సందీప్ పాండే గురించి

సందీప్ పాండే ఎవరు? అన్న ప్రశ్న నుండి మొదలుపెడితే, ఆయన Asha Foundation వ్యవస్థాపకుల్లో ఒకరు. 2002లో రామన్ మెగసేసే అవార్డు గ్రహీత. భారద్దేశానికి చెందిన వారిలో అందరికంటే చిన్న వయసులో ఈ అవార్డు పొందిన వ్యక్తి. Active social activist. ఆయన కార్యరంగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్. వ్యక్తిగత విషయాలకొస్తే, UC-Berkeley లో Mechanical Engineering లో PhD చేసారు. తరువాత రెండేళ్ళు IIT-Kanpur లో పని చేసి, 1993 లో పూర్తి స్థాయి సమాజ సేవకుడిగా మారిపోయారు.

నిన్న రాత్రి IIIT లో ఆయన ప్రసంగం ఉండింది. మాకొచ్చిన మెయిల్ సారాంశం ఇదీ:

Dr Sandeep Pandey will talk about his experiences as a social
activist in the rural areas of Uttar pradesh. He will touch upon
the themes of Right to Information, Right to Food, Right to Work,
Right to Education, Harmony in community, Nuclear disarmamemt,
Peace and Anti-Globalisation.

ఆయన గురించి చెప్పడానికి చాలానే ఉంది నిజానికి. అంతా ఈ చిన్న టపాలో కూర్చాలనుకోవడం మరీ అతి చేయడమే. అందుకని, నేను చెప్పదలుచుకున్నవి మాత్రం చెబుతాను. :) ఇంతకీ, కాలేజీ లో ప్రసంగం లో RTI అని మొదలైనా కూడా, అణు ఒప్పందం, SEZs, Social inequality, poverty వంటి విషయాలు మొదలుకుని Globalisation, Over-population దాకా ఎన్నో విషయాల మీద సాగింది. విన్నవారి ప్రశ్నలని బట్టి ప్రసంగం రూటు మారుతూ వచ్చింది. వింటున్నంత సేపూ నన్ను ఆకట్టుకున్నది ఆయన లో ఉన్న simplicity. చెప్పదలుచుకున్నది స్పష్టంగా, సూటిగా చెప్పడం, చెప్పిన దానిపై ఎక్కడా నమ్మకం సడలకపోవడం. ఆయన చెప్పినవన్నీ నాకు నచ్చాయని కాదు. కొన్ని చోట్ల మరీ idealist లాగా అనిపించాడు. కొన్ని చోట్ల పూర్తి ఆధునికతకి వ్యతిరేకిలా అనిపించాడు. అయినప్పటికీ కూడా, సామాజిక విషయాలపై ఓ సమాజ సేవకుడి మాటలు, అదీ ఈ స్థాయి వ్యక్తి మాటలు లైవ్ వినడం నాకు ఇదే మొదటి సారి. తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉండింది. అణుఒప్పందం గురించి ఇప్పటిదాకా చదవని point of view ని ఆయన Buddha weeps in Jadugoda అన్న కథలో చెప్పారు. ప్రస్తుత అణుఒప్పందం పై ఈ కోణంలో ఇప్పటిదాకా పేపర్లలో అయితే చదవలేదు నేను. వేరే context లో ఈ విషయాల గురించి చదివినా కూడా. పాండే గారి వివరణలు ఈ విషయంలో వారి పరిశోధనని గురించి చెప్పాయి. RTI ఎలా మొదలైంది అన్న కథ కూడా నచ్చింది నాకు.

పొద్దున్న ఆయనదే ఒక వీడియో చూసాను. ఇది ఒక అరగంట సాగే ఆయన ఇంటర్వ్యూ. వివిధ విషయాల మీద ఆయన అభిప్రాయాలు. ఇక్కడ కూడా నాకు నచ్చింది ఇదే. ఆయన లో ఉన్న స్పష్టత, simplicity. చెప్పిన విషయాలన్నీ మనం ఒప్పుకుంటామా లేదా అన్నది వేరే విషయం. ఒక మనిషికి తాను చేస్తున్న పని సరైనదని పూర్తి నమ్మకముంటే, అది ఎలా ఉంటుందో పాండే మాటల్లో తెలుస్తోంది నాకు :) ఒక విధంగా నిన్నటి ప్రసంగం నాకు నిరాశే కలిగించి ఉండాలి. కానీ, Sandeep Pandey – the man గురించి కాస్త ఎక్కువ తెలుసుకునే అవకాశం కల్పించింది కనుక, క్షమించేస్తున్నా ;)

