“నలదమయంతి” సినిమా చూశాను. సినిమా నాకు నచ్చేసింది కానీ, సినిమాకంటే ఎక్కువగా కొన్ని పాటలు నచ్చాయి. అందునా, కమలహాసన్ పాడగా, మాధవన్ వీథుల్లో అయోమయంగా తిరుగుతూ ఉండగా వచ్చిన “Stranded on the streets” పాట మరీనూ. పాటకి రెండు వర్షన్లు ఉన్నట్లు ఉన్నాయి. రాగా.కాం తెరిచి చూస్తే, పూర్తి ఇంగ్లీష్ వర్షన్ ఒకటి కూడా ఉంది. ఈపాట మరీ నచ్చింది. దీన్నే “బ్లూస్” అంటారేమో అని నాకు సాహిత్యాన్ని బట్టి అనిపించింది. బ్లూస్ సంగీతాన్నే అంటారనుకోండీ… కానీ, “బ్లూస్” కి, “డిప్రెషన్”కి, ఈ పాటకీ ఉన్న సంబంధం వల్ల అలా అనిపించింది. మాధవన్ మొహంలో కనబడే అయోమయం, దిగులూ, ఫ్రస్ట్రేషన్ తో కూడిన భయం – అన్నీ ఆ పాట లిరిక్స్ లో కూడా సాక్షాత్కరించాయి నాకు. సినిమాలో వచ్చిన సందర్భం యూట్యూబ్ వీడియో ఇక్కడ.
కమల్ పాడిన ఇంగ్లీషు వర్షన్ (మొదట కొన్ని తమిళ్ లైన్లు వదిలేస్తే), రాగా.కాం లో ఇక్కడ వినండి.
కమల్ కథను అందించిన ఈ సినిమాలో కమల్ నటించలేదు కానీ, ఉన్నట్లుండి క్లైమాక్స్ లో విచ్చేసిన (ఊడిపడిన) కమలహాసన్ ని చూసి- “అరే! “విరుమాండి” (అలియాస్ పోతురాజు) గెటప్ లో ఉన్నాడే” అని నేను ఆశ్చర్యపోయేంతలో – “నేను సండీయార్ (విరుమాండి కి ముందు అనుకున్న పేరట) షూటింగ్ నుంచి వస్తున్నా” అంటూ కమల్ హాసనే చెప్పేశాడు. అప్పట్లో చూళ్ళేకపోయాను…ఇన్నాళ్ళకి చూడగలిగాను నలదమయంతి సినిమాని. మీరూ చూడకపోతే, ఏదో అలా సరదాగా నవ్వుకోవడానికి, అక్కడక్కడా కొంచెం కదిలిపోవడానికీ, తప్పకుండా చూడండి!:)…. ఈపాటలన్నా వినకుండా ఎలా మిస్సయ్యానో అప్పుడు!
ఈ సినిమా తెలుగులోకి డబ్ అవ్వలేదా???