ఈ మధ్య అడపాదడపా మల్లాది హనుమంతరావ్ గారు రాసిన “మనుచరిత్రలో మణిపూసలు” పుస్తకం తిరగేస్తూ ఉన్నాను. ఇందులో మనుచరిత్ర లోని పద్యాల నుండి కొన్ని ఎంచుకుని, వాటిని వివరంగా పరిచయం చేశారు. పద్యాలలో వర్ణన కొన్ని చోట్ల చాలా నచ్చింది, కొన్ని చోట్ల నచ్చింది. కొన్ని చోట్ల డొంకతిరుగుడుగా అనిపించింది…కొన్ని చోట్ల మరీ అతిగా అనిపించింది (అని చెప్పి నా అజ్ఞానాన్ని, పొగరును మరొక్కసారి బయటపెట్టుకుంటున్నాను). … అయితే, ఒక్క పద్యం చదివి, దాని వివరణ చదివాక మాత్రం – విషయం చెప్పడానికి చూపిన సృజనాత్మకతకు నా మైండు బ్లాకైపోయింది. ఓర్నాయనో, ఇలా రాస్తే ఎంత కష్టపడాలో అర్థం చేసుకోడానికి! అనిపించింది.
ఆ పద్యం:
శ్రీరుచిరత్వ భూతి మతి జిత్వర తాకృతి శక్తి కాంతులన్
ధీరత సార భోగముల ధీనిధి యీశ్వర నారసింహు డా
వారిజనాభ శంకరుల వారికుమారుల వారితమ్ములన్
వారి యనుంగుమామలను వారి విరోధుల బోలు నిమ్మహిన్
దాని తాలూకా వివరణ:
శ్రీరుచిరత్వం (లక్ష్మీ సంపన్నత), భూతి (సంపద), మతి (బుద్ధి), జిత్వరత (విజయ శీలత), ఆకృతి, శక్తి, కాంతి, ధీరత,సారం (బలం), భోగం అనే విషయాలలో పెద్దన నరసానాయకుడిని వరుసగా – హరి, హరులతోనూ, వాళ్ళ కుమారులతోనూ (బ్రహ్మ, కుమారస్వామి), ఆ కుమారుల తమ్ములతోనూ (మన్మథుడు, వీరభద్రుడు), ఆ తమ్ముళ్ళ మేనమామలతోనూ (చంద్రుడు, మైనాకుడు), వాళ్ళ విరోధులతోనూ (రాహువు, ఇంద్రుడు) -లతో పోల్చాడన్నమాట!!
మళ్ళీ ఈ బంధుత్వాలకి కూడా వివరణ అవసరం కదా! (కనీసం నాకైతే అర్థం కాలేదు వివరాలు చదివే దాకా!)
1) నారాయణుని నాభి కమలం లోంచి పుట్టిన కుమారుడు బ్రహ్మ. శంకరుని కుమారుడు కుమారస్వామి.
2)మన్మథుడు కూడా విష్ణుమూర్తి కొడుకు కనుక, బ్రహ్మకు తమ్ముని వరస. వీరభద్రుడు దక్షయజ్ఞ సమయంలో శివుడి జటాజూటం నుంచి పుట్టాడు కనుక, కుమారస్వామి కి తమ్ముని వరస.
3)మన్మథుడు లక్ష్మీ దేవి సంతానం కనుకా, చంద్రుడు లక్ష్మి కి తోబుట్టువు కనుకా – మన్మథుడి మేనమామ చంద్రుడు. అలాగే, వీరభద్రుడికి పార్వతి తల్లి లాంటిది. పార్వతికి అన్న మైనాక పర్వతం కనుక, మైనాకుడు వీరభద్రుడికి మేనమామ
4) చంద్రుడి విరోధి రాహువు. మైనాకుడి విరోధి ఇంద్రుడు (పర్వతాల రెక్కల్ని ఇంద్రుడు కత్తిరించాడు కాబట్టి!)
-ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది… ఎలా అర్థం చేసుకున్నారో ఏమిటో దీన్ని చదువరులు!!!
excellent
క్రమాలంకారం. మహా అందంగా ఉంది.