నికేతా మెహ్‌తా కేసు

నిన్న కాసేపు నికేతా మెహ్తా కేసు గురించి చదువుతూ ఉన్నాను. మొదట దీనిపై ఆసక్తి కలిగించింది The Statesman దినపత్రిక లో నిన్న వచ్చిన వ్యాసం. తరువాత Times of India ఆన్లైన్ వ్యాసాలు చదివాక ఈ ఉదంతం పై నా టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. ఈ కేసు గురించి వివరంగా రాయబడ్డ బ్లాగు టపా ఇక్కడ.

క్లుప్తంగా చెప్పాలంటే, నికేతా మెహ్‌తా తనకి పుట్టబోయే బిడ్డకి గుండె జబ్బు ఉండే ప్రమాదం ఉందనీ, పుట్టిన క్షణం మొదలుకుని జీవితాంతం పేస్‌మేకర్ వాడాల్సిన అవసరం వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిసి తనకి అబార్షన్ కి అనుమతినివ్వాలని కోర్టును కోరింది. మన దేశపు చట్టాల ప్రకారం ఇరవై వారాలలోపే అబార్షన్ చేసుకోవాలట. కానీ ఈవిడకి ఇరవై నాలుగు వారాలకి ఈ విషయం తెలిసింది కనుక కోర్టుని చేరింది విషయం. హైకోర్టేమో ఆమె తరపు వాదన తోసిపుచ్చింది. ఈ అబార్షన్ చట్టసమ్మతం కాదు అని తేల్చింది.

ఈ కేసు ఫలితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి. ఓ పక్క ఆ పుట్టబోయే బిడ్డ కి జీవితాంతం బాధలు పడే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ కి, అదీ తల్లిదండ్రులు కోరుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అని. అబార్షన్ నేరమా? ఘోరమా? తప్పా? ఒప్పా? అన్న మీమాంస కాదు ఈ టపా. ఈ కేసు విషయం లో ఏది న్యాయం అన్న చర్చ కోసం. మామూలుగా అబార్షన్ నేరం అనుకున్నాకూడా, ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నేరం చేస్తే ఓ జీవితాన్ని జీవితాంతం చస్తూ జీవించే యాతన నుండి తప్పించవచ్చు కదా? ఈ కేసులో ఒక వాదన ఏమి రావొచ్చు అంటే – “ఒకవేళ ఇవేమీ లేకుండా బిడ్డ మామూలుగానే పుడితే…అప్పుడీ అబార్షన్ ఆ బిడ్డని చంపేసినట్లే కదా?” అని. కానీ, అది ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, శిశువు గుండెజబ్బుతో పుట్టే అవకాశం ఉన్నప్పుడు – ఆ లాజిక్ పని చేస్తుందా? జబ్బుతో పుట్టిన బిడ్డ తో తల్లిదండ్రుల జీవితం, పుట్టిన శిశువు జీవితం, వీళ్ళలో జరిగే మానసిక సంఘర్షణా – ఇవన్నీ ఆలోచిస్తే మరి?

తొమ్మిదేళ్ళ వయసు నుండి పేస్‌మేకర్ వాడుతున్న ఓ ముప్ఫై ఐదేళ్ళ మనిషి కథనం ప్రకారం జీవితాంతం దానిపై ఆధారపడి బ్రతకాల్సిన మనుషులు కూడా మామూలు జీవితం గడపొచ్చట.ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ట్రీట్ చేయొచ్చని అతను అన్నాడు. ఈ విషయం బానే ఉంది వినడానికి. అయితే, తెలిసి తెలిసీ…. అన్న భావన ఆ తల్లిదండ్రుల్లో రావడంలో నాకేమీ అసహజత్వం కనబడ్డం లేదు. పైగా, పేస్‌మేకర్ ట్రీట్‌మెంట్ ఖర్చుతో కూడుకున్నదట. జీవితాంతం ఆ ఖర్చు భరించే స్థోమత తల్లిదండ్రులకి ఉండాలి కదా.

“”But I will have to now stop working. We are not that rich to afford full-time nannies. Finances will certainly be one concern.”

-అన్న మాటల్ని బట్టి చూస్తే నికేతా దంపతుల అసహాయత అర్థమౌతోంది కదా. దానికి జవాబు గా బోలెడు సంస్థలు ముందుకొస్తున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తుంది జీవితాంతం – వంటి వాదనలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఇప్పుడిస్తున్న వాగ్దానాలే-వేటికీ గ్యారంటి లేదు అన్నది ఒక విషయమైతే, ఇలా ఎన్ని కేసులకని సాయం చేస్తారు? అన్నది మరో విషయం. ఈ కేసు తరువాత తమకి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న కేసులు ఎక్కువైపోయాయంట కాబోయే తల్లిదండ్రుల్లో. ఈ విషయానికి సంబంధించి ఉపయోగపడే రకరకాల టెస్టుల గురించిన సమాచారం ఇక్కడ.

