తెలుగు కవిత్వం తో నా డీలింగ్స్…

నేను ఆట్టే కవితలు చదవను. అసలు నాకు కవితలోని భావాన్ని అనుభవించడం చేతకాదు అని ప్రగాఢ విశ్వాసం. నేను వచనంలో కవిత్వాన్ని మాత్రమే అనుభవించగలను. వచన కవిత్వాన్ని కూడా అనుభవించలేను, వేరే కవిత్వాల మాట అటుంచితే. “కవిత్వం” అన్న పదాన్ని నేను అర్థం చేసుకునే విధానంలో, “కవితలు” మాత్రమే కవిత్వం కిందకు రావు. మాటలు కూడా వస్తాయి. అందుకే, నేను పరమ నిక్కచ్చిగా నేను కవిత్వం చదవను అనలేను. అయితే, చదివినంతలో నన్ను అలాగే తమ మాయ లో పడేసి, వెంటాడి వెంటాడి మళ్ళీ మళ్ళీ చదివించిన తెలుగు కవితలు ఉన్నాయి. అలాంటి కొందరి గురించి చెబుతూనే, కొంత మార్కెటింగ్ కూడా చేయడం ఈ టపా ఉద్దేశ్యమనమాట :)

ఇటీవలికాలంలో రోజూ జపం చేస్తున్న కవి ఐతే “శ్రీశ్రీ”. మహాప్రస్థానంలోని సెలెక్టెడ్ కవితల్ని రోజూ..రోజూ..తలుచుకుంటూనే ఉంటున్నాను. అయితే, ఇతనితో నా తొలిపరిచయం “అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం” అన్న వాక్యాలతో, స్కూల్లో ఓ సందర్భంలో. “అబ్బ చ!” అనుకోలేదు. ఎందుకంటే, ఆపాటికి శ్రీశ్రీ అన్నాయనను మహాకవి అంటారని తెలిసి ఉండటం చేత. “ఓహో” అనుకున్నానే కానీ, ఆ సంవత్సరం ముగిసే సరికే ఇలాగే కొన్ని వాక్యాలు విని విని ఆయనంటే ఓ అభిమానం ఏర్పడి పోయింది. ఓ పదేళ్ళయ్యాక ఇప్పుడా ఆ నామస్మరణం లేనిదే లేవను. ముఖ్యంగా – ఒక రాత్రి, కేక, ఐ, కళారవి, ఆః!,,స్విన్ బర్న్ కవికి – ఇవి అలా అలా చదివి చదివి ఖంఠతా వచ్చేసాయి. అలాగే, ఎంచక్కా పాటలుగా విన్న – “ఆనందం అర్ణవమైతే”, “జగన్నాథుని రథచక్రాలు” అలా రిథమిక్ గా గుర్తు ఉండిపోయాయి. “నిజంగానే” – అని ఎన్ని సార్లు ఎన్ని సందర్భాల్లో అనుకుంటానో. ఓ ఫోర్సు ఉంది ఈ కవితల్లో. “ఖడ్గసృష్టి” సంకలనంలో – “ఏవి తల్లీ!” కవితలో “పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయినజాడలేవీ ?” అన్న వాక్యం నన్ను చాలారోజులు వెంటాడింది మొదట చదివినప్పుడు. అయితే, మహాప్రస్థానంలో కొన్ని, ఖడ్గసృష్టిలో ఒకటీ అరా మినహాయిస్తే, నాకెందుకు శ్రీశ్రీవి మిగితావి నచ్చలేదో, ఇవి మాత్రం ఎందుకు అంతలా నచ్చేసాయో మాత్రం అర్థం కాదు.

అయితే, 2006 ప్రాంతంలో మూలా సుబ్రమణ్యం, కొత్త రవికిరణ్ ల ద్వారా పరిచయమైన కవి ఇస్మాయిల్ ఇలాగే మర్చిపోలేని ముద్ర వేసాడు. అక్కడికి నేనేదో తెగ చదివేశా అని కాదు. కానీ, ఇలా ఇన్స్టంట్ గా నాకు నచ్చేసిన వారు తక్కువ. ఇస్మాయిల్ కవితల్లో కూడా కొన్ని అలా చదువుతూ ఉంటే, “అబ్బ!” అనిపిస్తే, కొన్ని “అబ్బా!” అనిపించినవి ఉన్నాయి కానీ, నేను చదివిన కాస్తలో, ఆ కొద్ది పదాల్లో బోలెడు అర్థాన్ని పలకడం, అన్నింటికంటే ముఖ్యంగా – భాషలోని సింప్లిసిటీ, చదువుతూ ఉండగా, చదివాకా, కలిగే ఫీలింగ్ – నాకు చాలా నచ్చేశాయి. అయినప్పటికీ నేను ఎక్కువగా ఆయన కవితలు చదవలేదు అనుకోండి, అది వేరే విషయం.

వీళ్ళిద్దరు కాక అపుడప్పుడూ వెబ్లో చదివే కవితల్లో కూడా కొన్ని అలా వెంటాడుతూ ఉంటాయి. ఈమాట వెబ్జీన్లో అలా కొన్ని చదివాను. అలాగే, ఒకప్పుడు తెలుగుపీపుల్.కామ్ లో కూడా అలాంటి కవితలు చాలా చదివాను. ప్రస్తుతం కృష్ణశాస్త్రి భాషని అర్థం చేస్కుని, అనుభవించడాన్కి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇన్నిరోజులు ఔతూ ఉన్నా కూడా అసలు “కవిత్వం” అంటే ఏమిటీ? దేన్ని కవిత్వం అనొచ్చు, దేన్ని అనకూడదు? ఏది మంచి కవిత? ఏది కాదు? – ఇవన్నీ నాకు ఎప్పుడూ అర్థం కాని ప్రశ్నలే. రోజులు గడిచేకొద్దీ నాకు జవాబులు తెలుసుకోడం పై కూడా ఆసక్తి తగ్గుతూ వస్తోంది.

సరే, నాలాంటి వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు కానీ, సెప్టెంబర్లో పుస్తకంలో “తెలుగుకవిత” అని ఫోకస్ ప్రకటించి, అదలా అక్టోబర్ దాకా పొడిగించారు. ఇలా పొడిగించడం వల్ల పుస్తకం సంగతి అటు పెడితే, నాకు చాలా లాభం – ఎందుకంటే, రకరకాల విషయాలు తెలుసుకున్నాను కనుక. ఇస్మాయిల్ గారితో మొదలై, గోపిరెడ్డి రామకృష్ణ, అఫ్సర్ గార్ల వద్దకు చేరి, విశ్వనాథ వారి కవిత్వం రుచి చూపి, ముకుందరామారావు గారిని పలకరిస్తూ, శివారెడ్డి గారి గురించి మొదలై (ఈ మధ్యలో మళ్ళీ ఇస్మాయిల్ గారిని తల్చుకుంటూ), రైతు కవిత, తిలక్, ఇక్బాల్ చంద్, ఆకెళ్ళ రవిప్రకాశ్, వైదేహి శశిధర్ గార్లదాకా వచ్చి, మధ్యలో మన బ్లాగరు ఉష గారిని కలిసి, కల్పన గారి ద్వారా చలం కవిత్వం అంటే ఏమిటో తెలుసుకుని, విన్నకోట రవిశంకర్ గారు ఇటీవలి కవిత్వం గురించి చెప్పింది విని, యదుకులభూషణ్ గారికి నచ్చిన కవితతో సెప్టెంబర్-అక్టోబర్లు ముగిశాయి.

ఇలా పాతా కొత్తా భేదం లేకుండా రకరకాల కవుల గురించి రాసిన ఈ వ్యాస రచయితలందరికీ ధన్యవాదాలు – బ్లాగ్ముఖంగా.

ఈ రెండు నెల్లలోనూ పుస్తకం.నెట్ లో తెలుగుకవిత అన్న ఫోకస్ అంశంపై వచ్చిన వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు.

(సైటు కార్యం, స్వకార్యం – రెండూ చేయడం అంటే ఇదే!)

Published in:  on October 31, 2009 at 9:27 am Comments (2)

కథ ఇట్లా ఉండాలె – కథ పై

బస్సులో కూర్చుని – కనుపర్తి వరలక్ష్మమ్మ గారి “కథ ఎలా ఉండాలె?” కు మాలతిగారి ఆంగ్లానువాదం – “The Charm of a cherished story” చదువుతూ ఉన్నాను. ఇదివరలో చదివినదే అయినా, ఈసారి చదివినప్పుడు దాని గురించి మరికాసేపు ఆలోచించాను. ఈ ఆలోచనల్లో నాకు రకరకాల సందేహాలు కూడా కలిగాయి. ప్రస్తుతానికి కథ గురించి చర్చల వల్ల ఇది నాకు నచ్చిన కథ. కనుక, ఈ కథ చదువుతున్నప్పటి అనుభవాలను పుస్తకం.నెట్ లో పంచుకోవాలనిపించింది.

