తెలుగు కవిత్వం తో నా డీలింగ్స్…

నేను ఆట్టే కవితలు చదవను. అసలు నాకు కవితలోని భావాన్ని అనుభవించడం చేతకాదు అని ప్రగాఢ విశ్వాసం. నేను వచనంలో కవిత్వాన్ని మాత్రమే అనుభవించగలను. వచన కవిత్వాన్ని కూడా అనుభవించలేను, వేరే కవిత్వాల మాట అటుంచితే. “కవిత్వం” అన్న పదాన్ని నేను అర్థం చేసుకునే విధానంలో, “కవితలు” మాత్రమే కవిత్వం కిందకు రావు. మాటలు కూడా వస్తాయి. అందుకే, నేను పరమ నిక్కచ్చిగా నేను కవిత్వం చదవను అనలేను. అయితే, చదివినంతలో నన్ను అలాగే తమ మాయ లో పడేసి, వెంటాడి వెంటాడి మళ్ళీ మళ్ళీ చదివించిన తెలుగు కవితలు ఉన్నాయి. అలాంటి కొందరి గురించి చెబుతూనే, కొంత మార్కెటింగ్ కూడా చేయడం ఈ టపా ఉద్దేశ్యమనమాట :)

ఇటీవలికాలంలో రోజూ జపం చేస్తున్న కవి ఐతే “శ్రీశ్రీ”. మహాప్రస్థానంలోని సెలెక్టెడ్ కవితల్ని రోజూ..రోజూ..తలుచుకుంటూనే ఉంటున్నాను. అయితే, ఇతనితో నా తొలిపరిచయం “అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం” అన్న వాక్యాలతో, స్కూల్లో ఓ సందర్భంలో. “అబ్బ చ!” అనుకోలేదు. ఎందుకంటే, ఆపాటికి శ్రీశ్రీ అన్నాయనను మహాకవి అంటారని తెలిసి ఉండటం చేత. “ఓహో” అనుకున్నానే కానీ, ఆ సంవత్సరం ముగిసే సరికే ఇలాగే కొన్ని వాక్యాలు విని విని ఆయనంటే ఓ అభిమానం ఏర్పడి పోయింది. ఓ పదేళ్ళయ్యాక ఇప్పుడా ఆ నామస్మరణం లేనిదే లేవను. ముఖ్యంగా – ఒక రాత్రి, కేక, ఐ, కళారవి, ఆః!,,స్విన్ బర్న్ కవికి – ఇవి అలా అలా చదివి చదివి ఖంఠతా వచ్చేసాయి. అలాగే, ఎంచక్కా పాటలుగా విన్న – “ఆనందం అర్ణవమైతే”, “జగన్నాథుని రథచక్రాలు” అలా రిథమిక్ గా గుర్తు ఉండిపోయాయి. “నిజంగానే” – అని ఎన్ని సార్లు ఎన్ని సందర్భాల్లో అనుకుంటానో. ఓ ఫోర్సు ఉంది ఈ కవితల్లో. “ఖడ్గసృష్టి” సంకలనంలో – “ఏవి తల్లీ!” కవితలో “పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయినజాడలేవీ ?” అన్న వాక్యం నన్ను చాలారోజులు వెంటాడింది మొదట చదివినప్పుడు. అయితే, మహాప్రస్థానంలో కొన్ని, ఖడ్గసృష్టిలో ఒకటీ అరా మినహాయిస్తే, నాకెందుకు శ్రీశ్రీవి మిగితావి నచ్చలేదో, ఇవి మాత్రం ఎందుకు అంతలా నచ్చేసాయో మాత్రం అర్థం కాదు.

అయితే, 2006 ప్రాంతంలో మూలా సుబ్రమణ్యం, కొత్త రవికిరణ్ ల ద్వారా పరిచయమైన కవి ఇస్మాయిల్ ఇలాగే మర్చిపోలేని ముద్ర వేసాడు. అక్కడికి నేనేదో తెగ చదివేశా అని కాదు. కానీ, ఇలా ఇన్స్టంట్ గా నాకు నచ్చేసిన వారు తక్కువ. ఇస్మాయిల్ కవితల్లో కూడా కొన్ని అలా చదువుతూ ఉంటే, “అబ్బ!” అనిపిస్తే, కొన్ని “అబ్బా!” అనిపించినవి ఉన్నాయి కానీ, నేను చదివిన కాస్తలో, ఆ కొద్ది పదాల్లో బోలెడు అర్థాన్ని పలకడం, అన్నింటికంటే ముఖ్యంగా – భాషలోని సింప్లిసిటీ, చదువుతూ ఉండగా, చదివాకా, కలిగే ఫీలింగ్ – నాకు చాలా నచ్చేశాయి. అయినప్పటికీ నేను ఎక్కువగా ఆయన కవితలు చదవలేదు అనుకోండి, అది వేరే విషయం.

వీళ్ళిద్దరు కాక అపుడప్పుడూ వెబ్లో చదివే కవితల్లో కూడా కొన్ని అలా వెంటాడుతూ ఉంటాయి. ఈమాట వెబ్జీన్లో అలా కొన్ని చదివాను. అలాగే, ఒకప్పుడు తెలుగుపీపుల్.కామ్ లో కూడా అలాంటి కవితలు చాలా చదివాను. ప్రస్తుతం కృష్ణశాస్త్రి భాషని అర్థం చేస్కుని, అనుభవించడాన్కి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇన్నిరోజులు ఔతూ ఉన్నా కూడా అసలు “కవిత్వం” అంటే ఏమిటీ? దేన్ని కవిత్వం అనొచ్చు, దేన్ని అనకూడదు? ఏది మంచి కవిత? ఏది కాదు? – ఇవన్నీ నాకు ఎప్పుడూ అర్థం కాని ప్రశ్నలే. రోజులు గడిచేకొద్దీ నాకు జవాబులు తెలుసుకోడం పై కూడా ఆసక్తి తగ్గుతూ వస్తోంది.

సరే, నాలాంటి వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు కానీ, సెప్టెంబర్లో పుస్తకంలో “తెలుగుకవిత” అని ఫోకస్ ప్రకటించి, అదలా అక్టోబర్ దాకా పొడిగించారు. ఇలా పొడిగించడం వల్ల పుస్తకం సంగతి అటు పెడితే, నాకు చాలా లాభం – ఎందుకంటే, రకరకాల విషయాలు తెలుసుకున్నాను కనుక. ఇస్మాయిల్ గారితో మొదలై, గోపిరెడ్డి రామకృష్ణ, అఫ్సర్ గార్ల వద్దకు చేరి, విశ్వనాథ వారి కవిత్వం రుచి చూపి, ముకుందరామారావు గారిని పలకరిస్తూ, శివారెడ్డి గారి గురించి మొదలై (ఈ మధ్యలో మళ్ళీ ఇస్మాయిల్ గారిని తల్చుకుంటూ), రైతు కవిత, తిలక్, ఇక్బాల్ చంద్, ఆకెళ్ళ రవిప్రకాశ్, వైదేహి శశిధర్ గార్లదాకా వచ్చి, మధ్యలో మన బ్లాగరు ఉష గారిని కలిసి, కల్పన గారి ద్వారా చలం కవిత్వం అంటే ఏమిటో తెలుసుకుని, విన్నకోట రవిశంకర్ గారు ఇటీవలి కవిత్వం గురించి చెప్పింది విని, యదుకులభూషణ్ గారికి నచ్చిన కవితతో సెప్టెంబర్-అక్టోబర్లు ముగిశాయి.

ఇలా పాతా కొత్తా భేదం లేకుండా రకరకాల కవుల గురించి రాసిన ఈ వ్యాస రచయితలందరికీ ధన్యవాదాలు – బ్లాగ్ముఖంగా.

ఈ రెండు నెల్లలోనూ పుస్తకం.నెట్ లో తెలుగుకవిత అన్న ఫోకస్ అంశంపై వచ్చిన వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు.

(సైటు కార్యం, స్వకార్యం – రెండూ చేయడం అంటే ఇదే!)

Published in: on October 31, 2009 at 9:27 am Comments (2)

ఎదురుచూపు మళ్ళీ…

ఈ ఎదురుచూపులన్న వాటికి ఆదీ అంతం రెండూ ఉండవు కాబోలు. ఒక్కొక్కటి గా చూస్తే ఉన్నాయేమో బహుశా. ఒక్కటిగా చూస్తే ఉన్నట్లు అనిపించదు. నాకెందుకో నేనెప్పుడూ దేనికోసమో ఎదురుచూస్తున్నట్లే ఉంది ఈమధ్య కాలంలో. ఎటొచ్చీ, “దేనికోసం” అన్న ప్రశ్నకి జవాబు మారుతూ వస్తోంది. అంతే. గత ఏడాది, ఇదే టైం లో “ఎదురుచూపు” గురించే ఒక పోస్టు రాశాను. ఆ విషయం ఇది రాస్తూ ఉంటే గుర్తుకొస్తోంది. అందుకే అంటున్నది – “ఆదీ అంతం ఏదీ లేని గానం” ఏమో ఎదురుచూపంటే.

ఎకనామిక్స్ పాఠాలు స్కూల్లో నేర్పే మొదటి రోజే చెప్పే మాట – మనిషి కోర్కెలు అపరిమితమైనవి అని. అందుకే ఏమో, ఎదుర్చూపుకి కూడా ఆదీ అంతం ఉండదు కాబోలు! కోరికలే గుర్రాలైనా కూడా ఎదురుచూపులే మిగుల్తాయేమో. ఈ చూపులు, ఎదురుచూపులు ఇలా ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండాల్సిందేనా? తల్చుకుంటేనే భయంగా ఉంది..మనిషంత మనిషిని ఆకారమైనా లేని ఎదురుచూపులు బందీలు చేయడం ఏమిటో. ఆ బందిఖానా లో పడి కొట్టుకుంటూ మనిషి అలా ఉండిపోడం ఏంటో. అలా చూస్తారేంటి, ఎకనామిక్స్ లో ఇదేగా చెప్పారు, నేను కాస్త భాష మార్చి చెప్పే సరికి నాకేదో అయిందనుకుంటే ఎలా?

హా, ఇదివరలో ఎదురుచూపుల్లో కూడా ఒక తియ్యదనం ఉన్నట్లు తోచేది – “చేరువైనా, దూరమైనా, ఆనందమేనా…” అన్నట్లు. ఇవాళ ఇంకోలా అనిపిస్తోంది. “వినేవారు లేక, విసుక్కుంది నా కేక” అని. ఎవరన్నా వింటారేమో అని ఎదురు చూసి, చూసి, విసుగొచ్చేసి ఉంటుంది పాపం. ఎవరో వినకపోతే పోయే, మన కేక మనమే వినిపించుకోము ఒక్కోసారి, అప్పుడు అది ఉత్త విసుక్కోడం కాదు, కసురుకుంటుంది మనల్ని. మనకా అర్థం కాదు – ఎందుకు? మనం ఇంకేదో జరగాలని ఎదురుచూస్తూ ఉంటాము కదా! ఆదేమో, విసుక్కుని, కసురుకుని, చివరకి గింజుకుని, ఆఖర్లో ముసుగేస్కుని పడుకునేసింది అనుకోండి – “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అని విషాదంగా పాడుకోవాల్సిందే. ఆ తర్వాత ఆ కేక వినిపిస్తుంది ఏమో, దాన్ని విందాము, అని మనం ఎదురుచూడ్డం మొదలుపెట్టినా, అది రాదు కదా. అప్పుడు కూడా ఎదురుచూపులే మిగుల్తాయి.