మన అబార్షన్ చట్టాల ప్రకారం 26 వారాల తర్వాత తల్లి కి ప్రమాదమైనప్పుడు అబార్షన్ చేసుకునే సౌలభ్యం ఉందట కానీ, బిడ్డ పరిస్థితి బాలేకపోతే కాదట. ఇది మరో వింత నాకు. ఏం? పుట్టాక ఆ బిడ్డ మాత్రం మనిషి కాదా? అలా అబార్షన్ ఆపాక పుట్టిన శిశువు ఏదో కారణానికి మరణిస్తే మాత్రం ఆ తల్లికి క్షోభ కలగదా?

పుట్టబోయే బిడ్డ పుట్టాలా వద్దా అన్న విషయం లో తల్లి అభిప్రాయానికి విలువ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితి ఏమిటి? వంటివి మరిన్ని ప్రశ్నలు. అసలు బాధ్యత గల ఏ తల్లీ కారణం లేకుండా తనకి పుట్టబోయే బిడ్డను చంపాలనుకోదు అన్నది మరొక పాయింటు.  అబార్షన్ గురించి తల్లికి కొంత స్వేఛ్ఛ ఉండాలని నా అభిప్రాయం. పెంచడానికో, పుట్టించడానికో తల్లికి ఒకవేళ వ్యతిరేకత ఉంటే, ఆమెని ఆమె తాలూకా మనుషులు ఒప్పించలేకపోతే…బలవంతంగా కోర్టు బిడ్డని పుట్టనిచ్చాక ఆ బిడ్డ పరిస్థితి సాఫీగా ఉండాలనేముంది? నికేతా కేసు గురించి కాదు ఇది అంటున్నది. ఆ కేసులో కారణాలు వేరు. ఆ కేసులో నేనైతే నికేతాకే ఓటు వేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది more general context.

“”But what is disappointing is that we have been proved to be fools. We are educated fools. People in remote areas go to quacks for an abortion. The lesson here being sent out is: don’t follow the law. We are being punished for being law-abiding citizens.” -అన్న మాటల్లో అర్థమౌతున్నాయి నికేతా మెహ్‌తా ఈ కేసు విషయం లో అనుభవించిన క్షోభా, ఫలితం ఆమెలో కలిగించిన అసంతృప్తీ. “We have initiated awareness about the abortion law and that it needs to change with time and changing societal standards and medical advances,’’  – అన్నప్పుడు కాస్త ఆశాభావం కూడా కనిపించింది. (మూలం)

Published in:  on August 8, 2008 at 9:23 am Comments (2)

రెండో భార్య కి ఆస్తిహక్కు గురించిన వార్త

   ఈరోజు హిందూ పత్రిక లో రెండో భార్య కి భర్త ఆస్తి మీద హక్కు ఉండదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కనిపించింది. అది చదివాక కలిగిన ఆలోచనలే ఇప్పుడీ టపా రూపం లో బయటపెడుతున్నా :) అసలు టపా ఇక్కడ చదవొచ్చు.

ఇంతకీ సారాంశం ఏమిటీ అంటే – ఆస్తిపై రెండో భార్య అయిన వ్యక్తికి ఎటువంటి హక్కూ ఉండదనీ, కానీ, ఆమె సంతానానికి మాత్రం కలుగుతుంది అని. మళ్ళీ అలా అని రెండో పెళ్ళి చెల్లుతుంది అని కాదు.

” Children born of second marriage are entitled to a share in the property of their father though the second marriage itself is void, the Supreme Court has held.”

పిల్లలు లీగలంట…. పిల్లల తల్లి మాత్రం లీగల్ కాదంట. అంటే… ఆ తల్లి పరంగా చూస్తే ఆమె దిక్కులేనిదే…ఒక వేళ పిల్లలు వదిలేస్తే. పైగా ఆ వార్త తాలూకా కేసు ప్రకారం మొదటి భార్య తానే భర్త కి దూరంగా వెళ్ళిపోయింది. తరువాతే భర్త రెండో పెళ్ళి చేసుకుని నలుగురు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు అతను చనిపోగానే మొదటి భార్య కూడా ఆస్తి కోసం వస్తే ఇన్నేళ్ళూ కలిసి జీవించిన రెండో భార్యకి ఆస్తిహక్కు లేదంట… ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన మొదటి భార్య కి మాత్రం ఉందట! అంటే… రెండో భార్య కి ఆస్తి హక్కు కల్పించడం  అన్నది ఈ కేసు ఒక్కదాన్ని చూసి నిర్ణయించే విషయం కాకపోయినా కూడా, ఈ తరహా ప్రత్యేక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నది నాకు తోస్తుంది. అయినా, పిల్లలకి హక్కున్నప్పుడు వాళ్ళ తల్లికి ఎందుకూడదు? అన్నది ఇక్కడ ప్రశ్న.  ఇంకో ప్రశ్న ఏమిటి అంటే… మొదటి భార్య ఈ కేసులోలా తానుగా బయటకు వెళ్ళిపోయినా కూడా ఆమెకి ఆస్తి హక్కు వస్తుందా? రెండో భార్య కి మాత్రం ఎందుకు రాదు? అన్నది.

నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఆ తీర్పు గురించి చదివాక. సుప్రీం కోర్టు అంతటి ధర్మాసనం అలా ఎలా తీర్పిచ్చింది? , అందులోనూ ఈ కేసు విషయంలో అని.  భర్తే మొదటి భార్య ని వదిలేసి రెండో మనిషి ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు రెండో భార్య లీగల్ కాదు అనడం ఒక వాదన (అదన్నా కూడా మళ్ళీ పిల్లలకిచ్చి తల్లికివ్వకపోవడం అన్యాయమే అని తోస్తుంది.) మరి ఈ పేపర్ వార్త ప్రకారం కనీసం అది కూడా కాదు కేసు.  ఏమిటో ఈ తీర్పులు! సరిగా రాసిన వ్యాసం ఇంకోటి కావాలేమో..సరైన ఐడియా రావడానికి. అయినప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు నాకు నచ్చలేదు :(

Published in:  on January 28, 2008 at 8:05 pm Comments (5)

వేట అనబడు ఈరోజుటి ఫీల్డ్ ట్రిప్ కథలు

                ఈ కార్యక్రమానికి ఈరోజే నేను ఫీల్డ్ ట్రిప్ అని నామకరణం చేసుకున్నాను.  ఏ కార్యక్రమం? అంటే – ఆషాకిరణ్ పనులపై చుట్టూపక్కల ఉన్న స్లం ఏరియాలకు వెళ్ళి వచ్చే కార్యక్రమం. అసలు స్కూలు వరకు అయితే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలే మా కాలేజీ క్యాంపస్ కి వచ్చేవారు. ఈ మధ్య మెడికల్ క్యాంపుల campaigning లో నేనూ వేలు పెట్టడం మొదలెట్టడం తో…. నా ఫీల్డ్ ట్రిప్పులు మొదలయ్యాయి. వెళ్ళినదాన్ని ఊరుకోక వాళ్ళ యోగ క్షేమాలు తెలుసుకోడం లో ఆసక్తి చూపడం తో మళ్ళీ నాకే వెళ్ళాలి అనిపించడం మొదలైంది. ఈరోజు వెళ్ళిన ట్రిప్పు ఉద్దేశ్యం వేరు, ఐతే. కొంతమంది ఆషాకిరణ్ స్నేహితులెవరో బాగా చదగలిగే కెపాసిటీ ఉన్న పిల్లల్ని వారికి వీలున్నంత వరకూ చదివించడానికి మూందుకు వచ్చారట. అలాంటి వారిని కనిపెట్టడానికి వేట ఈరోజు main purpose. :)

దానిలో భాగంగా రకరకాల తల్లిదండ్రుల్ని కలిసాను. ప్రధానంగా మూడు రకాలు – పిల్లలు చదవాలి అన్న తాపత్రేయం లో  రాత్రి పగలు కష్టపడే వాళ్ళు, పిల్లలు చదువుకుంటాం అన్నా కూడా సంపాదన పరమైన ఇబ్బందుల వల్ల చదివించలేని వారు. పిల్లల సంపాదన కోసం వాళ్ళ చదువు మాంపించిన వారు. మరి పిల్లల్లో కూడా కొన్ని రకాలు – బాగా చదువుకుంటూ ఉన్న పిల్లలు, బాగాచదువుతూ ఏవో కారణాల వల్ల మానేసిన పిల్లలు, బాగా చదివినా కూడా సంపాదనలో పడి చదవడం మీద ఆసక్తి చూపని పిల్లలు, పెద్దగా చదివే సామర్థ్యం,ఆసక్తి లేకుండా – పేరుకి చదువుకుంటున్నాం అని చెప్పే పిల్లలు – ఇలా అన్నమాట. ఒక్క రోజులో ఎలా చెప్పావు? అనొచ్చు మీరు… ఇందులో చాలా భాగం ఈ ఒక్క రోజు observation కాదు. వెళ్ళిన ప్రతిసారి చూస్తున్నవే. Universal గా దాదాపు “నువ్వు పెద్దయ్యాక ఎమౌతావ్?” అని అడిగిన స్కూలు వయసు పిల్లలందరూ…అదీ ఈ వాతావరణం లో నుంచి వచ్చినవారు – “డాక్టర్ ఔతాను” అనే అంటారు. ఉండబట్టలేక, ఈరోజు అలా అన్న మీనా అనే అమ్మాయిని అడిగాను… ఎందుకు అందరు డాక్టర్ అంటారు అని…. మీనా అంటే మా కాలేజీ ఎదురుగుండా ఉన్న టీకోట్టు వాళ్ళ అమ్మాయి. నాకు కాస్త సన్నిహితంగా తెలుసు, మా స్కూలు లో నాకు ఫేవరెట్ స్టూడెంట్ కావడం మూలాన :)   .. ఆమె జవాబు – “డాక్టర్ కి ఉన్నంత గౌరవం ఇంకోకరికి ఉండదు కదా అక్కా.” (ఆ మధ్య వరకు టీచర్ అనేది… మా స్కూలు ఇంకా తెరవకపోవడం తో అక్కా అనడం మొదలెట్టింది.. :) )

