Confusion …Confusion!

ఇవాళ ఈనాడు పేపర్లో ఒక చిన్న వార్త ఉండింది. హైదరాబాద్ లోకల్ ఎడిషన్లో చూసినట్లు గుర్తు. ఈనాడు సైటులో నుండి ఈ వ్యాసానికి లంకె ఇద్దామని చూసాను కానీ, వ్యాసం పేరు గుర్తు లేక..వెదకలేకపోయాను. ఈపేపర్ నుండి దిగుమతి చేసిన పీడీఎఫ్ ఇక్కడ. ఇంతకీ విషయం ఏమిటంటే :

పాత కాలం నాటి తెలుగు పత్రికలన్నీ (ఆంధ్రపత్రిక పేరైతే గుర్తుంది. మిగితావి గుర్తు లేవు. నేను ఆ వ్యాసాం చాలా క్యాజువల్ గా చూసి వదిలేశా నిజానికి) డిజిటైజ్ చేస్తున్నామనీ, త్వరలో ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులో అవన్నీ పెడతామనీ ఆ వార్తలో అన్నారు. అక్కడ ఇది ప్రారంభిస్తున్న దృశ్యం కూడా ఉంది. చదివి, ఓ…మంచి ఆలోచనే..అనుకున్నా. ఇప్పుడు ప్రెస్ అకాడెమీ వెబ్సైటు కోసం వెదుకుతూ ఉంటే, నాకు 2004 నాటి మరో వార్త – హిందూ పత్రిక పేజీల్లో కనబడ్డది. (అది ఇక్కడ.)

అంటే…ఐదేళ్ళ బట్టీ వీళ్ళు… చేద్దాం అనుకుంటూనే ఉన్నారనా? లేక…మధ్యలో ఏమన్నా ఐందా? పైగా, అప్పటి న్యూసైటెం లో “The academy had already taken up digitisation of old newspapers on a small scale and so far about 16 lakh pages had been digitised. A sum of Rs. 18 lakhs had been spent so far and the academy intended to take up a massive digitisation project covering all major newspapers and weeklies published from the State. A grant of Rs. 30 lakhs had been made to the academy, he said. ” అన్నారు. “He said all newspapers which would be digitised would be preserved and compact discs would be made. This would involve about Rs. 1 crore, he said adding the academy was serious about going ahead with the project.” అని కూడా అన్నారు.

ఇప్పుడేమో మళ్ళీ అరవై లక్షల నిధులు మంజూరు చేసారంట! వీళ్ళ పనే బాగుందే! అనుకున్నా.

ఇంతకీ, నాది ఇంకో సందేహం…ఇవన్నీ చేసి, నిజంగానే ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని, ఆ కోట్లన్నీ తగలేసి దానిలో ఎంతో కొంత నిజంగా దీనిపై ఖర్చుపెట్టి మన వాళ్ళు దాన్ని ఆ ప్రెస్ అకాడెమీ వెబ్సైటేదో (నాకు కనబళ్ళేదు ఇంకా)..అందులో పెట్టారనుకుందాం…మనమెలా చదువుకోవాలన్నట్లు? ఏదో 1940 మార్చి ఐదున ఏం జరిగిందో మనకి అవసరమంటారా? లేక, ఫలానా సభలో ఫలానా వారేమన్నారో? అన్న విషయం కోసం వెదుకుతామా? – అంటే, నా ఉద్దేశ్యం – Search సౌలభ్యం ఉండాలి కదా అని. వీటన్నింటికీ సర్చి సౌకర్యం ఎప్పటికొస్తుందో లెండి, అది వేరే విషయం. కౌముది వారు ఇదివరలో వాళ్ళ పీడీఎఫ్ ఫైళ్ళలో keywords index చేయడం ద్వారా శోధన కొంతవరకూ పెట్టారు. (ఇది సెప్టెంబర్ 2007 ప్రాంతంలో వారి సైటులో ఉన్న ప్రకటన. అప్పట్లో వారిని ఏం చేస్తున్నారని సంప్రదిస్తే, yuyam వెబ్సైటు వారి ద్వారా ఇది చేస్తున్నామని చెప్పారు.

ఏమిటో… ముందు 2004 లో లక్షలు పోసిన వాటికి కాళ్ళొచ్చి ఎటుపోయాయి? అని అడిగితే చెబుతారంటారా?

