ఆ అమ్మాయిలను దారి అడిగామో అక్కడికి) వచ్చేస్తాం అనగా, యధాలాపంగా తల తిప్పితే, “ఉర్సులినెన్ క్లోస్టర్” అన్న పేరు ఉన్న భవనం. ఇంతసేపూ వెదుకుతున్న బ్లాక్ మొనాస్టరీ కి మరో పేరది! దాని కథాకమామిషూ ఏమిటన్నది ఇంకా అర్థం కాలేదు నాకసలు!!
ఆ సరికి, మా ఐదున్నర గంటలూ దాదాపుగా అయిపోయాయి. ఇంకాసేపట్లో ట్రెయినెక్కాలి. దానితో, నా స్నేహ బృందం కొలంబీ తోటలో తిరుగుతూ ఉంటే, నేను ప్రస్తుతం ఆ ఊర్లో ఉన్న నా కాలేజీ రోజుల నాటి స్నేహితురాలిని రైల్వే స్టేషన్ లో కలిసాను.
మొత్తానికి ఊరు పెద్దదే అయ్యుండొచ్చు కానీ, పర్యాటక ఆకర్షణలన్నీ రైల్వే స్టేషన్ చుట్టుపక్కలే ఉండటంతో, ఉన్న సమయం తక్కువైనా బానే తిరిగినట్లు లెక్క. ఊరు చాలా సందడిగా ఉంది. ఎక్కడికక్కడ కనిపించే పిల్లకాలువలూ, కూడళ్ళలో కనిపించే అందమైన విగ్రహాలూ (రెండూ మా ఊర్లో పెద్దగా లేవు!) నాకు నచ్చాయి. ఊళ్ళో మంచి మ్యూజియంలు చాలానే ఉన్నాయి కానీ, ఐదున్నర గంటల్లో అన్నీ చూసేయాలి అనుకోవడం అత్యాశ కదా. అలాగా ముగిసింది మా ప్రయాణం.
వింతగా కనిపిస్తున్న ఈ విగ్రహంతో ఈ టపా ముగిస్తున్నాను
చెక్కుడు చీస్, రెండు చెక్కుళ్ళ ఆలూ (ప్రాగోగులు-4)
ఇవ్వాళ్టికి ప్రాగ్ చేరి ఎనిమిదో (ఆఖరు) రోజు. పనులన్నీ అయిపోయాయి కనుక, తీరిగ్గా కూర్చుని ఏం తిన్నా ఇక్కడ? అని ఆలోచించడం మొదలుపెట్టాను. రెండు రోజులుగా మాలో రికరింగ్ జోక్ ఏమిటంటే – చెక్ రెస్టారెంట్ కి వెళ్ళి వెజిటేరియన్ అంటే చాలు – పొటాటో ఫ్రైస్, ఫ్రైడ్ చీస్ … మన ముందు ఉంటాయి అని.
రాత్రి భోజనానికి ఎవరిష్టం వారిది కానీ, సాధారణంగా మధ్యాహ్నాలు వింటర్ స్కూల్లో అందరితో కలిసి అక్కడే తినాల్సి వస్తుంది (వెళ్ళే వాళ్ళు అప్పుడు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, కానీ, ఏదో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చని నేను వెళ్ళలేదు). అయితే, మొదటి రోజు – ఏదో పెట్టారు. అది బాగుండింది. నాకు చాలా రుచిగా కూడా అనిపించింది. బహుశా, వెజిటబుల్ రైస్ తరహాలో వండినందుకేమో. దానితో లంచ్ తర్వాత బయటకు వచ్చాక నన్ను అక్కడ చదువుకుంటున్న ఒకతను “వెజిటేరియన్ ఫుడ్ ఎలా ఉంది?” అని అడిగితే.. “వండర్ఫుల్. భలే ఉంది. నేను ఇంత రుచిగా ఉంటుందని ఊహించలేదు” అని చెప్పుకుపోతూ ఉంటే, ఆశ్చర్యంతో అతను “నిజమా! చెక్ వెజిటేరియన్ ఫుడ్ బాగుంది అని ఇదే వినడం. చూద్దాం ఈ వారం ముగిసేసరికి ఏమంటావో!” అన్నాడు. అర్రెర్రె! ఎంత దార్శనికుడు! అనిపిస్తోంది ఇప్పుడు అతన్ని తల్చుకుంటే
)
సరే, తరువాత నుండి మళ్ళీ శుక్రవారం దాకా … రోజూ ఫ్రైడ్ చీస్, పొటాటో ఫ్రైస్… రెంటిలో ఏదో ఒక్కటైనా (లేకపోతే రెండూ) తప్పనిసరి మా లంచ్ లో. అది తప్ప తినేదానికి ఏదీ ఉండదు అక్కడ. నాకేమో ఆ రెండింటిపై రోజూ ఆబగా తినేసేంత మమకారం లేదు. అన్నింటికంటే ఘోరం ఏమిటంటే, ఒకరోజు గ్రూప్ డిన్నర్ అనమాట. అది ముగిసిన తరువాత – అది నచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే – అక్కడ బీరూ, వైనూ ఏరులై పారింది కనుక, ఆ ఏరులో ఈతకొట్టిన వారూ, పంది మాంసాన్ని బాగా ఇష్టపడి తినేవారూనూ! మరి ఆ రెండు కోవల్లోకి చెందని నాలాంటి వాళ్ళకి (నేనూ, ఇంకో బ్రీటీష్ అమ్మాయీ) మా పరమాద్భుతమైన “ఫ్రైడ్ చీజ్, ఆలూ ఫ్రైస్” వండి వేయించి పెట్టారన్నమాట
). ఆ విధంగా… నాకు కావాల్సింది మాత్రమే తీసుకుని, అది తిని…ఏదీ మిగిలించి పారేయని చరిత్ర గల నేను.. ఇలాగ రోజూ ఆలూ, చీస్ తినలేక ప్రాగ్లో పెట్టుకున్న తిండి వదిలేయడం నేర్చుకోవాల్సి వచ్చింది.
అయితే, ఇది చూసి ప్రాగ్ లో శాకాహారులకి దిక్కులేదు అనుకోనక్కర్లేదు. బోలెడు ఇతర ఆప్షన్లు ఉన్నాయి. కనీసం మేము ఉన్న ఏరియాలో బోలెడు రకరకాల ఇతర జాతీయ రెస్టారెంట్లు ఉన్నాయి… ఇస్కాన్ వారి ఇండియన్ కాక..నిజం ఇండియన్ వి కూడా ఉన్నాయి (నేను వెళ్ళలేదు కానీ, బాగుంటాయని చెప్పారు ఇక్కడ). మేము ఇలా రోజూ రాత్రుళ్ళు రోడ్డున పడేవాళ్ళం కనుక, ఒక్క గ్రూప్ డిన్నర్ అప్పుడు తక్క, మిగితా అన్ని రోజులూ పది నిముషాల నడకలో చక్కటి శాకాహారం దొరికేది (అంటే, సరిగ్గా మన టైపులో ఉండేవే కావాలి అంటే కష్టం కానీ, శాకాహారం అయితే చాలు అన్న పరిమితి మాత్రమే ఉంటే దొరికేస్తుంది అని భావము) వీటన్నింటికంటే నాకు తెగ నచ్చేసినవి – బేకరీలు/మినీ మార్కెట్లూ..వాటిలోని బ్రెడ్డు/బిస్కట్/కేక్ వెరైటీలు. నేను “ఫుడ్ టూరిజం” లో నేను మహా మురిసిపోయిన సందర్భాలూ వీట్ల్లో ఉన్నప్పుడే
ఇంక, చాలా చోట్ల సలాడ్లు కూడా ఉన్నట్లే ఉన్నాయి. ఒకరోజు ఒక వందేళ్ళ నాటి రెస్టారెంటుకు వెళ్ళాము. అక్కడికి ఒకప్పుడు ఐన్స్టీన్, కాఫ్కా వంటి వారు వచ్చేవారట (అయినా కూడా, అది మామూలు రెస్టారెంటు…చాలా మామూలు ధరలు. నాలుగు యూరోల్లో నేను ఎంచక్కా బ్రెడ్డు, వెజిటెబుల్ సలాడ్ తిని, ఆ చలికి హాట్ చాక్లెట్ కూడా సేవించేసా! మా ఊళ్ళో అయితే దాదాపు అసాధ్యం. ఇక ఇలా గొప్పోళ్ళు వచ్చారన్న పేరున్న రెస్టారెంటైతే మరీ అసాధ్యం!). అక్కడ శాకాహారులకి కొద్దో గొప్పో చాయిస్ ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన అంశం
అసలుకి నా సలహా ఏమిటంటే – ప్రాగ్ వెళ్ళే శాకాహారులూ, బహుపరాక్…. అనేంత దృశ్యం లేదు… ఎంచక్కా అన్నీ దొరుకుతాయి కాసేపు అటూ ఇటూ నడిస్తే. కానీ, పొరపాట్న కూడా చెక్ రెస్టారెంట్లకు వెళ్ళకండి. వెళ్ళిన ప్రతిచోట లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అనుకోడంలో తప్పు లేదు కానీ, లేని ఫుడ్డు ఎక్కణ్ణుంచి తింటాం చెప్పండీ??