“ఎదురుచూపుకీ నిదరేది?” – నిద్రా? ఆకలి దప్పులు కూడా ఉండవనుకుంటాను. లేదా, ఆ ఆకలే నాబోటి వారి పై పడి తీర్చుకుంటూ ఉంటుంది ఏమో. ఎదురుచూపు నన్ను బందీ చేసి నా జీవితంతో ఆడుకోడం బానే ఉంది కానీ (నాక్కాదు, దానికి), నాకో కోరిక. అల్లాద్దీన్ కి చిక్కిన భూతం పాత జీవితంలా, నేనూ ఎదురుచూపులని ఒక డబ్బాలో పడేసి మూత పెట్టేసి, సముద్రంలో గిరాటేస్తాను. అప్పుడు, నాలాంటి ఎదుర్చూపుల్లో బ్రతికే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తల్చుకుంటే జాలేస్తోంది. ఎందుకంటే, మాకదే పని కదా… అది లేకుంటే, జీవితం డల్లై పోదూ? అందుకే, ఎందుకొచ్చిన గోల, నేనిలా ఎదుర్చూపుల్లోనే బ్రతుకడమే సరేమో. అసలు చూపులుండేవే ఎదురుచూడ్డానికీ!

Published in: on October 27, 2009 at 3:51 pm Comments (2)

మూడు పాటలూ, నేనూ

ఇదెక్కడి గోలండీ బాబూ – పగలంతా నా తలలో తిరిగి తిరిగి, దాన్ని తినేసి, ఆఖరుకి నన్నొదిలేసి వెళ్ళిపోయింది – ఏదా? అదే…గోల. నేను గోల చేయలేదు…గోలే నన్నేదో చేసి వెళ్ళిపోయిందంటున్నాను. మనిషి గోల చేస్తాడు కానీ, గోల మనిషినేం చేస్తుంది అంటారేంటి మళ్ళీ? నన్ను ఏదో చేసిందంటే నమ్మరేం? మీదెక్కడి గోలండీ బాబూ!

మీకంటే నేనే నయం ప్రశ్నలేసి చంపుకోకుండా విషయం కనుక్కునే ప్రయత్నం చేశాను. ఇంతకీ ఈ గోలెక్కడిదో అర్థం అయింది చివరకి…కానీ, ఏమిటో, ఎందుకో, అర్థం కాలేదు. లేదంటే – అసలదేమిటో అర్థమైంది కానీ, ఎక్కడిదో, నా దగ్గరికెలా వచ్చిందో అర్థం కావడంలేదా? ఏమిటో – నాకేమర్థం కావడంలేదో కూడా నాకర్థం కావడం లేదు :(

మొన్నామధ్య ఓరోజు లేవడం లేవడం – “ఆంఖోంకీ…గుస్తాకియా…” పాటతో లేచాను. పాట మ్రోగుతోంది తల్లో. తల్లో ఏం ఆన్ చేస్కున్నానో లేస్తూ లేస్తూ – అది నాకు తెలీదు. సరే, పాట వస్తోందా, మధ్యలో మ్యూజిక్ వినబడ్డాక నాకేదో తేడాగా అనిపిస్తోంది. తేడా ఏంటో అర్థం కాదు. పాట మధ్యలో మ్యూజిక్ రాదా ఏంటి? అని మళ్ళీ నన్ను నేనే వెటకరించుకుంటున్నా (అద్దంలో మిటకరించుకుని చూశా కూడా) (ఆర్యా! ఈ రెండు పదాలు మదీయ పైత్య ప్రేలాపనలని గమనించగలరు). ఇలా ఇది ఓ పదిసార్లు ఐంది. ఆ పాట మొదలవడం, “ఆంఖోకీ ……” వరకు మళ్ళీ వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యూజిక్ వినబడ్డం. ఇలా ఇలా అయ్యాక, కాసేపటికి, అ మ్యూజిక్ తర్వాత భాగం వినబడ్డం మొదలైంది.

“పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు… రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో…”
“ఒహొ హొ హొ..ఒహొ ఒహొ ఒహొ…”
అబ్బబ్బా! ఏమిటీ మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ. ఇంతసేపటికి ఏదో లైను వినబడ్డది అనుకుంటూ ఉంటే, మళ్ళీ అదే సంగీతం. ఎక్కడిదీ పాట “ఆంఖోంకీ….” మధ్యలో?
అనుకుంటూ తడబడుతూ ఉండగానే – “అమ్మ బ్రహ్మదేవుడో!” అంటూ ఈ పాట కొనసాగింది.
“ఓహో!” ఇలా వచ్చారా తల్లీ!” అనుకున్నాను మన ఆత్మాసీత గురించి.

అవి రెండూ అలా మైండులో తిరుగుతూ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే, ఏదో ఓలా పని కానిచ్చుకుని, ఆఫీసుకని బయలుదేరాను. బెల్ సర్కిల్ దగ్గర పెద్ద జాం. సరే, అలా ఆకుపచ్చ విప్లవం కోసం ఎదురుచూస్తూ ఉంటే, ఓ పక్క ఉన్న గందరగోళంతోనే గజిబిజిగా ఉంటే, ఇక్కడ కొత్త గందరగోళం! “ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది!” అట. నాకెక్కడ తీరికా ఇప్పుడు ఏం తెలిసిందో తెలుసుకునేందుకు, గ్రీన్ లైటొచ్చేస్తేనూ!

ఆఫీసుకొచ్చేసాక – మళ్ళీ, “లాలాలాలా లాలల లాలా…”
“మోహాలే… దాహాలై… సరసాలే… సరదాలై… “
“ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది!”
ఏంటి తెలిసేది? నాకు గందరగోళం వల్ల చిరాకెక్కువై కూడా ఆవేశం కలుగుతోంది. అయినా, గందరగోళం దేనికో తెలియట్లేదు. మరి ఏమిటది తెలిసేది ఆవేశం వల్ల? ఆకాశం ఏనాటిదో తెలుస్తుందా? అనురాగం ఏనాటిదో తెలుస్తుందా?

“ఏం మాట్లాడుతున్నావసలు? తల్లో హెడ్డుందా? మోకాళ్ళలో ఏమన్నా నొప్పులా?”
“ఏయ్! ఎవర్రా అది? నాతోనే వెటకారమా?”
“నీతో ఏమిటి? నువ్వేమన్నా పెద్ద ఇదా? అసలు నీకూ, నాకూ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.”
(ఎందుకన్నా మంచిదని, ఎందుకొచ్చిన గోలని) “నేనే నక్కని” అనేశాను.
“హహహహ”
“అద్సరే, నవ్వులు ఆపి, తమరెవరో సెలవిస్తారా?”
“నేనా? నీ మనసులో తిరుగుతున్న పాటలన్నింటిలో ఉన్నదాన్ని.”
“అన్నింటిలో ఉన్నదేమిటి? సంగీతం, సాహిత్యం. రెండింటిలో మీరెవరండీ?” ఈసారి నేను నిజంగా నక్కనే అని అర్థమైపోయి, వినయంగా అడిగాను. అలాగే, అలా మాటల్లో పెట్టి సదరు ఆకాశవాణి డిటైల్స్ మొత్తం తెలుసుకుందామని నక్కజిత్తుల వేషాలు కూడా వేయడానికి రెడీగా ఉన్నాను.
“రెండూ కాను”
“మరి?”
“వాటి కలయికను”
“ఓహో! మరైతే, ఇలా గలగలమంటూ బిలబిలమంటూ పాడుకుంటూ వచ్చేసి నన్ను ముంచేస్తే, నా గతేం కాను?”
“చూడు, నా బతుకునిండా రాళ్ళు. పాడకుంటే ఎలా ?” – అన్నది ఆ గొంతుక, ఇస్మాయిల్ గారు అన్నట్లే!
“రాళ్ళా?” అన్నా నేను నోరెళ్ళబట్టి.
“గలగలమన్న శబ్దం ఎక్కడిదనుకున్నావ్?”
“అది తెలీయకే కదా ఈ గోలంతానూ!” విసుగ్గా అన్నాను.
“ఎక్కడిదంటే…”
“భూల్ జా…. ఇన్ యాదోంకో తూ భూల్ జా…” ఫోను!
పగటిపూట, ఆఫీసులో, కలా! ఏమిటి చేసేది ఇప్పుడు?”
“కాలాన్నే నిలదీసి కలలకి ఇవ్వాలి వెలలేని విలువను.”
-అబ్బా! మళ్ళీ మొదలు!!!

(నా తల్లో జరిగే కథ నాకర్థం కాదు. అసలు నేనేం మాట్లాడుతున్నానో ఈ ఆకాశవాణికర్థం కాదు. ఆ ఆకాశవాణి కథేంటో నాకర్థం కాదు. నాకెందుకు ఏదీ సరిగా అర్థం కాదో కూడా నాకే అర్థం కాదు. నేనెందుకిలా రాసి రాసి చంపుకుతింటానో మీకర్థం కాదు. మనసెందుకు నాకు సర్రియలిజం ఎక్కువైందేమో అనుకుంటోందో… మీరెందుకు నా బ్లాగును అదోలా చూస్తున్నారో…ఈ రాతేమిటో… ఏవిటో! ఏవీ అర్థం కావట్లేదు. :( )

Published in: on October 21, 2009 at 9:34 pm Comments (7)
Tags:

నిశ్యాలోచనాపథం-17

ఎప్పట్లాగే చీకట్ని ద్వేషించడం ఎరుగని నేను ఎగుర్కుంటూ రాత్రి పూట రోడ్లపై పడ్డాను. నిజం చెప్పొద్దూ, రాత్రి పూట రోడ్ల సొగసే వేరు. పగలంతా జనాల కాళ్ళ కింద నలిగి, వాటి అందం ఎవరికీ అర్థం కాదు. జనం కూడా సాటి జనం అందచందాలను పట్టించుకుంటారు కానీ, తమ కాళ్ళ కింద భూమిని గమనించరు. రాత్రి పూట రోడ్డు ఖాళీ కనుక కాస్త కావాలని తెచ్చుకున్న పరధ్యానం తో కిందకి చూస్తూ, రోడ్ల అందాలని ఆస్వాదిస్తూ నడుస్తున్నాను. అటు వైపు నుంచి నిశి ఎప్పట్లాగే ఏడుప్మొహము వేసుకుని దాన్ని వేళ్ళాడేసుకుని, కాళ్లీడ్చుకుంటూ నడిచోస్తోంది ఎదురుగ్గా. నాకు మొన్నటి మా గొడవ ఇంకా మనసులో అలాగే ఉంది. తనంటే పిచ్చి కోపంగా కూడా ఉంది. నేనంటే ఆటలైపోయినట్లుంది తనకి అని అనుమానం కూడా కలిగి, అవమానంగా కూడా అనిపించింది. అందుకే నేను పలకరించలేదు.