Published in:  on August 5, 2008 at 10:45 am Comments (1)

Rosy గారితో కాసేపు

నాకూ, ప్రశాంతికి మధ్య జరిగిన ఓ ఆన్లైన్ సంభాషణ లో రోసీ గారి గురించి తెలిసింది. చందానగర్ లో ఒక స్లం ఏరియా లో ఓ స్కూలు పెట్టి (ఫుల్ టైం స్కూల్) నడుపుతున్నారు అని. నాకు కాలేజీ నుండి దగ్గరే కదా, అని ఆవిడ కాంటాక్ట్ డీటైల్స్ సంపాదించి ఈరోజు కలిసాను. కలిసి వచ్చాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. ఆవిడ ప్రచారం ఇష్టం లేదన్నది కానీ, నా ఉద్దేశ్యం లో మంచి పని చేసేవాళ్ళ గురించి ఇతరులకి చెప్పడం లో తప్పు లేదు. పైపెచ్చు, స్పూర్తి కూడా కలిగిస్తారు వాళ్ళు.

ఇంతకీ, నేను చందానగర్ స్టేషన్ దగ్గర కలుస్తా అని చెప్పాను. దానికి వచ్చే దారిలోనే అర్థమైంది అక్కడి మనుష్యుల living standards. స్టేషన్ దగ్గర పాపిరెడ్డి కాలనీ అని ఉంది. అక్కడ కాస్త నయం… పక్కా ఇళ్ళూ అవీ కనిపించాయి. ఇంతకీ ఆమెని కలిసాను. తర్వాత, వాళ్ళ స్కూలుకి తీసుకెళ్ళారు. ఆ కాలనీ లోనే కాస్త ముందుకెళితే, SVN school అని కనిపించింది. శారదా విద్యా నికేతన్ అట పూర్తి పేరు. స్కూల్లో నలభై మంది పిల్లలు. అందరూ ఇదివరలో కాగితాలేరడమో, అడుక్కోవడమో చేసిన పిల్లలే. ఒకరిద్దరి నుండి వారి కథలు కూడా విన్నాను. ఈ స్కూల్లో ఓ మానసిక వికలాంగుడైన అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ మొదట స్కూల్లో చేరక ముందు ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉన్నారు? అన్నది రోజీ గారు చెబుతూ ఉంటే ఆశ్చర్యమేసింది.

ఇది కాక ఓ అనాథ శరణాలయం కూడా నడుపుతున్నారు ఈమె. దానికి నేను వెళ్ళలేదు..కనుక దాని వివరాలు పెద్దగా తెలీవు.

ఇది మా  ఆషాకిరణ్ మాదిరి కాదు. ఫుల్-టైం బడి. కనుక, పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టవచ్చు. ప్రస్తుతమున్నది అద్దె భవనం. త్వరలో సొంత భవనం కట్టుకోగలం అన్నది ఆమె ఆశ. ఇంతకీ, వింత ఏమిటీ అంటే, అక్కడ చెప్పుకోదగ్గ ఫండింగ్ అంటూ రెగులర్ గా ఏదీ లేదు. ఆమె, కుటుంబ సభ్యులే దీనికి మహారాజ పోషకులు. అంటే, వాళ్ళేదో మహా వీర ధనవంతులని కాదు. వాళ్ళకి ఉన్న దానిలోనే ఇదంతా చేస్తున్నారు. ఇటీవలే applabs వాళ్ళు వచ్చి నోట్ బుక్స్ అవీ ఇచ్చారట స్కూలుకి. ఆవిడ ద్వారా ఆ కాలనీ వాసుల జీవితాలూ…వారి కష్ట నష్టాల్లోకి తొంగిచూడగలిగాను. నాకు బయటి ప్రపంచం తో అందునా, ఆ తరహా ప్రపంచం తో సంబంధాలు తక్కువే. కనుక, నాకు వాళ్ళ గురించి చెప్పడం ద్వారా సమాజం లో నేనూ ఉన్నా కనుక సమాజానికి నేనూ ఏదో చేయాలి అని మళ్ళీ గుర్తు చేసిన రోజీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోను?