చివరి రోజు (అంటే నిన్న) మొత్తం అయిపోయాక అందరూ ఎంచక్కా రాత్రి చెక్ రెస్టారెంటుకి వెళ్ళి గులాష్ (అదో రకం మాంసాహారం. బీఫ్/పోర్క్ ఏదో వాడతారు. నాకు వివరాలు తెలీవు) తింటూ బీర్ సేవిద్దాం అని తీర్మానించారు. నేను తిరగబడ్డా
నా వల్ల కాదు ఆ చీజ్, పొటాటో తినడం. నేను ఇంకెక్కడికన్నా..ఏ సబ్వేకో, ఫలాఫెల్ షాపుకో పోతాను అన్నా… ఏ బేకరికో వెళ్ళినా ఆ చెక్ రెస్టారెంటులకంటే పావు ఖర్చుతో నచ్చింది తినొచ్చు…అనుకున్నా మనసులో! ఇంతలో, నా కొలీగ్ చైనీస్ అబ్బాయి కూడా తిరగబడి – నాకు చిరాగ్గా ఉంది ఈ సెంట్రల్ యూరోపియన్ ఫుడ్ తో…నేను చైనీస్ రెస్టారెంటుకి వెళ్ళి చూస్తా ఎలా ఉంటుందో! అన్నాడు. హమ్మయ్యా! అయాం నాట్ అలోన్… అనుకుని, టాటా చెప్పేసా. సరే, అలా వెళ్ళబోతూ ఉండగా, ఇతను అన్నాడు – “చైనీస్ రెస్టారెంట్లలో విజిటేరియన్ డిషెస్ రెండు మూడు ఎలాగో ఉంటాయి.. నీకు పర్లేదు అంటే నాతో పాటు రావచ్చు” అని. గతంలో వివిధ దేశాల్లో (అంటే- నార్వే, క్రొయేషియా మరియు డెన్మార్క్) నాకు శాకాహారం దొరకడంలో సాయం చేసాడు కనుక, ఇతన్ని నేను నమ్మాను
అలా ఇద్దరం కలిసి ఒక చైనీస్ రెస్టారెంటుకు వెళ్ళాము. అప్పుడే కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.
ఆ రెస్టారెంటుకు వెళ్ళే దారిలో ఆ అబ్బాయిని – “అయితే, ఇంటి ఫుడ్ మీద దారి మళ్ళిందా?” అని అడిగాను. దానికి అతని జవాబులో నాకు బోలెడు జ్ఞానోదయం అయ్యింది. “లేదు. ఇలా ఊరికే రకరకాల మాంసాలు ఉత్తవి తినాలంటే విసుగ్గా ఉంది. చైనాలో కూడా రకరకాల మంసం తింటాం కానీ, వాటితో పాటు అన్నమో, నూడుల్సో ఇలా ఏదో ఒకటి ఉంటుంది.” అన్నాడు. నేను “ఓహో” అనెంతలోనే…”అసలు వీళ్ళకి వెజిటేరియన్ అంటే సలాడ్లు, చీస్ ఫ్రై మాత్రమే ఎందుకో నాకు అర్థం కాదు. చైనాలో అయితే వెజిటేరియన్ కి కూడా చాలా చాయిస్ ఉంటుంది” అన్నాడు. నేను అవాక్కయ్యాను. చైనాలో వెజిటేరియనా? అని. అదే అతన్ని అడిగేసాను. అతను వాళ్ళు ఉత్త కూరగాయలతో కూడా రకరకాలవి చేసుకుంటారనీ, కొన్ని బౌద్ధ ఆలయాలకి వెళ్తే, గుడ్డు లేని ఆహారం కూడా దొరుకుతుందనీ అన్నాడు. కెవ్వుమని కేకపెట్టింది మనసు. నాకు తెల్సిన ఒకరిద్దరు చైనా వెళ్ళినప్పుడు ఆహరం గురించి కంప్లైంట్ చేసినట్లే గుర్తు. అలాగంటే, జర్మనీ గురించి కూడా చేసారు అనుకోండీ… కనుక, బహుశా, సరిగ్గా మన టైపు ఆహారం కోసం చూసి నిరాశపడ్డారేమో అనిపించింది ఇది విన్నాక.
సరే, ఈ స్నేహితుడు నాకు కొన్నాళ్ళ బట్టీ తెలుసు, ఒకే డిపార్ట్మెంట్ లో పని చేస్తాం కనుక. అతను సాధారణంగా చైనీస్ రెస్టారెంటుకు వెళ్ళడు. అందుకని కుతూహలం కొద్దీ మళ్ళీ అడిగా.. నువ్వు వెళ్ళవు కదా. ఇవ్వాళ ఎందుకు వెళ్దాం అనుకున్నావు? అని. అతని జవాబు : “సాధారణంగా యూరోప్లో,అమెరికాలో కనబడే చైనీస్ రెస్టారెంట్లు చాలా మట్టుకు విన్ జౌ (Wenzhou) ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పెడతారు. ఈ రెస్టారెంటు “సిచ్వాన్” (Sichuan) వాళ్ళది (పేరును బట్టి చెప్పాడు అనుకుంటా). నేను ఈ ప్రాంతానికి దగ్గర్లో పెరిగాను కనుక, నాకు ఇక్కడి ఫుడ్ అంటే ఇష్టం.” అన్నాడు. విషయం ఏమిటంటే, ఇక్కడి ఆహారం చాలా “హాట్” గురూ టైపులో ఉంటుంది. ఈ కుర్రాడు అక్కడివాడే అయినా, బహూశా ఏళ్ళ తరబడి యూరోప్ లో ఉండి సుకుమారం అయిపోయాడో ఏమో… ఉప్ఫూ ఉప్ఫూ అనుకుంటూ, చెమట్లు కక్కుతూ, నేను నవ్వుతూ ఉంటే సిగ్గుపడుతూ తిన్నాడు
) ఇండియాలోని చైనీస్ రెస్టారెంట్లలో సిచ్వాన్ స్టైల్ వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ అని అమ్ముతారు కొన్ని చోట్ల..కొంచెం స్పైసీగా ఉండే ఫ్రైడ్ రైస్ అది. ఇదంతా అయిన చాలా సేపటికి నాకు బల్బు వెలిగింది – ఆ పేరెందుకు వచ్చిందో!