అదేమిటో కానీ, నేను అలిగిన ప్రతిసారి అవతలి మనుషులు అక్కడ విషయమే లేనట్లు లైట్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈమె కూడా మా ఇద్దరి మధ్యా ఏమీ జరగనట్లే, హాయ్! అన్నది నన్ను చూడగానే. నీరసంగానే అన్నదనుకోండి, కానీ, అన్నది కదా, సో, నేనూ అనాల్సి వచ్చింది. అన్నాక మనం ఊరుకొము కదా… మళ్ళీ మొదలైంది గమ్యం తెలీని మా చర్చ. తెగేదాక మేము లాగుతూనే ఉంటాము. ఆదేమో తెగదు. ఇలా ఎంతసేపు సాగుతుందో ఈ రాత్రి.. అనుకుంటూ అడిగాను తనని -

“ఏమిటీ, మళ్ళీ అలా డీలా పడి కనిపిస్తున్నావు?” అని.
“పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ…? – అని ఆలోచిస్తున్నాను.” అన్నది.
“ఏవీ తల్లీ?” అన్నాన్నేను, శ్రీశ్రీని స్మరించుకుంటూ.
“అదే..అదే.. వెదుక్కుంటున్నాను.” అంది నిశి పరధ్యానంగా.
“ఏంటి అనుకునేది? ఇప్పుడు కాలం ఎటు పోయిందంటావ్? అసలే కాలం కావాలి నీకు? భూతకాలమా? వర్తమానమా? భవిష్యత్తా?”
“నాకు నా భూతకాలం వర్తమానంగా కూడా ఉండాలి. వీలైతే అదే భవిష్యత్తుగా కూడా ఉండాలి.”
“కోరికలే గుర్రాలైతే” అన్నట్లు ఉంది నీ వ్యవహారం – అన్నాను నవ్వుతూ.
“అలాగే అనిపిస్తుంది లే. నేనేది మాట్లాడినా నీకు నవ్వులాటే కదా.”
ఇదే, ఇక్కడే నేను కరిగిపోయేది ఈ నిశి తో ప్రతిసారి. ఇలాంటి దిక్కుమాలిన సెంటీ డైలాగులూ, ఏ దిక్కుమాలిన దీనానాథ్ మంగేష్కర్ ఎక్స్ప్రెషను రెండు కలిపి నా ఎదుట నిలబడుతుంది చూడండి, అప్పుడే నా కోపమంతా ఆవిరైపోతుంది. ఆవిరైపోతుందో లేక ఆ సెకను గాల్లో కలిసిపోతూ కోపాన్ని మోసుకెళ్లిపోతుందో మరి, నాకు తెలీదు. కోపం ఆవిరయ్యాక ఇంకేం చేస్తాం? నిశి గురించిన శ్రద్ధతో -
“ఏమైంది? నీకు నీ ప్రస్తుతపు జీవితం నచ్చట్లేదు… అంటావా ఐతే?” అన్నాను.
“అది ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎన్ని విధాలుగా చెప్పాను? మళ్ళీ అదే అడిగితే ఏం చెప్పేది?”
“అదే, అదే, తెలుసు నాకు. ఎందుకు? అన్నదానికి నువ్వు చెప్పే కారణాలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను.

“దర్జా అలవాటయ్యాక మామూలు బ్రతుకు బ్రతకడం కష్టం కదూ?” అన్నది నిశీ ఉన్నట్లుండి.
“అనుకుంటా. నాకు దర్జా అలవాటు లేదు” అన్నాను నేను సీరియస్గా.
తనేమీ మాట్లాడలేదు. దానితో మళ్ళీ నేనే అడిగాను -
“ఏంటీ, ఎవన్నా డబ్బు సమస్యలోచ్చాయా నీకు?”
“హాహాహాహా. నీకేమనిపిస్తోంది?”
“ఏమో, నీకు అలాంటి సమస్యలు ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు కనుక, ప్రస్తుతానికి డబ్బుకి లోటు లేదు అనుకుంటున్నా నేను. కాకుంటే, చెప్పలేము. సినిమాటిగ్గా ఏదో జరిగి ఇప్పుడు నువ్వు కష్టాల్లో పది ఉండొచ్చేమో నాకేం తెలుసు?” అన్నాను.
“కష్టాలు, దర్జాలు డబ్బుతోనే రావాలా? డబ్బుతోనే పోవాలా?”
“నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.”
“జీవితాన్ని అనుభవించాక, జీవితం తో ప్రేమ వ్యవహారంలో దెబ్బతిన్నాక, మామూలుగా జీవించడం కష్టం అనిపిస్తోంది.”
“మామూలుగా జీవించడం అంటే?”
“అంటే, పూర్తి ఆనందంగా కాక, రకరకాల భావలతో జీవించడం”
“అలా ఆనందం తప్ప వేరేది లేకుంటే త్రిల్ ఉండదు కదా జీవితం లో?”
“ఆనందం అంటే, జీవించడం లో ఆనందం, కేవలం ఆనందం మాత్రమే కలిగించే అనుభవాల గురించి అనట్లేదు.”
“అంటే?”

“జీవితం తో ప్రేమలో ఉన్నప్పుడు అందులోని మంచి,చెడు,తీపి,చేదు – అన్నీ అలా వచ్చినవి వచ్చినట్లు అనుభవిస్తూ – ఆనందంగా ఉండేదాన్ని.”
“ఇప్పుడేమోచ్చింది?”
“వ్యవహారం చెడింది, ఆనందం చెడింది.”
“ఇప్పుడేంటి అయితే, ఆనందకరమైన క్షణలే ఉండట్లేదా? అలా ఎలా ఉంటుంది? అలా ఉండకూడదే?”
“ఆనందాన్ని కూడా ఆనందంగా అనుభవించలేకపోతున్నా, అదేమిటోగానీ.”
“ఇలా అర్థం కాకుండా తిక్క తిక్కగా ఎందుకు మాట్లాడతావంటావ్ నువ్వు? సరదాకా?”
“నాకున్న లిమిటెడ్ వకాబ్యులరీకి ఇలాంటి ఆలోచనలను వివరించాలంటే, తిక్క తిక్కగానే వస్తున్నాయ్ వాక్యాలు – ఎంత ప్రయత్నించినా, నాన్సెన్సే మిగుల్తోంది..” దిగాలుగా అంది నిశి.
“ఇప్పుడేమంటావ్? నీకు జీవితంలో ఏదో మిస్సైనట్లు అనిపిస్తోంది – అంటావ్? అంతేనా?”
“ఏదో కాదు – లైఫ్ ప్లెజర్ – బ్రతకడంలో ఉన్న ఆనందం – అది కోల్పోతున్నానేమో అనిపిస్తోంది.”
“ఎలా? అలా ఉన్నట్లుండి ఎలా కోల్పోతున్నావు?”
“ప్రేమలో మోసపోయానన్నా కదా, అప్పట్నుంచి నమ్మకం పోయింది బ్రతుకుమీద. నమ్మకం పోయాక, అక్కడ ఏ మిరాకిల్ జరిగినా నేను దాన్ని ఆస్వాదించలేకపోతున్నాను.”
“మన అనుకున్నవాళ్ళతో ఏదో తగువొచ్చిందనుకో – రెండు రోజులు మాట్లాడుకోం, మూడోరోజుకి మళ్ళీ కలిసిపోతాము. అదే పట్టుకుని జీవితాంతం ఒకరి మొహం ఒకరు చూస్కోకుండా అయిపోతామా ఏమిటి?” అన్నాను, ఈ పిల్ల మరీ ఇంత సెన్సిటివా? అన్న సందేహం ఓ పక్క, ఈ పిల్లకింత చాదస్తమేమిటో? అన్న అనుమానం ఓ పక్క నన్ను తొలుస్తూ ఉంటే.
“ఏమో, నేను మళ్ళీ ప్రేమించలేకపోతున్నాను. ప్రేమిస్తున్నానేమో – ఎప్పుడు ఆపాను కనుక – అది నన్ను మోసం చేసింది కానీ, నేను దాన్ని కాదుగా. ప్రేమని అందుకోలేకపోతున్నా అనాలేమో.”

“అబ్బో!” అనుకున్నా ముందు. ఆశ్చర్యానికో, అవాక్కైనందుకో – అర్థం కాలేదు నాకే. “ఇదెక్కడి ఫిలోరా బాబూ!” అనుకుని,
“ఇప్పుడేంటంటావ్ ఐతే? ఓసారి ప్రేమలో విఫలమైతే, మరోసారి ప్రేమించలేను అంటావా?” అన్నాను.
“మరోసారి అదే ఎంటిటీ ని ప్రేమించలేను అంటున్నా” అన్నది తను, నన్ను సరి చేస్తూ.
“ఆ ఏదో ఒకట్లే” అనుకుని మనసులో, పైకి మాత్రం – “అవతలి పార్టీ మళ్ళీ నీ దగ్గరికి తనకి తానుగా వచ్చినా?” అన్నాను.
“నేను మనిషిని కదా, నాకు అలా సెలెక్టివ్ మెమరీ డిలీట్ ఉండదు కదా…” అంది నిశి.
ఆసరికే నాకు అర్థంకావట్లేదు – అయితే ఏంటిప్పుడు? అని. ఉండబట్టలేక అడిగేశాను తనని.
“అయితే ఏంటిప్పుడు? అసలు సరిగ్గా నీ సమస్యేంటి? జీవించలేకపోడమా? ఆనందంగా జీవించలేకపోవడమా? ఆనందం కనిపిస్తున్నా అనుభవించలేకపోవడమా? ఏంటసలు?”
“పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ?” అన్నది తను గాల్లోకి చూస్తూ.
“అదిగో మళ్ళీ! ఇప్పుడేంటి? ఏం కావాలి నీకు ఇప్పుడు?”
“నేను గతంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళే మార్గం తెలీక, నేనే గతం అయిపోదాం అనుకుంటున్నాను.”
“గతంలోకి – నువ్వెలా వెళతావు? నువ్వు గతం ఎలా ఔతావు? నన్ను కన్విన్స్ చేస్తే కానీ, ముందుకు పోలేవు కదా” – చిక్కావు చేతిలో చిలకమ్మా…అహ్..అహ్.. అన్న పాట గుర్తొస్తూ ఉంటే, అడిగాను.
“ఆ కాలం నాకోసారి కనబడాలి…”
“ఎలా కనిపిస్తుంది? అదోచోట నిలిస్తే కదా, ఎలా ఆపుతావ్ దాన్ని?” అన్నా, వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. కానీ, అదేమీ పట్టించుకోకుండా తను మాత్రం -
“నాగ్గానీ కాలం దొరకాలీ… కాలర్ పట్టుకుని మరీ వెనక్కి లాక్కెళతాను. అక్కడే కట్టేసి ఆపేస్తా. అది అయినా పారిపోడానికి ప్రయత్నిస్తే, ఏదో ఒకలా బ్రతిమాలుకుని నేను చెప్పిన దారుల్లో నడిపిస్తాను..” అంటూ చెప్పుకుపోతోంది.

“రోడ్డు నంబర్ ఎక్స్ లో దేవత వి అనుకుంటున్నవా నువ్వేమన్నా, 305 గదిలో దేవుడు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా?”
“ఒకవేళ కాలం దొరికితే? అన్న ఆశ ఉండాలి. ఆశ అన్నది మనిషికి చాలా ముఖ్యం…” అని ఏదో చెప్పుకుపోతూ ఉండగా, తనకే గొంతులో ఏదో అడ్డం పడ్డది.
“దయ్యాలు వేదం వల్లించినట్లు, నువ్వు ఆశ గురించి చెబితే, ఇలాగే ఔతుంది” అన్నాను నేను మళ్ళీ నవ్వుతూ.
“దొరికితే?”
“అబ్బ సర్లేవొయ్! దొరికితే, దొరిక్నప్పుడు చూద్దాము.”