మీనా వాళ్ళ అమ్మ గురించి, ఇంకా ఈరోజు ట్రిప్పు లో మొదట కలిసిన సావిత్రమ్మ కుటుంబం గురించీ -  ప్రత్యేకంగా మరో పోస్టు రాయాల్సిందే.  అవి రెండూ కాస్త రెండు రకాల కేసులు. మిగితావి ఒక తరహా కేసులు.  ఈరోజు నాకు అర్థమైంది ఏమిటి అంటే అన్ని సంధర్భాల్లోనూ -”Teach them to catch fish” అన్న సలహా పనిచెయ్యదు అని. పేర్లు చెప్పకుండా ఓ కేసు చెబుతాను. ఓ అమ్మ, ఓ నాన్న. వాళ్ళకి నల్గురు పిల్లలు..వాళ్ళలో మొదటి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్ళైపోయింది.  రెండో పిల్ల తెలివైనది. పది పాసయ్యింది. తనకి చదువుకోవాలని ఉంది. తల్లిదండ్రులకి ఉందో లేదో అన్నది నాక్కాస్త అనుమానంగా ఉంది. They can’t afford her studies అన్నది ఒక స్పష్టమైన కారణం.  మరేవన్నా ఉంటే ఉండొచ్చు. ఇక, ఆ తండ్రి కి చెడు అలవాట్లు ఏమన్నా ఉన్నాయేమో తెలీదు కానీ, మనిషి కాస్త పెద్దతనే. చివరి ఇద్దరు పిల్లలు తప్ప అంతా పనికి పోతే, అలా జీవించగలుగుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లకి Teach them to catch fish paradigm లో ఏమి చేయాలి? చదువు చెప్పించాలి అసలైతే ఏ పారాడైం లో అన్నా. మళ్ళీ మన నుంచి కమిట్మెంట్ లేనిదే పిల్లని తల్లిదండ్రులు చదివించరు. మనమెందుకు కమిటవ్వాలి? వాళ్ళకి లేని ఆసక్తి మనకెందుకు? అన్నది ఒక వాదం.  మొత్తం మనం చేయకుండా వాళ్ళకి సపోర్టు గా నిలబడ్డం … అన్నది ఈ కేసు లో ఎలానో నాకు అర్థం కావడం లేదు. ఎలాగో మొత్తం మనం కమిట్ కాలేము… ఆమె చదువు ఆమే చదూకోవాలి..ఆమె పరీక్ష ఆమే రాయాలి…మనం పోయి కూర్చోలేం కదా..

సారంశం ఏమిటి అంటే – ఇప్పుడీ విషయం లో  వాళ్ళకి చేపలు పట్టడం నేర్పడం అంటే…ఏ చేపలో, ఏ జాతివి పట్టాలో… కాస్త తెలిస్తే చెప్పండి… అవి ఆచరనలో సాధ్యమైతే మీ పేరు చెప్పుకుని ఆ పని చేస్తాము ఇక్కడ మేము :)   ఏదన్నా స్పెషల్ గాలం ఉంటే దాన్ని ఎలా దొరకబుచ్చుకోవాలో కూడా చెప్పండి.

Published in:  on August 22, 2007 at 6:30 pm Comments (10)

రైతుల ఆత్మహత్యలు

ఇవాళ ఉదయం హిందూ పేపర్ లో P.Sainath రాసిన ఓ వ్యాసం చదివాను. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు ప్రస్తుతం ఏమి చేస్తున్నాయి అన్న విషయం పై రెండు ఉదాహరణలతో రాసిన వ్యాసం అది. అది చదివాక ఒక విధమైన – “ఇది” అని చెప్పలేని తరహా – బాధ కలిగింది. ఇప్పుడే మరో వ్యాసం చూసాను – Andhra pradesh – Suicide for survival అని Binu Matthew రాసిన వ్యాసం. “A unique drama is being played out in the South Indian state of Andhra Pradesh. Grim, dark and unbelievable yet horrifically real.” అంటూ మొదలైంది. నిజానికి ఈ విషయం వినడం కొత్తేమీ కాకపోయినా కూడా ఈ తరహా భాష లో వినడం ఇదే తొలిసారి. కాబట్టి తగలాల్సిన దాని కంటే ఎక్కువగానే తగిలింది దెబ్బ నాకు.

Driven to desperation farmers in the state are committing suicide with the hope of getting the relief package offerered for the survivros of deceased…” చదువుతూంటే మనసంతా ఎదోలా అయిపోయింది. ఆత్మహత్యకి ముందు తమ కుటుంబాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. మళ్ళీ మరు క్షణం లో అదే నిర్ణయం బాధ్యతారాహిత్యం గా, తన వారిని నట్టేటిలో ముంచేసేలా అనిపిస్తుంది. ఈ ఆత్మహత్యల పర్వం ఎవరి బాగు కి? ఎవరి బాధ కి? అన్నది నాకో చిక్కు ప్రశ్న గా మారింది చివరికి. బాధితులు, లాభితులు కూడా ఒకరేలా కనిపిస్తున్నారు.  మన వ్యవసాయానికి వర్షం కోసం చాతక పక్షి లా ఎదురు చూడ్డం తప్ప మరో మార్గాంతరం లేదా?? మన రైతులకి ప్రకృతి వంచిస్తే కోలుకునే మరో మార్గం లేదా? పరిస్థితి చక్కబడడానికి ప్రభుత్వం పాత్ర ఏమిటి? సామాన్యులు ఏమన్నా చేయగలరా?