బహుశా ప్రాగ్ వార్తలు ఇక్కడితో సమాప్తం అనుకుంటాను
ప్రాగోగులు-3
ఇవ్వాళ నా తిరుగుళ్ళలో చాలా భాగం ప్రాగ్ కోట ప్రాంగణాల లోనే గడిచింది. బయట నుంచి చూస్తే అదొక మినీ నగరంలా అనిపించింది. లోపలికెళ్ళాక, నిజమే నని అర్థమైంది. కోట, చర్చి(లు), జైళ్ళు, మధ్యలో మామూలు జనాభా ఇళ్ళూ… ఇలా అన్నీ ఉన్నాయి. వీటికి తోడు ఎముకలు కొరికే చలి కూడా
. అలా వణుకుతూనే మళ్ళీ పాత-నగరం వీథుల్లో తిరిగాను అనుకోండి, అది వేరే విషయం.
ఈ కోట ప్రాంగణంలో ప్రత్యేకం గుర్తుండిపోయినవి –
1) ఈ రాజుల యుద్ధకాంక్షల గుర్తులు
2) ఖైదీల జైళ్ళు
3) కాఫ్కా నివసించిన ఇల్లు
4) బయట నుంచి చూస్తే అద్భుతంగా అనిపించినా, లోపల మామూలుగా ఉన్న రాజ భవనమూ (ప్యారిస్ లోని వర్సై ప్యాలెస్ తాలూకా జనం డబ్బుల్తో భోగాల్లో మునిగే ప్రక్రియ చూశాక తక్కిన అన్నీ సింపుల్ గా అనిపిస్తున్నాయో ఏమిటో మరి నాకు…)
5) ఆ ఎత్తు నుండి కనబడే ఊరు దృశ్యాలూ
అడుగు పెట్టీ పెట్టగానే, గేటు దగ్గరే హింస మొదలు. ఆ గేటు పైన ఉన్న రెండు బొమ్మల్నీ చూడండి…ఎలా చంపుకుంటున్నారో! x-(

లోపలి రాజుల ప్యాలెస్ బైట నుంచి చూడ్డానికి, ఇలా, నాకు మా గొప్పగా అనిపించింది.
కాసేపు అక్కడక్కడ తిరిగి, ఎదురుగ్గా ఉన్న చర్చిలోకి తొంగి చూసి వచ్చాక, “గోల్డెన్ లేన్” అన్న భాగానికి వెళ్ళాను. ఇది ఒకప్పుడు ఈ కోట గోడలకి ఆనుకుని కట్టుకున్న చిన్న చిన్న ఈళ్ళ వీథి. మొదట స్వర్ణకారులు, ఆపై రాజభవనంలో పని చేసే ఇతర పనుల వారూ ఉన్నా, ఒక సమయంలో రాజుగారు ఆల్కెమిస్టులను కూడా ఇక్కడ ఉంచాడట. అందుకని “గోల్డెన్ లేన్” అన్న పేరట. ఇంతకీ, ఆధునిక యుగంలో కాఫ్కా ఒక రెండేళ్ళు ఇందులో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నాడట! ఇంకా కొంతమంది చెక్ ప్రముఖులు కూడా ఇక్కడ వివిధ సమయాల్లో జీవించారట. కాఫ్కా ఉన్న ఇల్లు ఇప్పుడు సావనీర్ షాపుగా మారిపోయింది.
ఈ వీథిలోనే ఒక చోట పైన అంతస్థులో యుద్ధాల్లో వాడిన కత్తులు, కిరీటాలూ, రకరకాల ఆర్మర్లూ అన్నీ ఉన్నాయి. అబ్బో! ఇవన్నీ వేస్కుని ఎలా యుద్ధాలు చేసేవాళ్ళో! అనుకున్నా.
ఇది దాటుకుని వచ్చాక, “దాలిబోర్ టవర్” అన్న బురుజు లాంటి దాని దగ్గరికి వచ్చా. లోపలికి వెళ్ళే ముందు అదేమిటో నాకు తెలీదు. కానీ, నిజానికి అది ఒక భయంకరమైన జైలు. దుర్యోధనుడు శకుని వాళ్ళ ఫ్యామిలీని ఒక డంజన్లో పడేసి రోజూ వంద మెతుకులు పడేసేవాడని సినిమాల్లో చూపిస్తారే… అదంతా విని, ఆ వీళ్ళు మరీలే…అలాంటి డంజన్లలోకి ఎలా పడేస్తారు మనుషుల్ని ఎంతైనా? అనుకునేదాన్ని. ఇక్కడ అలాంటీది నిజంగానే ఉంది! అలాగే, ఈ బందీలను బందించే సెళ్ళు కూడా వివిధ రకాలవి ఉన్నాయి. ఉదాహరణకి ఇదొకటి.
ఇక్కడ మొదట్లో రాజకుటుంబీకుల్లో తప్పు చేసిన వారిని బందించేవారట. దీని పేరు దలిబోర్ అన్న ఒక యోధుడి పేరు మీద పెట్టారట. అతడు రాజకుటుంబీకుడే అయినా, ఏదో రాజుకి వ్యతిరేకులని సమర్థించినందుకో దేనికో ఈ జైల్లో పడేసారంట. ఒక కథ ప్రకారం ఇక్కడి ఒంటరితనంలో కాలక్షేపం కోసం అతగాడు ఫిడేలు నేర్చుకుని, దానిపై విషాద గీతాలు అద్భుతంగా వాయించడం మొదలుపెట్టాడంట. దాని గురించి విన్న ప్రాగ్ ప్రజలు వచ్చి ఆ జైలు చుట్టూ చేరి అతని పాటలు వినేవాళ్ళట. ఇంతకీ, చివర్లో ఇతన్ని కొన్నాళ్ళ తరువాత ఉరితీసారంట. ఇలాగ జైల్లో ఫిడేలు నేర్చుకోవడం గురించి చెక్ భాషలో ఒక సామెత కూడా ఉందట – “Necessity taught Dalibor how to fiddle” అని. అయితే, ఇది కాకుండా అసలు కథ ఇంకోటి ఉంది. ఆ కాలంలో “ఫిడేలు” అని ఒక టార్చర్ ఇన్స్ట్రుమెంట్ కి మారుపేరు ఉండేదంట. దానికి మనిషిని తగిలించి “శ్రుతి” చేస్తే, ఎలాంటీ వాడైనా తను వాయులీనం కాకుండా ఉండాలంటే, నేరాలు ఒప్పేసుకోవాల్సిందేనట. దాని నమూనా కూడా ఒకటి అక్కడ కనబడ్డది కానీ, ఫోటోలు తీయలేదు. అక్కడి బోర్డుపై ఇది ఉంది:
“The fiddle was a nickname for an instrument of torture, a sort of rack on which the convicted man was “streched” till, “out of necessity” (under pressure, in suffering), the victim began to “fiddle” (change his tune, confess)
ఇప్పుడు అర్థమవుతోంది నిన్న Museum of medieval torture instruments” ఎందుకు కనబడ్డదో!! అయ్యా, అదీ కథ!