కథ విషయానికొస్తే, ఇది ప్రధానంగా రచయిత అయిన భర్తకూ, అతని భార్యకూ మధ్య కథ అంటే ఎలా ఉండాలి అన్న విషయంపై జరిగిన చర్చ/వాదన. నా మటుకు నాకు కథ అయితే చాలా సహజంగా, ఇంట్లో జరుగుతున్నంత సహజంగా అనిపించింది. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండటం, మధ్యలో ఇంటి పనుల విరామాలు, చివర్లో నిద్రొస్తోందని చర్చ ముగియడం – ఇదంతా అతి సహజంగా ఇంట్లో జరిగే దానిలా అనిపించింది. ఎటొచ్చీ, కథకి నాటకీయత అవసరం అని చాలా బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉండే ఉంటారు – వాళ్ళకి ఇది అసంపూర్ణ కథ కావొచ్చు. కథ అన్నాక – ఫలానా టెంప్లేట్లలో ఏదో ఒకదానిలోకి ఒదగాలి – అని బలంగా నమ్మేవాళ్ళకి కూడా ఇది బహుశా నచ్చదేమో. కథల స్ట్రక్చర్ విషయంలో నేను అనార్కిస్టుని కావడం ఈ కథని స్వేచ్ఛగా ఎంజాయ్ చేసి, దీనిలో చెప్పిన విషయాల గురించి ఆలోచించడానికి ఉపకరించిందేమో.

“కథ” అన్నదాన్ని ఓ డెఫినిషన్లో ఇరికించడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఈ కథ చదివాక అసలు అర్థం కావట్లేదు. అందుకు ఈ కథ రూపం కారణం కావొచ్చేమో కానీ, ప్రధానంగా ఇక్కడ చర్చించిన విషయం కారణం. ఈ కథలోని కొన్ని వాక్యాలూ – నా ఆలోచనలూ:
” The stories that are just intended to make the reader laugh are insipid”
- ఇది చాలా అన్యాయం అనిపించింది నాకు. How can a comedy story be insipid? పైగా, కొన్ని కొన్ని మూడ్లలో ఉన్నప్పుడు హాస్యకథలు మనల్ని అందులోంచి బయటకు కూడా తేగలవు. రాసిన ప్రతి హాస్య కథా వందల సంవత్సరాలు నిలువకపోవచ్చు – కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోవచ్చు – కానీ, అది చదువరికి హాయినిచ్చినంతకాలం అది “ఇన్సిపిడ్” ఎలా ఔతుంది? హాస్యమంటే – నిజజీవితంలో జరిగే హాస్యం కానక్కరలేదా? రోజూవారీ జీవితంలో హాయిగా నవ్వుకునే సందర్భాలను తీసుకుని కథాంశాలుగా రాస్తే, ఎందుకు అవి ఇన్సిపిడ్ ఔతాయి?

’Every story must include a truth of ethical or scientific value. It is only then the writer’s effort is rewarded.”
- మళ్ళీ, ఎందుకు ఉండాలి? అన్నది నా సందేహం. కథ ఎందుకు రాస్తారు? అంటే “సాంఘిక ప్రయోజనం” అన్నది ఒకటేనా జవాబు? “హాస్యం” కూడా ఒక విధంగా సాంఘిక ప్రయోజనమే అలా అంటే :) కథలో ఒక రకం జీవితాన్ని చూపించాలి అని రచయిత అనుకున్నాడు అనుకుందాం – చూపాడు అనుకుందాం. ఇందులో అన్నిసార్లూ సాంఘిక ప్రయోజనం ఉండాలి అని ఏముంది? – అలాగే, ప్రతి కథలోనూ ఎథికల్, సైంటిఫిక్ విలువలు ఉండాలి అని ఏముంది? మళ్ళీ “హాస్యాన్ని” ఉదాహరణగా తీసుకుంటాను. నేనో దిగాలుపడ్డ మనసుతో కూర్చుని ఉన్నప్పుడు ఏదో కథ చదివి, నవ్వుకుంటూ, చీరప్ అయితే, రచయిత కృషికి ఫలితం దక్కినట్లు కాదా?

’if the purpose of a story is only to provide a temporary pleasure, if love is the only theme, if you cannot write any better than that, and if the readers cannot enjoy anything better than that, then, I would say that both the writers and the readers are self-indulgent”
- “ప్రేమ” కథలు రాస్తే మాత్రం తప్పేంటి? ప్రేమ అన్నది మనుషుల్లో ఉండే సహజ రసం. కథల్లో సహజ రసాన్ని చూపడంలో అంత తప్పేముంది? తాత్కాలిక ఆనందం కల్పించేది కథ ఎందుకు కాకూడదు? అన్నది నా ప్రశ్న. కథకి ఏకైక లక్ష్యమే ఎందుకుండాలి? చాలా లక్ష్యాలుండి వాటిలో తాత్కాలికానందం ఒక కోణం ఎందుక్కాకూడదు?

“There are two kinds of stories—the best and the mediocre. The best stories are those, which contain style, freshness, clever descriptions, creativity, suitable rasa, and ethical values. Such stories will receive permanent status in literature; readers receive them well. They never become old.”
-ఇక్కడి వరకూ బానే ఉంది. కానీ, తరువాత:
“The mediocre stories will have all the elements but no moral values. These mediocre stories are also written in powerful and living language, do include fine descriptions, and the structure and characterization are not bad either. They may not be lacking in rasa; yet, they do not attain a permanent place in literature for want of a compelling moral value. These stories have served their purpose just by providing a momentary pleasure to the readers.”
అన్నారు. అంటే, కలకాలం నిలిచే కథల్లో తప్పితే మిగితా కథల్లో నైతిక విలువల్లేవనా? అసలు రెండే రకాల కథలు అని చెప్పేయడమే నాకు అన్యాయమనిపించింది. దానికి తోడు, కలకాలం నిలిచే కథల్లో తప్ప నైతిక విలువలు ఉండవంటే ఎలా? ఈ వ్యాఖ్యానాలన్నీ ఎలాంటి కథల్ని ఉద్దేశించి అన్నారో -
“In the name of nature, if you describe everything regardless of propriety, it turns into vulgarity. The reason the modern day stories are reprehensible is those descriptions. Description should not cross the line of propriety even if it were natural.”
-అన్న వర్ణన బట్టి తెలుస్తోంది కానీ, అలా ఆలోచించినా కూడా కథలు ఉంటే మొదటి కేటగిరీలో లేకుంటే రెండోదానిలో ఉండటం అసాధ్యం అనిపిస్తోంది. ఇంకొన్ని కేటగిరీలు అవసరం :)

“And then the third rate stories are those which are written without any talent; and often written in some foolish way; probably the writer gets excited at the sight of a woman and writes about her. Most of the stories now being published in Telugu magazines nowadays belong to this category.”

- నో కామెంట్స్. నాకు తెలీదు. చదివేవాళ్ళు అవి కూడా చదువుతారు కదా మరి! థర్డ్ రేట్ సరే – కానీ, వాళ్ళేమీ వచ్చి నేను ఫస్ట్ రేట్ అనరు కదా (అంటారా?)

చివర్లో భార్య మాటలన్నీ వింటూ ఉన్న భర్త : “A story could be a moral story like in sumati satakam or vemana poems. But it’s not smart to suggest that each and every story must fit into a paradigm of moral value. A story is like a flower. It must blossom freely and pleasurably or else it would lose its beauty and become insipid. To speak the truth, story writing is an artistic creation. And it is the duty of the connoisseurs of art to make sure that it serves a purpose” అంటాడు. వీళ్ళ చర్చలో ఉంటే మోరల్ స్టోరీ, లేకుంటే ఇమ్మోరల్ స్టోరీ అని రెండే రకాలు ఉన్నట్లు ఉన్నా కూడా నా దృష్టిలో అలా కాదు కనుక, నాకు ఈ వాక్యం చదువుతూ ఉంటే. “It must blossom freely and pleasurably ” అన్న భాగం చాలా కరెక్టనిపించింది.
“That’s good. If you ride on a moral high horse, and create only allegories, I don’t have to tell you about the outcome. People will be happy without reading them.”
ఔను నిజం ఔను నిజం! :)

నన్ను ఏళ్ళ తరబడి పట్టి పీడిస్తున్న సందేహం ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఈ కథలోని భార్య పాత్ర ద్వారా:
“I’m saying that only when you write stories with moral values, their worth heightens. And people will welcome them. Not only Telugu people but others also translate them into their languages and read them. Look at the stories of Tolstoy and Premchand. Aren’t they getting translated into Telugu? Why did they receive that kind of attention? “
-అంటే, మోరల్ స్టోరీలు తప్ప వేరే భాషల్లోకి అనువాదం కావా? అంటే, మన కథలు ఇతర భాషల్లోకి అంత విరివిగా అనువాదం కాకపోడానికి కారణం ఇదా? నాకు ఈ జవాబు అంత నమ్మదగ్గదిగా లేదు. వేరే భాషల్లోకి అనువాదాలయ్యే కథలన్నీ ఇలా గొప్ప విలువలున్నవేనా? అలా అంటే, “విలువలు” అన్న పదం కిందకి ఏమేమి వస్తాయి?

ఈ కథ చదివినప్పట్నుంచీ ఇవే సందేహాలు నాలో. అన్నింటికంటే సూటిగా తగిలినది ఈ చివరి వాక్యం!
ఎంతకీ తెగడంలేదు ఆలోచనలు.

ఎప్పుడో నలభైల్లో రాసిన ఈ కథ ఇప్పుడు చదివినా కూడా ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయంటే… ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు…

Published in:  on August 17, 2009 at 2:35 pm Comments (3)
Tags:

ఉపమ Vs Symbolism

కొన్ని నెలల క్రితం “రక్తరేఖ” (గుంటూరు శేషేంద్ర శర్మ గారి ‘డైరీ’) చదువుతున్నప్పుడు చదివిన ఓ చర్చ ఇది. ఈ చర్చ నాకు ఆసక్తి కరంగా అనిపించటమే కాక – కొన్ని సందేహాలను కూడా పుట్టించింది. అందుకే ఆ పేజీలలోని ఒకట్రెండు డైలాగులలోని కొన్ని భాగాల్ని ఇక్కడ పెడుతున్నాను. ఎక్కువ పెడితే కాపీరైట్ ఉల్లంఘన ఔతుందేమో మళ్ళీ!