- అప్పుడోసారీ, ఇప్పుడోసారి చదవడం మినహా ఈ సమస్యతో నాకు ప్రత్యక్ష సంబంధం లేదు కనుకే ఇన్ని సందేహాలు. :(

Published in:  on June 26, 2007 at 9:49 am Comments (7)

One cornea, 3 beneficiaries!

            గూగుల్ వార్తల పేజీ చూస్తూ ఉంటే ఇదిగో ఈ వ్యాసం కనిపించింది. చదివాక కంటికి సంబంధించిన వైద్యం లో ఇదో చెప్పుకోదగ్గా ఉపయోగం ఉన్న పరిశోధన ఫలితమే అనిపించింది. అందుకనే ఇక్కడ రాయాలనిపించింది దీని గురించి.

సారాంశం ఏమిటంటే – ఇదివరలో “ఒక కార్నియా, ఒక పేషంట్” అన్నట్లు ఉండేది. అయితే ఈ మధ్య “University of Melbourne” వాళ్ళు ఒక ఆక్సడెంట్ లో పోయిన వ్యక్తి కార్నియా ను ఉపయోగించి ముగ్గురికి ఆపరేషన్ లు చేసారట. వాళ్ళు patient కు మొత్తం కార్నియా మార్చకుండా కార్నియా లో పాడు అయిన భాగాన్ని మాత్రమే బాగు చేయ్యడం ద్వారా సాధించగలిగారు ఈ feat ని. Eye donation campaigners ఎప్పుడూ చెబుతూ ఉంటారు – “Shortage of corneas” అని. ఇలాంటి పద్ధతి అందుబాటు లోకి రావడం వల్ల ఉపయోగం బానే ఉన్నట్లు తోస్తుంది. మరి ఈ వ్యాసం చదివిన దాక్టర్లు చెప్పాలి వాళ్ళ అభిప్రాయాలు కూడా.

Published in:  on April 15, 2007 at 3:46 am Leave a Comment

Management lessons from AshaKiran kids

నాకీమధ్య ఓ సందేహం వచ్చింది. పిల్లలకి చదువు చెప్పే సమయం లో కాస్త కఠినంగానే వ్యవహరించాలేమో అని. ఇదివరలో అంత తెలిసేది కాదు కానీ, ఇప్పుడు బాగా తెలుస్తోంది ఈ విషయం. ఓ రెణ్ణెళ్ళ క్రితం వరకు పిల్లలు బానే ఉండేవారు. గొడవ చేయకు అంటే చాలా మటుకు ఆపేవారు. చెట్లు ఎక్కకు, పడతావు అంటే వినేవారే ఎక్కువ…ఇంకా పైకి ఎక్కేవారికన్నా : అప్పట్లో.

కొత్త సంవత్సరం మొదలయ్యాక వీరి ఆగడాలు బాగా ఎక్కువైపోయినట్లు నాకు అనుమానం. మెట్లు లేని మేడ పైకి గోడ లోని కన్నాల సాయం తో ఎక్కే ప్రయత్నాలు చేయడం ఒకటి – ఎంత risky పనో ఎంత చెప్పినా అర్థం కాలేదు. తరువాత కొన్నాళ్ళకు ఆ బిల్డింగ్ వాచ్మెన్ కి భయపడో ఏమో మరి మానేశారనుకోండి. అది వేరే విషయం. ఒకళ్ళనొకళ్ళు పరుష పదజాలం తో దూషించుకోవడం, మరీ విపరీతంగా కొట్టుకోవడం, సందు చిక్కితే పిలిచినా వినిపించుకోకుండా చెట్లు ఎక్కడం, కొమ్మలు తెంపేయడం – ఇవి Latest developments. పిల్లలతో మెత్తగా ఉంటూనే  వారికి మంచి చెప్పొచ్చు అని అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళు. కానీ, మొన్న మా AK స్కూలు అమ్మాయి లలిత తన స్నేహితురాలు సంధ్య తో : “ఆ టీచర్ ఊరికే అట్ల చెబుతుంది అంతే. ఏమీ అనదు లే” అని నా గురించి నా ముందే చెబుతూంటే అనిపించింది – నేను మరీ మెతగ్గా వ్యవహరిస్తున్నానేమో వీరితో అని.

బెదిరింపు ఒక మార్గం. ఇలా చేస్తే ఫలానా వారికి చెప్తాను అని. మొన్నో రోజు నేను ఎవరికో ఫోను చేస్తూ ఉంటే వీళ్ళకి కాస్త భయం, భక్తి ఉన్న సత్య సార్ కి చేస్తున్నా ఏమో అనుకుని పిల్లలందరూ సైలెంటైపోయారు. కాసేపు ప్రశాంతత అలుముకుంది. అందరూ కూర్చుని ఇచ్చిన చిన్న చిన్న exercises చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా నాకే ఉద్ధేశ్యం లేకున్నా కూడా బెదిరించినట్లైంది.