Published in: on May 19, 2009 at 10:52 am Comments (1)

ఇది నాస్తికత్వమెలా ఔతుంది?

ఈ ప్రపంచికం లో మతాలకేం కొదువ? హిందూ మతం…క్రిష్టియన్ మతం, ఇస్లాం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, Zorastrianism, బహాయ్ మతం, కంఫ్యూజియనిజం, Judaism, Shintoism…వగైరా వగైరా బోలెడు మతాలున్నాయి….  నా వరకు నేను అర్థం చేసుకున్న మతం – అదొక జీవన విధానం అన్న అర్థం లో. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి అన్నట్లు ఉన్నా ఇన్ని రోజులూ. ఈరోజు ఈ బ్లాగు రాస్తా అనుకోలేదు కానీ… ఇక ఉండబట్టలేక బహిరంగంగా గోడు వెళ్ళబోసుకుంటున్నా :)

ఏం చెప్పమంటారు? ఏమిటో… నాకీ మధ్య “మానవ సేవే మాధవ సేవ” అన్న మాటలు మునుపెన్నడూ లేనంత నిజం అనిపిస్తున్నాయి. “దేవుడెక్కడో లేడు… నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు… మనందరిలో ఉన్నాడు” అన్న భావన ఎక్కువైంది… ఈ ప్రభావం లో ఈ పూజలూ, పునస్కారాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది.  మామూలుగానే ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు తప్ప నేనెప్పుడూ పెద్దగా రిలీజియస్ కాదు…నాకు గుర్తున్నంత వరకూ. చిన్నప్పుడు అయితే, ఆయన నేర్పేవాళ్ళు కనుక ఏదో ఆ శ్లోకాలు అవీ చదవడం వంటివి చేసేదాన్ని. కానీ, ఇటీవలి కాలం లో గుళ్ళకు వెళ్ళడం కూడా ఏదో ఓ ఔటింగ్ లాగా, కాస్త రిలాక్సేషన్ కోసం ఆ వెళదాం అన్న వాళ్ళతో వెళ్తున్నా కానీ… మరింకే కారణానికీ కాదు…. ఈ విషయం పైనే రెండు రోజులుగా నా స్నేహితురాలితో చర్చలు. నువ్వు నాస్తికురాలివి అంటుంది ఆమె. నేనెట్ల నాస్తికురాలినౌతాను? (అసలెవరైనా నాస్తికులు కాలేరని నా నమ్మకం. ఏదో ఓ దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు కదా…ఆ సిద్ధాంతమే దైవం మరి!) అని నేనంటాను.  మా చర్చ ఇలా ఉంది… యధాతథంగా కాదు కానీ… ఈ విధంగా-

“నేను నాస్తికురాలిని అని ఎవరన్నారు?”

“మరి నువ్వు దేవుణ్ణి నమ్మవు కద?”

“అసలు నేను నమ్మను అని ఎవరన్నారు?”

“మరి పూజలు అవీ ఇష్టం లేదు అన్నావు కదా?”

“అయితే? దేవుణ్ణి నమ్మనా?”

“మొన్నోరోజు విగ్రహారాధన కూడా నచ్చట్లేదు అన్నావు కదా?”

“అవును, అయితే? నాస్తికురాలినా?”

“దేవుణ్ణి నమ్మకపోతే నాస్తికులనే అంటారు!”

“మొదటగా ఒక విషయం – నాకు పూజల మీద ఆసక్తి లేదు అని మాత్రమే అన్నాను. విగ్రహారాధన కూడా అంతే. నాస్తికత్వానికి, వాటికీ తేడా ఉంది.”

“సరే. ఇప్పుడేమిటంటావ్?”

” అంటే నువ్వు నమ్మే దేవుడికి నేను పూజ చేయకపోతే నేను నాస్తికురాలినా? ఈ లెక్కన నీకు క్రిశ్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ నాస్తికుల్లానే కనబడాలే?”

“అలా ఎలా అంటాను? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కున్నారు…”

“మరి నా దేవుళ్ళు నాకూ ఉన్నారు.”

“ఎవరు?”

“మీరే…”

“??”

“మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడే. ఇంకో ప్రాణికి ఉపయోగపడే ఏ ప్రాణైనా దేవుడే. మనుష్యులకు ఉపయోగపడే వస్తువులు కూడా దేవుళ్ళే మరి (దేవుడు చేసిన దేవుళ్ళు అనాలేమో వీటిని…హీహీ)”

“అది వేరు…”

“అదే మరి. నాకు అది వేరు కాదు.”

“ఇంత మంది నమ్ముతున్నారు కదా….”

“నేను వాళ్ళనేమన్నా అన్నానా? నేను ఈ దేవుళ్ళను నమ్ముతా అంటున్నా. ఎవరి మతం వారిది..ఎవరి జీవితం వారిదీ”

- ఇక్కడ ఆగింది ఈరోజుకి.

నా మీద “సత్యమే శివం” ప్రభావం బాగా ఉంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపించింది ఈ చర్చ ను బట్టి. ఏమైనా, నేను ఒక దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం ప్రకారమే జీవిస్తున్నాను. ఆ నమ్మకం తోనే జీవిస్తాను, ఏదో జరిగి నన్ను బలంగా కదిలించి నా మతం తప్పు అని నిరూపిస్తే చెప్పలేం కానీ. నా మతం వల్ల నా తోటి వారికి జరిగేది మేలే. నా మతం ఆచారాలు(??) నేను పాటిస్తూనే ఉన్నాను. మరి అలాంటప్పుడు నేను నాస్తికురాలినెట్లవుతా? అది కూడా నాకెక్కడా ఏ మతం మీదా ద్వేషం లేనప్పుడు….నాకు దేవుడు ఉన్నాడు అన్న దృఢమైన  విశ్వాసం ఉన్నప్పుడు?

నాకు తెలిసిన సత్యమే నా శివం.  అప్పుడు నాస్తికత్వానికి తావేదీ?

Published in: on September 21, 2007 at 10:55 am Comments (20)

మళ్ళీ బడికి!

మా ఆషాకిరణ్ స్కూల్ మళ్ళీ తెరుచుకుంది ఎట్టకేలకు బాలారిష్టాలన్నీ దాటుకుని. నిన్న మూడో రోజు. ఈ వానొకటి తగలడి వరుసగా – సున్నా,రెండు,నాలుగు మంది పిల్లలు ఈ మూడు రోజుల్లో. మళ్ళీ పిల్లల మధ్యకు… “మళ్ళీ బడికి” వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ టపా తో ఓ గేమ్ ని గురించి కొంచెం కారంగా, కొంచెం గారంగా చెప్పడం, మీనుంచి మీకు తెలిసిఉన్నచో పంచుకోవాల్సిన ఓ విషయం తెలుసుకోడం నా ముఖ్య ఉద్దేశ్యం.

నల్గురు పిల్లలు…ఇద్దరు జూనియర్ బ్యాచ్, మిగితా ఇద్దరు సీనియర్ బ్యాచ్. రెండు బ్యాచ్ లకీ రీడింగ్ సెషన్ ఈరోజు. కథలు. ఇదివరకటి కంటే వీళ్ళ Reading skills చాలానే అభివృద్ధి చెందాయి. మంచిదే. దీని ఆషాకిరణ్ కారణం అనేమీ చెప్పలేము. వాళ్ళు ఒక ఏడు పెద్దవారవడం కావొచ్చు, లేకుంటే వాళ్ళ సర్కారీ బళ్ళో నిజంగానే బాగా చెప్పారేమో ఈ మధ్య. ఏదైనా, నాకైతే ఆనందం కలిగింది వాళ్ళ performance కి. సరే, ఓ గంట అలా ఈ పుస్తక పఠనం అయ్యాక “అబాకస్” అని ఒక ఆట మొదలుపెట్టాం… నల్గురు పిల్లలు ఆట. మేము పక్కన చూడ్డం. ఇదేమో snakes & ladders తరహా ఆట. కాకుంటే ప్రతి డబ్బా లోనూ ఏదో లెక్కల సమస్యలు ఉంటాయి… నీ డైస్ పై ఉన్న సంఖ్యల మధ్య తేడాని రెండు తో గుణించి అన్ని గళ్ళు ముందుకు వెళ్ళు అనో, లేకుంటే.. నీ డైస్ పై ఉన్న సంఖ్య ల కూడిక పదైతే ఒక గడి ముందుకు, లేకుంటే మూడు గళ్ళు వెనక్కో..అలా ఏదో. ఒక విధంగా ఈ ఆట పిల్లలలు చాలా ఉపయోగకరం…mental math కోసం. అయితే, సమస్యల్లా ఏమిటీ అంటే – ఇది పూర్తి చేయాలంటే ఓ రోజు పడుతుంది కాబోలు. ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వెళ్ళడం ఖాయం. ఆటన్నాక మరీ ఇంత పెస్సిమిస్టిక్ గా ఉంటే ఎలా? ప్రతి చోటా – “else move backward…” అన్న కండీషన్ వర్తించే అవకాశాలే ఎక్కువ. మొదట్లో కాసేపు ఇది కాస్త విసుగు పుట్టించింది కానీ, కాసేపయ్యేసరికి మునిగిపోయారు పిల్లలు అందులో. మళ్ళీ రేపు కూడా ఆడదాం అని చెప్పి దుకాణం కట్టేయాల్సి వచ్చింది. :)