ప్ర: ఉపమాలంకారంలోని ఉపమేయాల్ని తీసివేసి కేవలం ఉపమానాలతోటే వాక్యవ్యవహారం నడుపుతామనుకో, అది సింబాలిజం ఔతుందా? ….. (ప్రశ్న ఇంకా ఉంది…)
జ: కాదు. ఉపమాలంకారంలో రెండు వస్తువులుంటాయి. ఆ రెంటికీ కొన్ని లక్షణాలుంటాయి. ఆ పోలికల మూలంగా ఒకదానితో ఒకటి పోల్చబడతాయి. కానీ, సింబాలిజంలో ఒకటే వస్తువు ఉంటుంది. దానిలోనే రెండవ వస్తువు ఉంటుంది. బయటికి కనిపించేది భౌతిక వస్తువు., మామూలు కళ్ళకి కనొపించకుండా లోపల ఉండేది రెండ్వ వస్తువు… (and it goes on.)

సింబాలిజం : అన్న దానికి తెలుగు పదమేమిటి ఇంతకీ? అన్నది నాకొచ్చిన అనుమానం :)

ప్ర: “ముఖ చంద్రుణ్ణి కష్టాల మేఘాలు ఆవరించాయి” అంటే రూపకం అయింది (రూపకాలంకారం). ఇక్కడ ముఖమూ, చంద్రుడూ అనే రెండు వస్తువులకూ అభేధం చెప్పడమే కదా ఈ అలంకార లక్షణం?”
జ: రెండు వస్తువులకు అభేదం చెప్తున్నాడు నిజమే. కానీ, అవి నిజంగా ఒకే వస్తువు కాదు కదా; రెండు వస్తువులే కదా. కానీ, లారెన్సు చెప్పిన వాక్యం చూడు – “ఎర్రగులాబీ పువ్వు అగ్నిజ్వాల”. ఇక్కడ ఎర్రగులాబి, అగ్ని జ్వాల రెండు వస్తువులు కావు. భౌతిక ప్రపంచంలో రెండైనా ఇక్కడ కవి ద్రష్ట అయిన సన్నివేశంలో ఎర్రగులాబీలోనే ఆ అగ్నిజ్వాలను చూశాడు.

……………………..
……………………….
“ఇలా ఒక స్థూల దృశ్యం ఐన ఒక భౌతిక దృశ్యంలోంచి దాని తాత్విక దృశ్యాన్ని చూడటం, అంటే ఒక వస్తువులోంచి దాని వాస్తవికతను పిండుకోవడం సింబాలిజం”

- ఇదీ ఆ చర్చ. చాలా ఆసక్తికరంగా ఉండింది. ఆఖరుకి నాక్కూడా ఎప్పుడో స్కూల్లో వదిలేసిన గ్రామరూ, అలంకారాలు, ఛందస్సు మీద ఆసక్తి పుట్టింది ఇది చదివాక :)

Published in:  on August 2, 2009 at 2:06 pm Comments (9)

మ్యూజింగ్స్ – చలం

ఈ మధ్య కొద్దిరోజులుగా చలం “మ్యూజింగ్స్” చదువుతూ ఉన్నాను. ఇది ఏకధాటిగా చదివేసే తరహా పుస్తకం కాదని నేను సీరియస్గా నమ్మడం చేత నెల దాటినా పూర్తికాలేదు ఇంకా. ఇంకా ఎక్కువకూడానేమో…గుర్తులేదు. ఒక్కోచోట చదివిన లైన్లనే మళ్ళీమళ్ళీ చదువుతూ ఆగిపోయిన సంధర్భాలున్నాయి. ఒక్కోచోట పేజీ మొత్తాన్నీ చదవకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. చలం అంటే ఎవరో నాకు తెలుసుకానీ, చలం అంటే ఏమిటో తెలీదు. రెండేళ్ళ క్రితం “మైదానం” చదివే ప్రయత్నం చేసి సగం చదివి, భరించలేక చేతులెత్తేసాక మళ్ళీ చలాన్ని చదవాలన్న కోరిక కలగలేదు. కానీ, ఏ ముహుర్తానో ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను.లేకుంటే, ఆయనలోని ఈ కోణాన్ని తెలుసుకోలేకపోయి ఉండేదాన్నేమో జీవితాంతమూ. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ 1937-1955 మధ్య కాలంలో రాసినవి. “వీణ” అన్న పత్రికలో మొదలయ్యాయని పుస్తకంలో రాసుంది. డెబ్భై ఏళ్ళ తరువాత ఇంకా ఆ పుస్తకాన్ని చదువుతున్నామంటే, ఇక పుస్తకం గురించి నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటాను.

ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఈ విషయం మీద అని వ్యాసాలు రాయలేదు కానీ, ఎన్నో విషయాలని స్పృశించారు. ప్రధానంగా ప్రకృతి ఆరాధన, సౌందర్య పిపాస కనిపించినా కూడా, సమాజం మీద వ్యంగ్యాస్త్రాలకీ, తాను అన్వయించిన స్త్రీ స్వేచ్ఛ పై చలం అభిప్ర్రాయాలకీ తగినంత స్థానం ఉంది. నిజానికి అదొక తరహా రచనా విధానమేమో – అక్కడ మొదలుపెట్టి ఇక్కడ తేలడం. శైలి చాలా చోట్ల నాకు చైతన్య స్రవంతి లాగా అనిపించింది. అందుకేనేమో, ఆ ప్రవాహంలో పడి నేను కూడా చాలా సేపు ఈదాను చలం తో పాటు. వ్యక్తిగతంగా నాకు అలా “చైతన్య స్రవంతి” తరహాలో సాగిపోయే రాతలంటే చాలా ఇష్టం. దానికీ, జీవితానికీ మధ్య నాకు ఉన్నట్లు కనిపించే సారూప్యమే కారణమేమో. అందువల్లే కాబోలు, కొన్ని భాగాల్లో చలం మాయలో పడి, చదివిన లైన్లే మళ్ళీ మళ్ళే చదివినది!

ఈయన శైలిలో ఉన్న మాయని మైదానంలో కొంతవరకూ తెలుసుకోగలిగినా కూడా, అక్కడి కథావస్తువు వల్ల సరిగా అర్థంచేసుకోలేకపోయాను. ఈ వ్యాసాల్లో ఆ మాయ చాలావరకూ అర్థమైంది. ఆయన -శైలిని మెచ్చుకుంటే ఏం లాభం, నేను రాసినది ఒప్పుకోనిదే అంటే అనుకోనీ, నేను శైలినే మెచ్చుకుంటున్నాను. రాసినది – to some extent I agree perfectly. కానీ, ఆయన రాసిన విషయాల్లో కొన్నింటిపై నా అభిప్రాయాలూ ఆయనవీ కలవ్వు. అలాగని పుస్తకాన్ని చదవడం ఆపేస్తా అని కాదు. :) ముఖ్యంగా ప్రతి టాపిక్ లోకీ స్త్రీ ని లాగడం నాకు మహా చిరాకు పుట్టిస్తుంది. కానీ, అది వదిలేస్తే, ఆ ప్రకృతి వర్ణనలూ, అక్కడక్కడా చెప్పే ఫిలాసఫీ, సమాజంపై వ్యాఖ్యలూ, ఆ రాసే శైలీ – ఎన్ని సార్లు తలుచుకున్నా తనివితీరదు. ఏ ఒక్క వ్యాసం తరువాతైనా నేను కనీసం ఓ పది నిముషాలన్నా దాన్ని తలుచుకోకుండా ఉన్నానా అంటే, లేదనే చెప్పాలి. అంత నచ్చాయి చాలా వ్యాసాలు నాకు. ఇప్పుడిది రాస్తూ ఉంటే కూడా, కొన్ని చోట్ల చలం మాటలు గుర్తు వస్తూ నాలో ఆ “వావ్!” అనుభూతిని పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వ్యాసం.

ఈ వ్యాసాలు చదువుతూ, నచ్చిన వాక్యాలు రాసుకుందామని రాయడం మొదలుపెట్టి, అదే ఓ పుస్తకం అయ్యేలా ఉందనీ, దాదాపు ప్రతి నాల్గో వాక్యమో, ఐదో వాక్యమో రాయాల్సి వస్తోందనీ అర్థమయ్యాక రాయడం మానేశాను. ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు తీసి తీరిగ్గా ఏదో ఓ వ్యాసం ఓపెన్ చేసి చదూకోడమే దీనికి పరిష్కారం అని అప్పుడే అర్థమైంది నాకు ;) ప్రస్తుతం అదే చేస్తున్నాను. పుస్తకం ఇలా ఒకటికి రెండు మూడు సార్లు చదివినవే చదువుతూ ఎప్పటికి పూర్తిగా చదివేస్తానో చెప్పలేను కానీ, ఎప్పటికీ చలాన్ని మరిచిపోలేనని మాత్రం చెప్పగలను. అలాగని ఇప్పుడు ఆయన నవల్లు చదవడం మొదలుపెట్టాలన్న ఆలోచన నాకు లేదు. “మైదానం” ప్రభావం ఇంకా మాయమవలేదు పూర్తిగా. ప్రకృతి ఆరాధన కలిగించే అనుభూతి ఎలాగైతే మాటలకందనిదో, అలాగే ప్రకృతిపై, మనిషిపై, ప్రపంచంపై చలం మ్యూజింగ్స్ ఇచ్చే అనుభూతికూడానూ. భాష కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉండింది నాకు చదవడానికి. కానీ, మొత్తానికైతే పుస్తకం నాకు నచ్చింది.