ఇది ఇంట్రో టపా. మరో కొద్ది రోజుల్లో మరో టపా వివరంగా రాస్తాను ఈ ట్రిప్ గురించి.

Published in:  on March 20, 2008 at 11:16 am Comments (6)

మా స్కూల్ లో ఓ చిచ్చర పిడుగు

ఈ చిచ్చర పిడుగు అన్న పదం ఇక్కడ వాడొచ్చో లేదో నాకు తెలీదు కానీ….. ఇక్కడ మొన్న సోమవారం నాడు వచ్చిన ఓ పిల్లని గురించి చెప్పడానికి ఇంతకంటే నాకు మంచి పదం కనబళ్ళేదు…

ఆ పిల్ల ఎల్కేజీ చదువుతోందట. వయసు ఏడేళ్ళట…ఏడేళ్ళకి ఎల్కేజీ ఏమిటి అనకండి…. అదంతే. పిల్ల బాగా తెలివితేటలు గలది…చురుగ్గా ఉంది. మూడు భాషల్లోనూ అక్షరాలు రాయడం వచ్చు. ఏడేళ్ళప్పటికి నాకైతే హిందీ రాదు మరి. మూడో తరగతి నుండి ఉండేది మాకు హిందీ…ఆ పిల్లకి అప్పుడే ఎలా వచ్చేసిందో ఏమో గానీ. ఎక్కాలొచ్చట…కొంతవరకూ. తెలుగైతే గుణింతాలు కూడా వచ్చు. ఏదడిగినా చురుగ్గా చేసేస్తోంది…వేగంగా కూడానూ. సరే, ఆ పిల్లని ఎంగేజ్ చేయాలని, మా స్కూల్ కి సంబంధించిన ఆషా మేడం కి తెలుగు అక్షరాలు నేర్పమని అన్నాం నేను, ఆషా గారూనూ. (ఆమె కి తెలుగు తెలియదు). ఆ పిల్లల సైకాలజీ ప్రకారం చూస్తే వాళ్ళు సిగ్గుపడి చెప్పననాలి. కానీ, ఈ పిల్ల దొరికిందే చాన్స్ అని చెప్తా అన్నది.

కాసేపు నేను వేరే పిల్లల గొడవ లో పడి వీళ్ళని చూడలేదు. తరువాత చూస్తే – “ఇది తప్పు రాసావు. ఇలా రాయకూడదు…ఇలా రాయాలి…” అనుకుంటూ ఏదేదో చెబుతూ ఉంది ఈ పిల్ల ఆషా గారికి :) ) నిజం చెప్పొద్దూ…భలే నవ్వు వచ్చింది. పైగా, ఆవిడ అక్షరాలు రాస్తే, కరెక్షన్ కూడానూ! ఓ పక్క నవ్వొస్తోంది.. ఓ పక్క ఆ పిల్లని చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది. ఆ స్కూలుకొచ్చిన పిల్లల్లో నేను – కాస్త చురుగ్గా, ఆత్మవిశ్వాసం తో నిండి ఉండి, మరీ అల్లరిగా కాక బుద్ధిగా ఉండే పిల్లల్ని ఇద్దరినే చూసాను. ఒకరు మీనా, ఇది వరలో రెండు మూడు సార్లు ఈ బ్లాగులోనే రాసాను తన గురించి. రెండో పిల్ల ఈ అమ్మాయి శిరీష. అందులో మీనా అందరికంటే పెద్ద పిల్ల, ఈమె దాదాపు అందరికంటే చిన్న పిల్లానూ.

ఏమైనా కూడా ఈ పిల్ల ఇలాగే ఉంటే మంచి స్థానానికి వస్తుంది జీవితం లో అని అనిపిస్తోంది.

Published in:  on September 26, 2007 at 1:27 pm Comments (4)

Happy Teachers Day!