ఒక విధమైన హారర్ తో బయటకు వచ్చా, ఆ శిక్షా విధానాలూ, జైళ్ళూ చూశాక. అంతా అయ్యాక, షరా మామూలుగా – “ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం?” అని మళ్ళీ నిట్టూర్చుకున్నా, శ్రీశ్రీ ని తలుచుకుంటూ. వర్సై పేలెస్ చూసినప్పుడు యుద్ధ కాంక్షని గురించి అనుకుంటూ ఈ కవిత తల్చుకుంటే, ఇక్కడ ఆ జైళ్ళను చూసి జడుసుకుని తల్చుకున్నా. ఏవిటో, ఈ యుద్ధాలూ, హింసానూ! అబ్బే, మనుషులేం మారినట్లు లేరు ఇన్నాళ్ళైనా. మెదళ్ళూ, మెథళ్ళూ మాత్రం మారాయి అంతే.
(అందుకే వత్తులు గట్రా సరిగ్గా పలుక్కోవాలి. సినిమాల్లో పాడినా, టీవీలో యాంకరింగ్ చేసినా, మామూలుగా మాట్లాడుకున్నా!)
అక్కడనుంచి బయటపడగానే, మంచులో ప్రాగ్ నగరం ఇలా కనబడ్డది
నన్ను శాంతింపజేయడానికి అనమాట ![]()


ఎంచక్కా బయటికొచ్చి, కిందకి దిగేసి, “చార్లెస్ బ్రిడ్జ్” దాటుతూ వెనక్కి తిరిగితే, ఈ ప్రాంగణమంతా జనానికీ, జీవితానికి నేపథ్యంలా..ఇలా.. కనబడ్డది..

అదీ సంగతి ఇవ్వాళ్టికి. అన్నట్లు, ఇక్కడ ఆదివారం అయినా సూపర్ మార్కెట్లు తీసే ఉన్నాయి. ఈ పది నెలల్లో ఎప్పుడూ ఆదివారాలు సూపర్ మార్కెట్ తెరిచిన ప్రాంతం చూడలేదు నేను ఇప్పటిదాకా
రేపట్నుంచి పాఠాలు మొదలు కనుక, బహుశా నా ప్రోగ్గోల కి చుక్కెదురేమో. ప్రాగోగులన్నీ చార్లెస్ యూనివర్సిటీ బాధ్యత.
కొసమెరుపు – అంటే, రేపట్నుంచి నా పరిస్థితి గుర్తు తెస్తూ… దార్లో ఇది కనబడ్డది
ప్రాగోగులు-2
ఈ చలిగానీ లేకుంటే, ఇవ్వాళ ఎంత బాగుండేదో… అనుకున్నాను… రోజంతా కాలి నడకన ప్రాగ్-1 పర్యటన చేస్తూ ఉంటే (ప్రాగ్ నగరం మొత్తం పది భాగాలుగా విభజించారు. ప్రాగ్-1 నుండి పది దాకా). చారిత్రకంగా పేరు పడ్డ కట్టడాలూ, వంతెనలూ ఎక్కువభాగం ఇక్కడే ఉండడం వల్లా, మా పాఠాలూ, బసా కూడా ఇదే ప్రాంతం కావడం వల్లా ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది, జరుగుతుంది కూడా నన్నమాట. మామూలుగా అందరి టూరిస్టుల్లాగే, ఎంచక్కా, అలా ఒక్కొక్కటీ చూసుకుంటూ ముందుకు పోతూ, ఆల్రెడీ ఇక్కడికి ఇదివరలో వచ్చిన నా కొలీగ్ పుణ్యమా అని మ్యాపు వెదుక్కునే పని లేకుండా, ఎంచక్కా ఫాలో అయిపోతూ, అలా గుడ్డిగా ఫాలో అవుతున్నప్పుడు కూడా మంచు మూలాన జారిపోతున్న రోడ్డును జాగ్రత్తగా గమనించుకుంటూ, ఎంచక్కా, తెల్లటి ఊలు దుప్పటేస్కుని నిద్రపోతున్నట్లు కొంచెం సైలెంటుగా ఉన్న ప్రాగ్-పాత నగరాన్ని చూస్తూ…సాగిపోయాను.
ఏమాటకి ఆమాటే చెప్పాలి : ఇన్నాళ్ళకి మొదటిసారి నాకు – అన్ని ఊళ్ళూ ఒకేలా ఉంటాయేమో? అన్న సందేహం చివరకి కలిగేసినా, కొన్ని కొన్ని భవనాలూ, విగ్రహాలూ, స్మృతి చిహ్నాలూ.. అవీ భలే నచ్చేసాయి నాకు.. నదికి ఒక బ్రిడ్జి పై నిలబడి, ఎప్పుడో 1300స్ నాటి చార్లెస్ వంతెననూ, దాని పక్కగా ప్రసిద్ధి చెందిన ప్రాగ్ కోటనూ చూద్దంలో ఉన్న ఆనందం, ఆ చార్లెస్ బ్రిడ్జ్ పై కాసేపు తర్వాత నడిచినప్పుడు కూడా కలుగలేదు
)
కాసేపయ్యాక, “బొహీమియన్ కార్నివాల్” అని బోర్డు…అక్కడ గుమిగూడిన జనం కనబడ్డారు. కార్నివాల్ ప్రారంభంలో భాగంగా, అక్కడ ఒక చిన్న స్టేజీ దగ్గర ఎవరో తమ కళలను ప్రదర్శిస్తున్నారు (వీళ్ళే వాళ్ళు). నాకు భలే నచ్చేసింది. భయంకరమైన చలి వల్ల ఇక వెళ్ళిపోదామనుకున్నా తప్ప, లేకుంటే, అలా కాసేపు ఉండేదాన్నేమో. ఏమిటో, వీళ్ళని చూడగానే, నాకు ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది మెజీషియన్” గుర్తువచ్చింది (ఉత్త స్క్రీంప్లే చదివితేనే అది అలా గుర్తుండిపోయింది లెండి).
అసలింతకీ, ఇది చూసే ముందు చూసిన దాని గురించి చెప్పాలి. దీని పక్కనే ఒక పెద్ద గడియారం ఉంది. మధ్యాహ్నం రెండింటికి ఆ గడియారం లోంచి ఇద్దరో, ముగ్గురో, కొందరో మనుషులొచ్చారు… నాకు సాలార్జంగ్ మ్యూజియంలో ఉండే గంటల గడియారమే గుర్తొచ్చింది. ఇది దానికంటే ఎన్నోరెట్లు పెద్ద సైజనుకోండీ…అయినా కూడా! (1410లో నెలకొల్పిన ఈ గడియారం ప్రపంచంలోని మూడవ అతి పాత “Astronomical Clock” అట. నాకు ఆ బొమ్మలు… ముఖ్యంగా అస్తిపంజరం బొమ్మ ఉండడం…అంతా విపరీతమైన కుతూహలం కలిగించాయి. ఇప్పుడు ఇంటికొచ్చాక వివరాలు చదువుతూ ఉంటే సింబాలిజం అర్థమైంది. వివరాలు వికీపేజీలో.)
ఈ ఊళ్ళో ప్రతి రెండో షాపూ ఒక రెస్టారెంటేమో, ప్రతి మూడో షాపూ ఒక సావనీర్ షాపేమో అని నా సందేహం. రెస్టారెంట్లలో ప్రతి రెండో రెస్టారెంటూ “అసలు సిసలు చెక్ వంటకాలది” అయితే, ప్రతి మూడోదీ చైనీస్ ఏమో? అని కూడా సందేహం కలిగింది. ఆ కాసేపట్లోనే, ఒక ఇరవై చైనీస్ రెస్టారెంట్లు అయినా చూసి ఉంటాను. ఇక, చెక్ రెస్టారెంట్లు సరే సరి. ఇలాక్కూడా ప్రకటించేసుకుంటున్నారు-

నోరు తిరగని పేర్లు గల చర్చులు, బురుజులూ అన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉండగా, రెండు పంచులు పడ్డాయి… రెండు మ్యూజియంల తాలూకా బోర్డులు చూసి. ఒకటి – “Museum of Medieval Torture Instruments”. ఇక్కడికి కొంచెం పర్లేదు అనుకున్నా కానీ, అసలు రెండో దాని పేరు చదవగానే అవక్కయిపోయా. “Museum of sex machines” – Needless to say, I did not visit them!