Published in:  on August 27, 2008 at 9:14 am Comments (22)

తెలుగెందుకు చదవాలి?

మే నెల్లో నేను “ఎందుకు చదవాలి?” అని రాసిన టపా కింద వ్యాఖ్య రాస్తూ రానారె గారు – “అసలు తెలుగెందుకు చదవాలి?” అన్న ప్రశ్న లేవనెత్తారు. తరువాత మాలతిగారు “తెలుగెందుకు మాట్లాడాలి?” అన్న టపా రాసారు. అప్పట్నుంచీ ఈ టపా రాద్దామని అనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది. ఇది.. మీరు తెలుగెందుకు చదవాలో చెప్పడం కాదు. నేను ఎందుకు చదువుతున్నానో చెప్పడం కోసం రాస్తున్న టపా. ఎందుకంటే, ఒకసారి ఆలోచించి చూస్తే, నిజంగా అర్థం కావట్లేదు నాకు తెలుగు ఇందుకు చదవాలి అని అందరికీ వర్తించే కారణం. నా మటుకు నేనే ఎక్కువ చదవను తెలుగు. ఓ ఇరవై శాతం తెలుగు పుస్తకాలు చదువుతానేమో…అంతే. కానీ, ఆ ఇరవై శాతాన్నే ఎందుకు చదువుతున్నా అన్న దానికి ఈ టపా.

1. భాష పై ప్రేమ కొద్దీ: ఇది నా మటుకు నాకు ప్రధాన కారణం. నాకు తెలుగులో చదవడమంటే ఇష్టం. ఈ భాషలో పదాలంటే ఇష్టం. నాకు అర్థమయ్యేంతలో భాషలో చేసే విభిన్నమైన ప్రయోగాలను తెలుసుకోడం అంటే ఇష్టం. నాకు అర్థమయ్యేంత దాకా రకరకాల మాండలీకాలు ఆయా పాత్రల మాటల్లో చదవడం ఇష్టం. తెలుగు పదాల కూర్పు ఇష్టం. ఇందుకని చదువుతాను నేను.

2. అనువాదాల ద్వారా తెలుగు పుస్తకాల్ని చదివితే నాకు తృప్తి ఉండదు. ఈ విషయాన్ని గురించి ఎందుకా అని ఆలోచిస్తే ఓ విషయం అర్థమైంది. అసలు భాష లో ఆ భాష మనుష్యుల జీవితాల గురించి తెలుసుకుంటే వచ్చే తృప్తి అదే విషయాన్ని అనువాదం ద్వారా తెలుసుకుంటే కలగదు అని. ఏ రష్యనో..జర్మనో అయితే… ఎలాగో అది నాకు రాదు కనుక, నాకు అనువాదాలు కూడా నచ్చేస్తాయి. అదే పుస్తకాన్ని నేను ఒరిజినల్ జర్మన్ లో గనుక చదివితే అప్పుడు అనువాదం నచ్చదేమో….ఎవరికి తెలుసు? అనువాదం ఎంత బాగా చేసినా కూడా, అసలు భాష తెలిసుంటే ఆ భాష లో చదవడం వేరు…దాన్నే మరో భాషలో చదవడం వేరు. అంతే కాదు. మన తెలుగు జీవితాల్ని గురించీ, మనకి తెలీని మనవాళ్ళ ప్రపంచం గురించీ తెలుసుకోడానికి తెలుగు సాహిత్యం కంటే ఉత్తమమైన మార్గం ఇంకోటేముంది?
(ఈ అనువాదాల్లో తెలుగు కథలు చదివి నచ్చకపోవడం వల్ల ఒరిగిన లాభాల్లో అతి పెద్దది మాలతిగారి పరిచయం, మా మధ్య ఏర్పడ్డ అనుబంధమూనూ.. హీహీ. కనుక అలాంటి లాభాలు కూడా ఉంటాయి తెలుగు చదవడం వల్ల.)

3. భావ వ్యక్తీకరణ మెరుగుపరుచుకోడానికి: మీరీ టపా చదువుతున్నారూ అంటే, మీరు నేటివ్ తెలుగు స్పీకర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు తెలుగు మాట్లాడుతూ పెరిగారు ఇంట్లో…లేకుంటే తెలుగు మీ మాతృభాష – ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగే అవకాశం ఎక్కువ (రెంటికీ తేడా ఏమిటీ? అనకండి. తేడా ఉంది. నన్నెరిగిన వారికి తేడా అర్థమయ్యే ఉంటుంది ఈపాటికి…నేనే ఉదాహరణని కనుక.) మన భాషలో వ్యక్తీకరించినట్లుగా భావాలని పర భాష లో వ్యక్తీకరించలేము (నా అభిప్రాయంలో). అంటే పై వాక్యం – నాకు ఆంగ్లమే మన భాష…అనుకునే వారికి కాదు. ఎవరికైనా తల్లిభాష అనేది ఒకటుంటుంది కదా…చాలా మటుకు మనం వేరే ఎన్ని భాషలు నేర్చుకున్నా అందులో మాట్లాడ్డంలో ఉన్న కంఫర్ట్ లెవెల్ వేరే భాషల్తో రాదు. అలాగే, మనలోని భావాలని అందులో వ్యక్తం చేసినంత బాగా ఇంకో భాషలో చేయలేకపోవచ్చు. సాహిత్యం చదవడం ఈవిధంగా కూడా ఉపయోగకరమే కదా. (అంటే..ఇది ఏ భాషకైనా నిజమే అనుకోండి…మీరు ఆ భాషలోనే వ్యక్తీకరించుకుంటాను…నాకు తెలుగొద్దూ….అంటే అది మీ ఇష్టం.)

4. ఏముందోయ్ తెలుగు సాహిత్యం లో? అని వెక్కిరించాలన్నా, (అంటే తెలుగు సాహిత్యంలో ఏమీ లేదని కాదు. మీరేదో సరుకు లేని పుస్తకమో కథో చదివితే కదా మీరు ఒక దురభిప్రాయమన్నా సాక్ష్యంతో ఏర్పరుచుకోగలిగేది!!) “ఏముందోయ్ తెలుగు సాహిత్యం లో?” అని వెక్కిరించేవారికి సమాధానం చెప్పాలన్నా కూడా మనం తెలుగు చదవాల్సిందే. లేకుంటే, ఏదో ఎమోషనల్ అయిపోయి లాజిక్ లేకుండా మాట్లాడేసి… తెలుగే గొప్ప..తెలుగే చదవాలి అనేస్తే ఎవరూ పట్టించుకోరు.

5. మీకు తెలుగులో రాయాలన్న తాపత్రేయం ఉంటే: మీరు ఇంగ్లీషు మాత్రమే చదువుతూ తెలుగులో బాగా రాయాలనుకోడమంత వెటకారపు ఆలోచన ఇంకోటి లేదు నా దృష్టిలో. ఒక భాషలో రాయాలంటే ఆ భాష గురించిన జ్ఞానం ఉండాలి కదా… ఆ భాష సాహిత్యాన్ని గమనిస్తూ ఉంటే, nuances మనక్కూడా తెలుస్తాయి.

ఇవి కాక…”ఎందుకు చదవాలి?” అన్నప్పుడు చెప్పిన ఏడు కారణాలూ ఇక్కడ కూడా వర్తిస్తాయి.

చివరగా ఓ చిన్న నిట్టూర్పు. ఆ మధ్య ఓసారి ఒకరితో మాట్లాడుతూ ఉంటే జరిగిన చర్చ సారాంశం: “తెలుగు సాహిత్యమంటే అస్తమానం ఇప్పుడు బ్రతికిలేని వాళ్ళ పుస్తకాలే పట్టుకుని చెప్పుకుంటూ ఉంటాం గొప్పగా. అదే నువ్వు ఏ ఆంగ్ల సాహిత్యమో తీసుకుంటే…ఎంత డైవర్సిటీ ఉంది? ఎన్ని ప్రాంతాల వాళ్ళు రాస్తున్నారు? ఆఫ్గన్ మొదలుకుని అమెరికన్ జీవితం దాకా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల జీవితాల్ని ఆంగ్ల సాహిత్యం ప్రతిబింబిస్తోంది…. తెలుగు అలా చేయగలదా?” అన్న ప్రశ్న వచ్చింది. తెలుగు అలా చేయలేదు…ఎందుకంటే ఆంగ్లం వ్యాప్తి వేరు. తెలుగు లో ఆఫ్గన్ జీవితం గురించి రాసే ఆఫ్గన్ దొరకడం దుర్లభం కాదూ? అదే ఆంగ్లం లో రాసే ఆఫ్గన్ దొరకడం ఎంత తేలిక? తెలుగు అలా చేయనక్కరలేదు కూడా. అసలే భాషా అలా చేయనక్కరలేదు నన్ను అడిగితే. ఏ భాషకైనా (ఆంగ్లాన్ని వదిలేస్తే) ప్రధానమైన పాఠకులు ఆ భాషని మాట్లాడేవారే. అనువాదాల ద్వారా చదువుకునే వారు వేరు. వాళ్ళని ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ, పైన చెప్పిన చర్చలో చెప్పుకోవాల్సిన భాగం – “మంచి పుస్తకాలంటే మనం ఇంకా పాతవే చెప్పుకుంటూ రావడం. ఆంగ్లం లో కూడా పాత పుస్తకాల్ని తలుచుకుంటూనే ఉంటాము కానీ వాటిని మాత్రమే తలుచుకోము. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కొత్తవి కూడా విరగబడి చదువుతూనే ఉంటారు జనం. అంత పెద్ద ఎత్తులో తెలుగులో పుస్తకాలు రావనుకున్నా గానీ, శాతాల లెక్కన చూస్తే కూడా contemporary తెలుగు సాహిత్యం గురించి ఎంత మంది …”ఇది చదివి తీరాలి!” అని చెప్పగలుగుతున్నారు?