ఒకరోజు ఆలస్యంగా అయినా కూడా నేను కొందరు చిన్ని గురువులకి టీచర్స్ డే శుభాకాంక్షలు వెబ్ముఖంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ బ్లాగు ని చూస్తూ వచ్చిన వారెవరైనా వాళ్ళెవరో వెంటనే కనుక్కుంటారు అనుకుంటా. అదేమా ఆషాకిరణ్ పిల్లలు. సాధారణంగా పిల్లలు టీచర్లకు విషస్ చెబుతారు. మరిక్కడ టీచరే పిల్లలకి ఎందుకు చెబుతోంది అంటేనేను వాళ్ళకి పాఠాలు చెప్పడానికే వెళ్ళినా కూడా అక్కడినుండి గత సంవత్సర కాలం లో నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో! అందుకే నేనే వాళ్ళకి వెబ్ముఖంగా విష్ చేస్తున్నా :) నేను ప్రస్తుతం ఇంట్లో ఉన్నా కనుక వాళ్ళకి పర్సనల్ గా చెప్పలేను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సెమెస్టర్ స్కూల్ నడవడం లేదు కనుక వాళ్ళని కలవనూ లేను. సో, మళ్ళీ ఈ హృదయభాను పోస్టు :)

నిజానికి, సరైన దృష్టి తో చూడాలే కానీ, ఎక్కడి నుంచి నేర్చుకోలేము? ఎవరి నుంచి నేర్చుకోలేము? సత్యమే శివం లో కమల్ హాసన్ ప్రతి మనిషి లో నూ దేవుడు ఉన్నాడు అన్నట్లు…. ప్రతి వస్తువు లోనూ టీచర్ ఉన్నాడు/ఉంది. ఈ విషయం నేనే కాక ఇంకెవరన్నా నాకు చెప్పుంటే మునుపైతే – “ఏదో చెప్తునారు.. మనటైప్ కాదు ఈ కహానీలు…” అనుకుని వదిలేసేదాన్ని కానీ, అందులోని నిజం ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేను. టీచర్ అంటే స్కూల్లోనో, కాలేజీలోనో పాఠాలు చెప్పే వారు మాత్రమే కాదు. ఇంట్లో అమ్మ,నాన్న లు మొదలుకుని, మనల్ని ప్రభావితం చేసిన గొప్ప వాళ్ళు మొదలుకుని, ఈ క్షణం లో పరిచయమైన వ్యక్తి కూడా మనకు టీచర్ కిందే లెక్క. ఇక చెట్లు, చేమలు, జంతువులు, పక్షులుఒకటనేముంది, అన్నీ ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంటాయిఈ సంధర్భం లోనే నా ఆటోగ్రాఫ్ సినిమాలోని – “మౌనంగా నే ఎదగమని…” పాట గుర్తువస్తోంది.

సరే, సోదాపి విషయం చెప్పాలి కదూ! ఏం నేర్చుకున్నాను ఆ పిల్లల దగ్గర్నుంచి? – అతి ముఖ్యమైనదిసహనం. వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకున్నది కాదు లెండివాళ్ళ వల్ల నేర్చుకున్నది. తరువాత, వాళ్ళ నుండి నేర్చుకున్నదిపడి లేవడంవాళ్ళ లొ పడి లేవడం అంటే ఆటల్లో కింద పడ్డా కూడా దులుపుకుని లేచి ఆట కొనసాగించుకోడందెబ్బ గురించి ఆలోచిస్తూ ఉండకుండా. మరో విషయంచిన్న చిన్న ఆనందాలను పుర్తిగా అనుభవించగలగడం. వాళ్ళ వల్లే నాకు తెలిసిందిటీచింగ్ అన్న కళ ఎలా ఉంటే వినేవాళ్ళకు చక్కగా ఉంటుందో అని. వాళ్ళ వల్ల కూడా నాకు తెలిసిందిఏ బంధుత్వమూ, ఏ స్నేహమూ లేని బంధాలు కూడా అభిమానం, ఆప్యాయతలను పంచగలవు అని. నేనెక్కడ కనబడ్డా వాళ్ళు, వాళ్ళెక్కడ కనపడ్డా నేనుఅభిమానంగా పలకరించుకోడం చూస్తూ ఉంటే. అన్నింటి కంటే ముఖ్యమైన్దిఈ పిల్లలతో, వాళ్ళ కుటుంబాలతో గడిపిన సమయమ్ చెప్పిన బ్రతుకు పాఠాలుఇంకెక్కడా దొరకని పాఠాలు అవి. మరిన్ని చెప్పిన వారిని టీచర్స్ డే నాడు ఓ సారి తలుచుకోవద్దూ? ఇదంతా పిల్లలకి ఎలాగో చెప్పను కనుక, ఎవరికో ఒకరికి చెప్ఫాలి కనుక, వెబ్ముఖంగామా ఆశాకిరణ్ పిల్లలకి టీచర్స్ డే శుభాకాంక్షలుఫ్రం one of their teachers :)