ఈ ఆట ఆడించే క్రమం లో ఓ పెద్ద సమస్య భాష. ఆ ఆట లో గళ్ళపై అంతా ఆంగ్లం లో రాసి ఉండటం వల్ల పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు. మేము పక్కనే కూర్చుని వాళ్ళకి ప్రతిసారీ వివరించాల్సి వచ్చింది. ఎటొచ్చీ వాళ్ళకి దీని వల్ల కూడా కొత్త పదాలు తెలిసాయి…అది వేరే విషయం. కానీ, నాకు తెలియాల్సింది ఏమిటీ అంటే – ఇలాంటి ఆటలు తెలుగు లో రాసి దొరుకుతాయా? అంటే గళ్ళలో అంగ్లం కాక తెలుగు. ఎక్కడా దొరక్కపోతే మేమే తయారు చేస్తాం ఏమో..చెప్పలేను కానీ, ఎంతైనా ఆ కంపెనీల బోర్డుల లుక్ రాదు కదా మేము తయారు చేసిన బోర్డు కి? అందుకని, తెలుగు లో రాసి ఉండేవి దొరికే అవకాశాలుంటే చెప్పండి… కొనుక్కుని ఆషాకిరణ్ కి ఉపయోగిస్తాం. పిల్లలకే ఇంగ్లీషు నేర్పుకోవచ్చు గానీ, వాళ్ళకి తెలుగే కాస్త ఇప్పుడిప్పుడు సరిగ్గా చదవడం, రాయడం వస్తోంది… కనుక కొన్నాళ్ళాగుదాం అని.

మీకు ఈ తెలుగు లో ఇంగ్లీషు ఆటలు (హాహా) ఎక్కడన్నా దొరికే చోటు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి…

Published in: on September 20, 2007 at 3:24 am Comments (7)

ఈ విషయం లో మీ మాట ఏమిటి?

ఈరోజు మళ్ళీ ఆ మూడో ప్రాజెక్టు మీద రెండో ఫీల్డ్ ట్రిప్. అర్థం కాలేదా? ఆషాకిరణ్ వి రెండు ప్రాజెక్టులు గా చూస్తాను నేను. (ఇది నాకు సంబంధించిన AK Activities మాత్రమే. మిగితా విషయాలున్నా నేను పట్టించుకోను) – స్కూల్, మెడికల్ క్యాంప్ లు. మూడోది మొన్న వెళ్ళిన ఫీల్డ్ ట్రిప్ కథ. కొందరు వ్యక్తులు పిల్లల చదువు కి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు అని చెప్పిన ట్రిప్ కి ఇది రెండో భాగం. ఇందులో ఓ చిన్న సందేహం ఉదయించింది నాలో. అది ఇక్కడ -