(అని అవాల్టి సంభాషణ అక్కడ ముగిసింది కానీ, నిశి ఇంత పట్టుదల కలది అని నేను అసలు ఊహించలేదు. మేము నిజంగానే కాలాన్ని కనిపెట్టి ఎదుట నిలబడ్డాము. కాలరు పట్టుకోలేకపోయాము – మొదటి కారణం : అది చాలా పొడవు. రెండో కారణం, అది రౌండ్ నెక్ ట్-షర్టు వేస్కుంది. దానికుండే రౌండ్ కాలర్ అలా పట్టుకు లాగేందుకు అనువుగా కూడా లేదు. వచ్చే భాగం లో వివరంగా చెబుతాను.)

Published in: on October 10, 2009 at 1:10 pm Comments (7)
Tags:

నిశ్యాలోచనాపథం-16

అదరగొట్టి, బెదరగొట్టి నిశి ని పోయిన్సారి పంపేశానే కానీ, నాకు కుతూహలం ఆగట్లేదు. ఏం చెప్తుందా? అని. ఫోన్ చేద్దాం అనుకున్నా… వద్దనుకున్నాను. ఎస్సెమ్మెస్ అనుకున్నా, నోనో అనుకున్నా మళ్ళీ నేనే. తొందర తొందరగా రాత్రి భోంచేసేసి తొందరగా ముసుగేసేస్కున్నా – ఎవరికీ కనబడకుండా బైటకెళ్ళిపోయి, వీలైనంత త్వరగా నిశీని పట్టేస్కుని కథ వినాలని. అయినా, వెర్రి తాపత్రేయం కాకపోతే నేను త్వరగా వెళ్తే ఏం లాభం, తను రావాలి కానీ! కాసేపు అటూ ఇటూ తిరిగాక, మధ్యలో ఓ చోట నాకో మనిషితో బాత్చీత్ కూడా అయ్యాక (ఆ మనిషి గురించి మళ్ళీ చెప్తాను లెండి), నీరసమొచ్చి వీథి అరుగు దగ్గర కూర్చుని ఉంటే, అటువైపు నుంచి నెమ్మదిగా నడుస్తూ వస్తూ కనిపించింది నిశీనిస్.

“రామ్మా! రా! వచ్చావా! ఎప్పుడొస్తావో అని చూస్తున్నా. బాగా త్వరగా వచ్చేశావే…” అన్నాను కాస్త వ్యంగ్యంగా.
“కాలు కాస్త బాలేదులే..” అన్నది నిశి. అప్పుడు గమనించాను నెమ్మదిగా నడవడం లో మామూలు నెమ్మదితనం కన్నా కూడా తేడా నెమ్మదితనం ఎక్కువగా ఉందీ అని.
“ఏమైంది? బాగా నొప్పిగా ఉందా?” అన్నాను.
“ఏమీ లేదు లే. ఏదో ఆలోచిస్తూ మెట్లపై పట్టు తప్పాను. కాస్త బెణికింది. అంతే. ఇపుడు బానే ఉన్నాను.” అంది నిర్లిప్తంగా.
“అంటే, పగలు కూడా నువ్వు ఇంతేనా? మెదడు వాపు వంటివి వచ్చేస్తాయి ఇలా చేశావంటే” – రెండర్థాలు వచ్చేలా వాడాను నిశి గమనిస్తుందా లేదా అని.
ఆమె నా వ్యంగ్యం అర్థం చేస్కోలేదని నాకు అర్థం కావడంతో, హర్టయ్యా. కానీ, తమాయించుకుని, కాస్త నెమ్మదిగా -
“కాలు బాగా నొప్పిగా ఉందా? నడుద్దామా, కూర్చుందామా?” అన్నాను.
మొన్నోరోజు పాత మిస్సమ్మ సినిమా చూసినప్పటి నుండి నాకు ఎందుకో నిశీ ని చూస్తే సావిత్రి గుర్తొస్తోంది. మిస్సమ్మ తర్వాత నిశీ ని చూస్తే, చిన్నప్పుడు తప్పిపోయిన మా అక్క కూడా గుర్తొస్తోంది. దానితో, నాకు సహోదరీ భావం లోలోన తన్నుకొస్తోంది తనని చూస్తూంటే.

మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా – ఓ వీథికుక్క వచ్చి నిశీ పక్కన కూర్చుని కాలు నాకడం మొదలుపెట్టింది. నాకు కుక్కలు-వీథికుక్కలూ రెండూ అంటే భయమూ, భక్తీ కనుక – కాస్త భయంతో దాని వంక చూస్తూ ఉన్నాను. నిశి ఓ రెండు మూడుసార్లు దాన్ని అవతలకి వెళ్ళమని తోసింది. అది వెళ్ళలేదు. మా మానాన మేము మాట్లాడుకుంటున్నాము కానీ, నిశి కి చిరాకు పెరుగుతూ ఉండటం గమనించాను. ఇంతలో ఉన్నట్లుండి ఆ కుక్కని ఒక్క తోపు తోసి తానేమో ఒక్క ఉదుటున లేచింది. నేను ఠంగైపోయాను. నిశి అంత కోప్పడ్డం నేను ఇదివరలో చూడలేదు. సరే, లేవడం ఒకెత్తు – ఆ కుక్కవైపుకి తిరిగి – “నీకేం ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఊరికే అలా నన్ను వెంటాడతావు? పనీ పాటా లేదా? చెప్తే వినబడదా?” అని అరవడం ఇంకో ఎత్తు. అదేమన్నా మనిషా ఏం? ఏం అర్థమై చస్తుందనీ? “కుయ్….కుయ్..” అనుకుంటూ వెళ్ళిపోయింది. మొదటిసారి ఓ కుక్కపై భయం పోయి జాలి కలిగింది. నేను నేననుకున్నంత “అకుక్కురం” కానేమో అని మొదటిసారి అనిపించింది.
(అలాంటి పదమేదీ లేదు అనుకుంటా. అమానుషం అంటాం కదా, కుక్కలకి ఎలా అనాలి? అన్న అనుమానం వచ్చినప్పుడు సృష్టింపబడ్డ పదం అది. సృష్టికర్త కోడ్ – శ్రీరాం).

నిశీ వైపుకి తిరిగి కోపంగా – “ఎంత హృదయం లేని దానివి నువ్వు…నోరు లేని జీవిపై అలా విరుచుకుపడతావా?” అన్నాను.
“నాకు ముందే పరమ చిరాగ్గా ఉంది. ఇదొకటి ఊరికే సతాయిస్తోంది.”
“దానికేం తెలుస్తుంది చెప్పు నీ చిరాకు సంగతి?”
“మరి నాకెందుకు దాని సంగతి? నాకు పరమ చిరాకు కుక్కలంటే.”
“అకుక్కానుషం అంటే బాగుందా, అకుక్కురం అంటే బాగుందా?, అకుక్కషం అంటే బాగుందా? నాకు మధ్యలోది నచ్చింది. కానీ, ఊరికే అడుగుతున్నాను.” అన్నా.
“ఏహె! ఆపు నీ గోల. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలయొచ్చు కదా. ఓ పక్క ఈ కుక్క నస, ఓ పక్క నీ నస. ఎందుకిలా సతాయిస్తారు అంతా నన్ను! అన్నీ ఇలాగే చేస్తాయేమిటి నాతో!” అరిచింది నిశీ.

“..ఓ పక్క ఈ కుక్క నస, ఓ పక్క నీ నస…” – ఏంటో తేడాగా ఉందే ఈ వాక్యం అనిపించింది. అంటే, కాస్త వక్రంగా నన్ను తిడుతున్నట్లా? అని అనుమానం వచ్చింది. ఇందాకట్నుంచి కుక్కని అడ్డం పెట్టుకుని నన్నంటోందా? ఏదో ఒకట్లే కానీ, నిశీ చిరాకు మరీ ఎక్కువగా ఉన్నట్లనిపించి -
“మళ్ళీ ఏమైంది? మొన్నోరోజు ఏవో కారణాలు చెబుతాను అన్నావు…” అన్నాను, పోయిన్సారి ఎక్కడ ఆపామో గుర్తు తెచ్చుకుంటూ.
“కారణాలు సరిగ్గా డాక్యుమెంట్ చేస్కుని సూసైడ్ నోట్ రెడీ చేసేలోపే ఏదో జరిగిపోయేలా ఉంది. అంత విరక్తొస్తోంది నాకు” అంది నిశీ కసిగా.
“అరే..అరే… ఏంటి ఆ ఆవేశం?” అన్నాను.
“బీపీ పెరిగిపోతోంది…”
“బీపీ బీపీ బీపీ పెరగట్లేదా? బీపీ మాత్రమే పెరుగుతోందా?” అన్నాను.
“ఏంటీ?” అర్థం కాక అయోమయంగా చూసింది నన్ను. నిశీ జూనియర్ ఎన్టీఆర్, వేణుమాధవ్ ఇద్దర్నీ చూసినట్లు లేదు.
“ఏం లేదు లే. ఏమైంది… ఎందుకు అలా రైజవుతున్నావు?” అన్నాను కాస్త నెమ్మదిగా. జోకు పేలకపోతే, అలాగే నెమ్మదైపోయి తుస్సుమన్న బాంబులా ఉంటే, ఒక్కోసారి రెండో జోకు వేసేందుకు పనికిరావొచ్చు. ఒక్కోసారి మనమే జోకవచ్చు కానీ, నిశీకి అంత సీన్ లేదు.

“నేను అదోరకం మనిషిని. నాకు ఊపిరి పీల్చడం కంటే కూడా ఆనందాన్ని పీల్చడం ముఖ్యం. ఊపిరి లేకున్నా బ్రతగ్గలను కానీ, ఆనందంగా లేకుంటే నేను బ్రతకలేను. లైఫ్ ప్లెజర్ తగ్గే కొద్దీ నాకు బ్లడ్ ప్రెజర్ ఎక్కువౌతుంది. అలాగే, ఆత్మహత్య చేస్కోవాలన్న మానసికమైన ప్రెజర్ కూడా పెరుగుతూ ఉంటుంది”
“దాన్నే ‘మా.ప్రెజర్’ అని కూడా అంటారు లే. అంటే, masochistic pleasure అనమాట” అన్నాను కసిగా.
LP ఏంటి? దాని వల్ల BP ఏంటి? అసలు ఈ పిల్లది తనని తాను హింసించుకునే స్వభావమా? నాలాంటి జనాల్ని ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి హింసిస్తోందా? లేక రెండూనా? – అని సందేహం కలిగింది.

నేనిలా ఆలోచనల్లో పడిపోవడంతో తానే మళ్ళి అడిగింది – “వింటున్నావా?” అని.
“వింటున్నానమ్మా… వింటున్నాను.”
“నాకు జీవించడంలో ఆనందం కలగట్లేదు…” అని తను ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా..
“పోనీ ఆనందంలో జీవించు” అన్నాను. ఇలా తికమక పెట్టకపోతే, తను నాకు పిచ్చెక్కించేస్తుంది మరి.
“జోకా? నేనోపక్క అసహనంగా ఉంటే, నీకు వెటకారమైపోయింది” అన్నది నిశీ కోపంగా.
“సరే, చెప్పు చెప్పు…” అన్నాను.
“బాటా” అన్నది నిర్లిప్తంగా.
నాకు కోపం వచ్చింది. నేను గట్టిగా… “ఇన్ బ్లూ” అన్నాను.
“హహహహ…కోపమే? నీవు నేర్పిన విద్యయే…” అన్నది.
“సర్లే, సంగతేంటో చెప్పు” అన్నాను విసుగ్గా.
“ఇదిగో, నీకు నేనంటే విసుగ్గా ఉందే…అలా నాకు జీవితమంటే విసుగ్గా ఉంది.”
“నాకు నువ్వంటే విసుగుంటే, నేను నిన్ను వదిలేసి పోతానా ఏంటి? ఏడ్చినట్లు ఉంది.” అన్నా కోపంగా.
“నేనూ, జీవితమూ ఒకళ్లనొకళ్ళం విసుక్కుంటూ రోజుల తరబడి కొనసాగడం ఏడ్చినట్లే కాదు, ఏడ్చి మొహం కడుక్కున్నట్లు ఉంది” అన్నది నిశీ.