అసలు ఇవన్నీ తర్వతా కానీ, కోట చూసేందుకని చెప్పి నెమ్మదిగా పైకి స్లోప్ ఉన్న రోడ్డు మీద, ఆ మంచుకి జారి పడిపోకుండా నడుస్తూ ఉండగా…”గోపాల్ – ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్” అని కనబడ్డది. ఇంక చూడండీ…. నా మనసు “అహ మీది తెనాలే…మాది తెనాలే…మనది తెనాలే…” అని కాసేపు…”జజ్జనక జజ్జనక జనకు జజ్జనక” అని కాసేపు డ్యాన్సు వేసింది. ఆ డ్యాన్సులు తెముల్చుకుని కోట దగ్గరికి వెళ్ళేసరికి అది మూసే సమయం ఔతూ ఉండటం తో, రేపు పొద్దున్న వద్దాం లే అని హోటెల్ కి వెనక్కి వచ్చి, అక్కడ ఇంకో ఫ్లోరులో ఉన్న నా కొలీగ్ కి ఇలా ఒక ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ కనబడ్డది అని మెసేజ్ పంపాను. అతనేమో, సరే, నెనెప్పుడూ ఇండియన్ రెస్టారెంటుకు వెళ్ళలేదు, మనం డిన్నర్ అక్కడ చేద్దామా? అన్నాడు. మీకు కష్టమేమో… కావాలంటే ఇంకెక్కడికైనా వెళ్తానంటే వెళ్ళు..బలవంతం లేదు అన్నా. అయినా అతను వస్తా అనేసరికి, వెళ్ళాం. ఎంట్రీలో ఒక విదేశీ వనిత స్వదేశీ దుస్తుల్లో సాయంకాలం కదా…దీపాలు వెలిగిస్తోంది ఆరుబయట. లోపలకి వెళ్ళగానే, ఒక పక్క స్టీలు గిన్నెలు, వాటిపై మూతలు, ఏవో పొడులు గట్రా (మా IIIT లో యుక్తాహార్ మెస్సులా). మరొక పక్క భగవద్గీత వగైరా బోలెడు పుస్తకాలు – అమ్మకానికి. అది చూశాక కూడా నాకు విషయం అర్థం కాలేదు. లోపలకి వెళ్ళాక, భక్తివేదాంత ప్రభుపాదుల వారు దర్శనం ఇచ్చారు – ఫొటోలు. అప్పటికి గానీ, నాకు ఎందుకు ఇండియన్ రెస్టారెంట్ అన్నా ఇండియన్స్ ఎవ్వరూ కనబడ్డంలేదు కౌంటర్లో? అన్న ప్రశ్నకి సమాధానం దొరకలేదు
పాపం తినడానికి అంతా బానే ఉంది కానీ, వాళ్ళ దగ్గర పెప్పర్ కానీ, చిల్లీ కానీ…ఏవీ లేవంట. అలాగే, తియ్యగా తినాల్సి వచ్చింది అంతా
. కానీ, అన్నింటికంటే నాకు కొత్తగా ఉన్నవి – ఆ బ్యాక్గ్రౌండ్ పాటలు. ఇస్కాన్ వారి గుళ్ళు ఒకట్రెండు చూశాను ఇండియాలో. కానీ, అంత భయంకరమైన సంగీతం ఇదివరలో విన్నట్లు లేను. ఈ నా కొలీగ్ ఏమో “ఇండియాలో ఇలాంటి పాటలు వింటారా?” అని అడిగాడు, అదీ ఇంగ్లీషులో! ఇలాగ డిన్నర్ చేసినంతసేపు పంచులే – “అంటే…హిందూస్ అందరూ ఇలాగే ఉంటారా?” “ఇస్కాన్ ఏమిటి?” “కల్ట్ అంటే… గోపాల్ వాళ్ళకి మాత్రమే దేవుడా?”, “మిగితా హిందూస్ కీ వీళ్ళకి ఇష్యూస్ లేవా?” ఇలా…. అతనికి బోలెడు డౌట్లు. నాకేమో భయం… ఇక్కడ ఇంగ్లీషులో వీళ్ళ గురించి మాట్లాడ్డం అవసరమా? అని. నువ్వు కాసేపు ఊరుకుంటే, మనం అలా నడుస్తూ వివరంగా మాట్లాడుకుందాం. అని చెప్పా. అలాగ, ఏదో మేనేజ్ చేసా అన్నమాట. ఆ రెస్టారెంటులో మేము తప్ప ఇస్కానేతర మనుషులెవరూ లేరు. ఎంచక్కా, అందరూ నామాలు అవీ పెట్టుకుని, భారతీయ వస్త్రధారణ గురించి కష్టపడుతూ… నా మీద వాళ్ళే కొంచెం భారతీయంగా కనిపిస్తున్నారా? అన్న అనుమానం కూడా కలిగించారు కొందరైతే
. మొత్తానికి అదీ ఇండియన్ “వెజిటేరియన్” రెస్టారెంటు కథ. ఆ పేరు పెట్టిన ఖర్మానికి “మీలో ఎవరన్నా ఇండియా వెళ్ళారా బాబూ?” అని నిర్వహకులని అడగాలన్న కోరిక బలవంతంగా అణుచుకున్నా…కింద ఒక భజన మందిరం కూడా ఉందనీ, ఇస్కాన్ భజనలు జరుగుతున్నాయనీ అర్థమయ్యాక. ఇంతమంది మధ్య మనమెక్కడ వాదిస్తాం? అని.
ఇక తిరుగుళ్ళూ అయ్యాక, డిన్నర్ కి ఈ రెస్టారెంటుకు వెళ్ళే ముందూ…అంటే చీకట్లు కమ్ముకుంటున్న వేళకి- మా హోటెల్ కి ఆవలి వైపు ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ విగ్రహాలు చూసేందుకు వెళ్ళాను (ఇది మాత్రం నెట్లో దొరికిన ఫొటో…నేను తీసినది కాదు. వెలుతురు సరిగా లేక, నేను తీసిన బొమ్మ మరీ డార్క్ గా వచ్చిందనమాట).

ఏమిటో, చూడగానే, చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. కొంచెం సేపు అలా ఆ బొమ్మలు అలా క్రమంగా దెబ్బతినడాన్ని చూస్తూ నిలబడిపోయాను…చలి మళ్ళీ కొరికేదాకా! మొదట ఉన్న బొమ్మ ఒక మాదిరిగా ఉంది. అలా వెనక్కి మళ్ళే కొద్దీ, కొద్ది కొద్దిగా దెబ్బతింటూ వచ్చాయి బొమ్మలు. కంయూనిస్టు ప్రభుత్వాల బాధితులకు మెమోరియల్ అట అది (వికీ పేజీ ఇక్కడ).
-ఇవ్వాల్టికి “ప్రాగ్గోల” కు విరామం.
ప్రాగోగులు-1
కొద్దిసేపటి క్రితమే చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో ల్యాండ్ అయ్యాను. ఇక్కడ వారం రోజుల మకాం… ఒక చలికాలపు పాఠశాల (వింటర్ స్కూల్) కోసం. మా ఊళ్ళో విశేషాల గురించి రాయడానికే సమయం చిక్కక రాయడం లేదు. కానీ, దిగిన క్షణం నుంచి ఎంత రాయకూడదు అనుకున్నా రాయడానికి ప్రేరేపించే అనుభవాలే ఎదురవుతున్నాయి ఇక్కడ. దానితో, ప్రాగులో నా బాగోగుల కథ – ప్రాగోగులు…చెప్పక తప్పడం లేదు.