ఇది మారాలంటే మనమేం చేయాలి? ఈ టపా ద్వారా కొంతమందన్నా ఈ దిశలో ఆలోచించి, విషయాన్ని అర్థం చేసుకుంటే…. అంతకంటే కావాల్సిందేమీ లేదు. సో, తెలుగు వెలగడానికి ఏమి చేస్తారు మీరు? మీ వ్యాఖ్యల్లో చెప్పండి మరి! :)

Published in:  on July 11, 2008 at 5:35 pm Comments (14)

తెలుగు కథకి జేజే – కానీ ఈ పుస్తకానికి మాత్రం చెప్పలేను!

“తెలుగు కథకి జేజే”  పేరు చూడగానే చదవాలనిపించింది కానీ, చివరికి నాకిది అసంతృప్తినే మిగిల్చింది. :( విషయానికొస్తే, ఇది సుమారు ఎనభై తెలుగు కథల సంకలనం. నేను చదివిన పేర్లూ, విన్న పేర్లు దగ్గర్నుంచి, కొత్త పేర్ల దాకా చాలా కథలు ఉండేసరికి, చూసి సంబరపడ్డాను… కథోత్సవం అని… కానీ, చివరికి ఇలా  అసంతృప్తి తో ఈ టపా రాస్తున్నా.

మొదట వరుసగా చదవడం మొదలుపెట్టాను. అంటే, అదే పనిగా కాదు… కాస్త గ్యాప్ ఇస్తూ వరుసగా ఒక్కో కథా. మొదటి పది కథల్లోనూ గొప్ప గొప్పోళ్ళ కథలున్నాయి. వాటిలో నాకు నచ్చింది ఒకే ఒక కథ… కృష్నశాస్త్రి గారి తప్పిపోయిన బామ్మ కథ. అది కూడా పదిలోకీ బెటర్ కథో, లేక నిజంగానే జేజే అనే కథో, మరి అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. :( తరువాత పదిలో కూడా మూణ్ణాలుగు మినహా పెద్దగా ఆకర్షించలేకపోయాయి. కథ బాగుంటే, కథనం నచ్చదు. అంతా బానే ఉందే అనుకున్నప్పుడు ముగింపు సంబంధం లేకుండా అనిపిస్తుంది…. ముళ్ళపూడి వెంకట రమణ గారి “ఆ చేతి చేత”, కొ.కు. “ఆదాయ వ్యయాలు” తప్ప మిగితావి నన్ను పెద్దగా ఆకర్షించలేకపోయాయి. ఈ ఇరవై కథల్లో బాగా ప్రముఖులైన వారి కథల్లో నుండీ ఈ మూడే నాకు మళ్ళీ చదవాలనిపించినవి.  ఇది జరిగాక, ఇక నేను వరుస మానేసి, అదృష్టాన్ని నమ్ముకున్నాను. ఏదో అలా ఓ కథ తీసి చదువుతాను, నా టైం బాగుంటే, కథ బాగుంటుంది – అని. కానీ, అది కూడా పెద్ద వర్కవుట్ కాలేదు నాకు :( ఇప్పటి దాకా చదివిన కథల్లో పదోవంతు నచ్చినట్లు ఉన్నాయి….అంతే. నేను కొనలేదు కానీ, ఖరీదు మూడొందలు!

డెబ్భై ఐదు కథలున్న పుస్తకం లో అరవై కథల దాకా వచ్చినా కూడా అసంతృప్తి అలాగే కొనసాగిందంటే, నాకింతకంటే పెద్ద కొలమానం లేదు ఆ పుస్తకం నాకు నచ్చలేదు అని తెలుసుకోడానికి. అసలు దీని గురించి బ్లాగు రాయడం కూడా ఆసక్తి లేనంత నిరాశ కలిగించింది ఈ పుస్తకం. ఇంతకంటే నేనేమీ రాయలేను.  సంకలనాలు కూర్చడం లో కూర్పరిని చూసి చదవాలని ఇప్పటికి అర్థమైంది నాకు.

Published in:  on July 1, 2008 at 3:21 pm Comments (2)

తొలిరేయి-చావా కిరణ్ గారి నవల

మన బ్లాగరు చావా కిరణ్ గారు నేనొక నవల రాసాను, చదివారా? చదివి మీ అభిప్రాయం చెప్తారా? అని అడిగినప్పుడు నాకు కాస్త సంతోషమేసింది – మన తోటి బ్లాగరు బ్లాగులో నవల రాసేసారు…అని. వెంటనే ఆయన బ్లాగు తెరిచాను. “తొలిరేయి” అన్న పేరు. ప్రేమకథేమో అన్న అనుమానం. మొదటి కొన్ని లైన్లు చదివాక, ఇలా చదవడం ఇబ్బందిగా ఉంది అంటే పీడిఎఫ్ ఇచ్చారు. ఏకబిగిన అరవై+ పేజీలూ చదివేసి, కాస్త కఠినమైన వ్యాఖ్యలు ఇస్తాను-మీకే చెప్పనా? బ్లాగులోనే పెట్టనా? అని అడిగితే – బస్తీ మే సవాల్…. అంటూ సై అనేసారు. దానితో ఇక్కడే పెట్టేస్తున్నా.

సైన్స్ ఫిక్షన్ – థీం నాకు కొత్తగా, బాగుంది. పేర్లు భలే వెరైటీ గా పెట్టారు…జిక్షి, సుబ్బా, స్టీల్రావు అంటూ. ఎక్కడ్నుంచి వచ్చాయో గానీ ఐడియాలు. మళ్ళీ నళిని, రజిత-మామూలు పేర్లే. కాన్సెప్ట్ అంతా కుతూహలం కలిగించే విధంగా ఉంది. ఇసుక తుఫాను సందర్భంగా చేసిన వర్ణన – టూ గుడ్. నాకు అన్నింటి కంటే ఆ భాగం నచ్చింది. ఇసుక తుఫాను రావడం,అక్కడ వెంటనే నాగరికతల ఆనవాళ్ళు బయటపడడం – చదువుతూ ఉంటే నాలో ఆ “వావ్!” ఫీలింగ్ కలిగించడంలో చావా గారికి ఫుల్ మార్కులు :) ఒక వాక్యం:”ఇంత అందమైన బొమ్మకే సృష్టికర్త ఉన్నపుడు, ఇంత అందమైన లోకానికి ఉండడని ఎందుకు అనుకుంటున్నారు?” – గుడ్ వన్! ఇదే వ్యాఖ్యని డాకిన్స్ (Richard Dawkins) వంటి వారు వింటే ఎలా స్పందిస్తారో తెలీదు కానీ, బాగా రాసారు ఈ వాక్యం. కథలోని ముగ్గురి పరిశోధనలు (మేధా, రజిత, సుబ్బా) – కొరిలేట్ చేయడం – చాలా బాగా చేసారు. ఆ భాగం కూడా నాకు చాలా నచ్చింది.

ఇక, ఫ్లిప్ సైడ్:
1. భరించలేనన్ని అచ్చుతప్పులు.
2. “వచ్చినాను, వెళ్ళినాను…” ఇది.. నాకు వింతగా ఏమీ అనిపించలేదు కానీ, రాత భాషలో అలా చదవడం కొత్తగా ఉండింది. ఇలా మాట్లాడే వారిని చూసాను కానీ…చదవలేదు. :)
3. రజని-రజిత-రంజిత : ఒకే మనిషికి ఇన్ని పేర్లు వాడారు ఈ నవల్లో. అదొక సారి చూసుకుని ఉండాల్సింది.
4. ఒక దానికొకటి సంబంధం లేని ఘటనలు వరుసగా వస్తున్నప్పుడు కనీసం **** లాంటి సెపెరేటర్స్ ఉపయోగించొచ్చు కదా…. ఎంత ఇబ్బందిగా ఉండిందో చదవడానికి!!
5. “నేను పాపాల్రావుని కలవడానికి వచ్చాను” అంటూ జిక్షి ప్రశ్నించగానే… (౩౪ పేజీ) – అక్కడ ప్రశ్న ఏముంది అసలు?
మొదట అన్నట్లు, అచ్చుతప్పులు చూస్తేనే అర్థమౌతోంది కిరణ్ గారు రెండో రీడింగ్ కి బద్దకించారు అని… :) నవల రాసేటప్పుడు ఎంత ఓపిగ్గా రాయాలో ఈ నవల చదువుతూ ఉంటేనే అర్థమైంది. ప్రపంచంలోని అన్ని భాషల నవలాకారులందరికీ పెద్ద నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది. నవల రాయడం అన్న చక్రంలో ఎన్ని దఫాలు రాసింది చదవాలో, తప్పులు సరిచూసుకోవాలో ఇప్పుడొక లే-పర్సన్ అవగాహన వచ్చింది నాకు. (భయపడకండి, నేను రాసేంత సీన్ లేదు..హీహీ) కిరణ్ గారు ఆ హోంవర్క్ కొంతైనా చేసి ఉంటే, నవల మరింత ఆకర్షణీయంగా ఉండేది. ఈ హోంవర్క్ లేకపోడం వల్ల రీడబిలిటీ ఎంత తగ్గుతుందో ఇప్పటిగ్గానీ అర్థం కాలేదు నాకు. నేనూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకోవలి ఇక. :) learning from others experiences!