“ఇదిగో చూడు, ఎందుకు అలా అస్తమానం సూసైడ్ అంటావు? కాలక్షేపానికన్నా ఓసారి బ్రతుకుతా అనరాదు?” అన్నాను.
“ఎందుకు బ్రతకాలి? ఒక్క కారణం చెప్పు?” అన్నది.
“…” ఏం చెప్పాలో తోచలేదు నాకు. ఎందుకు బ్రతకాలంటే కారణం నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు చావాలంటే తను చాలా కారణాలు చెప్పుకుంటోంది. ఏమిటో! అనిపించింది. అదే తనతో అన్నాను. దానికి తను -
“పోనీ, ఎందుకు చావకూడదో చెప్పు?” అని అడిగింది.
“బ్లా..బ్లా..బ్లా..” అని ఓ పది నిమషాలు చెప్పాను.
“అంటే, బ్రతకడం ఎందుకో తెలీదు కానీ, ఎందుకు చావకూడదో మాత్రం తెలుసా?” అన్నది.
నేను ఏమీ మాట్లాడలేకపోయాను.
“నువ్వు పిరికిదానివో… ఫూల్ వో… పనికిరానిమనిషివో…వెన్నముకలేని మనిషివో… నాకు అర్థం కావట్లేదు…” అని ఓ వెధవ నవ్వు నవ్వింది.
“మరి నువ్వో?” అన్నాను ఉక్రోషంలో. ఒక్క ఉదుటున నన్నెవరూ అన్ని మాటలు అనలేదు.
“నేను పిరికిదాన్ని కాదు. ఎందుకంటే, నేను పనికిరాని మనిషినని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఫూల్ నే కావొచ్చు, ప్రపంచానికి. వెన్నముక ఉంది కనుకే బ్రతకలేకపోతున్నా” అన్నది, ఈసారి “విజయ దరహాసం” ఒలకబోస్తూ.
“ఇదిగో, నువ్వు చెప్తానంటే సరిగా కారణం చెప్పు. లేదంటే లేదు. నన్ను అంటావెందుకు మధ్యన? నేను నువ్వు చెప్పినవన్నీ కూడా కావొచ్చేమో కానీ, ఇప్పుడు అది నీ ద్వారా మళ్ళీ తెలుసుకోనక్కర్లేదు.” అన్నాను కోపంగా.
“అరే…అరే… కోపమే.. ముక్కుమీద కోపం..నీ మొహానికే అందం..” అని హమ్మింది కాసేపు.
నేను ఏమీ మాట్లాడలేదు. దానితో బుజ్జగించే మూడ్ లోకి వచ్చింది నిశీ.
“సరేలే, సారీ. నిన్ను ఏమీ అనను. ఇక శాంతించు..” అన్నది.
“ఎవరి చావు వాళ్ళని చావనివ్వొచ్చు కదా…ఎందుకు నాలో లోపాలుంటే మాత్రం అవి అలా ఎత్తి ఎత్తి చూపించి మరీ నన్నే అడగాలా?” అన్నాను, కళ్ళలోంచి నీళ్ళు రావడం ఒక్కటే తక్కువ.
“ఎజ్గాక్ట్లీ! ఎవరి చావు వాళ్ళని చావనివ్వొచ్చు కదా!” అన్నది నిశీ.

“చావు!” అన్నా కోపంగా.
“లేదు. మరియాదగా సాగనంపాలి నన్ను. అలా కోపగించుకుంటే నేను ప్రశాంతంగా వెళ్ళలేను” అన్నది స్థిరంగా.
“ఏంటీ?” అన్నాను షాక్ లో.
“నిన్ను ఒప్పించి కానీ ముందుకు సాగను అని చెప్పా కదా…ఎక్కడున్నా సరే, వచ్చి, నిన్ను ఒప్పించిగానీ ముందుకెళ్ళను.”
“వార్నీ! నేను నిన్ను మారుద్దాం అనుకుంటూ ఉంటే, నువ్వు నన్ను మార్చేలా ఉన్నావు కదా..” అనుకున్నా మనసులో. ఇవాళ్టి నిశీ మార్కు ఊకదంపుడుకి తలనొప్పి మొదలైంది. వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండగా, తెల్లారుతున్న సూచనలు కనబడ్డాయి.
దానితో తను-నేను టాటాలతో ఎవరి దోవన వాళ్ళు వచ్చేశాము.

ఐనా, తన మానాన తను చస్తా అంటే, వినకుండా, ఏదో దీనజనోద్ధరణ సామ్రాట్ లా ఫీలై నేను పరిచయం పెంచుకోడం ఏంటో, ఇలా ఇరుక్కుపోడం ఏమిటో! ఇంకెన్ని వినాలో – నా గురించి నేనే!

Published in: on September 30, 2009 at 1:44 pm Comments (7)
Tags:

Purpose of building a language

The more I think about this book, the more I like it. I realized that my childhood fantasy about building a new language is no longer as fantastic as it was. But, knowing more about all those passionate inventors is very much interesting. Perhaps, it is some psychological satisfaction seeing others’ work when you know you can’t do that and don’t want to do that now.

I dont remember what my purpose was in having dreams about developing a new language. Perhaps, its just a childish desire. Perhaps, I was frustrated with the “nature” of a natural language at that age itself! May be, it has something to do with the language troubles with those cousins who spoke a different tongue.

Whatever it might be, reading through this book, I realised how many different reasons can exist for people to decide on developing a new language.

Take Esperanto – its the language of peace. It wants to be the platform for enabling people of different cultures and languages to communicate. However, there are languages like Klingon (Star trek) or Tolkeinish stuff – which are primarily created for fiction. But, then, Klingon and its cult following is a different story again – as the author mentioned, its like “art for art’s sake”. Can you imagine, there is even a “woman’s language” which enables a woman to express her feelings in a versatile and verbose way compared to existing languages. There are these “logical” languages, which are spoken with “logic” ;) There is Ogden’s “simple english” which is like a entry point for non-english users in to English. There are these symbolic languages like “Blissymbolics“. There are “philosophical” languages like that of Wilkins’.

It was very interesting to know about groups of “ConLang” (Constructed Languages) developers and enthusiasts, their passion for what they are doing etc. I did not imagine that there is so much of analysis, study, online help etc for the developer enthusiasts. I am still in the process of exploring these things. So, perhaps, might write more on ConLangs soon.

The most interesting part is the story of revival of the modern Hebrew language. In a way, perhaps, this is a misfit in this group since its not an “invented” language like others. But then, how it was reborn as a “spoken” language is a very inspiring story – if languages had lives and had some societies among themselves, modern hebrew might have been idol worshipped among those societies and it would have walked with a halo behind its head.

Will talk more about modern hebrew later … but, it was amazing to see so many perspectives about development of a language. After every night that I slept reading this book, I woke up muttering to myself – words, language, relations, power, expression, symbols – randomly.The day began with getting confused with the purpose of language and the usefulness/uselessness of it. It began with questions left unanswered. Was I dreaming about things? I dunno.

I still am clueless. :( Is it the inability of my brain or the inability of my ability to express? Why am I not able to answer these questions that my day gives me, after the night reading? Should I keep experiencing this hangover time and again? :(

Published in: on September 14, 2009 at 9:31 am Comments (2)

నిశ్యాలోచనాపథం – 15

ఆరోజలా శ్రీశ్రీ, కృష్ణశాస్త్రీ ఇద్దరూ కనబడ్డట్లే కనబడి, మాట్లాడినట్లే మాట్లాడి – చెప్పీ చెప్పక మా సమస్యలతో కబుర్లాడి, మొదట దృశ్యమై కనబడి, తర్వాత అదృశ్యమైన సంగతి చెప్పాను కదా. తరువాత మేమిద్దరం (అదే, నేనూ, నిశీ) విడిపోయాము. పగలౌతూ ఉండటంతో. కానీ, నిశీ అంత ఎనర్జెటిగ్గా ఉండగలదని నేను ఊహించలేదు. ఎప్పుడూ ఏడుపు మొహమేస్కుని ఉండటమే కానీ, ఆరాత్రి శ్రీశ్రీ ని చూడగానే తనలో ఎంత ఉత్సాహం కనిపించిందంటే, నేనింకా పూనకమొచ్చేస్తుందేమో అని భయపడ్డాను. సరే, విడిపోయాక ఈసారి కాస్త నిశ్చింతగా ఉన్నాను. ఈ మూడ్లో ఉండగా ఆత్మహత్యల వైపుకి మనసు మళ్ళదేమోలే అని. మా ప్రోటోకాల్ ప్రకారం ఎస్సెమ్మెస్లు, ఫోన్లు చేస్కోము కనుక రాత్రి కోసం ఎదురుచూస్తూ గడిపాను. నిజం చెప్పొద్దూ – నాకు పెస్సిమిస్టులంటే పరమ అసహ్యం అయినా కూడా , నిశీ స్నేహాన్ని వదులుకోలేకపోతున్నా. నిశీ ఎంత నిరాశతో మాట్లాడినా, తను నాకు నచ్చుతూనే ఉంటుంది.

నిజానికి, ఇపుడు నాకు మహా ఉత్సాహంగా ఉంది. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రుల హాంగోవర్ లో ఉన్నా. ఇవాళ ఎవరు కనిపిస్తారో? అని ఎదురుచూస్తున్నా. అయినా, తెలుగువాళ్ళే కనబడాలా ఏంటి? ఆర్కేఎన్ కనబడొచ్చుగా, టాగోర్ కనబడొచ్చుగా… అనుకుంటూ ఈలేస్కుంటూ వస్తున్నా. ఆ వైపు నుండి నిశీ వస్తోంది. “నిశీ!” అంటూ ఎదురెళ్ళాను.
“ఓహ్! హాయ్!” – అంది నీరసంగా.
“ఏమిటీ.. ఒంట్లో బాలేదా?” అన్నాను. కానీ, మనసులో బాలేదేమో అని అనుమానమొచ్చింది. ఇన్నాళ్ళ పరిచయంలో ఎప్పుడూ చూస్తున్నదేగా అని.
“హా.. కొంచెం నీరసంగా అనిపిస్తోందిలే. పగలు సరిగా పడుకోలేదు.” అంది నిశి.
“ఏం?”
“అదే, వాళ్ళతో మాట్లాడాము కదా… ఆ కవితావేశాలను అనుభవించి నాకూ ఆవేశం వచ్చేసిందిలే. ఆరోజు నేనిల్లు చేరేసరికే నాలో రకరకాల భావాలు కలగడం మొదలుపెట్టాయి.”
“అంటే?” అన్నాను….అర్థం కాక.
“ఆ రాత్రికీ నాలోని కొత్త ఆలోచనలకూ సరిగ్గా లంకె ఎక్కడో నేను చెప్పలేనుకానీ, ఆ రాత్రే ఈ ఆలోచనలకి కారణం అని మాత్రం చెప్పగలను.”
“ఏ ఆలోచనలకు?”