1) అసలు విమానం ఎక్కీ ఎక్కగానే చెక్ ఎయిర్వేస్ వారి పత్రిక ఒకటి కనబడితే తెరిచాను. అంతే, విమానం దిగేదాకా, చదువుతూనే ఉన్నా… చదివినవే మళ్ళీ కూడా చదివా…ఆసక్తికరంగా అనిపించి. చివరాఖరుకి అది నాతో తెచ్చుకోవచ్చా అని విమానం వాళ్ళని అడిగి, వాళ్ళిస్తే తెచ్చేసుకున్నా కూడా
(అసలు ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసిన వింతలూ, విశేషాలూ, వార్తలూ వాటి గురించి రేపో ఎల్లుండో వివరంగా రాస్తాను)
-అలాగ ఆ పుస్తకం గురించి నా కొలీగ్ కి ఊదరగొడుతూ, చలికి వణుకుతూ ఊళ్ళోకి వెళ్ళడానికి బయటకు వెళ్ళబోతూ, ఏటీయం లో డబ్బులు డ్రా చేసుకుందాం అనుకున్నాము. అక్కడ్నుంచి మొదలయ్యాయి పంచులు నాకు.
2) ఏ.టీ.యం లో 2000 చెక్ క్రోనులు అని సెలెక్ట్ చేసాను… చాలా రోజులు ఉండాలి, పైగా ఇక్కడ అంతా ఖరీదు అంటారు అని. ఇంక చూడండీ… 2000 క్రోను నోటు ఇచ్చిందది! ఇండియా ఏ.టీ.ఎం. లలో ఐదొందలు డ్రా చేస్తే ఎక్కడ ఐదొందల నోటు ఇస్తుందో అని, నాలుగొందలు, వందా వేర్వేరుగా డ్రా చేసేదాన్ని నేను. అంత చిరాకు నాకు పెద్ద నోట్లంటే… పైగా, నా తరహా ఖర్చులకి అలాంటి నోట్లు పరమ దండుగ. చిన్నవుంటేనే పండుగ. జర్మన్ ఏ.టీ.ఎంలు ఈ విషయంలో భలే ముద్దొస్తాయి. 50 యూరోలు తీయాలని అడిగితే, 20+10+10+5+5 – ఈ డినామినేషన్లలో ఇస్తాయి ఎప్పుడూ.
3) బస్సు ఎక్కాలంటే, బస్సులోనో, బస్టాపులోనో కాకుండా, ఒక కౌంటర్ లో కొనుక్కోవాలి టికెట్లు. అక్కడికెళ్ళి, 32 క్రోనుల టికెట్టు కి 2000 రూపాయల నోటు ఇచ్చాడు నా కొలీగ్. వెనకే మరో 2000నోటుతో నేనున్నా క్యూలో. ఆ కౌంటర్లో ఆమె చేతులెత్తేసింది. మేము చిల్లర్లు ఇవ్వలేము అన్నది. మీ ఏ.టీ.యం మాకు ఈ నోటే ఇచ్చింది అన్నాడు నా కొలీగ్. ఆవిడ…ఆయినా మేమంతే…అనేసి కౌంటరు మూసేస్తున్న బోర్డు పెట్టింది. ఖంగారు పుట్టింది నాకైతే…ఇంతలో క్రెడిట్ కార్డుతో కొనొచ్చన్న విషయం తట్టి కొన్నామనుకోండీ… కానీ, తొమ్మిదింటికి ఆ కౌంటర్ మూసేస్తే, తరువాతి బస్సులు జనం ఎలా ఎక్కుతారు? అన్నది నాకు అర్థం కాలేదు.
4) ఈ బస్సుమారి ఒకచోట మెట్రో ఎక్కాలి. అక్కడ ఎస్కలేటర్ ఉండిందీ…. కనుచూపుమేరదాకా మెట్లే ఉన్నాయేమో అని అనుమానం కలిగింది అది చూసాక
నేను ఈ చలి-కోటులో పాకెట్లు వెదికి ఫోను తీసి కెమెరా ఆన్ చేసే సరికి దాదాపు సగం పైకి ఎక్కేసాము. దానితో ఇదిగో-ఇంత మాత్రం కనబడ్డది.
5) హోటెల్ లోకి ప్రవేశించాక అడుగడుక్కీ పంచి పంచి పంచి. ఆ రిసెప్షన్ లో పనిచేసే వాడెవడో కానీ, కొత్తవాడో, తాగు-వాడో, నిద్రలో ఉన్నవాడో – ఏమిటో అర్థం కాలేదు. ముందు నా కొలీగ్ తన రిసర్వేషన్ తాలూకా పేపర్లతో ఉన్నాడు. వెనుక నేను ఉన్నా. “మీ పేరు లేదు” అన్నాడు రిసెప్షనిస్టు. “ఉంది” అంటాడు ఇతను. ఇలా రెండు మూడు సార్లు అయ్యాక, నా కొలీగ్ ఆ రిసెప్షనిస్టు దగ్గర ఉన్న పేర్లు తనే చూసి, “ఇదిగో, ఇదీ నా పేరు” అన్నాడు. అతను “ఓ, సారీ, సారీ…” అనేసి, అతనికి రూం అలాట్ చేసాడు. నెక్స్ట్ నేను వచ్చాను. “ఇద్దరికీ ఒకే రూం” అన్నాడు. నేను హడలిపోయా. ఇదెక్కడి ఖర్మరా బాబూ…అని అయోమయంలో అనుకుంటూ ఉండగా, నా మీద కాస్త అలర్టుగా ఉన్న నా కొలీగ్ – ఆమె సెపెరేట్ గా బుక్ చేసుకుంటే ఇద్దరికీ ఒక రూం అంటారేమిటి? మేమిద్దరం ఒకే చోట పని చేస్తాము…ఒకే పనిమీద ఇక్కడికి వచ్చాము… అంతే. అన్నాడు. “మీ పేరు నిజంగానే లేదు” అన్నాడు రిసెప్షనిస్టు కూల్ గా. మళ్ళీ ఖంగారు మొదలైంది నాకు. “లేకపోవడం ఏమిటి? అతను బుక్ చేసిన రోజే కాస్త ఆలస్యంగా నేనూ చేసా. అతని పేరు ఉంటే నా పేరు ఎందుకు ఉండదు?” అన్నా. “ఏమో, ఇక్కడ కనబడ్డం లేదు” అన్నాడు అతను మళ్ళీ. ఇంతలో, ఆపద్భాందవుడిలా, నా కొలీగ్ మళ్ళీ ఆ చిట్టా చూసి, నా పేరుని పాయింట్ అవుట్ చేసి చూపాడు రిసెప్షనిస్టుకి. అతను మళ్ళీ సారీ చెప్పి, నాకు తాళం తీసే కార్డులు ఉన్న కవర్ ఇచ్చాడు. అందులో రెండు కార్డులున్నాయి. “అదేమిటండీ రెండు ఉన్నాయి?” అని అడిగా. “ఓ..సారీ!” అనేసి రెండోది తీసేసుకున్నాడు. అయోమయ దృక్కులతో – “ఏమన్నా హెల్ప్ కావాలంటే, ఫలానా నంబర్…నాకు కాల్ చేయండీ” అన్నాడు. సరేనని బయటపడ్డాము.