చివరగా, కిరణ్ గారి నవల నాకైతే కథ,కథనం పరంగా చాలా నచ్చింది. మళ్ళీ ఆయన ఇంకోటి రాస్తే బాగుండు అనే ఎదురుచూస్తున్నా. నిజానికి ఓ రోజు అసలు మాటల్లో దింపి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటూన్నా….ఎలా రాసారు? ఐడియా ఎలా వచ్చింది? సమయం ఎక్కడిది? మీ ఆఫీసోళ్ళు పనివ్వడం లేదా? ;) అని. ఇంతకీ, చివరికి అంకితం చదివాక గానీ అర్థం కాలేదు ఇన్ని అచ్చుతప్పులు దొర్లిన కారణం – పరధ్యానం!! :) )

Published in:  on May 19, 2008 at 4:31 pm Comments (6)

కృష్ణ శతకము

“కృష్ణశతకము” – టీకా తాత్పర్యసహితము అన్న బాలసరస్వతీ బుక్ డిపో వారి ప్రచురణ ని చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నప్పటికీ ఎప్పుడూ చదవాలన్న కోర్కె కలుగలేదు. కారణం నాకు నా భాషా ప్రతిభపై ఉన్న భయం. ఎలాగో, టీకాతాత్పర్యమున్నా కూడా ఇవన్నీ నాకు అర్థం కావు అన్న ధీమా. కానీ, ఓ శుభముహుర్తాన చదవడం మొదలుపెట్టాక అర్థమైంది నా రెండో అనుమానం వట్టి అపోహ అని. దీనిలోని భాష చాలావరకు సరళంగా ఉంది. అర్థంకానిచోట ఎలాగో ప్రతిపదార్థం ఉంది. “కృష్ణశతకమునకు ఆంధ్రదేశములో మిక్కిలి వ్యాప్తియున్నమాట వాస్తవము” అన్న ముందుమాట వాక్యం చదివి నవ్వొచ్చింది. కానీ,
“నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!”
అన్న రెండో పద్యం చదివాక అర్థమైంది ఆ వాక్యం లోని నిజం. ఈ పద్యం మనలో చాలామందికే తెలిసుంటుందనే అనుకుంటున్నాను.

నన్ను ఈ పుస్తకం సగందాకా చాలా ఆకర్షించినా కూడా, ఇక ముందుకెళ్ళే కొద్దీ ఒకే మూసలో సాగినట్లు అనిపించింది. అఫ్కోర్సు, శతకం అంటే, అలా ఒక వస్తువు (ఇక్కడ దేవుడు) మీదనే అదే పనిగా రకరకాలుగా చెప్పి చెప్పి చెబుతూనే ఉంటారు అనుకోండి..అది వేరే విషయం. ప్రధానంగా నాకు ఇందులో మూడే రకాలైన పద్యాలు కనిపించాయి:
1. కృష్ణుణ్ణి సూటిగా పొగిడేవి – అతని గుణగణాలనూ, అతని లీలలనూ.
2. మొత్తం దశావతారాలూ, మిగిలిన దేవుళ్ళూ – అందరిలోనూ కృష్ణుడినే చూస్తూ రాసిన పద్యాలు
3. తనొక పాపిననీ, తనని క్షమించమనీ వేడుకునే పద్యాలు
-ఈ మూడో రకానివి చూస్తే అనుమానం..ఈయనది కూడా “పాండురంగమహత్యం” సినిమా తరహా కథ ఏమో అని. రాసినాయన నరసింహకవి.

నాకు ఈ శతకం చదవడం వల్ల అర్థమైన విషయాలు:
1. భాష చాలా సరళంగా ఉంది. అర్థం కాని చోట అర్థం కావడానికి టీకా తాత్పర్యాలు ఉండనే ఉన్నాయి
2. నా తెలుగు నేను అనుకున్నంత ఘోరం కాదు…కాస్త ఘోరమే.
3. ఇన్ని రకాలుగా వర్ణించవచ్చు కృష్ణుడిని.
4. భక్తిలో మునిగితే ఇక సమస్తం అదే కనిపిస్తుంది.

ఇక.. నాకు నచ్చిన కొన్ని లైన్లు, ఉదాహరణకి:

“జొక్కపు నీ గుణజాలము
వక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!”

“….దేవకీ
పుత్రా! ననుఁగావు నీకుఁబుణ్యము కృష్ణా!” (64) – :)

“హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!” (49)

“విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపదలఁచి విష్ణుఁడ వనగా
విశ్వముఁ జెరుపను హరుఁడవు….” (35)

“గరిఁగాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా!” (యాభై ఐదు)

-నిజానికి, నేను మొత్తం పద్యాల్ని పైన చెప్పిన మూడు రకాల్లోకి క్లాసిఫై కూడా చేసుకున్నాను…ఏదో ఓ రేంజిలో పేద్ద టపా రాద్దాం అనుకున్నా ఈ శతకం గురించి మొదట్లో తెగ నచ్చి…. కానీ, సమయం గడిచేకొద్దీ ఈ శతకం అప్పట్లో కలిగించిన ఉత్సాహం కలిగించలేకపోయింది నాలో.. ఏం చేస్తాం!

కృష్ణశతకం చదివే ఆసక్తి ఉంటే, వికీసోర్సు లో దొరుకుతుంది. టిఖా తాత్పర్యాలు కావాలంటే మాత్రం-మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాల్సిందే …నాకు తెలీదు :)

Published in:  on April 16, 2008 at 5:14 pm Comments (2)

దాటు – ఎస్.ఎల్.భైరప్ప (అనువాదం: పరిమి రామనరసింహం)

దాటు – ఎస్.ఎల్.భైరప్ప రాసిన సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన కన్నడ నవల. నేను పరిమి రామ నరసింహం గారు చేసిన తెలుగు అనువాదం చదివాను.

కన్నడ గ్రామీణ వాతావరణం లో కుల వ్యవస్థ, కులాల మధ్య ఉన్న అంతరాలు, జనాల లో నాటుకుపోయిన భావాలు, సామాజిక వ్యవస్థ – వంటి అంశాలను లోతుగా చర్చిస్తుంది ఈ పుస్తకం. ఆ ఊరు పేరు తిరుమలపురం. కథ ఊరి చరిత్ర నుండి మొదలై ఊరి ఆలయం గుడి పూజారి కూతురు ఊరి పటేలు అయిన గౌడ కొడుకుని ప్రేమించానని, అతన్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో ఇక ఆసక్తికరంగా సాగడం మొదలౌతుంది. అక్కడ్నుంచి మనుష్యుల్లో పేరుకుపోయిన చాంధసవాదం ఒకవైపు, పైకి కులాల పట్టింపు లేదు అంటూనే మళ్ళీ లోలోన ఆలోచించే హిపోక్రసీ ఒకవైపు, పిరికితనం ఒకవైపు, సమయాన్ని బట్టి మారే ఊసరవెల్లి తరహా ఒకవైపు, దేనికీ బెదరని ధైర్యం ఒకవైపు, గాంధీ సిద్ధాంతాలలో నమ్మకం ఉంచి, వాటిని పట్టించుకోని ఊరిపెద్దల మధ్య ఒక మనిషి నిస్సహాయత ఒకవైపు, ఆలోచనలేని ఆవేశం ఒకవైపు, విప్లవ భావాల ప్రభావం – ఈ నవలలో ఆ సమాజం లోని అన్ని రకరకాల మనస్తత్వాలనూ కవర్ చేసినట్లు అనిపించింది.

ఒక గ్రామం లెవెల్ లో కులం పట్టింపులు ఎలా ఉంటాయి? మనుష్యుల మధ్యకి వస్తే ఎలా ఉంటాయి? ఒక్కో సంధర్భంలో ఎలా మారతాయి? వోటు రాజకీయాలు….ఏ కులానికి ఆ కులం గొప్పదనం కోసం కలవరించడం, మధ్య మధ్య లో శాస్త్రాల ప్రస్తావనతో కూడిన చర్చలు, “తక్కువ” కులాలు అని పేరుబడ్డ వారి మనోభావాలు, వాళ్ళలోని యువత లోని ఆగ్రహం, కులాంతర ప్రేమలు – ఇలా ఇన్ని విషయాలను అవలీలగ రచయిత చర్చించడం చూస్తే, రచయిత సమాజాన్ని ఎంతగా చదివాడో అర్థమైంది నాకు. ఇది చదవడం వల్ల నాకు వ్యక్తిగతంగా ఏమి జరిగింది? అంటే, చాలా మేలు జరిగింది. చాలా విషయాలు తెలుసుకున్నాను -ఆ సమాజం గురించి. Wordly equations గురించి. ఇది నాకు సంబంధించినంత వరకు చాలా బాగా అర్థమయ్యేలా రాయబడిన చరిత్ర గ్రంథం.