“నాకు ఆరోజు నుండి కొన్ని ప్రశ్నలు – నేను జీవితాన్ని ప్రేమించాను. జీవితం నన్ను మోసం చేసింది. కానీ, అందుకోసం నేను ఎందుకు ఆత్మహత్య చేస్కోడం?” అని ఇంకేదో చెప్పబోతూ ఉండగా -
“హమ్మయ్య! ఎప్పుడంటావా అని చూస్తున్నా. ఈ బుద్ధి నీకెప్పుడొస్తుందో అనే నా ఎదురుచూపుకూడానూ..” అన్నా ఆనందంగా.
“చెప్పేది పూర్తిగా విను. నా ఆత్మహత్యకు నేను చెప్పిన కారణాలు అర్థరహితం అనిపించాయే కానీ, ఆత్మహత్య చేస్కోను అనట్లేదు కదా…”
“అంటే?” అన్నాను అవాక్కై.
“నన్ను నేను అర్థం చేస్కోడంలోనూ, అవతలి పార్టీని అర్థం చేస్కోడంలోనూ కొంత దారి తప్పాను అప్పట్లో. ఇప్పుడు సరైన కారణాలు తెలుస్తున్నాయి నాకు. బహుశా అప్పటికి కూడా సరైన కారణాలు నా సబ్ కాన్షస్ మైండ్ కు తెలిసుంటాయి. కానీ, నేను కాన్షస్ గా ఉన్నప్పుడు అది అన్కాన్షస్ అయి ఉంటుంది కదా…”
ఇన్ని -షస్ లు విని నాకు గందరగోళం మొదలైంది.
“ఏమిటో…అంతా అయోమయం, గందరగోళం…ఏం మాట్లాడుతున్నావో…” అన్నా.
“ఎజ్గాక్ట్లీ! ఎజ్గాక్ట్లీ! నా మనసు కూడా ఇలాగే గందరగోళంలో, అయోమయంగా మాట్లాడింది అప్పుడు…దానితో నేను కూడా అలాగే ప్రవర్తించాను. కానీ, కారణాలు ఏవైనా, సబ్కాన్షస్ మైండులో అసలు ఆలోచన ఉందే, అది మాత్రం బైటపడిపోయింది ఆపాటి ఆలోచనలు…” అని ఇంకా ఏదో చెప్తూ ఉండగా, నాకు తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించి -
“ఇప్పుడు నీ ఆలోచనలు నీకు క్లియర్గా ఉన్నాయి కదా…” -అన్నా.
“పక్కా!” అన్నది తను.
“అయితే వదిలేయి. నీకు క్లియర్ అయితే చాలు. ఎలా క్లియర్ అయ్యాయో కాదు… ఇప్పుడు అవేంటో చెప్పు. ఈ కాంప్లికేటెడ్ కన్వల్యూటెడ్ వివరణ నేను భరించలేకపోతున్నాను” అన్నాను నిర్మొహమాటంగా.

“సరే, అదంతా వదిలేస్తే, నాకు జ్ఞానోదయం అయింది ఒక విధంగా.”
“ఏమని?” అన్నా, ఓ పక్క ఇప్పుడే ఉపన్యాసమిస్తుందో..అని భయపడుతూనే.
“బ్రతకడానికి ప్రేమ అన్నది సరిపోతుంది అనుకుంటూ ఉండేదాన్ని. కానీ, అది పూర్తిగా కరెక్టు కాదని అర్థమైంది.”
“మరీ బాగుంది. ప్రేమొక్కటే సరిపోతుందా? కాస్త బాధ్యతాయుతంగా ఉండటమూ, బ్రతకనేర్చిన తనమూ, డబ్బూ… అదృష్టమూ… అన్నీ కావాలి కదా బ్రతకడానికి… ఏ ఒక్కటి లేకున్నా బ్రతుకంత సులభమేమీ కాదు…” – అన్నాను ఈమాత్రం తెలీదా…అన్నట్లు ధ్వనిస్తూ.
“బ్రతకడానికి అదొక్కటే పట్టుకుని వేళ్ళాడితే సరిపోదు. ఇప్పుడు నేనూ ఒప్పుకుంటున్నాను. కానీ, బాధపడ్డానికి మాత్రం సరిపోతుందని అర్థమైంది.” అన్నది బాధగా.
“నాకర్థంకాలేదు” అన్నాను చిరాగ్గా.
“ప్రేమ బ్రతకడానికి సరిపోదు అని అర్థమయ్యాక, ఓసారంటూ ప్రేమించాక ఇక దాన్ని వదిలించుకోడం తెలీక – జీవితాంతం ఆ బాధలో బ్రతకడానికి ప్రేమ బాగా సూటవుతుందని చెప్తున్నా” అన్నది నిశీ మళ్ళీ.
“ఓహో…” అన్నాను జ్ఞానోదయం అయినట్లు. నిజానికి నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ, ఈ నిశీని వివరణ అడిగే కొద్దీ ఆ వివరణే అసలు విషయం కంటే క్లిష్టంగా ఐపోతుందని అనుభవపూర్వకంగా తెలిసింది కనుక ఊరుకున్నాను.

“సో, నే చెప్పొచ్చేదేమిటంటే… ఆత్మహత్య విషయంలో నా అభిప్రాయాలు మారలేదు. కానీ, ఎవరన్నా అడిగితే చెప్పే కారణం మారుతోంది..” అన్నది.
“మా-రు-తోం-దా?” అన్నా…అర్థంకాక.
“యస్. అంటే, కారణాలు సరిగ్గా ఫ్రేం చేసే ప్రాసెస్ లో ఉన్నా ఇప్పుడు.. అందుకే మారుతోంది అంటున్నా… సరే, మారబోతోంది అనాలేమో కదా…”
“అంటే?” అన్నా.
“ఇపుడు నీకు చెప్పినా అర్థంకాదు.”
ఎస్కేపవడానికి ఈ డైలాగుకంటే తేలికైన మార్గం లేదు. “నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేస్కోవట్లేదు…వదిలేయి” అన్నట్లు అనిపించింది నాకు. “మరెప్పుడు చెబుతావ్?” అన్నా.
“నేను మరింత స్పష్టంగా జవాబెలా ఇవ్వాలో తయారు చేస్కున్నాక.”
“ఇప్పుడేంటి? సూసైడ్ కరెక్టే అంటావ్ ఇంతా చేసి?” అన్నా.
“నేను చేస్కోడానికి నేను నిన్ను సమాధానపరిచే జవాబు ఇవ్వగలను అని అంటున్నాను.”
“ప్రేమించడాలు, అవి విఫలం కావడాలు… చస్తా అనడాలు… ఇదో ఫ్యాషనైపోయింది” – కోపంగా అన్నాను.
“నా కారణం విఫల ప్రేమ అని నువ్వు అపార్థం చేస్కుంటున్నావు. జ్ఞానోదయం అని నేను స్పష్టం చేస్తున్నా!!” తను కూడా కోపంగా అన్నది. తన కోపం ఇదివరలో చూసిన జ్ఞాపకం లేదు నాకు.

మనుషులు రైజయ్యే కొద్దీ వాళ్ళని రైజింగ్ స్టార్లు చేయాలన్న నా కోరిక మరింత బలీయమౌతూ ఉంటుంది.. అందుకే తనతో – “నువ్విలా అడ్డగోలుగా మాట్లాడితే, ఎవరికీ అర్థం కాదు. అసలు నీకు మాట్లాడ్డం చేతకాదేమో అని నా అనుమానం” అన్నాను.
“ఈమధ్య ఓ స్నేహితురాలు నాకు చాలా మాటలొచ్చని అన్నదే!” అంది నిశి అనుమానంగా.
“ఆవిడో అమాయకపు ప్రాణి ఐ ఉంటుంది లే.” అన్నాను. నిశీ కోపం తెచ్చుకోకుండా ఉందేమిటి ఇంకా అనుకుంటూ.
“సరే, నన్ను కాస్త ఆలోచించుకోనీ….ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా కారణాలు చెబుతాను..” అంటూ ఆవలి వైపుకి పరుగెత్తింది.
నేను తనని చూస్తూ, ఏమిటో ఆ కారణం..అని ఊహించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా, ఎప్పటిలాగే శ్రీముఖాలతో మెలుకువొచ్చింది!

Published in: on September 7, 2009 at 11:15 am Comments (4)
Tags:

నిశ్యాలోచనాపథం-14

ఈ రాత్రి తరువాత…..

తరువాతి రోజు, నేను చాలా ఎగ్జైట్మెంటుతో పరుగులాంటి నడకతో మేము ఈమధ్య ఎప్పుడూ కలుస్తున్న వీథిలోకి వచ్చాను. ఆ వీథిని పగటిపూట ఏమంటారో నాకు తెలీదు కానీ, గొప్పగొప్పోళ్ళు ఆ వీథిలో రాత్రి తిరుగాడటం ఇదివరలో నేను గమనించాను. అయితే, నిశి ఆత్మహత్య గోలలో, నా ధ్యాసంతా తనమీద ఉండి పట్టించుకోలేదు. సరే, తనకోసం వెదుకుతూ ఉండగా, ఓ దిక్కులో ఏవో వాదనలు వినిపించాయి. అంత రేంజిలో మాటలు, ఆ సమయంలో, ఆ వీథుల్లో ఇన్ని నెలల్లో ఎప్పుడూ వినలేదు. దానితో కుతూహలం కొద్దీ ముందుకెళ్ళాను…తీరా వెళ్ళాక… వాదిస్తున్నది మన నిశీనిస్! పక్కనున్నది ఆయనెవరో… చూసినట్లే ఉంది కానీ, గుర్తు రావట్లేదు.

“నాకర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా.. ఎందుకిలా చేస్తారు మీరంతా?”
“అమ్మాయీ, అట్లనకు. ’ఈ నిశీథ మధ్యమ్మున నే నొకండ.. నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు…’ -అని ఆయనేదో అంటూ ఉండగా..
“కన్నీటి కెరటాల వెన్నె లేలా? నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా?” – అని ఎదురు ప్రశ్నించింది నిశి.
“బాగు బాగు బహు బాగు”
“ఏం బాగో… మీ బాధ ప్రపంచానికి బాధ అనుకుని మీరు సంతోషించేయడమే కానీ, నాకు బాధెందుకైందో అడిగారా?”
“ఏమైనదేమైనది?”
“నాకు అర్థం కావట్లేదు అసలు! ఏడుపొచ్చేస్తోంది.” అని…“ఒక్క టొక్కటె కన్నీటిచుక్క లొలుక….నేడ్వ లేక యేడ్వ లేక యేడ్చుచుంటి” అన్నది నిశి.
“ఎంత బరు వయ్యెనో గాని యెడద వెలికి..తొలగి పారని దుఃఖాశ్రు జలము వలన”
- ఆ మనిషెవరో ఈపాటికి నాకర్థమైపోయింది. నిశీ సమస్య కూడా అర్థమైపోయింది. ఇక నేను వెళ్ళలేదంటే పెద్దా చిన్నా లేకుండా నిశీ అరిచేయడమూ, నిశీ సమస్య అర్థం కాక బాధతో ఆయన ఇంకా ఇంకా కవిత్వం చెప్పేయడమూ ఖాయం కనుక… నేను వెంటనే రంగంలోకి దూకాను.