6) సరే, ఈ గది తీసుకున్నాక చూస్తే, ఇక్కడ వైర్లెస్ పని చేయడం లేదు. ఫ్రీ-ఫ్రీ-ఫ్రీ అని టముకు వెయ్యడం ఎందుకు? అని కోపం వచ్చింది. వెంటనే ఆ సదరు రిసెప్షన్ వాడికి ఫోను చేసా. “మీ టీవీ వెనుక ఉన్న వార్డ్రోబ్ పక్కనే ఒక రౌటర్ ఉంటుంది. దానిలో ఒక వైర్ ఉంటుంది. దాన్ని పీకి మళ్ళీ పెట్టండి” అన్నాడు. “ఏమిటీ, గది గదికీ రౌటరా!” అనుకుని, అటు చూస్తే, టీవీ వెనుక ఉన్నది…గోడ! అదే చెప్పాను అతనికి. “నా కొలీగ్ ఒకతన్ని పంపిస్తాను..అతను వచ్చి మీకు సాయం చేస్తాడు” అని పెట్టేశాడు ఫోను.
7) రెణ్ణిమిషాల్లో ఒకతను వచ్చాడు. (నా మట్టుకు నాకైతే మన్మథుడు సినిమాలో… “థే పెయిడ్ నో” అని బ్రహ్మానందం అన్నప్పుడు బాగా బలంగా ఉన్న ఒకడూ “నో” అంటాడే….వాడి లాగే అనిపించాడు). “ఏమిటి ప్రాబ్లెం?” అన్నాడు. “ఏదో వైర్లెస్ డిటెక్ట్ అవుతోంది. పాస్వర్డ్ కూడా ఆక్సెప్ట్ చేస్తోంది కానీ తర్వాత కనెక్ట్ కావట్లేదు” అన్నా. అతను నా ల్యాప్టాప్ చూస్తా అన్నాడు. రెండు క్షణాలు మౌస్ మీదకు చేయి పెట్టబోతూ ఆగి అయోమయంగా చూసి అన్నాడు – “విండోస్ లో స్టార్ట్ సింబల్ ఉంటుందే…అలాంటిది ఏదీ?” అన్నాడు. అతనికి అర్థం కాలేదేమో అని… “ఇది విండోస్ కాదు” అన్నా నెమ్మదిగా, భయంగా. “అర్థమయ్యింది. కానీ, మరి ఆ స్టార్ట్ ఏదీ?” అన్నాడు. “నెట్వర్క్ కనెక్షన్స్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు” అని చూపించా. మళ్ళీ ఆ కనెక్షన్ల జాబితా ఎగాదిగా చూసి…”ఇక్కడి వైర్లెస్ పాస్వర్డ్ ఎక్కడ టైప్ చేయాలి?” అన్నాడు. చూపించాను. “నాకు ఇది అలవాటు లేదు. విండోస్ లో అయితే తెలుసు” అన్నాడు. నేను మళ్ళీ – “అది కాదు…నెట్వర్క్ కనిపిస్తోంది…కనెక్ట్ అవుతుఓంది..కానీ, తర్వాత ఏం కావట్లేదు” అన్నా. అతను ఒక నిముషం ఆలోచించి, రౌటర్ లో సమస్యేమో అని గబుక్కున టీవీ వెనక్కి వెళ్ళాడు.
ఆ తరువాత టేబుల్ జరిపాడు. ఆ తరువాత మంచం వెనక్కి వెళ్ళి చూశాడు. “ఈ గదిలో రౌటర్ ఏదీ?” అన్నాడు. “నేను ఇప్పుడే దిగాను. నాకు తెలీదు” అన్నాను. వెంటనే రిసెప్షన్ కి ఫోన్ చేసి, చెక్ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. ఇతను ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు.
8) ఒక రెణ్ణిమిషాలు తరువాత చాంతాడు సైజులో ఉన్న వైర్ పట్టుకుని వచ్చి, ఆ టీవీ వెనకాల అంతసేపూ నాకు కనబడని ఒక సాకెట్ నుంచి వైర్డ్ కనెక్షన్ పెట్టుకోవచ్చని చెప్పి, నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసాడు. చేసాక… “ఇప్పుడు ఇది కనెక్ట్ చేసేది ఎలా ఇందులో? విండోస్ లో అయితే మామూలుగా అయిపోతుంది” అన్నాడు. “అదే కనెక్ట్ అవుతుంది లెండి… వేరే ఏం మార్పులు చేయనక్కరలేకపోతే..” అన్నా. సరే, నా పుణ్యం పుచ్చి, చివరాఖరుకి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యింది. ఇంకాస్త పెద్ద వైర్ తీసుకొస్తాను. అప్పుడైతే, మీరు మీ బెడ్ పైన్నుంచే వాడుకోవచ్చు, అనేసి వెళ్ళిపోయాడు.
9) వెళ్ళేముందు ఒక రసగుళిక వదిలాడు – “మామూలుగా ప్రతి గదిలోనూ ఒక రౌటర్ ఉంటుంది. ఏమిటో, ఇక్కడ లేదు. బహుశా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎత్తేసారేమో” అన్నాడు. నేను అవాక్కై “వ్వాట్?” అన్నా. “అప్పుడప్పుడూ అలాంటివి జరగడం ఇక్కడ మామూలే లెండి” అన్నాడు =)). సరే, కాసేపయ్యాక పెద్ద వైర్ తెచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి..కానీ, నాకు మాత్రం నవ్వు ఆగడంలేదు
-ప్రస్తుతానికీ ఇవీ నా ప్రాగోగులు
ప్రాగ్ లాంటి నగరానికి వచ్చి నువ్వు చెప్పేవి ఇవా?? అనుకుంటున్నారా??
నన్నాకర్షించని మొడటి ఐరోపా నగరం – మాల్మో
నేను యూరోప్ లో జీవించడం మొదలుపెట్టి ఏడు నెలలు అవుతోంది. ఏదైనా కొత్త ప్రాంతం చూసి రాగానే, సాధారణంగా నాకది నచ్చుతూ ఉంటుంది. నాకెందుకో ప్రతి చోటా ఏదో ఒకటి నచ్చుతుంది. కొన్ని చోట్ల సముద్రమో, చెట్టూ చేమలో, ప్రశాంతంగా పారే నదులో నచ్చితే, కొన్ని చోట్ల శిల్పాలు, వాటిలో పలికే హావభావాలూ…కొన్ని చోట్ల పాత కాలపు భవనాలూ – ఇలా ఏదో ఒకటి నచ్చుతూ ఉంటుంది. ఇలా నేను ప్రతిసారీ ఎక్కడికో వెళ్ళడం, “ఈ ఊరు భలే ఉంది తెల్సా?” అనడం, “ఆ, ప్రతి ఊరుకీ అలాగే చెప్తున్నావ్ లే!” అని మా తమ్ముడు అనడం జరుగుతూ ఉంటుంది.
అలాంటిది, ఇన్ని ప్రయాణాల్లో మొదటిసారి, నాకొక ఊరు బోరింగ్ అనిపించింది. అది స్వీడెన్ దేశంలోని మాల్మో నగరం.
కొన్ని అనివార్య కారణాల వల్ల, నాకంటూ పనేమీ లేకున్నా, గతవారం మాల్మో లో దాదాపు ఇరవై నాలుగ్గంటలు గడపాల్సి వచ్చింది. తోచక, నడకతో నగర సంచారం చేస్తూ గడిపాను. ఈ టపా దాని గురించే!
