కొన్ని రోజుల తర్వాత ఇవ్వాళ మళ్ళీ మనుచరిత్ర తో కలిసి భోజనం చేసాను
మల్లాది హనుమంతరావు గారి ఎంపులో నుండి ఇవ్వాల్టి నా యాదృచ్చిక ఎంపు ఇది:
‘అపరిమితానురాగ సుమనోలసయై చిగురాకు-చేతులన్-
తపసిని కౌగిలించె, వనితా,-ఇదె రంభ-’; ‘తలంప రంభ -తాన్-
-అపరిమితానురాగ సుమనోలసయై చిగురాకు-చేతులన్
తపసిని కౌగిలించు టుచితంబె కదా!’-అన, నవ్వె రంభయున్.
- హనుమంతరావు గారు “ఈ పద్యంలో శ్లేష, వక్రోక్తి అలంకారాలు పెద్దన గారు చమత్కారంగా వాడారు” అని రాసారు. నాకు కూడా అదే కారణానికి నచ్చింది కానీ, మామూలు “నిరలంకార” తెలుగు నర భాషలో – ఒకే వాక్యాన్ని రెండు రకాలుగా ప్రయోగించి, ఒక రంభను ముగ్గుర్ని చేసినందుకు నచ్చింది అని చెప్పడంలో ఉన్న సుఖం వేరు కనుక, నేను ఇలా చెప్పుకుంటున్నా ![]()
అర్థం: “అపరిమితమైన ఎర్రదనం గల పూలతో అలసి, వంగి, చిగురాకులనే చేతులతో తపసి వృక్షాన్ని (అవిసె చెట్టు) కౌగిలించుకున్నది ఈ రంభా వృక్షం (అరటి చెట్టు)” అని ఒక చెలి అంటే,
“ఆలోచించి చూస్తె, రంభ (అప్సరస రంభ) అపరితమైన అనురాగం గల మనసుతో పరవశయై ఋషీశ్వరుడిని కౌగిలించుకోవడం మామూలే కదా” అని ఇంకొకావిడ అనింది.
రెండూ విన్న రంభ (ఆ చెలికత్తెలలో ఒకావిడ పేరు రంభ!) నవ్వింది.
ఈ కాసిని పద్యాలలోనే నాకు రకరకాల భావాలు, భ్రాంతులు కలుగుతున్నాయి – విసుగూ, విరామంతో సహా. ఇక ఈ జీవితంలో ఎప్పుడన్నా మనుచరిత్రను నిజంగా చదవడం మొదలుపెడితే, దాని గురించి ఎవరికన్నా చెప్పాలంటే, ఇలా వక్రోక్తులు, శ్లేషలు వాడుకోవాల్సిందే ఏమో!
శ్లేష తెలుసుకుంటేనే గొప్ప, ఆనందం. బాగా చెప్పేరు
బాగుందండీ! ఇది చదువుతుంటే నాకెందుకో రంభా వ్రతం కథ గుర్తుకొచ్చింది!
@Rasagna garu: ఏమిటా వ్రతం, ఏమా కథ?
ఇక్కడున్న రంభలు ముగ్గురు కాదు యిద్దరే అనుకుంటా. అప్సరస రంభే వరూధిని చెలులలో ఒకరు. వరూధిని కూడా అప్సరసే కదా. ప్రవరునికి తన గురించి చెపుతూ, తన ప్రాణసఖులైన యితర అప్సరల పేర్లుకూడా చెపుతుంది:
పేరు వరూధిని విప్ర కు
మార! ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
మా రంభా శశిరేఖ లు
దార గుణాఢ్యులు మదీయలగు ప్రాణసఖుల్
బాగుంది. మధ్యలో ఈ ఎంపు దేనికండీ… ఎంపిక అని స్పష్టంగా అర్ధమయ్యే పదం ఉండగా!
@కామేశ్వర రావు గారు: ఓహ్… అక్కడ హనుమంతరావు గారి వివరణ బట్టి నేను ఆ రంభ, ఈ రంభ ఒకరు కాదేమో అనుకున్నా!
@ఫణీంద్ర: “ఎంపు” అన్నది తెలుగు పదం (అదే…తెలుగులో వాడే పదం). నేను కనిపెట్టింది కాదు. ఇప్పటికే చాలా చోట్ల వాడుకలోనే ఉంది. “ఎంపు” పేరుతో ఒక ప్రముఖ రచయిత కథ కూడా ఉంది.మిగితావన్నీ పక్కన పెడితే, నేను తప్పు వాడితే మీరు పాయింట్ అవుట్ చేయడంలో అర్థం ఉంది కానీ… మీకు “ఎంపు” కష్టంగా ఉంది కనుక నేను వాడకూడదు అనడంలో అర్థం లేదు. ఏమంటారు?
నేను మిమ్మల్ని తప్పు పట్టటం లేదండీ. ఎంపు మంచి పదం అన్న విషయంలో నాకు ఏ సందేహమూ లేదు. మీరు కోట్ చేసిన కథ కూడా చాన్నాళ్ళ క్రితం చదివాను, ( ఇప్పుడు గుర్తు లేదనుకోండి ). ఎక్కువ మందికి తెలీని పదం కదా అని, అంతే.