అయితే, కొంతవరకూ ఈనవల నా మానసిక పరిణతిని మించి ఉన్నదేమో అని అనిపించింది అక్కడక్కడా. ఉదాహరణకి – వెంకటరమణయ్య పాత్ర చిత్రణ నాకు పూర్తిగా అర్థం కాలేదు. అలాగే, అతని కూతురు, మన కథానాయికా అయిన సత్యభామ ఆయన మరణం తరువాత జంధ్యం ధరించడం, హోమం చేయడం…వంటి విషయాలు నా ఊహకు అందలేదు. ఇక ముగింపు వాక్యాలు…. literal గా అయితే అర్థమయ్యాయి కానీ, అసలు ఆ వాక్యాల్లో ఏమి చెప్పదలుచుకున్నారో అర్థం కాలేదు. ఇంకా, ముఖచిత్రమే నాకు అర్థం కాలేదు అసలు. ఓ పాదం… ఐదు వేళ్ళపై ఐదు ముఖాలు. ఏదో డిజైను. దాని గురించి కాస్త వివరించి ఉంటే బాగుండేది. కవరు లోపలి భాగంలో ఉన్న బొమ్మ ని గురించి రాసారు కానీ, దీని గురించి రాయకపోవడం వల్ల – అర్థం కాలేదు. (I tried to get a image of the cover page…but I was not able to get a proper size. Will Upload once I get it.)

అనువాదం మాత్రం చాలా బాగుంది. నాకు తెలుగు నవల చదివినట్లే ఉండింది. ఎక్కడా అనువాదం చదివినట్లు అనిపించలేదు.

పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ. వెల రెండొందలు.

Published in:  on February 4, 2008 at 8:35 pm Comments (1)

2007 పుస్తకాల రీకాప్

2007 లో చదివిన పుస్తకాల్లో నాకు ఆసక్తి కలిగించిన పుస్తకాలను గురించి చెప్పడం ఈ టపా ఉద్దేశ్యం. (అంటే, పన్లోపనిగా పింగ్ బ్యాక్లు పెట్టి పాత వ్యాసాలను చదివేలా ప్రేరేపించడం పైకి చెప్పకూడని బహిరంగ రహస్యం.) కొత్త సంవత్స్రరం లోకి వచ్చి పదిహేను రోజులైతే ఇప్పుడు ఈ టపా ఏమిటీ? అనకండి… ఇప్పటికి కుదిరింది మరి! నాకీమధ్య పుస్తకపరిచయం కంటే, నెల నెలా పుస్తకావలోకనమే వర్కవుట్ ఔతుందేమో అనిపిస్తోంది :( విషయానికొస్తే, ఈ ఏడాది చదివిన పుస్తకాలలో నాకు ఆసక్తికరంగా అనిపించినవి, నన్ను నిరాశ పరిచినవి అని రెండు రకాలుగా క్లాసిఫై చేసుకుంటే, ఆ జాబితా ఇది. ఇవి కాక మిగితావి అంటే పెద్దగా లేవు కానీ, మిగితా పుస్తకాలను వదిలేశాను అంటే, అవి బాలేనివని కాదు… వాటిలోనూ బాగున్నవి ఉన్నాయి. జాబితా మరీ పెద్దదైపోతూ ఉంటేనూ…తగ్గించేసా.  మరిక చదవండి…. (తర్వాత ఎవరెవరి కర్మను అనుసరించి వారికి ఫలితాలు దక్కుతాయి.)

అసక్తికరమైనవి:
1. ఇండియా విన్స్ ఫ్రీడం – మౌలానా అబుల్ కలాం అజాద్:
చరిత్ర ప్రియులు తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకం గురించి ఇదివరలో ఓ సారి బ్లాగాను కూడా. కనుక మళ్ళీ ప్రత్యేకం రాయను. ప్రతి ఇంటి గ్రంథాలయం లోనూ ఉండాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం.


2. టిప్పింగ్ పాయింట్ – మాల్కం గ్లాడ్వెల్:

ఈ పుస్తకం ఉన్నట్లుండి జరిగే కొన్ని సామాజిక మార్పులను అర్థంచేసుకోడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఉన్నట్లుండి ఏదో ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చేయడమూ, ఉన్నట్లుండి ఏదో సంచలనం జరిగిపోవడమూ ఇలాంటివి. ఇందులో తీసుకున్న కేస్ స్టడీలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. దీని గురించిన వికీ పేజీ మీకు ఆసక్తి కలిగించవచ్చు.ఇక్కడ చదవండి.

3. రాజ్మోహన్స్ వైఫ్ – బంకిం చంద్ర ఛటర్జీ:

ఈ పుస్తకానికున్న చారిత్రకవిలువ గొప్పది. కారణం ఇది బంకిం రాసిన మొదటి నవల కావడం ఒకటి, ఆయన రాసిన ఏకైక ఆంగ్ల నవల కావడం మరోటి. భారతీయ ఆంగ్లసాహిత్యంలో తొలితొలి రచనల్లో అదొకటి కావడం ఇంకో కారణం. దీని గురించి కూడా ఇదివరలో బ్లాగాను. ఇది ఒక గొప్ప నవల అని నాకు అనిపించలేదు కానీ, చారిత్రకవిలువ ను బట్టి చూస్తే, ఇది చదవడం నా అదృష్టమనే భావిస్తున్నాను.

4. బెస్ట్ ఆఫ్ సత్యజిత్ రాయ్:
ఇది సత్యజిత్ రాయ్ కథల సంకలనం. కొన్ని కథల్ని బెంగాలీ నుండి గోపా మజుందార్ అనువదిస్తే, కొన్నింటిని సత్యజిత్ రాయే ఆంగ్లానువాదం చేసారు. ఈ పుస్తకం గురించి ప్రత్యేకం బ్లాగి పొరపాటు చేసి మ్యూసిండియా లో పెట్టాను. వాళ్లేమో దానికి లంకె తొలగించేసినట్లున్నారు.. అది అక్కడ లేదు. :( అయినప్పటికీ, ఇది కూడా ఒక మంచి పుస్తకం. కొని పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించే పుస్తకం. కథకునిగా సత్యజిత్ రాయ్ అన్నది సాధారణంగా ఓ కొత్త కోణం. పాఠకులని ఆయన ఏ కోశానా నిరాశపరచరు. ఈ తరహా కథల్ని రాయ్ తప్ప వేరెవరూ రాయలేరు అనిపించేంత నచ్చింది నాకీ పుస్తకం. మొదటిసారి నుండి ఇప్పటిదాకా ఆ పుస్తకంలోని కథల్ని ఎన్నిసార్లు చదువుకున్నానో కూడా లెక్కలేదు.

5. బటర్ టీ అట్ సన్రైస్ – బ్రిట్టా దాస్:
ఇది భూటాన్ లో జీవితం పై రచయిత్రి సొంత అనుభవాల సంకలనం. ఫిజియోథెరపిస్టుగా ఓ సంవత్స్రరం పాటు భూటాన్ లో గడపడానికి వస్తుంది రచయిత్రి. అప్పుడు తనకు కలిగిన అనుభవాల గురించీ, భూటాన్ ప్రజల జీవితం గురించీ ఈ రచన. దీని గురించి ఇక్కడ బ్లాగాను. పుస్తకం ఆసక్తికరంగా, చదివించేలా ఉంది. ఈక్షణం భూటాన్ వెళ్ళిపోదామా అనుకునేంతగా ప్రభావితం చేసింది నన్ను ఈ పుస్తకం :)

6. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు – విశ్వనాథ సత్యనారాయణ:
వేయిపడగలు దెబ్బకి అల్లాడుతున్న నన్ను మళ్ళీ విశ్వనాథ రచనల వైపు లాగిన పుస్తకం. పుస్తకం చదివినంతసేపూ బాగా ఆసక్తికలిగించింది. ఎక్కడికక్కడ హాస్యం బాగుంది. అసలా ఊహే – విష్ణుశర్మకి, తిక్కనకీ ఇంగ్లీషు నేర్పాలన్న ఆలోచనే నవ్వు తెప్పించేదైతే, కథ నడిచిన విధానం ఇంకా నవ్వు తెప్పించింది. దీని గురించిన బ్లాగు టపా ఇక్కడ.

7. ఆర్గుమెంటేటివ్ ఇండియన్ – అమర్త్య సేన్:
నేను ఈ పుస్తకం చదివే ముందు భయపడ్డాను – అమర్త్యసేన్ అంత మనిషి రాస్తే మన తలకెక్కుతుందా? అని. కానీ, ఈ వ్యాస సంకలనం అందరూ తప్పక చదవాల్సినది. నేను అన్ని వ్యాసాలూ చదవలేదు. కానీ, చదివిన వ్యాసాలు నాకు ఎన్నో విషయాలను చెప్పాయి, ఎంతగానో ఆలోచింపజేసాయి. సాధారణ మానవులకి అర్థమయ్యేలా రాయబడిన పుస్తకమనే చెప్పాలి. వ్యాసాలు కూడా మరీ అకడమిక్ వ్యాసాల తరహాలోకాక చదివించేలా ఉన్నాయి. అందుకే కాబోలు, ఈ పుస్తకం నాకు నచ్చింది.