కాస్త గట్టిగా చెప్పడం చాలా అవసరం అని అర్థం కావడానికి ఇన్నాళ్ళు పట్టింది నాకు, బెదిరింపు సంగతి అటు పక్కన పెడితే. మెతగ్గా ఉంటే ఎవరూ వినరు. నీ మాట అవతలి వాళ్ళని చేరాలంటే “aggressive గా ఉండు అనుకుంటూ management principle ఒకటి కనిపెట్టాను :) ప్రథమ యత్నం గా – “చూడు బాబూ, గొడవ చెయ్యడానికే అయితే ఇక్కడకు రాకు. నువ్వు వెళ్ళిపోయినా నేను ఏమీ అనను. ఎవరికీ ఫిర్యాదు చెయ్యను. వెళ్ళు. రెపట్నుంచి రాకు” -బాగా నస పెడుతున్న ఒకడికి చెప్పి చూసాను. కాస్త ఫలితం ఉండింది. అక్కడికీ గట్టిగా చెప్పలేకపోయాను. చిన్నపిల్లల్లే అన్న soft-corner తో.

అయినా స్కూల్లో టీచర్లలా కర్రలు పట్టుకుని చెబితే గానీ వినరో ఏం కథో ఈ పిల్లలు. ఆ మధ్య “మీ స్కూల్ లో కూడా ఇలాగే చేస్తావా రా?” అని ఒకడిని అడిగితే “ఇట్లెందుకు చేస్తా? సారు కొడతాడు” అని జవాబిచ్చాడు!!!!! అంటే కొట్టము-తిట్టము కాబట్టి మాతో ఏమన్నా చేయొచ్చు అన్నమాట! కాస్త 2,3 ఏళ్ళుగా వస్తున్న లిని, సత్య లాంటి వాలంటీర్లకు పిల్లలు కాస్త భయపడతారు. అలవాటు కాబట్టి ఊరుకుంటారో! 4,5 నెలలు గా వస్తున్న నాబోటి వారికి వాళ్ళు ఇంకా అంత అలవాటు పడకపోవడం మాట వినకపోవడానికి ఓ కారణం కావొచ్చు. ఏది ఏమైనా  నేను ఇంత మంది అధ్యాపకుల మధ్య ఏ బీస్కూలూ చెప్పలేనన్ని మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకుంటున్నా. అది మాత్రం నిజం!

Published in:  on March 2, 2007 at 3:58 am Comments (9)

Reality tastes bitter

నిన్నటి ఆషాకిరణ్ క్లాసులో ఓ కొత్త పిల్లాడు కనిపించాడు. వాడు నిజంగా కొత్తవాడో లేక నేను వచ్చిన రోజుల్లో రాని irregular పిల్లవాడో ;) తెలియక నా పక్కన కూర్చున్న అబ్బాయిని అడిగి కనుక్కున్నా. కొత్త అబ్బాయంట. సరే అనుకుని పలకరించా … నీ పేరేంటి అంటూ. చెప్పాడు. చూట్టానికి ఒ 12 ఏళ్ళ పిల్లవాడిలా ఉన్నాడు. ఎంతవరకూ చదువుకున్నావ్ అంటే ఇప్పటిదాకా బడికే పోలేదు అనిచెప్పాడు. పోనీ అక్షరాలు వచ్చా అంటే రావన్నాడు. వీడికి మనం మొదటి నుంచీ మొదలెట్టాలి అన్న విషయం మాత్రం అర్థమైంది నాకు. మిగితా వాళ్ళతో పాటు వాడు కూడా కూర్చుని ఉన్నాడు. ఉన్న వాలంటీర్లలో ఎవరో వాడి బాధ్యత తీసుకున్నారు. కానీ, వీడు చాలా అల్లరి గా ఉన్నాడు. బాల రౌడీ లాగా అనిపించాడు. :)

కాసేపటి తరువాత పిల్లల్లో ఒకరెవరో అన్నారు – మహేష్ సిగరెట్టు కాలుస్తాడు అని. నిజమా? అన్నట్లు వాడి వైపు చూస్తే నిజమే అన్నాడు వాడు! ఆ పిల్లల్లో పెద్దవాడిలా అనిపించినా కూడా వాడికి ఓ 12 ఏళ్ళు ఉంటాయేమో అంతే. వాడు ఆ విషయాన్ని చెప్పడం లో సిగ్గుపడ్డం లాంటివి ఏమీ జరగలేదు. నవ్వుతూ అదేదో సాధారణ విషయం అయినట్లు చెప్పాడు. అది గాక జర్దా కూడా అలవాటంట వాడికి !!! ఎలా అలవాటయింది అని అడిగితే ఇంట్లో వాళ్ళు తాగుతూంటే అలవాటయింది అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదా అంటే వాళ్ళు చాలా సార్లు కొట్టారని చెప్పాడు. అయినా వీడు మారలేదు అన్నమాట.

ఈ వయసుకే అలాంటి అలవాట్లు వచ్చేస్తే వాడి ఆరోగ్యం వాడు పెద్దవాడయ్యే సరికి ఎలాగౌతుందో తలుచుకుంటేనే భయమేసింది. వాడికి నాబోటి వారు చెబితే ఎలాగూ వినడు. శాంతి మేడం ఈ అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడవడం గురించి ఓపిగ్గా చెప్పారు. వాడు విన్నాడా అన్నది నాకు అనుమానమే. వాడి వాలకం చూస్తే ఎవరికో చెప్తే వింత చూస్తున్నట్లు ఉండింది.