మాల్మో చేరాలంటే, డెన్మార్కులోని కోపెన్ హాగెన్ నుండి ఓరెసుండ్ జలసంధి మీదుగా ట్రెయిన్లో ఒక అరగంటలో రావొచ్చు – మేము అలాగే వెళ్ళాము (కోపెణాగెన్ చేరబోతున్నప్పుడు ఒకావిడ ట్రెయిన్లో “మాల్మొ చాలా బోరింగ్ ఊరు. అఫ్కోర్సు, నేను అక్కడికి ముప్పయి ఏళ్ళ క్రితం వెళ్ళా అన్నది వేరే విషయం” అన్నది. ఇప్పుడు బాగుంటుందిలే అనుకున్నాం…పొరబాటు అనమాట!). మేము రాత్రికి బస చేయవలసిన చోటుకి వెళ్ళాలంటే, స్టేషన్ నుంచి కొంచెం దూరం ప్రయాణం చేయాలి. బస్సులో వెళ్తూ ఉండగా, మహా చిరాకేసింది. కారణం – అన్నీ పెద్ద పెద్ద రోడ్లూ, బిల్డింగులూనూ. ఉంటే ఉన్నాయి కానీ, అన్నీ ఒకలాగే ఉన్నాయి నాకు. ఇదివరలో ఇక్కడి నగరాల్లో తిరుగుతూ ఉంటే, ఆ భవనాలు అవీ చూసి అబ్బురంగా అనిపించేది…అబ్బా, చూడబోతే పాతవిగా ఉన్నాయి…లోపల మాడర్న్ గా ఉన్నా కూడా, బయట ఆ పాత లుక్ భలే ఉంచేస్కున్నారే! అని.
సరేలే, మనమేదో అర్బన్ ప్రాంతంలో ఉండి ఉంటాము అని సరిపెట్టుకున్నాను. తరువాతి రోజు, నా ఒంటరి అన్వేషణ మొదలైంది. నాకు పనేమీ లేదని చెప్పా కదా, కనుక పనులు ఉన్న వారు వాటికోసం వెళ్ళిపోతే, నేను సంచారినయ్యాను. కాసేపు ఒక మ్యాప్ తీసుకుని, అటూ ఇటూ తిరుగుతూ, సిటీ సెంటర్ కి వచ్చాను. సాధారణంగా, సిటీ సెంటర్ అంటే అక్కడే పాత టౌన్ హాలు, ఇంకా కొన్ని పాత భవనాలూ, శిల్పాలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే, షాపింగ్ మాల్స్ ఉన్నాయి! కాసేపు అదే దోవలో నడిస్తే, ఒక బారెడు పొడుగున్న చర్చి కనిపించింది. నిజం చెప్పొద్దూ – నిర్మాన పరంగా, మామూలు అమాయకపు కళ్ళకి చాలా సాధారణంగా అనిపించింది. ఉన్న దానికి తోడు, అంతకు ముందు రెండు రోజుల్లో రెండు అద్భుతమైన చర్చి భవన సముదాయాలను చూశాను. దానితో, ఇది చప్పగా అనిపించింది. అక్కడే ఒక టౌన్ హాల్ కూడా ఉండింది. బాగుంది కానీ, “వావ్” అనిపించలేదు. ఇలా ఇంకో ఐదు నిముషాలు నడవగానే, స్టేషన్ వచ్చేసింది!! వార్నీ, ఇంతేనా ఓల్డ్ సిటీ అంటే?? అనుకున్నా.
స్టేషన్ పక్కనే ఉన్న పర్యాటక శాఖ వారి ఆఫీసుకు వెళ్ళాను. నాకు ఇంకో రెండు మూడు గంటల టైం ఉంది, ఈ ఊళ్ళో చూడదగ్గవి ఏంటీ? అని అడిగాను. ఆవిడ ఓపిగ్గా, మ్యాప్ తీసి, అందులో సూచించడం మొదలుపెట్టింది. ఆమె మొదట చూపిన స్థలాలు చూసి అవాక్కయ్యాను. ఎందుకంటే, అది అంతసేపూ నేను నడిచొచ్చిన రోడ్డే! ఆ తరువాత, నే వచ్చిన ప్రాంతానికి సమాంతరంగా ఉండే మరో ప్రాంతం చూపి, ఇవి రెండూ కాక, మాల్మో కోట కూడా ఉంది, ఆ సైడ్ వెళ్ళి చూడమని సలహా ఇచ్చింది. అన్నీ ఒకట్రెండు కి.మీ దూరాలే కావడంతో, చూడ్డానికి బయలుదేరాను.
మొదట కోట ప్రాంతాల్లోకి వెళ్ళాను. ఇక్కడ ప్రశాంతంగా, బాగుంది. కాసేపు నడిస్తే, ఒక భవన సముదాయం కనబడింది. నాకు మామూలుగానే అనిపించింది కానీ, అదే ఇక్కడి కోట. ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ నాటిది అంటే ఒక్క పట్టాన నమ్మలేకపోయాను! కోటకి చరిత్ర అయితే చాలా ఉంది కానీ, చూడ్డానికి మాత్రం నాకు మామూలుగా అనిపించింది. అసలు కోటకంటే, లోపల వాళ్ళు పెట్టిన కోట ఫొటోలే బాగున్నాయి నాకు!
ఇక్కడ ప్రత్యేకం నేను గమనించినవి కొన్ని:
1) స్టేషన్ లో దిగ్గానే, ఎదురుగ్గా సిటీ బస్సులు వస్తున్నాయి. మేము ఎక్కాల్సిన బస్సు ఎక్కడ వస్తుందో డిస్ప్లేలో చూసుకుని అక్కడికి వెళ్ళి నిలబడ్డాము. ఎంతకూ బస్సు రాదు. కాసేపటికి స్టాప్ కు అటు చివర ఉన్న ఇక్కడి స్టాఫ్ ని అడిగితే, ఆయన “కం విత్ మీ” అని మమ్మల్ని అక్కడికి ఒక వందమీటర్ల దూరంలో ఉన్న మరో చోటికి తీసుకు వెళ్ళి – “ఇక్కడ వస్తాయి ఆ బస్సులు. మా డిస్ప్లే లో ఏదో సమస్య ఉంది” అన్నాడు!!! ఎంతైనా, చూపిస్తాడు అనుకున్నా కానీ, ఇలా నడిపించి దింపుతాడు అనుకోలేదు!!
2) ఇక్కడ సైన్స్ ఫిక్షన్ పుస్తకాల కోసం ప్రత్యేకం ఒక షాపే ఉంది!
3) మాల్మో స్వీడెన్లో కెల్లా అత్యంత కాస్మపాలిటన్ నగరం అంటే ఓహో అనుకున్నాను కానీ, నిజంగానే అలాగే ఉంది, కనీసం నేను తిరిగిన ప్రాంతం. రకరకాల ముఖాలు, రకరకాల దేశాల రెస్టారెంట్లు వగైరా అడుగడుక్కీ కనిపించాయి.
4) బస్సుల్లో టికెట్లు కొనే పద్ధతి లేదు
మా ఊళ్ళో ఐతే ఎంచక్కా బస్సుల్లో డ్రైవర్లు టికెట్లు ఇవ్వకపోయినా, మషీన్లు ఉంటాయ్.
5) డిజైన్ ఔత్సాహికులకి ఇక్కడ మంచి కాలక్షేపం అవుతుందనుకుంటాను.
6) ఇక్కడో రకం ఫలాఫెల్! ఫలాఫెల్ తో మా ఊళ్ళో మిరపకాయలు ఇవ్వరు. ఇక్కడ ఇస్తారు. నాకెందుకో గానీ, సమోసాతో మిరపకాయలిస్తారు హైదరాబాదులో కొన్ని షాపుల్లో…అది గుర్తొచ్చింది
)
(ఫొటోలు కొన్ని తీశా కానీ, అబ్బే, నాకు ఏదీ పెద్ద గొప్పగా అనిపించలేదు. అందుకని ఏదీ పెట్టట్లేదు!!)

