8. కంప్లీట్ అడ్వెంచర్స్ ఆఫ్ ఫెలూదా (1 &2)- సత్యజిత్ రే:
వెల్, రెండు సంకలనాలు కలిపి 35 చిన్న సైజు నవల్లు. :) ఫెలూదా అన్నది సత్యజిత్ రాయ్ షెర్లాక్ హోమ్స్ ప్రభావం లో సృష్టించిన డిటెక్టివ్ పాత్ర. అరవైల నుండి మొదలై దాదాపు పాతికేళ్ళపాటు బెంగాలీ టీనేజ్ పిల్లల అభిమానపాత్ర గా ఉండింది.  ఫెలూదా పుట్టి ఇన్నాళ్ళూ గడిచాక నాక్కూడా అది అభిమాన పాత్రే అనిపించింది ఆ సంకలనాలు పూర్తిచేసేసరికి. నేను రాయ్ రచనల వ్యామోహంలో పడి ఈ సంవత్సరం ఆయన రాసిందేది కనబడితే అది చదివేసి, ఓ వ్యాసంకూడా రాసి, కాస్తంత వివాదాస్పదం కూడా అయ్యాను కొద్దికాలం. తరువాత…. కొత్తవి దొరకలేదు రాయ్ వి! :( ఫెలూదా హోమ్స్ ని మించినవాడు అని అనను కానీ, మంచి ఎంటర్టైనర్ అనే చెప్పాలి. కథాంశాల్లో పోయే కొద్దీ కొత్తదనం లోపించడం, ప్రిడిక్టబిలిటీ వంటి సమస్యలతో కూడా మొత్తం ఫెలూదా సీరీస్ అంతా పూర్తి చేసాను అంటే అర్థం చేసుకోండి…రాయ్ శైలిలో ఏదో ఉంది అని :) బహుశా, నేను అభిమానిని కనుక లొసుగులు అర్థం కాలేదేమో, అది వేరే విషయం.

9. ఇట్స్ నాట్ అబౌట్ ది బైక్ – లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆత్మకథ
లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఒక సైక్లిస్టు. అతి కష్టతరమైన “టూర్ డి ఫ్రాన్స్” ని వరుసగా ఏడుసార్లు గెలిచాడు. అది కూడా కేన్సర్ బారిన పడి బయటపడ్డాక! ఇది అతని ఆత్మకథ. ఈ పుస్తకం గురించి ముందుగానే విని ఉన్నప్పటికీ చూడ్డం ఇదే మొదలు. చదవడం ఇది చివరమాత్రం కాదు అనుకుంటూన్నా. ఎంతో స్పూర్తిదాయకమైన పుస్తకం. కష్టాలని ధైర్యంగా ఎదుర్కుని అధిగమించడం ఎలాగో ఈ పుస్తకం చెబుతుంది మనకు. సైక్లింగ్ టోర్నమెంట్లు, సైక్లిస్టులకి ఉండాల్సిన లక్షణాలు – ఇలాంటి వాటి గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నా నేను ఈ పుస్తకం చదివి.

10. పరమేశ్వరశాస్త్రి వీలునామా – గోపీచంద్:
పరమేశ్వరశాస్త్రి వీలునామా గురించి ఓ సారి సవివరంగా ఇక్కడ బ్లాగాను. కనుక మళ్ళీ చెప్పను.

11. పడక్కుర్చీ కబుర్లు – ఎమ్బీఎస్ ప్రసాద్:
“పడక్కుర్చీ కబుర్లు” అన్నది ఏడు చిన్న చిన్న పుస్తకాల సంకలనం. ప్రత్యేకం సినిమాలని కాదుకానీ, రకరకాల విషయాల పై ఇవి నిజంగా లిటరల్ గా – పడక్కుర్చీ కబుర్లు. ఎవరో బాగా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మనపక్కనే పడక్కుర్చీ లో కూర్చుని కబుర్లు చెబుతున్నట్లే ఉంటుంది. నేను మూడు భాగాలు చదివాను. ఆ మూడూ సినిమాలకి సంబంధించినవే – మొదటిభాగం – నలుగురు నటీమణులు (సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి), రెండో భాగం – నలుగురు పాత్రధారులు (ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, గుమ్మడి ), ఐదోభాగం-నలుగురు గాయకులు (నాగయ్య, ఘంటశాల,పీ.బీ.శ్రీనివాస్, ఎస్పీబీ). మూడింటిలోనూ కబుర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.  ఎన్నిసార్లైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరన్నా – అలా ఓ భాగం తెరిచి అలవోకగా చదువుకోగలిగేంత సాధారణభాష లో, ఆసక్తికరంగా రాయబడినవి. మిగితా భాగాల వివరాలు – మూడోభాగం :నాలుగు క్షేత్రకథానికలు(అమరావతికథలు, మిట్టూరోడికథలు, దర్గామిట్టకథలు, పసలపూడి కథలు), నాలుగోభాగం-నలుగురు రాజులు(అశోకుడు,రాయలవారు,శివాజీ,బహదూర్ షా జాఫర్), ఆరోభాగం:నలుగురు నాయకులు(నెహ్రూ,పటేల్,నేతాజీ,జిన్నా), ఏడోభాగం:నాలుగు విజయా కామెడీలు(పెళ్ళిచేసిచూడు,మిస్సమ్మ,అప్పుచేసిపప్పుకూడు,గుండమ్మకథ). ఇవి కాక మరో మూడుభాగాలు రాబోతున్నాయని నేను చదివిన ఓ పుస్తకం వెనుక భాగం లో వేసారు. “ఎదురుచూపుకు నిదరేది?” అనుకూంటూ అవెప్పుడొస్తాయా అని ఎదురుచూట్టమే.

12. సచ్ అ లాంగ్ జర్నీ – రోహింటన్ మిస్ట్రీ:
ఈ పుస్తకం గురించి కూడా ఇదివరలోనే బ్లాగాను. మిస్ట్రీ అంటే ఒక స్టీరియోటైప్ ఏర్పడిపోయింది నాకు ఇది చదివాక. అయినప్పటికీ కూడా, పుస్తకం ఆసక్తికరంగా, చదివించేలా ఉందనే చెప్పాలి. మిస్ట్రీ శైలి పాఠకులని చదివింపజేస్తుంది.  ఐనప్పటికీ కూడా మిస్ట్రీ ఆ స్టీరియోటైప్ కాక వేరేది రాస్తాడని నాకైతే నమ్మకం లేదు! బహుశా మళ్ళీ మిస్ట్రీ నవల రాస్తే చదూతానేమో, అది వేరే విషయం అనుకోండి… :)

13. ఫిడేలురాగాల డజను – పఠాభి:
సరదాగా చదూకోడానికి బాగుండే పుస్తకం. ఈ పుస్తకం గురించి ఓ సారి బ్లాగాను. రెండో బ్లాగు రాస్తూ ఉన్నా…. ఒకటి పుస్తకం గురించైతే మరోటి దాని విమర్శల గురించి :)

14. అనుభవాలూ-జ్ఞాపకాలూనూ (మొదటి భాగం) – శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ఆత్మకథ:
శ్రీపాదవారి ఆత్మకథ గురించిన మొదటి ఇంట్రో స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది. అష్టావధానం గురించిన పాఠం అది. ఈయన ఆత్మకథనుండి తీసిన ఓ భాగం. నేను చదివిన మొదటిభాగం లో అది లేదు కానీ, ఈ పుస్తకం ద్వారా అప్పట్లో మనుష్యుల జీవనశైలి ఎలా ఉందో కొంతవరకూ అర్థమైంది. ఈ పుస్తకం భాష కొంత అర్థంచేసుకోవడం కష్టమైంది, కానీ, నాలో ఆ తరహా భాష పై ఆసక్తైతే రేకెత్తించింది. నాకో పెద్ద జాబితా ఉంది ఈ పుస్తకం చదివాక తెలుసుకోవాల్సిన పదాల జాబితా. త్వరలో ఆ జాబితా తో ముందుకొస్తా :)

నిరాశకలిగించినవి:

1. వేయిపడగలు – విశ్వనాథ సత్యనారాయణ:
2. అనుక్షణికం – చండీదాస్:
3. కథాసరిత్సాగరం – సోమదేవుడు:
- ఇవి మూడూ నన్ను ఏఏ విధాలుగా నిరాశపరిచాయో మళ్ళీ చెప్పి మళ్ళీ గొడవ మొదలెట్టదలుచుకోలేదు. కనుక విషయం మటుకు చెప్పి వదిలేస్తున్నా.

4. జంధ్యామారుతం – పులగం చిన్నారాయణ: (రెండు భాగాలు)

ఇవి రెండూ జంధ్యాల తీసిన సినిమాలపై. నేను పేరు చూసి ఏదో ఊహించా – సినిమాని విశ్లేషించడం, ఆసక్తికరమైన కథలేమన్నా చెబుతారేమో అని. అవి చూస్తే, రికార్డు పుస్తకంలా అన్నీ డీటైల్స్ రాసి, అక్కడక్కడా కొన్ని డైలాగులూ అవీ మాత్రం రాసారు. సినిమా టైటిల్స్ ఇంకా స్టోరీలైన్ తెలుసుకోడానికి యాభైయ్యో అరవైయ్యో రూపాయలు పెట్టి ఒక్కో పుస్తకం కొననక్కరలేదు ఏమో అనిపించింది…

- ఇంక అయిపోయింది లెండి. ఆ అమృతాంజనాలూ జండూబాములూ ఇవన్నీ తెచ్చుకోండి సార్లూ,మేడమ్సూ. ఈ సుదీర్ఘ టపా చదివినందుకు ధన్యవాదాలతో
-ఇట్లు నేను అలియాస్ ఈబ్లాగుఓనర్.

Published in:  on January 17, 2008 at 5:29 am Comments (7)