ఈ వయసు పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పడం ఎంత అవసరమో నాకు అప్పటికి గానీ అర్థం కాలేదు. కానీ, వాళ్ళకి చెప్పేవారెవరు? చెప్పాల్సినవాళ్ళు స్వయానా ఈ అలవాట్లకు బానిసలయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు వాడికి వాడు చేసే పని అంత మంచిది కాదు అని చెప్పేదెవరు? వీడికి అయితే వాడికి విసుగొచ్చేదాకా చెప్పడానికి ఆషాకిరణ్ ఉంది. మిగితావారికో? పిల్లల కోసం పని చేసే సంస్థలు ఈ విషయం పై కూడా తగిన స్రద్ధ తీసుకోవాలి అనుకుంటా. చదువు కీ, కూడూ గుడ్డలకి facilitate చేయ్యడం ఒక ఎత్తు. ఈ తరహా విషయాలు ఒక ఎత్తు. Lets hope for a better future for all kids!

Published in:  on January 19, 2007 at 5:55 pm Leave a Comment

సత్యమే శివం

                          కొన్ని సినిమాలు జీవితాన్ని మనం చూసే విధానాన్నే మార్చేస్తాయి. అలా నన్ను ప్రభావితం చేసిన ఒక సినిమా “అన్ బే  శివం” లేదా “సత్యమే శివం”.  మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన తీరు లో గొప్ప శక్తి ఉంది.  నాకు… సరిగా గుర్తులేదు… గుర్తు ఉన్నంత వరకు ఇవే అనుకుంటా పదాలు:
“ఆస్తికులైన హితులందరికి శివమే సత్యమట
నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట”

ఈ దేవుడేంటో … ఈ కాన్సెప్ట్ ఏంటో అని తలకొట్టుకునే రోజుల్లో చూసా ఈ సినిమా ని. మానవత్వాన్ని మించిన దేవుడు లేడని ఎంత ప్రాక్టికల్ గా చెప్పారంటే – ఆ రోజు నుండీ ఈ రోజు దాకా నేను అదే మార్గం లో ఉన్నా. నాలో కలిగిన అయోమయం చాలా వరకు పోయింది ఈ సినిమా సంభాషణ లు విన్నాక. ప్రతి మనిషి లోనూ దేవుడు ఉన్నాడు – ఇంకొకరి క్షేమం గురించి ఆలోచించే ప్రతి మనిషీ దేవుడే అన్న సందేశం సూటిగా నా గుండెల్లో అలా దిగిపోయి – పాతుకుపోయింది. అయితే – ఈ సందేశాన్ని ఆవేశం గానో, మనుష్యుల్ని ఈసడిస్తూనో ఇవ్వలేదు. పూర్తి స్థాయి హాస్యం తో ఇచ్చారు. అది నన్ను అంత లా కట్టిపడేసి నడిస్తే ఈ బాట లో నడవాలి అనిపించేలా చేయడానికి కారణం ఇదే అనుకుంటా.

ఈ సినిమా కి సంబంధించినంత వరకు ఇది కాకుండా ఇంకా ఎన్నో చెప్పుకోవలసిన విషయాలు ఉన్నాయి. కానీ నేను నేర్చుకున్న జీవిత పాఠం ఇది : దేవుడు ఎక్కడో ఉండడు. దేవుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. నీ తోటి మనిషి కష్టాన్ని నువ్వు పంచుకున్నప్పుడో, లేక ఆ కష్టం తీరడానికి నువ్వు తోడ్పడినప్పుడో నీలోని దేవుడు ఎదుటివారికి కనిపిస్తాడు. అలాగే జీవితం లో నువ్వు ఈ రెండో వైపు చిక్కినప్పుడు ఎదుటి వారి లోని దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. అని.

“ఆస్తికులైన హితులందరికి శివమే సత్యమట
నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట”

Published in:  on November 7, 2006 at 5:36 am Comments (5)

సందేహాలు

మరో మారు AK లో ఈరోజు. ఏ రోజుకారోజు చెప్పుకోదగ్గ విషయాలేం లేకపోయినా కూడా నాలో కలుగుతున్న ఆనందాన్ని , ఈ వారానికి రెండు గంటల క్లాసులు నాకు నేర్పుతున్న పాఠాల్ని నేను గమనిస్తూనే ఉన్నాను. పిల్లలకి చదువు చెప్పడం అంత సృజనాత్మకమైన పని ఇంకోటి లేదు అని నాకు అర్థమైంది. ఈ పని లో గెలవాలంటే గొప్ప ఓపికా , నేర్చుకోవాలన్న తపనా మాత్రమే కాదు … ఎంతో ఊహా శక్తి కూడా ఉండాలి అని నాకు రోజులు గడిచే కొద్దీ అవగతమౌతోంది.