“కృష్ణశాస్త్రి గారూ! ఆపండి. మీకు నేను అసలు సమస్య వివరంగా చెబుతాను.” – అని పరుగెత్తుకుంటూ వెళ్ళాను.
“హమ్మయ్యా! వచ్చావా! ఈయన పేరు గుర్తు రాక, ఈయన కవిత్వం భాష అర్థం కాక… చచ్చిపోతున్నా…”
“దేవులపల్లి కృష్ణశాస్త్రి” – అని ఆయన మార్కు నవ్వు నవ్వారాయన.
“క్షమించాలి. తనకి మీ కవిత్వంలోని భాష అర్థం కావట్లేదు అనుకుంటా” – అన్నాను చిన్నగా.
“అంత కరెక్టుగా ఎలా కనిపెట్టావ్?” అని అడిగింది నిశీ ఆశ్చర్యంగా.
కృష్ణశాస్త్రి గారికి కూడా ఈ సందేహం వచ్చిందని నాకు అర్థమైంది. ఇద్దరికీ కలిపి వివరించాల్సిన సమయం వచ్చిందని అర్థమై చెప్పడం మొదలుపెట్టాను.
“నిశీ సమస్య మీ భాష. తనకి తెల్సిన ప్రస్తుత మానవ తెలుగులో మీ భాష కాస్త క్లిష్టంగా అనిపిస్తోంది. ఎవర్ని అర్థమడగాలో తనకి తెలియట్లేదు. అలాగని చదవడం మానేద్దామా అంటే, ఈ కవితలన్నీ రాత్రులూ, కృష్ణపక్షాలూ, దిగుళ్ళూ – అన్నీ తన అభిమాన విషయాలాయె.” – అని ఓ క్షణం ఆగాను.
“ఔను నిజం! ఔను నిజం! నీవన్నది నిజం నిజం!” అన్నది శ్రీశ్రీని తలవందే కన్ను తెరవని నిశీ.
నేను చిన్నగా నవ్వి -”ఇదంతా ఇంత కరెక్టుగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నాదీ అదే బాధ కనుక! మీ బాధైతే ప్రపంచానికి బాధ కనుక, మీరు ఎలా చెప్పినా చెల్లింది. మా బాధ చెప్పుకోలేక..మీ ద్వారా చెప్పుకుందామని మిమ్మల్ని ఆశ్రయిస్తే, మీరనేది అర్థం కాక..కొత్త బాధలు పుట్టుకొస్తున్నాయే… మా బాధ ఎవరికి పట్టింది?” – ఆవేశంగా అన్నాను.
అనేసి, డైలాగ్ లో బరువు కోసం -
“ఎడతెగని యాత్ర నిట్లు సాగింప లేక… యేడ్వగా లేక కృశియింతు” మేము… అని ఆయన వంక చూశాను.
“నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” – అని నవ్వారాయన.
“ఓహో! ఇలా వచ్చారా….”- అనుకున్నాను.

ఇవాళ పౌర్ణమి లాగుంది. కొంత వెన్నెల వెలుగు ఉంది. నిశికి ముందే ఆ వెలుగు కారణంగా అసంతృప్తిగానూ, విసుగ్గానూ ఉంది. దానికితోడు, ఈ నిస్సహాయత ఒకటి! అంతకంతకూ తనలో పెరుగుతున్న అసహనం వెన్నెల వెల్తురులో నాకు కనిపిస్తూనే ఉంది. ఉన్నట్లుండి -
“విశ్వమంతా నిండి, వెలిబూదివోలె-బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి-బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!”
-అని ఆవేశంగా అరిచింది. ఎందుకలా అరిచిందా అని తనవైపు చూస్తే, తానేమో ఇంకో దిక్కుకి చూస్తోంది.. ఎదురుగ్గా…
“భూతాన్ని,
యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!”
-అంటూ వస్తున్న శ్రీశ్రీ!

“ఏమిటిలా?” అన్నారు కృష్ణశాస్త్రి కూడా ఆశ్చర్యంగా.
“నిద్రకు వెలియై, నేనొంటరినై, చీకటిలోపలి నా గదిలో… నా గదిలోపలి చీకటిలో.. చీకటిలో..నా గదిలో…నా గదిలో..చీకటిలో…” అంటూ ఆయన చెప్పుకుపోతూ ఉండగా,
“నిజంగానే, నిజంగానే?” – అంటూ నిశీ, నేనూ అత్యుత్సాహం చూపించాము.
ఈపాటికి నిశీకి ఉత్సాహమొచ్చేసింది. కృష్ణశాస్త్రితో -
“రానీ, రానీ, వస్తే రానీ!
కష్టాల్‌, నష్టాల్‌, కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ, రానీ! కానీ, కానీ!”
అని, కష్టమైతే అయింది, మీ భాష అర్థం చేసుకుంటాను..మీ ఘోషను అనుభవిస్తాను..అన్నది ఉత్సాహంగా.

“మిమ్ములన్ చూసినంతనే ఈబాల ఉత్సాహంతో ఉరకలేయు..” – అన్నారు దేవులపల్లివారు.
“నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం, అనితరసాధ్యము నా మార్గము” అన్నారు శ్రీశ్రీ, కించిత్తు గర్వంగా, ఓసారి నాతో గతంలో అన్నట్లే. నాకు ఓ చిలిపి ఆలోచనొచ్చింది. కృష్ణశాస్త్రి గారితో – “మరి మీరో?” అని అడిగా (అడుగుతూ నిశీకి కన్నుగీటాను)
“చెవి యొగ్గి వినుడు!
ఏను స్వేచ్ఛా కుమారుడ నేను గగన
పథ విహార విహంగమ పతిని నేను
మోహన వినీల జలధరమూర్తి నేను
ప్రళయ జంఝా ప్రభంజన స్వామి నేను!”
-అన్నాడాయన.
ఓ! అనుకుని… “వావ్!” అనుకున్నాను.

“ఏమండీ, మీరన్నా సాయం చేద్దురూ… ప్రపంచం బాధ మీ బాధంటారు కదా… ఈ చీకటి ప్రపంచంలో ప్రస్తుతానికి ఉన్నది మేమిద్దరమే కదా..మీరిద్దరూ కాక.. మా బాధ మీ బాధే కదా… మా బాధనన్నా కవిత్వంలో చెప్పండి… బాధ తీరే మార్గమన్నా చెప్పండి..” అన్నది నిశీ. తనంత చొరవగా, సౌమ్యంగా ఒకరితో మాట్లాడ్డం చూడ్డం ఇదే మొదలు నాకు. అసలెప్పుడన్నా తాను ఇంకోరితో మాట్లాడ్డం నేను చూడనేలేదు కదా ఇవాళ్టికి ముందు.. (సారీ, ఈ రాత్రికి ముందు).

“పదండి ముందుకు, పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ! భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!” – శ్రీశ్రీ గారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ, తెలివిగా తాను ముందుకు నడుస్తూ వెళ్ళిపోయారు, పరిష్కారం చెప్పకుండానే.
దిగాలుగా దేవులపల్లివారి వైపుకి తిరిగాము ఇద్దరం -
“నన్ను గని యేరు జాలి జెందంగ వలదు -
ఎవ్వ రని యెంతురో నన్ను? – ఏ ననంత
శోకభీకర తిమిరలో కైకపతిని!
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు,
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు,
నా కమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దు॰ఖంపు నిధులు కలవు -
ఎవ్వ రని యెంతురో నన్ను?” -

-అని తనలో తాను దిగాలుగా పాడుకుంటూ అటు నడిచెళ్ళిపోతున్న మనిషిని ఇంకేమడగము? మొహాలు వెళ్ళాడేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూస్కుంటూ ఉండగా, తొలి వెలుగురేఖ మొహాన పడబోతోందని గమనించి… మా దారులు వేరయ్యాయి, మళ్ళీ కలవడానికే సుమా!

Published in: on August 31, 2009 at 10:27 am Comments (5)
Tags:

నిశ్యాలోచనాపథం-13

ఆరోజు తను చెప్పింది జీర్ణించుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇలాంటి కథలు కొత్తని కాదు కానీ, ఈ తరహా అన్వయాలు కొత్త నాకు. అందుకని, కొన్నాళ్ళు అలా తన మాటల మాయలోనే ఊగి, ఇన్నాళ్ళకి మళ్ళీ వాస్తవానికొచ్చి, మధ్యలో కోల్పోయిన జీవితాన్ని వెదుక్కోడంలో సమయమంతా గడిచిపోయి, నిశ్యాలోచనలు కాస్త తగ్గిన మాట నిజం. కానీ, కోల్పోయినవన్నీ దొరకవు – వెదికినంత మాత్రాన. అలా వెదగ్గానే దొరికేసేవే అయితే, ప్రపంచంలో జనాలు ఇంకాస్త ఆనందంగా బ్రతికేవాళ్ళేమో (దొరికేసాయని ఏడ్చేవాళ్ళూ ఉండే అవకాశం లేకపోలేదు). అందుకని, మళ్ళీ వచ్చా, నిశీ కథ మీకు వివరంగా చెబుదామని. ఎక్కడ ఆగామూ పన్నెండో భాగంలో…. నిశీనిశ్ ఎందుకు ఆత్మహత్య చేస్కోవాలనుకుంటోందో? అని నేను ఆమెని అడిగిన దగ్గర కదా..

“నాకు జీవితం-ప్రేమ రెండూ మిథ్య అనిపిస్తోంది. అలాంటప్పుడు జీవితంపై ప్రేమ మాత్రం ఎందుకు? అది అంతకంటే పెద్ద మిథ్య. ఏమీ ఉండదు చివరకి. ప్రేమ తానుగా ఇంకెవర్నో చేరుకుని బ్రతికేస్తుంది. మన బ్రతుకు మాత్రం నరకం చేస్తుంది. అందుకే నాకు బ్రతుకంటే అసహ్యం పుడుతోంది” -అని మొదలుపెట్టింది తను.
అప్పుడే అనిపించింది నా దగ్గర ఓ రికార్డర్ ఉంటే బాగుండు అని. ఇలా కన్వల్యూటెడ్ గా చెబితే, ఎలాగో నా పీతబుర్రకి ఒకసారికి అర్థం కాదు. కనీసం ఇదంతా అర్థంలేని ప్రేలాపన అని తెలుసుకోడానికైనా నేను ఇది రెండుమూడు సార్లు వినాలి. ఏ సినిమాలోనో అయితే, డైలాగు అర్థం కాకుంటే, రివైండ్ చేస్కుంటాము. మరి నిజ జీవితంలో? లేని పోని ఆశలకూ, నిరాశలకూ, అయోమయాలకూ – భాషే అన్నింటికంటే పెద్ద మూలం అని ఈమధ్యే నాకు జ్ఞానోదయం చేసారు – Ogden, Bliss మొదలైన పెద్దలు “In the land of invented languages” అన్న పుస్తకంలో. నిజం! నిజజీవితంలో ఇలా మనిషి ఏదో మాట్లాడి మనకి అది అర్థం కాకపోడమో, లేకుంటే వాళ్ళు ఏదో అని అది మనం మర్చిపోడమో కాదంటే, మనమేదో అని అది వాళ్ళకి అర్థం కాక..మనం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఏడవడమో – ఇలాంటివి జరగడం వల్లే తొంభై శాతం బాధలు. అసలు మనుషులకి భాషే లేకుంటే బాగుండని ఓపక్క అనిపిస్తుంది కానీ, ఇలా నిశీ లాంటి వాళ్ళకి వాళ్ళ బాధ చెప్పుకోడానికి వేరే మార్గమేముంది – భాష తప్ప?