Published in:  on September 6, 2007 at 4:50 am Comments (4)

Where teachers fear students

ఆ మధ్య ఓ రోజు శాంతి మేడమో ఎవరో ఒక పిల్లాడికి బండి లో అమ్మే పానీపూరీలు అవీ ఇవీ అన్నీ తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారంట. అప్పుడు నేను లేను. నా స్నేహితురాలు ఉంది. ఆ మాట వినగానే ఆ పిల్లాడు వెంటనే నా స్నేహితురాలిని చూపించి – “ఈ టీచర్ కూడా తింటుంది అక్కడ” – అని accusative Tone లో చెప్పాడట! కాసేపటికి నేను వెళ్ళాను. నా స్నేహితురాలు నాతో ఇది అంతా చెప్పింది. ఇద్దరికీ నవ్వు వచ్చింది. నేను ఏదో ఒకటి అనాలని వాడిని పిలిచి – “నువ్వెప్పుడు చూసావు రా?” అని అడిగా. ” ఆ రోజు నువ్వు కూడా ఉన్నావ్ టీచర్ అక్కడ” – అన్నాడు. ఇంక చూడాలి నా మొహాన్ని! నేను, నా నేస్తం ఇద్దరం చాలా నవ్వుకున్నాం. దెబ్బకి చాలా రోజుల దాకా నేను ఆ బండి జోలికి పోలేదు. మొన్నో రోజు ఓ ఫ్రెండు బలవంతం మీద వెళ్ళా. అదీ చుట్టుపక్కల చూసుకుని!

ఇంకో స్నేహితుడి అనుభవం: అతడికి సిగరెట్ అలవాటుంది. ఉన్నట్లుండి ఓ రోజు ఆషాకిరణ్ లో ఒక అమ్మాయి ని చూసి షాక్ తిన్నట్లు మొహం పెట్టాడు. ఎందుకని అడిగితే అసలు సంగతి చెప్పాడు. ఇతను సిగరెట్లు కొనే బండి ఆ అమ్మాయి నాన్నదంట! దానితో అన్నాడు – ” ఇంక నుంచి వేరే ఏదో బండి వెదుక్కోవాల్సిందే!” అని :)

ఆ మధ్య ఓ రోజు పిల్లలతో అవుట్ చేసుకునే ఆట ఆడుతూ అత్యుత్సాహం లో జారి పడ్డాను. అనుకోకుండా తరువాతి రోజు కూడా స్కూలు కి నేనే వెళ్ళాను. దెబ్బలు కనిపిస్తే ప్రశ్నలతో చంపేస్తారని ఫుల్-షర్టు వేసుకుని వెళ్ళాను. “ఏం టీచర్, చలేస్తోందా నీకు ఈ టైము కి?” “ఏం టీచర్, మళ్ళీ ఆడతావా మాతో?” (ఒకరిద్దరి ముసి ముసి నవ్వులు), “టీచర్, నిన్న దెబ్బ ఎక్కువ తగిలిందా టీచర్?” – concern. “టీచర్, నొప్పిగా ఉందా టీచర్?” – మరో సారి concern : ఇలా రకరకాల ప్రశ్నలతో దాడి చేసారు నా మీద :) కొన్ని ప్రశ్నలకు కాస్త embarassing గానూ, కొన్నింటికి వీళ్ళ శ్రద్ధ కు ఆనందంగానూ ఉండింది. కానీ, ఇంకో సారి ఫీట్లు చేసేటప్పుడు, అదీ వీళ్ళతో చేసేటప్పుడు కాస్త జాగ్రత్త గా ఉండాలి అని అర్థమైంది. లేకుంటే book అయినట్లే ఇంక. leg-pulling మొదలైంది అంటే ఆగదు – ఎక్కడైనా.. ఎవరినీ వదలకుండా satires వేసే నేను వాళ్ళ ప్రశ్నలకు మూగదాన్ని అయ్యాను!