“ఈ క్లాసులకి కూడా ప్రెపేర్ అవుతావా ఏంటి?” అని అడిగింది నా స్నేహితురాలు నన్ను ఈరోజు స్కూలు అయ్యాక. నిజానికి నేను ఈ వారం వెళితే వచ్చేవారం దాకా మళ్ళీ ఆలోచించను ఈ క్లాసుల గురించి …. నా క్లాసుల గొడవల్లో. కానీ … ఆ అమ్మాయి వెటకారానికే అడిగినా , అందులో నిజం ఉంది. ఈ క్లాసులకి నిజానికి బోలెడు చదువుకోవాలి – జీవితాన్ని, పిల్లల తత్వాన్నీ. ఎప్పటికప్పుడు కాస్త ఆలోచించుకుని వెళదాము అని అనుకుంటూనే ఉంటా కానీ … నా acads గొడవల్లో దీన్ని పట్టించుకోవడం లేదు నేను.

వాళ్ళకి ఓ మంచి పద్ధతి లో చదువు చెప్పాలని నాకు మహా తాపత్రేయం. అయినా నాలోని బాధ్యతా రాహిత్యానికి తోడు ఓ విధమైన నిస్సహాయత – ఇలా బోలెడు కారణాల వల్ల మొత్తానికైతే నా స్వప్నాలకూ, సత్యాలకూ బోలెడు తేడా నాకు 3-D స్క్రీన్ లో కనిపిస్తూనే ఉంది. నాకు తెలుసు అనుభవం లో నేనూ రాటుదేలతా అని. కానీ ఆ అనుభవం తో పాటు అనుభవఙుల సలహాలు కూడా అవసరమే. మీకు తోచినవి మీరూ చెప్పండి – How to make learning a good experience for children of this kind of background అని. :)

Published in:  on October 19, 2006 at 3:14 pm Comments (5)

12 hyper-active kids & poor me!!!

జీవితం లో ఇంత నిస్సహాయత ను ఎప్పుడూ అనుభవించి ఉండలేదు అనుకుంటా…. ఇంత చిన్న విషయానికి. ఎంత నిస్సత్తువ గా అనిపిస్తోందంటే …. నేను ఎందుకు అంత Efficient కాను అని ప్రశ్నించుకునేంత !! ఎవరిదీ తప్పు లేదు. కానీ నాలో ఏదో చెప్పలేని దిగులు …..

ఈ రోజు మా ఆషా కిరణ్ లో ఏ ఒక్క వాలంటీరూ రాలేదు వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల. ఎందుకో గానీ మామూలుగా వచ్చే ఒకళ్ళిద్దరు “పెద్ద దిక్కు” గా వ్యవహరించే మేడంస్ కూడా రాలేదు. ఒక్క మేడం వచ్చారు. పాపం వాళ్ళ బాబు కి జ్వరం అట …. వెళ్ళిపోయారు. డజను మంది Hyper-active పిల్లలు. మధ్య నేను. ఒక్కోళ్ళూ ఒక్కో వయసు .. ఒక్కో academic లెవెల్. నెను ఏం అవధానం చేసినా నా వల్ల కాలేదు. నాకు అలవాటు లేదు అన్నది ఒకటి. వాళ్ళ స్కూల్ టీచర్లలా నేను కఠినంగా మాట్లాడలేను అన్నడి మరోటి. చుక్కలు కనిపించాయి నాకు వెలుతురు ఉండగానే.

ఈ పిల్లలకేమో ప్రతి ఒక్కరికీ టీచర్ తమ సంగతి ముందు చూడాలని. ఈ ఒక్క సాయంత్రం లో నాకు ఎంతో ఓపిక వచ్చేసిందేమొ అనిపిస్తోంది ఈ క్షణం లో ఈ బ్లాగు టపా రాస్తూ ఉంటే. జీవితం లో ఇలాంటి అనుభవాలు ఎన్ని పాఠాలు నేర్పుతాయో వర్ణించడానికి నాకు మాటలు చాలవు. ఆ పిల్లలు పెరిగే వాతావరణాన్ని కాస్త అవగతం చేసుకున్నా ఈరోజు …. ఒక్కదాన్నే ఉన్నా కదా … వాళ్ళతో ఎక్కువ mingle అయ్యే సరికి వాళ్ళ జీవితాలతో మునుపటికంటే ఎక్కువ పరిచయం కలిగింది అనిపించింది.

ఈ రోజుకి స్కూల్ అయ్యేసరికి బ్రతుకు జీవుడా అనుకున్నా! అంత నీరసం వచ్చేసింది నాకు. చెప్పలేనంత విరక్తి,నిస్సహాయతా ఆవరించాయి. నా నేస్తం తో కాసేపు ఫోనులో మాట్లాడాక ఇప్పుడు కాస్తంత బావుంది మనసు కి. సాధారణంగా చాలా వరకూ నేను పాజిటివ్ గానే చూస్తూ ఉంటా. కారు చీకటి లో కాంతి పుంజం లా. దీన్నీ అలాగే చూద్దాం అని నిర్ణయించుకున్నా.  మీకు ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కనీ నా inefficiency గురించి ముందే విన్నవించుకున్నా కనుక నాకు కలిగిన నీరసం ఎందుకో అర్థం అయిందనే అనుకుంటా.  ఇది ఒక మరిచిపోలేని జీవిత పాఠం. జీవితం గురించి ఎన్నో నిజాలు చెప్పిన పాఠం.

ఈరోజు నన్నిలా ఏకాకి లా మిగిల్చిన ఓ దేవుడా ! ధన్యవాదాలు!!!!

Published in:  on October 12, 2006 at 1:56 pm Comments (2)