“ఈ మిథ్య కాన్సెప్ట్ ఎప్పట్నుంచీ అనిపిస్తోంది నీకు” అని అడిగా, నా ఆలోచనలకి కామా పెట్టి.
“నాకూ, ఈ జీవితానికీ పడదేమో అనిపిస్తోంది.”
“ఈ జీవితానికి పడదు..అంతే కానీ, అసలు జీవితానికీ నీకూ పడదనికాదుగా… లైఫ్ స్టైల్ మార్చుకో, లైఫ్ కూడా మార్చుకో..” అన్నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మేధావిలాగా.
“నాకు అంత పెద్ద ఆసక్తేమీ లేదు. నేను దారుణంగా మోసపోయాను జీవితంలో. ఈ మోసాన్ని మోస్తూ మళ్ళీ అదే జీవితాన్ని ప్రేమించలేను.”
“ఎవరో నిన్ను మోసం చేస్తే, జీవితాన్ని ప్రేమించడానికేమి? అంటే, ఆ మోసం చేసినవాళ్ళే నీ జీవితం అనుకున్నావా?” – ఇదేదో ప్రేమ వ్యవహారం అని అర్థమైన నేను అన్నాను.
“కానీ, మోసం చేసింది జీవితమే అని నేనంటే?”
ఒక క్షణం అనుమానమొచ్చింది – నాకు పిచ్చా, ఈవిడకా? అని. ఇద్దరికీ కూడా కావొచ్చేమో – ఇన్నాళ్ళు ఇలాంటి మనిషిని భరించాను అంటే నేను కూడా తేడా అన్నట్లేగా!
“జీవితం మోసం చేయడం ఏంటి నిశీ? అర్థమయ్యేలా చెప్పు.” అన్నాను కాస్త నెమ్మదిగా.
“నేను జీవితాన్ని ప్రేమించాను. నాకంటే ఎక్కువగా – బ్రతకడాన్ని ప్రేమించాను. నా జీవితాన్ని కాదు – లైఫ్ ఆస్ సచ్. ..”
“నువ్వా?” అన్నా ఒక్కసారిగా.. కెవ్వుమని. నేను చూసినంతలో ఈ మనిషి ఆ తరహాగా అనిపించలేదు నాకు మరి.

“నేనే! నీకు పరిచయమయ్యేనాటికే నా ప్రేమ కథ విఫలప్రేమ అయింది లే” – అదోలా వైరాగ్యంగా నవ్వుతూ అన్నది తను.
“అదేమిటి? నువ్వు అసలు ఎవర్నీ ప్రేమించందే… విఫలమైపోయిందా? అలా ఎలా?”
“చెప్పాను కదా.. బ్రతుకును ప్రేమించాను, బ్రతకడాన్ని వాంఛించాను అని.”
“మరిప్పుడిలా ఉన్నావేంటి? హౌ హౌ హౌ?” – క్యూరియాసిటీ ఆగట్లేదు నాకు.
“వెల్, నీకు మొదట్నుంచీ చెప్పడం నా వల్లకాదు. కాస్త క్లుప్తంగా చెబుతాను విను. మొత్తంగా దాదాపు పదేళ్ళ కథ చెప్పాలి నీకు..పది నిముషాల్లో”
ప్రాస కోసం అందో, నిజంగా అందో అర్థం కాలేదు కానీ, కానివ్వమన్నాను.
మొదలైంది ఇక… టన్ టనా టనా టన్!

“నేను జీవితాన్ని ప్రేమించాను. మామూలుగా కాదు. నన్ను నేను మరిచిపోయేంతగా. మా ప్రేమకలాపాలు ఎనిమిదేళ్ళు అప్రతిహతంగా సాగాయి. ఈ మధ్య కాలంలో నా జీవితంలో మరీ పెద్ద ఒడిదుడుకులేం లేవు. అందుకే కాబోలు, నాకు ప్రేమ తప్ప వేరే ధ్యాస కూడా లేదు. అసలు ప్రేమలేకుండా జీవితం ఉండగలదు అన్న ఆలోచనైనా నాకు రానంత గొప్పగా ఉండింది నా జీవితం…. “నా” జీవితం.”
“నా” ఏముంది.. పక్కింటోళ్ళ కథ కాదు కదా నువ్వు చెప్పేది. – అనుకున్నా మనసులో. ఆమె చెప్పడం కొనసాగించింది…
“అయితే, ఈ రెండేళ్ళలో నాకు జీవితంతో అయినన్ని తగువులు, మోసపోయినన్ని సందర్భాలు – మొదటి ఎనిమిదేళ్ళు మొత్తం కలిపినా అయి ఉండవు.”
“ఏమ్?” అన్నాను.
“జీవితమంటే నాకున్న ప్రేమకంటే, దానిపై నమ్మకం ఎక్కువ నాకు. గౌరవం కూడా ఎక్కువే. కానీ, ఇప్పుడు, ఈ క్షణంలొ – నమ్మకం లేదు..గుడ్డిగా నమ్మాలని ఉంది తప్ప. గౌరవం …పోయింది…ఉంటే బాగుండేది అని అనిపిస్తోందికానీ… ప్రేమ… ఉండీలేకా ఉంది..ఉన్నాకూడా లేదు..”
“జాబిల్లి కోసం…” అనబోయి ఆగాను… “ఉండీలేకా..ఉన్నది నువ్వే..ఉన్నాకూడా లేనిది నేనే” గుర్తొచ్చి.
“తప్పిపోయిన గౌరవమూ, సన్నగిల్లిన నమ్మకమూ… ఉందో లేదో తెలీని ప్రేమా – ఇవి పెట్టుకుని ఏ బంధంలో అన్నా సాధించగలిగేది ఏమిటీ?” – నిశీ దిగాలుగా అడిగింది.
“నీ సమస్యేమిటో నాకు అర్థం కావట్లేదు..” భయం భయంగా అన్నాను. ఔను మరి, కోపమొచ్చి ఏదన్నా చేయడమో, చేసుకుంటుందేమో అని నా భయం.

“ఉన్నంతలో వీలైనంత శ్రద్ధగా నేర్చుకున్నాను భాషను. ఎన్ని పదాలు నేర్చుకుని ఏం లాభం? ఎంత భాష తెలిసినా..ఎన్ని భాషలు తెలుసుకున్నా ఏం లాభం? నాకు అవసరమైనప్పుడు నా బాధ ఏమిటన్నది నేను అవతలి మనిషితో పంచుకోలేపోయాక?” తను వాపోయింది.
నాకు బాధనిపించింది అది చూసి… కాస్త అనునయంగా – “అది కాదు… కాస్త స్పష్టంగా చెప్పగలవా?” అన్నాను.
“పదాల్లో అన్నింటినీ బంధించగలిగి ఉంటే, జీవితాన్ని కూడా నా ప్రేమలో బంధించేసి ఉందును. రెంటికీ సంబంధం ఏమిటని అడక్కు… అది కూడా నేను వివరంగా వర్ణించలేకపోతున్నాను” అసహాయంగా చూస్తూ అన్నది.
“సరే, ఇప్పుడు ఐతే ఆత్మహత్య దేనికి?” అన్నా కాస్త చిరాగ్గా.
“అంతా విన్నాక కూడా అలా అడుగుతావు ఏంటి? జీవితమంటే అసహ్యం పుడుతోంది… అసలు ఇలాంటి జీవితాన్ని ప్రేమించినందుకు నామీద నాకు అసహ్యం పుడుతోంది – నేనూ నచ్చక, నా ప్రేమా నచ్చక…జీవితమూ నచ్చక – ఏం సాధించాలి బ్రతికి?”
“చచ్చి బ్రతకడం కంటే, బ్రతికి చావడం నయం.” అన్నాను.
“బ్రతికి చావడం కంటే చచ్చి బ్రతకడం నయం” అన్నది.

ఇప్పుడు, ఈమె ఇంత వైరాగ్యంలో ఉన్నప్పుడు, ఈమూడ్ నుంచి ఈమెను బైటకు తేవడం ఎలా? అనుకుంటూ ఉండగా, యధాలాపంగా వాచీ చూస్కుంటే, ఐదున్నరౌతూ ఉండింది. దానితో, నాకో ఆలోచనొచ్చింది.
“సరే, కాసేపు ఇలాగే కొనసాగిద్దాం… వెలుగొచ్చేస్తుంది..” అన్నా.
“నేను వెళ్ళాలి… ” అని చెప్పులేస్కుంటూ ఉంటే, చేయి పట్టుకుని ఆపి…
“మరి మన చర్చో?” అని అడిగా కొంటెగా.
“ఉండవమ్మా! రేపొచ్చి చెబుతాలే… అని హడావుడిగా పరుగెత్తుకుంటూ మాయమైంది చీకట్లోకి.
తనని ఫాలో ఔదామనుకున్నా కానీ, తను రేపొచ్చి నాకు కథ చెప్తుందని తెలుసు నాకు.

వచ్చిందీ, చెప్పిందీ కనుకే, నేను ఇదంతా ఇంత ధీమాగా రాస్తున్నది. ఏం చెప్పిందీ? అన్నది వచ్చే భాగంలో. ;)

Published in: on August 24, 2009 at 9:39 am Comments (5)
Tags:

Web searching for Daily living – and lolz

Query free search – I’ve been ROFL-ing ever since I read about this in the first two pages of a research paper. I did not go beyond that. My imagination ran so wild that – I got lost in that wilderness to proceed further. Let me tell you a few examples mentioned there and you know why I am saying that.

“When we are washing a coffee maker, for example, a web page is retrieved that includes tips such as ‘cleaning a coffee maker with vinegar removes stains well.’ A method designed on the basis of this concept automatically searches for a web page by using a query constructed from the use of ordinary household objects that is detected by sensors attached to the objects.”

-These lines from the abstract say enough about what this paper is about. Now that its possible to make anything from a domestic appliance or a furniture item to a Television turn in to our internet enabled browser, we can get search results despite the absence of a “real” querying, according to the paper.

“To search the web by using objects, we assume that a set of names of objects that are used (moved) by a user in a given period of time corresponds to user’s context. For example, when a cup, milk, and cocoa are moved in a given period of time, “cup milk cocoa” becomes the user’s context. Then, we search for a web page that matches the context.”

Reading these, I began getting doubts, as usual.
Firstly, it appears to be a dangerous intrusion in to my privacy. What if someone comes and attaches some sensor to some random object of mine? How embarassing it would be to suddenly see search results on the nearby sofa, on something that you can’t imagine to see at the moment?
Secondly, Who asked for it? I don’t want to search for milk and cocoa when I drink milk with cocoa. I may not want to think about more details on the topic at all.

My doubt is : Instead of going to this extent, why cant “voice based search” be improved upon? Instead of attaching sensors for each and every article, why can’t a sensor be attached to our own self, and perform a voice based search and then display the results?

Finally – its highly comical to imagine all these happen in “daily living”. It’ll be good to see a sci-fi comedy thriller with all these ingredients :) Ofcourse, with some creativity and some sense of history,I can see a historical sci-fi comedy thriller in making already. A “psycho sci-fi comedy historical thriller” (or with the order changed) or a “all-this-blah” + political thriller – may be on the cards in future..who knows?

The title of this paper – “Web searching for daily living” is a misnomer. I thought it talks about money generation through web search. Ideally, like a friend suggested, it should be – “Web searching intruding in to daily living”.

Details of the paper: Web Searching for Daily Living Takuya Maekawa (NTT ), Yutaka Yanagisawa , Yasushi Sakurai , Yasue Kishino , Koji Kamei , Takeshi Okadome (NTT) In proceedings of SIGIR-2009

Published in: on August 21, 2009 at 9:53 am Leave a Comment