టీచర్లకు పిల్లలే కాదు. పిల్లలకి టీచర్లు కూడా భయపడతారు! :)

Published in:  on March 3, 2007 at 3:11 am Comments (3)

Santhi madam Jindabad

        శాంతి మేడం IIIT లో ఒక Maths అధ్యాపకురాలు అని మాత్రమే తెలుసు నాకు ఇక్కడ చేరిన కొత్తల్లో. క్రమంగా నేను ఆషాకిరణ్ కు వెళ్ళడం మొదలుపెట్టాక ఆవిడ ఎంత ఓపిగ్గా పిల్లలకు పాఠాలు చెబుతారో చూస్తూ చూస్తూ ఆమెని నాకు తెలీకుండానే అభిమానించడం మొదలుపెట్టాను. గత వారం ఆమె ఏదో పని మీద సెలవు పై వెళ్ళారు. అప్పుడు గానీ తెలిసి రాలేదు నాకు అసలు కథ.
       ఆవిడ తో పాటు చాలా మంది వాలంటీర్లకు ఏవో పనులు ఉండడం తో ఈ వారం లో shortage వచ్చింది. దానితో నేను  మామూలు లా వారానికి ఓ రోజు కాకుండా వీలైనన్ని రోజులు వెళ్ళాలి అనుకుని అలాగే వెళ్ళడం మొదలుపెట్టాను. రెండో రోజే తెలిసొచ్చింది. పగలు మన పనులు చేసుకుంటూ,  సాయంత్రం నాలుగు కాగానే ఇంకో మేడం ఇంటికి వెళ్ళి, ఆరోజు చేయాల్సినవి ఏంటో కనుక్కుని, ఎవరికి ఏ exercises ఇవ్వాలో తెలుసుకొని ఆ రోజు పొరపాటున వాలంటీర్ల కొరత ఉంటే … multi-tasking చేస్తూ విజయవ్నతంగా స్కూలు ముగించి మళ్ళీ ఈ పిల్లల పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ మేడం కి ఇచ్చి ఆ రోజుటి స్కూలు గురించి snippets చెప్పడం నేను అనుకున్నంత తేలిక కాదని.

     అనుకున్నట్లు గానే వారం లో అన్ని రోజులూ వెళ్ళాను. వెళ్ళాక గానీ తెలీలేదు శాంతి మేడం కి ఎంత ఓపికో. నేనేం గొప్ప ఓపికున్న మనిషిని కాదు.  కోపం కొడా కాస్త ఎక్కువే. అయినా కూడా ఈ పిల్లల మధ్య కొపగించుకోలేదు … లేదా అలా ఉండడానికే ప్రయత్నించాను.  ఆ ప్రయత్నం లొ ఈ వారం నాకు మిగిల్చిన మధురానుభూతుల్ని పక్కన పెడితే – శాంతి మేడం నా  దృష్టి లో ఓ గొప్ప లెవెల్ కి ఎదిగిపోయారు ఈ వారం అనుభవం తో. నిన్న నా 5వ consecutive day to AK.  నేను ఉండలేకపోయాను. చాలా కష్టపడినట్లూ, ఈరోజుకి ఇంత మంది పిల్లల్ని manage చేయలేను అన్నట్లూ అనిపించింది. కాస్త విశ్రాంతిగా కూర్చుందాం అనుకున్నా…        

      ఈ మధ్య కాలం లో విపరీతంగా పెరిగిపోయిన కోర్స్ వర్కే దీనికి కారణం. రోజులో ఆ పనికి తప్ప దేనికీ సమయం లేని ఈ రోజుల్లో రోజుకి 2.5 గంటలు AK మీద invest చెయ్యడం కష్టమే కద మరి. నాకు నాలుగు రోజులకే ఇలా అనిపించింది అంటే – ఆవిడ నాకు తెలిసీ రోజూ వస్తారు. ఇల్లు, పిల్లలు, కాలేజీ ఇలా సవా లక్ష పనులు ఉన్న ఆమె పరిస్థితి లో నేను గనుక ఉండి ఉంటే – పారిపోయి ఉండేదాన్ని. :)