ఒక argument ఏమిటి అంటే – పనిలోకి వచ్చిన పిల్లల్ని మనం మళ్ళీ ఫుల్ టైం చదువులోకి దింపుతున్నప్పుడు ఆ చదువుకయ్యే డబ్బేకాక వాళ్ళ పని ద్వారా వచ్చే డబ్బు ను పోగొట్టుకుంటున్నారు కనుక అది కూడా మనమే ఇవ్వాలి అన్నది. నేనో పట్టాన దీన్ని ఒప్పుకోలేకపోతున్నా. అన్నీ మనమే ఇస్తే ఇక వాళ్ళు చేసేదేముంది అన్నది నా వాదన. వాదన కాదు లెండి…ఆలోచన. నేనేమీ మాట్లాడలేదు ఈ విషయం పై చర్చ జరుగుతున్నంత సేపు. ఊరికే వింటూ ఉన్నా. వాళ్ళకి మనం సాయం చేయాలి కానీ, ప్రతీదీ మనమే చేయడం అంత సబబు కాదేమో అనుకుంటున్నా. అంటే, వాళ్ళు చదువు మానేయడం లో మొదటి కారణం ఆ డబ్బే కానీ, మనం చదువుకే కాక జీవితావసరాలకు కూడా ఇవ్వాలా? అన్నది ప్రశ్న. మీరు ఏమంటారు? ఓ పక్క చదివిస్తున్నాం కదా, వాళ్ళ జీతం కూడా మనమే ఇచ్చుకోవడం అవసరమా? ఒక వేళ ఇచ్చామే అనుకోండి – అలా ఎంతమందికని ఇవ్వగలం? అసలది నాకైతే పర్సనల్ గా అంత మంచి ఆలోచనగా అనిపించడం లేదు. వాళ్ళ బాగు కోసం ఆలోచించినా కూడా వికటించే లా ఉంది ఈ ఆలోచన. మీ అభిప్రాయం ఏమిటి?

Published in: on September 8, 2007 at 6:00 pm Comments (6)

మాటసాయం తరువాత?

మా ఆషాకిరణ్ కు చెందిన ఒకానొక మెడికల్ క్యాంఫ్ లో వాలంటీర్ గా నేను ఉన్నప్పుడు …. ఒకానొక అని ఏముంది కానీ .. ఏ మెడికల్ క్యాంప్ అయినా కూడా …. జరిగిన సంఘటన – ఈ రోజు Britta Das అన్న physiotherapist భూటాన్ లో తన అనుభవాల గురించి రాసిన Buttertea at sun rise పుస్తకం చదువుతుంటే గుర్తు వచ్చింది.

మెడికల్ క్యాంప్ కి వచ్చే వారిలో ఆడవారు ఎక్కువే. ఇలా వచ్చేవారు దాదాపు 90 శాతం కూలి పనికి వెళ్ళేవారే అయి ఉంటారు. తక్కిన వారు ముసలి వారు, చిన్నపిల్లలూ నూ. ఈ ఆడవాళ్ళలో చాలా మంది సమస్యలకు మూలం – సరైన ఆహారం లేకపోవడం లేదా, వారి శక్తి కి మించిన బరువులు ఎత్తడమే. దీనికి పరిష్కారమంటూ బలానికి ఏవో మాత్రలు ఇచ్చినా కూడా వారికి చివరగా “సరిగా తినండి, మరీ శక్తికి మించిన పని చేయకండి” అని చెబుతూ ఉంటారు వాలంటీర్లు, డక్టరూ.

అలా చెప్పడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వినరు. వినరు అనే కంటే పరిస్థితులు వారిని విననివ్వవు అని చెప్పొచ్చు అనుకుంటా. ఇబ్బందిగా నవ్వి వెళ్ళిపోతారు. కానీ, అంతకంటే ఏమీ చెప్పాలో కూడా అర్థం కాదు నాకైతే. ఒక విధమైన నిస్సహాయత ఆవరిస్తుంది అది చూస్తూ ఉంటే. మాట సాయం మినహా చేయగలిగేదేమీ ఉండదు. కానీ, ఏమన్నా చేయలేమా వీరికోసం అన్న ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది.

ఈ రోజు Britta Das అనుభవాలు చదువుతూ ఉంటే ఎందుకో గానీ ఆ నిస్సహాయతే గుర్తు వచ్చింది నాకు.ఎప్పటికన్నా ఈ పరిస్థితి మెరుగుపడాలి అని ఆశావహ దృక్పథం తో ఎదురుచూట్టం కన్నా చేయగలిగేది ఏమన్నా ఉందా?

Published in: on May 26, 2007 at 1:53 pm Comments (4)