       శాంతి మేడం కి అసలు చిరాకు రాదు అనుకుంటా. :) అప్పుడప్పుడూ కాస్త … చాలా కాస్త కోపం ఐతే చూసాను. పిల్లలు విపరీతమైన అల్లరి చేసినప్పుడు అది కూడా. ఓ నేస్తం తో జరిపిన సంభాషణ వల్ల నేను 24 గంటల్లో నేను చెయ్యడానికి ఎన్ని పనులు ఉన్నాయో తెలుసుకుని … టైం లేదు అన్న మాటని నా డిక్షనరీ నుంచి తొలగిద్దామని అనుకున్నాక ఈ AK వారం జరిగింది. శాంతి మేడం ని చూసాక దానికి ప్రత్యక్ష రూపం అనిపించింది. శాంతి గారు జిందాబాద్ :)
    

Published in:  on December 23, 2006 at 12:18 pm Comments (1)

Dr Benjamin – one of the best docs I ever saw

          మొన్న ఆదివారం నాడు పొద్దున్నే 5:30 కి లేచా. ఇటీవలి కాలం లో నేను అంత త్వరగా లేవడం అసలు జరగలేదనే చెప్పాలి. దీనికి ఓ కారణం ఉంది. మా కాలేజీ ఆషాకిరణ్ వారు దగ్గర్లోని స్లం ఏరియా వారికి ఓ Medical Camp ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఆదివారాలు కాలేజీ కి సంబందించి ఏ ప్రోగ్రాములు నచ్చవు. అది ఎంత ఉదాత్తమైన దైనా సాధ్యమైనంత వరకు ఆదివారం అంటే నేను ఎవరన్నా నా బదులు వెల్తారా అనే చూస్తూ ఉంటాను. ఆదివారం ఒకటి దొరుకుతుంది అమ్మ తో గడపడానికి. ఇక ఆరోజూ నేను వీథుల్లో తిరుగుతూ ఉంటే ఎలా ? కానీ … ఈ సారి తెలుగు తెలిసిన వాళ్ళ కొరత ఉంది అంటే అయిష్టంగానే వస్తా అని చెప్పాను.

         అదిగో ఆ కారణాన కాలేజీ కి వచ్చి అక్కడినుండి మందులు నిండిన రెండు అట్టపెట్టెలతో నేనూ, రెంజిని అనబడు ఈ క్యాంప్ ని co-ordinate చేస్తున్న PhD Student నా కైనెటిక్ లో బయలుదెరాము. మిగితా వాలంటీర్లు కూడా మా వెనగ్గా వచ్చేసారు. కాసేపటికి డాక్టర్ గారు వచ్చారు. ఈ ఉపోద్ఘాతమంతా ఈయన గురించి చెప్పడానికే.

         డాక్టర్ బెంజమిన్ గారి గురించి నాకు ఆట్టే తెలీదు. అసలు ఆయన పేరు తెలిసిందే camp గురించిన minutes ని మాకు moderator మెయిల్ చేసినప్పుడు ! కానీ ఆయన పేషంట్లతో ఎంత బాగా మాట్లాడారో …. ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లు ఉంది. వాళ్ళ తో వాళ్ళ భాష లోనే సంభాషణ నడిపడం నాకు ఎంత గానో నచ్చింది. మధ్య మధ్య న మాక్కూడా ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెప్తూ వచ్చారు. తన అనుభవాలు, general health problems గురించి – ఇలా చాలా విషయాలు చెప్పారు. డాక్టర్ గారు ఆ జనాలను deal చేసిన తీరు నాకు బాగా నచ్చింది.

         గుడిసెల్లో ఉండే వాళ్ళ జీవితం గురించి నాకేం అవగాహన లేదు కానీ ఈరోజు చూస్తూ ఉంటే కాస్త తెలిసింది. వారికి ప్రధాన సమస్యలు రెండు ఏమో అనిపించింది. 1) పారిశుధ్య సమస్య 2)కాస్త ఆత్మీయమైన ఓదార్పు, ధైర్యం చెప్పడం. తాగుడు వంటి సమస్యలు ఉన్నాయి … కానీ నాకు ఇవి వాళ్ళు అక్కడికి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమో అనిపించింది. కొన్ని విషయాల్లో వారి నిస్సహాయత చూసి జాలి వేసింది. నేను ఏమన్నా చేయగలనా ? అన్న ప్రశ్న నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇలా నన్ను నేను ఎన్నో సార్లు ప్రశ్నించుకున్నా అనుకోండి. జీవితాంతం ఇలా ఎన్నో సార్లు ప్రశ్నించుకుంటూనే ఉంటా కూడా.

           అలాంటి ప్రశ్నలను …. సమాధానాలను వెదుక్కునే ప్రయత్నం లో కలిగిన అనుభవాలను చెప్పుకోడానికే కదా ఈ బ్లాగు ఉన్నది :) . ఇంతకీ బెంజమిన్ గారి తో మాట్లాడ్డం కుదర్లేదు కానీ – “Sir! hatsoff to U!అని చెప్పేదాన్నేమో మాట్లాడి ఉంటే. నేను ఇప్పటివరకూ మంచి డాక్టర్లను చాలా మందినే చూసా – ఈ తరహా సంధర్భం లో వాళ్ళు ఏం చేసిఉండేవారో చెప్పలేను కానీ ఈ డాక్టర్ గారు మాత్రం the best. ఈయన్ను చూసి చాలా మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

         
 

Published in:  on October 3, 2006 at 8:44 am Comments (3)

That Slum area boy …….

  చాన్నాళ్ళ క్రితం నాటి మాట. అంటే పూర్వ కాలం కాదు. ఈ కాలమే. నా కాలమే. ఓ రోజు నేను చూసిన ద్రుశ్యం నన్ను ఇంకా వెన్నాడుతూ ఉంది. ఆ దిశ గా తర్వాత కూడా నేనేం చెయ్యలేదు. దానికి నా అసమర్థత ను నిందించను. కానీ ఊరికే ఉండలేను. ప్రస్తుతానికి నిట్టూర్పు తో మీతో ఆ విషయం పంచుకుంటున్నాను.

మా వీథి లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నున్నటి తారు రోడ్డు. కొత్తగా వేసినట్లు ఉంది. రోడ్డు పై పక్కనే ఉన్న స్లం యేరియా పిల్లాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. ఏదో గీస్తున్నాడు తారు మీద. ఏం రాస్తున్నాడో నాకు అర్థం కాలేదు. దగ్గరకి వచ్చి చూసాను. వాడు అక్కడ చాక్పీసు తీసుకుని అక్షరాలు రాస్తున్నాడు !!!!!!! వాడి ఉద్ధెశ్యాలు ఏవన్నా కావొచ్చు. నున్నటి రోడ్డు ఆకర్షించి ఉండవచ్చు. చాక్పీసు అరిగించాలనిపించి ఉండొచ్చు. నోట్ పుస్తకం లేకపోయి ఉండవచ్చు. కానీ …. ఎందుకో అది నన్ను బాగా కదిలించింది. దాన్ని నేను వాడికి చదువుపట్ల ఆశ గానే అర్థం చేసుకున్నాను. అప్పట్లో అనుకున్నా …. నా చదువు అయిపోయి ఉద్యోగం చేస్తే నేను సంపాదించే డబ్బు లో కాస్తైనా  ఇలాంటి పిల్లల చదువుకు నా వంతు క్రుషి చేయాలని.

నా అభిప్రాయం దేశానికైనా మనిషి కైనా  భవిస్యత్తు బాగుండాలంటే చదువు ఓ రాచబాట వంటిది అని. ఆ చదువు కూడా అట్టడుగు లో ఉన్న వారికి కూడా అందుబాటు లో ఉండాలి అని. అప్పట్లో విపరీతమైన ఆవేశం ప్రభావం లో – “నేను పెద్దయ్యాక స్కూలు పెట్టాలి.  ఇలా అవకాశం లేని పిల్లలు అందరికీ అవకాశం ఇవ్వాలి. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి.” అంటూ చాలానే ఊహించుకున్నా. ఏమో ఒకానొక రోజు నేను కాకుంటే నాలా ఈ కలలు కన్న మరొకరు తమ కలను నిజం చేసుకుంటారేమో .. నేను చేయకపోయినా. నాలో ఏ కాస్తో ఓ మూల నా సమాజానికి ఏమైనా చేయాలి అని కోరిక రగిల్చిన సంఘటనల్లో ఇది ఒకటి. ఎవరన్నా అడిగితే టక్కున గుర్తు వచ్చేది.

Published in:  on September 16, 2006 at 4:54 am Comments (4)